తెలంగాణలో కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్ ఓటింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు ఈ నెల 30న జరగనుండటంతో పోలింగ్‌కు ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తొలిసారి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఇవాళ ఇంటింటి ఓటింగ్‌లో భాగంగా సీనియర్ సిటిజన్స్ ఓటు వేశారు. ఇక, ఇంటి నుంచే ఓటు వేసేందుకు ముందుగా ఫామ్ డి-12 సమర్పించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీని ద్వారా ఎన్నికల అధికారి వారికి ఓటు వేసేందుకు పర్మిషన్ ఇస్తారు. అయితే, తెలంగాణలో 28,057 మందికి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసేందుకు ఈసీ అధికారులు అనుమతించగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశాక వాటిని పోలింగ్ సిబ్బంది సేకరించి తీసుకుని వెళ్తున్నారు. ముందుగా సమాచారం అందించి ఓటు వేయించేందుకు పోలింగ్ సిబ్బంది ఇళ్లకు చేరుకుంటున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది అని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
భద్రాచలం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారు విలేకరులను మోసం చేశాడు మోసం చేశాడన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాముడికి పట్టు వస్త్రాలు కూడా తీసుకురాకుండా ప్రజల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ చెప్పిన మాట చెప్పకుండా ఇచ్చిన మీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెట్టాడు మరల మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తప్పుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాడని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక అభ్యర్థి పొదుపు వీరయ్య గారిని గెలిపించాలని కోరుతున్నానని ఆయన అన్నారు.
అన్ని విధాలుగా రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు
కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామాన్ ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె మంగళవారం తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆమె అక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లోటు బడ్జెట్‌కు తీసుకువచ్చిందన్నారు. 2014లో రాష్ట్రం విభజన సమయంలో తెలంగాణలో ధనిక రాష్ట్రమని, తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని వేలకోట్ల అప్పుల పాలు చేశాడని తెలిపారు. రాబోయే తరాల మీద భారం మోపేలా కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన ఉందన్నారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్‌దని మండిపడ్డారు.
చంద్రబాబు ఇక రాజకీయాల నుంచి వైదొలగాల్సిందే..!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక రాజకీయాల నుంచి వైదొలగాని ఏపీ దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ సలహా ఇచ్చారు. అనేక రోగాలు ఉన్నట్టు అయన తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.. ఆయనకు ఇప్పటికీ కేసు నుంచి విముక్తి కలగలేదు.. టీడీపీ- జనసేన పొత్తు కుదిరినా వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని మంత్రి ఆరోపించారు. హాథిరామ్ మఠానికి చెందిన మహంత్ అర్జున్ దాస్ ను తొలగిస్తూ ధార్మిక పరిషత్ నిర్ణయించింది.. ఆయనపై 16 అభియోగాలు రుజువు అయ్యాయని కొట్టు సత్యనారాయణ అన్నారు.
త్రిమెన్ కమిటీ ఇచ్చిన నివేదిక సిఫార్సు మేరకు అర్జున్ మహంత్ ను తొలగిస్తూ ధార్మిక పరిషత్ ఏకగ్రీంగా నిర్ణయం తీసుకుంది అని మంత్రి కొట్ట సత్యనారాయణ అన్నారు. ఆయన స్థానంలో రమేష్ నాయుడు అనే వ్యక్తిని మఠం బాధ్యులుగా నియమించాము.. ఏపీపీఎస్సీ ద్వారా 59 మంది గ్రేడ్ 3 ఈవోల నియామకం చేపట్టాం.. 54 మందికి ఆలాట్ మెంట్ కూడా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. 539 కోట్ల రూపాయల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల పునరుద్దరణ చేస్తున్నాం.. కొత్త వాటిని నిర్మిస్తున్నాం.. త్వరలో రాష్ట్రంలోని 8 వేల దేవాలయాలకు ధూప దీప నైవేథ్య పథకం కింద 5 వేల రూపాయలు ఇస్తామని ఏపీ దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవకతవకలపై ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు..
