మహిళలకు ఉచిత బస్సు డేట్ ఫిక్స్:
ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూటమిప్రభుత్వం ఒక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ‘తల్లికి వందనం’, ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకాలకు డేట్స్ ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పారు. మరోవైపు పాఠశాలలు మొదలుపెట్టే రోజున తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందిస్తామని ఆత్మకూరులో జరిగిన మినీ మహానాడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. కాకినాడ జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో మంత్రి నారాయణ మాట్లాడుతూ… ‘గత ముఖ్యమంత్రికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలా కుతలం చేశాడు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయింది. ఆ అప్పుల మనమే తీర్చాలి, తీర్చకపోతే ఊరుకోరు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జూన్ నుంచి తల్లికి వందనం, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తాం. ఒక మున్సిపల్ శాఖలోనే 3000 కోట్లు అప్పులు ఉన్నాయి. డ్యామా, మత్సశాఖ ఇబ్బందులు గురించి శాసనసభ్యులు చర్చించారు. దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి, మరో 25 శాతం పెండింగ్ ఉన్నాయి. ప్రతి నెల శాసనసభ్యులు అధికారులతో సమావేశం నిర్వహిస్తాను’ అని తెలిపారు.
కరోనా వైరస్ పట్ల తక్షణ అప్రమత్తం:
మహమ్మారి కరోనా వైరస్‌పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడండని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మరలా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కరోనా వైరస్ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రార్ధన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల వంటి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్ లు ఉన్నాయి. మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ:
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై “మైడియర్ డాడీ” అంటూ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణ చేశారు.. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు.. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పేర్కొన్నారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు కవిత. బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడటంపై అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని.. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారన్నారు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం, మోటీవేట్ చేస్తారని ఎదురు చూశారన్నారు. ఓరాల్‌గా ఇంకొంచెం పంచ్ ఎక్స్‌పెక్ట్ చేశారు. పార్టీ లీడర్స్‌కి యాక్సిస్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత ఇన్‌ఛార్జ్‌లకే లోక్ బాడీ బీఫాం ఇస్తారా? 2001 నుంచి పార్టీలో ఉన్న వారిని వేదికపై మాట్లాడనివ్వరా? అని అని అడిగారు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. బీసీలకు 42 శాతం కటా అంశాన్ని విస్మరించారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అత్తకు హైకోర్టు షోకాజ్ నోటీసులు:
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డికి పాస్ బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్లకు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూమి విషయంలో విచారణ పూర్తి చేసి నివేదికను అందించాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.
కాళేశ్వరాన్ని కూల్చింది వాళ్లే అని నా డౌట్:
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. “నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు.” అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం విషయంలో నిజం నిలకడగా తేలుతుందని కేటీఆర్ అన్నారు. ఒక బ్యారేజీలో 2 పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారని విమర్శించారని.. కమీషన్ల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఘోష్ విచారణ పూర్తయిందని అని చెప్పి.. ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసిన సంస్థతో అజర్ బైజాన్ ఒప్పందం:
పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ దేశంలో సంచలనంగా మారింది. ఆమెకు పాకిస్తాన్‌పై ఉన్న ప్రేమ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. మూడుసార్లు పాకిస్తాన్ సందర్శించి ఆమె, పలువురు పాక్ ఏజెంట్లను కలుసుకున్నట్లు తేలింది. ఇదే కాకుండా, ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో ఆమెకు ఉన్న పరిచయం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా, పాకిస్తాన్ తరుపున ఒక కథనాన్ని ప్రచారం చేయడానికి ఆమె తన వీడియోలను వాడుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. 33 ఏళ్ల యూట్యూబర్ ప్రస్తుతం హర్యానా పోలీస్ కస్టడీలో ఉన్నారు. గత రెండు వారాల్లో ఈమెతో పాటు 11 మంది పాకిస్తాన్ గూఢచారులు అరెస్ట్ చేయబడ్డారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో పనిచేస్తున్న యూఏఈకి చెందిన ట్రావెల్ కంపెనీ వీగోతో జ్యోతి మల్హోత్రా సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా తరుచుగా చేసే ప్రయాణాలకు వీగోనే స్పాన్సర్ చేసినట్లు తేలింది. అయితే, ఈ సంస్థ ఇప్పుడు అజర్ బైజాన్‌తో రెండు రోజుల క్రితం కీలక ఒప్పందం చేసుకుంది. అజర్ బైజాన్ టూరిజం బోర్డుతో వీగో ఒప్పందం చేసుకున్నట్లు తేలింది.
