బెంగాల్ హింసపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ నేత..
పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగాయి. కొందరు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో జరిగిన అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయి. అయితే, ఈ అల్లర్లపై ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి లేఖ రాశారు. ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్లపై జరిగిన దాడి వెనక కీలక కుట్రదారుల్ని వెలుగులోకి తేవాలాని, నేరస్తుల్ని గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విచారణ సహాయపడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
అభివృద్ధికి అడ్డుకట్ట వేయడం.. బీఆర్‌ఎస్‌కి పరిపాటే
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే BRS పార్టీ నిరంతరం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు, పారదర్శకంగా నడుస్తున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారానికి దిగడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం BRS పార్టీకి అలవాటైందని ఆయన అన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఇటీవల ప్రైవేట్ వ్యక్తుల పేరిట జరుగుతున్న వ్యవహారంపై సీఎం స్వయంగా సుప్రీంకోర్టులో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. “కోర్టు తీర్పు స్పష్టం చేసింది – అది ప్రభుత్వ భూమి అని తేల్చింది,” అని శ్రీధర్ బాబు అన్నారు. అయినప్పటికీ BRS పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తూ, AI టూల్స్ ద్వారా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.
పిల్లల ముందే భార్యని క్రూరంగా కొట్టి చంపిన కసాయి..
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. పిల్లల ముందే ఓ కసాయి భర్త తన భార్యను కొట్టి చంపాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింగా గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు. నిందితుడిని మొహమ్మద్ కలీముల్లా అలియాస్ మున్నాగా గుర్తించారు. కలీముల్లా తన రెండో భార్య మెహ్రుహ్నిషాను కర్రలో దారుణంగా కొట్టాడు. ఆమె ప్రాణాలు కోల్పోయే దాకా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరి పిల్లలు సమీర్, సల్మాన్ సమక్షంలోనే ఆమెపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెహ్రుష్నిషా ఓ వివాహం కోసం అమ్మగారి ఇంటికి వెళ్లింది. అక్కడ నుంచి సొంతింటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.
కాంగ్రెస్‌పై మండిపడ్డ కేటీఆర్.. రజతోత్సవ సభకు అనుమతివ్వలేదని ఆరోపణ
2025 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి కీలకమని పేర్కొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఇప్పటివరకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. మార్చి 28న అనుమతికి అప్లై చేసినప్పటికీ ఇంకా ప్రతిస్పందన లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని, రాష్ట్రం రూపుదిద్దుకునే దశలో పుట్టిన ఈ పార్టీ ఇప్పటికి అరవై లక్షల సభ్యులను కలిగి ఉందన్నారు. “రజతోత్సవం ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహించే సభ కాదు, ఇది మేం ప్రతి సంవత్సరం జరుపుకునే వార్షికోత్సవ సభ మాత్రమే,” అని స్పష్టం చేశారు.
జాతకం చెడిందన్నాడు.. కానీ జేబు మాత్రం బాగా నిండించుకున్నాడు
మీ జాతకం బాగాలేదని, శాంతి పూజలు చేయాలంటూ ఓ మహిళ ను బెదిరించి… అందిన కాడికి బంగారంతో ఉడాయించిన ఓ బురిడీ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఎర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ నరసయ్య తో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న గీత ఇటీవల భర్తను కోల్పోయింది. భర్త లెక్చరర్ గా పని చేసిన దిల్షుఖ్ నగర్ లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తుంది. గత ఏడాది భర్త మరణించడం , కూతురు ఎంబీబీఎస్ చదువుతుండటం… ఒకదాని వెంట ఇంకో సమస్యలు తలెత్తాయి. దీనితో ఆమె పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ సూచన మేరకు గుంటూరు కు చెందిన అరిగెల శాంభశివుడు అలియాస్ గురిజీ శివస్వామిను దిల్షుఖ్ నగర్ లో కలిసింది. బాధిత మహిళ కూతురి జాతకం బాగాలేదని… ఆమె పెళ్లి అయ్యాక ఆత్మహత్య లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందని బురిడీ బాబా బెదిరించారు. శాంతి పూజలు చేస్తే దోషం పరిహారం అవుతుందన్నారు. దీనితో భయపడిన బాధిత మహిళ బురిడీ బాబా కు మొదట 1 లక్ష 70 వేలు ముట్టజెప్పింది. ఇంకా పూజలు చేయాలనీ బెదిరిస్తూ ఆమె వద్ద నుండి 26 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అలాగే వాళ్ళు ఉంటున్న ఇంటి డాక్యుమెంట్ లను తీసుకొని , పూజ పేరిట శ్రీకాళహస్తి కు తీసుకెళ్లి అక్కడ పూజ నిర్వహించాడు.