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష నేతలు.. విపక్ష టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు కూడా చేసుకున్నారు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి కూడా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.. కొందరు అధికారులపై వేటు కూడా పడింది.. అయితే, మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో.. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడీపీ బృందం కలిసింది. అధికార పార్టీ ఒత్తిడితో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి తెలుగు తమ్ముళ్లు ఢిల్లీ బాట పట్టారు. వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని.. ఇదే సమయంలో విపక్షాల మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
భద్రాచలానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది
భద్రాచలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర గుర్తు చేశారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలోనే గోదావరి నదికి కరకటం నిర్మించాలని అది వరదల్లో కొండంత అండగా భద్రాచలంకి నిలుస్తుందన్నారు తుమ్మల నాగేశ్వర రావు. అలాగే నేను మంత్రిగా ఉన్నప్పుడే భద్రాచలం రెండో బ్రిడ్జి శంకుస్థాపన చేయడం జరిగిందని మళ్లీ మీరంతా అవకాశమిస్తే దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే సువర్ణ అవకాశం కూడా నాకే వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.. అంతేకాకుండా అనేక జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని హైదరాబాద్ నుంచి జగదల్పూర్ కి అలాగే వరంగల్ నుంచి చత్తీస్‌గఢ్ కి వయా వాజేడు మీదుగా మరొక జాతీయ రహదారి మంజూరు అయిందని తెలిపారు.. అయితే భద్రాచలం పంచాయతీని మూడు ముక్కలుగా విభజించి బిఆర్ఎస్ ప్రభుత్వం పాపం మూటగట్టుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భద్రాచలం ప్రజల అభీష్టానికి అనుగుణంగా భద్రాచలం అభివృద్ధి చేస్తామని పంచాయతీ విషయంలో కూడా అందరికీ ఆమోదయోగకరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు…. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన లొంగని నిజాయితీపరుడు వీరన్నని అటువంటి నిజాయితీపరుడు వదులుకుంటే అది పూర్తిగా భద్రాచలం యొక్క దురదృష్టం అని కాబట్టి ఇటువంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తుమ్మల.
నాగుపాము తలమీద ముద్దు పెట్టిన ఓ వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..?
కింగ్ కోబ్రా అంటే భయపడని వ్యక్తులు ఎవరు ఉండరు. ఆ పాము ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. అలాంటిది దాన్ని చూస్తేనే భయంతో వణికిపోయే మనం.. ఓ వ్యక్తి దాని దగ్గరికి వెళ్ళి గుండె ఆగిపోయేంత పనిచేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ఆ వీడియోలో ఓ నాగుపాము పడగ విప్పి ఉంది. అయితే మెల్లగా దాని దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి ఆ పాము నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. అలా ముద్దుపెడుతున్న క్రమంలో ఆ పాము కూడా అతనిని ఏం అనలేదు. దానికి కూడా అతను పెట్టే ముద్దు నచ్చిందేమో.. ముద్దు పెడుతుంటే, హ్యాపీగా చూస్తుంది ఆ నాగుపాము. ఒకవేళ తిరగబడి తనపై దాడి చేస్తున్నాడన్న భయంతో అతనిని కాటువేస్తే ఇంకేముంది. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఏదేమైనప్పటికీ ఈ సాహసం చేయడం చాలా ప్రమాదకరమే. ఇలాంటి వీడియోలు చూసి మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిదికాదు.
మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది..
కూకట్‌పల్లిలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు ఓటు వేస్తే.. అతడి ద్వారా నియోజక వర్గంలో అభివృద్ది పనులకు సపోర్టు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది అవసరమని ప్రజలు భావిస్తున్నారు.. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయన్నారు. బీజేపీ, జనసేన పార్టీ ప్రజల సమస్యలపై గళం విప్పి పోరాడే పార్టీలు.. ఈ పార్టీల అభ్యర్థులను ఆదరిస్తే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి.. నియోజక వర్గంలో ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనా పురందేశ్వరి అన్నారు.
బెడ్రూం వీడియోలు బయటపెడతానని పోలీసుని బ్లాక్మెయిల్ చేసిన భార్య..
కొందరు మహిళలు చేస్తున్న నేరాలను చూస్తుంటే, ఆశ్చర్యం, అసహ్యం కలగకుండా ఉండదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగిన ఓ మహిళ పెళ్లి చేసుకున్న భర్తనే బ్లాక్మెయిల్ చేస్తుంది. తమకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు బయటపెడతానని, డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. సదరు వ్యక్తి పోలీస్ అయినప్పటికీ.. ఆమె ఎక్కడా వెనక్కి తగ్గకుండా డబ్బులను డిమాండ్ చేసింది. వరాల్లోకి వెళ్తే సంగీతా దేవి అనే మహిళ ప్రభుత్వ అధికారులను పెళ్లి చేసుకుని, వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు బ్లాక్మెయిల్ చేస్తోంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉన్న బెడ్రూం వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తోంది. డబ్బులు వసూలు చేసేందుకే ఈ విధంగా బరితెగించింది. చివరకు బాధిత పోలీస్ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తుంది నా తెలంగాణ
సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తుంది నా తెలంగాణ అని వ్యాఖ్యానించారు. 72 నియోజకవర్గాలలో ఎన్నికల్లో ప్రచారం చేశా… మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ… గతంలో పంట ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని, 50 ఏళ్ళు కాంగ్రెస్ రాష్ట్రాన్ని గోస పెడితే… పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే సూర్యాపేటలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారమైందని, నీటి తీరువా రద్దు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన అన్నారు. ధరణి తీసేస్తే దళారీ రాజ్యం వస్తుందని, ఫ్లోరైడ్ నీటిని తాగించి జిల్లా ప్రజలను గోసపెట్టారు కాంగ్రెస్ నేతలు అని ఆయన మండిపడ్డారు.