ఆగిన హిందూ జంట పెళ్లి.. రిసెప్షన్ వేదిక ఇచ్చిన ముస్లిం కపుల్స్:
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో వచ్చిన ఈ అకాల వర్షం చాలా మందిని గందరగోళానికి గురి చేసింది. ముందుగా అనుకున్న కార్యక్రమాలు నిలిచిపోయాయి. పూణేలో కొన్ని వివాహాల్లో జాప్యం చోటు చేసుకుంది. కానీ, ఈ కుండపోత వర్షం కారణంగా ఒక సానుకూల విషయం జరిగింది. వనవాడిలో జరిగిన ఒక వివాహ వేడుక మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించింది. వర్షం కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి వేరే మతానికి చెందిన కుటుంబం అకస్మాత్తుగా సహాయం అందించింది. ఓ వరుడు మరొక వరుడికి మద్దతుగా మారాడు. పూణేలోని వనవాడి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం వర్షం కారణంగా హిందూ జంట వివాహం నిలిచిపోయింది. సంస్కృతి కవాడే, నరేంద్ర గలాండేల జంట వివాహం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బహిరంగ పచ్చిక బయళ్లలో జరగాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో భారీ వర్షం వల్ల మండపం తడిసి ముద్దయింది. దీంతో మొత్తం ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారాయి. ఇంతలో.. సమీపంలోని ఒక హాలులో ఓ ముస్లిం కుటుంబం రిసెప్షన్ జరుగుతోంది. హిందూ కుటుంబానికి చెందిన కొంతమంది పెద్దలు సహాయం ఆ ముస్లిం కుటుంబీకులను వేదిక కోసం అభ్యర్థించారు.
పట్టుబడిన మరో ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులు:
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరుగా పాకిస్తాన్ గూఢచారులు బయటపడుతున్నారు. ఇటీవల కాలంలో జ్యోతి మల్హోత్రా కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అధికారులు, ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో యూపీ యాంటీ-టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. ఇందులో ఒకరికి, ఇటీవల భారత బహిష్కరించిన పాక్ హైకమిషన్ అధికారితో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొహమ్మద్ హరూన్, తుఫైల్ అనే ఇద్దరు వ్యక్తులు భారత అంతర్గత భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హరూన్ పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగి మొహమ్మద్ ముజమ్మిల్ హుస్సేన్‌కు సన్నిహితుడు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ముజమ్మిల్ హుస్సేన్‌ను ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది, దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
మహ్మద్ యూనస్‌కి ఆర్మీ చీఫ్ వార్నింగ్:
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మరోసారి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే, అక్కడి యూనస్ ప్రభుత్వానికి, ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌కి పడటం లేదు. ఆర్మీ చీఫ్ హెచ్చరికల తర్వాత యూనస్ ప్రభుత్వం మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రానికి ‘‘మానవతా కారిడార్’’ని తిరస్కరించింది. బంగ్లాదేశ్ ఈ కారిడార్‌ని ‘‘రక్తపాత కారిడార్’’గా పిలిచారు. విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ఏకపక్షంగా ఐక్యరాజ్యసమితి ప్రతిపాదిత రఖైన్ కారిడార్ అంగీకరించిందని ప్రకటించారు. దీనిపై ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు చేయడంతో, ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. ఈ కారిడార్ బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుందని, ఇది భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా దీనిని ముందుకు తెస్తోందని బంగ్లాదేశ్‌కి ఆందోళన ఉంది. ఎన్నికలు లేకుండా అధికారంలో ఉండటానికి యూనస్, ఆయన మద్దతు దాడులు అమెరికా డిమాండ్లకు తలొగ్గుతున్నారని బంగ్లాదేశ్ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కారిడార్‌పై ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మాట్లాడుతూ..‘‘ బంగ్లాదేశ్ సైన్యం సార్వభౌమత్వానికి హాని కలిగించే ఏ కార్యకలాపాల్లో పాల్గొనదు. అలా చేయడానికి ఎవరిని అనుమతించదు’’ అని హెచ్చరికలు జారీ చేశారు.