పుల్వామా అమరుడి కుమార్తె వివాహం.. మాట నిలబెట్టుకున్న లోక్‌సభ స్పీకర్..
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నేరవేర్చారు. ఒకప్పుడు దు:ఖంతో నిండి ఉన్న ఆ ఇళ్లు, ఇప్పుడు సంతోషంగా ఉంది. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ హేమ రాజ్ మీనా కుమార్తె వివాహానికి ఆయన హాజరయ్యారు. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి సమయంలో, దు:ఖంలో ఉన్న హేమరాజ్ భార్యని ఓదారుస్తూ, ఆమెకు కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. హేమరాజ్ కుమార్తె వివాహ కార్యక్రమంలో ‘‘భట్’’ ఆచారాన్ని ఓం బిర్లా నిర్వహించారు. ఇది రాజస్థాన్‌లోని సంగోడ్ లో ఈ పెళ్లికి వచ్చిన వారందర్ని కదిలించింది. 2019లో పుల్వామా దాడిలో మరణించిన హేమరాజ్ మీనా భార్య వీరాంగన మధుబాల మీనా ఇంట్లో శుభకార్యానికి హాజరుకావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది.. ఆయనే కొనసాగుతారు
తెలంగాణ రాష్ట్రంలో పాలనపై విమర్శలు గుప్పిస్తూ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం పై భరోసా వ్యక్తం చేస్తూ, బీఆర్‌ఎస్ గతంలో చేసిన తప్పిదాలను ప్రజలు మర్చిపోలేరని పేర్కొన్నారు. “రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది – ఆయనే కొనసాగుతారు” అంటూ స్పష్టంగా తెలిపారు. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ పై విమర్శలు చేస్తూ, “అరవింద్ నిద్రలో కలలు కంటున్నట్టు ఉన్నారు” అన్నారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత పదేళ్ల పాలనలో కేటీఆర్ 10 నుండి 15 వేల కోట్ల వరకు బ్రోకర్లకు పంపించాడని, దాని మీద ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. “మేము మర్చంట్ అంటున్నాం.. ఆయన బ్రోకర్ అంటున్నారు,” అంటూ విమర్శించారు. “మీలాగా మేము 12 శాతం వడ్డీకి రుణాలు తీసుకోలేదు” అంటూ ఎద్దేవా చేశారు. మూసి వరదల సమయంలో ప్రజలను రెచ్చగొట్టిందెవరో, అడ్డుకున్నదెవరో ఇప్పుడైనా బీఆర్‌ఎస్ చెప్పాలన్నారు.
వైసీపీలో నూతన నియామకాలు.. 33 మంది పీఏసీ మెంబర్లు..
వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు ఉండనున్నారు. పీఏసీ కన్వినర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు.
వాట్సప్ సేవలకు అంతరాయం
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసెజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ సేవల్లో突اً అంతరాయం ఏర్పడింది. భారత్ సహా పలు ప్రాంతాల్లో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అనేక మంది సందేశాలు పంపడం, స్టేటస్‌లు అప్‌లోడ్ చేయడం వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సేవలపై మానిటరింగ్ చేసే డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, సమస్యను గురిచేసి నివేదించిన వారిలో 81 శాతం మంది మెసేజ్‌లు పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటి వరకు వాట్సప్ లేదా మెటా సంస్థ అధికారికంగా స్పందించలేదు.
వాట్సప్‌తో పాటు అదే కంపెనీకి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవల్లోనూ అంతరాయాలు ఉన్నట్లు యూజర్లు చెబుతున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో, సాయంత్రం మెటా యాప్స్ సేవల్లో అంతరాయం ఏర్పడటం నేపథ్యంలో యూజర్లు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తల్లే హంతకురాలు.. లిఖిత హత్య కేసును ఛేదించిన పోలీసులు..
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్ 4న లిఖిత తన ప్రియుడు అజయ్‌కు ఫోస్ చేస్తుండగా తల్లి సుజాతతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కోపంతో ఉన్న సుజాత, లిఖితను తన ఒడిలో కూర్చోబెట్టుకుని రెండు చేతులతో ఆమె ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసింది. తల్లి చేతుల్లోనే లిఖిత ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇంటికి తాళం వేసి, సుజాత యథావిధిగా తన ఉద్యోగానికి తిరుమలకు వెళ్లిపోయింది.