రాహుల్, సోనియాగాంధీలకు ఈడీ షాక్.. రూ. 752 కోట్ల ఆస్తులు సీజ్..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ. 90 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అలాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఢిల్లీ, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌజ్‌లు, లక్నోలోని నెహ్రూ భవన్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్‌కి చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 752 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. పీఎంఎల్ఏ 2002 కింద దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసులో 751.9 కోట్ల విలువైన ఆస్తుల్ని తాత్కాలికంగా అటాచ్ చేయాలని ఈడీ ఉత్తర్వులను జారీ చేసింది. ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలతో పాటు ఇండియాలోని అనేక నగరాల్లోని రూ.661.69 కోట్ల విలువైన స్థిరాస్తులను, ఈక్విటీ షేర్లలో పెట్టుబడి రూపంలో ఉన్న రూ. 90.21 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.
మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను.. కేసీఆర్ ఆశీర్వదిస్తే మంత్రిని అయ్యాను
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను, కెసిఆర్ ఆశీర్వదిస్తే మంత్రిని అయ్యానన్నారు. తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గం నంబర్ వన్ గా చేశానని, అప్పుడు ముస్తాబాద్ ఎలా ఉండే ఇప్పుడు ముస్తాబాద్ ఎలా ఉంది ఆలోచన చేయండన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ దరిద్ర పాలన కవలాన 24 కరెంటు కావాలా అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్న ముస్తాబాద్ రండి ఎప్పుడు వస్తారో చెప్పండి అని ఆయన సవాల్ విసిరారు. నేను బస్ ఆరంజ్ చేస్తా వచ్చి మండలంలో కరెంటు వైర్లు పట్టుకొని చూడండి కరెంటు ఉందో లేదో అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 9 ఏళ్ళుగా సిరిసిల్ల లో ఎంత అభివృద్ధి జరిగిందో చూడండని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ వాలంటీర్ వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: అచ్చెన్నాయుడు
ఏపీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘంతో మంగళవారం సమావేశమైంది. ఈసీతో భేటీ అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏపీలో దొంగ ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపులు, టీడీపీ ఓట్లు టార్గెట్ గా తొలగించడం, వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వంటి అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘అక్టోబర్ 27 వరకు ఓటర్ వెరిఫికేషన్ దేశమంతట జరిగింది. కానీ ఏపీ రాష్ట్రంలో మాత్రం ఓటర్ వెరిఫికేషన్ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణ అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది.
ఏపీలో కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి ఫారం సిక్స్ ఓటు తొలగించుకోవడానికి ఫారం సెవెన్ ఉంది. ఓటర్‌కి సమాచారం ఇవ్వకుండానే ఓట్లను తొలగిస్తూన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కుటుంబంలో నలుగురు ఉంటే.. నాలుగురు ఓట్లను వివిద బూతుల్లో చేర్చారు. ఒకే కుటుంబంలో ఉన్న ఓట్లను ఇష్టానుసారంగా మార్పులు చేశారు. ఒకే మనిషికి రెండు ఓట్లు ఉన్నాయి వాటికి సంబంధించిన ఆధారాలను రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇచ్చాము. వాలంటరీ వ్యవస్థను ఉపయోగించి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఈ అంశానికి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపాం’ అన్నారు. ‘160 పోలింగ్ స్టేషన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని మార్పు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు చెప్పాం. కానీ, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?
ఉత్తర కొరియా సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సాయుధ దళాలు వెల్లడించాయి. దక్షిణం వైపుగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది. ఈ ప్రయోగాన్ని ధృవీకరిస్తూ జపాన్ హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత దక్షిణ కొరియా ప్రయోగం గురించి మంగళవారం ప్రకటించింది.
గతంలో మే-ఆగస్టు నెలల్లో ఇలాగే నార్త్ కొరియాలోని కిమ్ సర్కార్ స్పై శాటిలైట్‌ని కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలమైంది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఉత్తర కొరియా ప్రయోగాన్ని నిర్వహించింది. కిమ్ జోంగ్ ఉన్ యూఏన్ తీర్మానాలను ఉల్లంఘిస్తోందని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి.
దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఈ ప్రయోగాన్ని ధృవీకరించాయి. టోక్యో ఒకినావాలోని దక్షిణ ప్రాంతంలోని నివాసితులు సురక్షిత ప్రాంతంలో రక్షణ పొందాలని హెచ్చరించింది. ఉత్తరకొరియా మరో గూఢచార ఉపగ్రహ ప్రయోగం చివరి దశలో ఉందని వారం క్రితం దక్షిణ కొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఆపరేషన్స్ చీఫ్ డైరెక్టర్ కాంగ్ హో పిల్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా ప్రయోగాన్ని చేపడితే మా ప్రజల ప్రాణాలకు భద్రత హామీ ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని సోమవారం చెప్పారు.