ట్రంప్ ప్రతీ దానికి క్రెడిట్ తీసుకుంటారు:
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) జాన్ బోల్టన్, డొనాల్డ్ ట్రంప్ వాదనల్ని తోసిపుచ్చారు. మధ్యవర్తిత్వం ఆయన క్రెడిట్ తీసుకోవడంపై సెటైర్లు వేశారు. ‘‘ట్రంప్ బీయింగ్ ట్రంప్’’ అని ఆయన ‘‘ప్రతీదానికి క్రెడిట్ తీసుకుంటారు’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తీసుకున్న చర్యలు పూర్తిగా సమర్థనీయమని బోల్టన్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేసే హక్కు భారత్‌కి ఉందని అన్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాల్సి ఉందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
నేను ద్రోణాచార్యుడిని కాదు:
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. గతంలో ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు ‘థగ్ లైఫ్’ను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్‌లో కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా మీట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. మణిరత్నం గారు ‘నాయకన్’ సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విధంగానే, ‘థగ్ లైఫ్’తో మరోసారి అందరినీ సర్‌ప్రైజ్ చేయనున్నారు. నన్ను కొందరు ద్రోణాచార్యుడితో పోల్చారు, కానీ నేను ద్రోణాచార్యుడిని కాదు, ఇంకా విద్యార్థినే. నేర్పించాలంటే ముందు నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో కలిసి నేర్చుకోండి. మణిరత్నం సినిమాల్లో నేను నటించను, కేవలం పాత్రలో జీవిస్తాను. మేమంతా సినిమా అభిమానులం, సినిమాను ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటాం. నాజర్ గారు ఆల్‌రౌండర్, ఆయనతో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశాను. ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాకు తనికెళ్ళ భరణి గారు డైలాగ్స్ రాయాల్సి ఉండగా, అది కుదరలేదు. ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేయాలని ఉంది.
పవన్, చిరు ఫ్యాన్స్ కు ‘భైరవం’ డైరెక్టర్ క్షమాపణలు:
‘భైరవం’ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల తాజాగా మెగా ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పారు. గతంలో తన ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ‘నేను మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిని. నా కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసినప్పుడు ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సాయిధరమ్ తేజ్ ను పరిచయం చేసి.. మంచి కథ ఉంటే అతనితో మూవీ చేయమని అడిగారు. నేను చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలు చూసి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. అలాంటిది వాళ్లను నేనెందుకు దూరం చేసుకుంటాను. 2011లో నేను నా ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టినట్టు ట్రోలింగ్ జరుగుతోంది. ఆ పోస్టు పెట్టింది నేను కాదు. బహుషా నా అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చు. కానీ నా ఫేస్ బుక్ ఐడీ కాబట్టి నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఇలాంటి పొరపాటు మరోసారి జరగదు. మనస్ఫూర్తిగా చిరంజీవి, పవన్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి నా మీద, నా సినిమా మీద ట్రోలింగ్ ఆపండి’ అంటూ విజయ్ కనకమేడల రాసుకొచ్చారు. ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై మెగా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.