హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
6 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్బంధించిన ఆరుగురు ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. లోకేష్ అనే సోషల్ మీడియా ప్రతినిధి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో ఎస్సై జానకి రామయ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎస్సై జానకి రామయ్య స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. ఈ నెల 5వ తేదీన లోకేశ్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత.. ఇంటికి రాలేదని లోకేష్ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము లోకేష్‌కు 41ఏ నోటీసు ఇచ్చి వదిలేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు.
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం సుప్రీం ధర్మాసనం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారం ఆయనకు చివరి పని దినం కావడంతో సర్వోన్నత న్యాయస్థానం ఘనంగా వీడ్కోలు తెలిపింది. నవంబర్ 9, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు చంద్రచూడ్‌కు రెండేళ్ల పదవీకాలం ఆదివారంతో ముగుస్తోంది. కానీ శుక్రవారమే ఆయనకు చివరి పని దినంతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా చంద్రచూడ్ మాట్లాడారు… వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవమని పేర్కొన్నారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాను ప్రశంసించారు. సమర్థుడైన నాయకుడిగా అభివర్ణించారు. సమర్థుల చేతుల్లో ధర్మాసనాన్ని విడిచిపెట్టడం తనకు భరోసాగా ఉందని ఆయన అన్నారు. తాను ఎప్పుడైనా కోర్టులో ఎవరినైనా బాధపెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించాలని కోరారు. మరోవైపు సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. నవంబర్ 11న (సోమవారం) జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఇప్పటికే వెల్లడించారు. 2025 మే 13 వరకు సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు.
ఆలయాలపై దాడులు చేసే వారందరిపై పిచ్చోళ్లుగా ముద్ర వేస్తరా..?
కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పిచ్చోళ్లుగా ముద్రవేసి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులపై మాత్రమే పిచ్చోళ్లు దాడులు చేస్తరా? ఇతర ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓట్లేయలేదనుకుంటున్నారా? ఒక వర్గం ఓట్ల కోసం దేవాలయాలపై, హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇకపై ఆలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలుంటాయని సీఎం హెచ్చరికలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందువులంతా ఏకమై ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకం..
సిడ్నీలో తెలుగు ప్రజలతో సమావేశం కావడం సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలుగు కమ్యూనిటీతో దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశమయ్యారు. కామన్ వెల్త్ సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగు వారికి ఆమె సమయం ఇచ్చారు. వారి నుండి పురందేశ్వరికి అద్భుతమైన స్వాగతం లభించింది. ప్రస్తుతం తాము నివసిస్తున్న దేశాలకు ఆర్థికంగా, రాజకీయంగా సానుకూలంగా సహకరిస్తూ మన దేశం, రాష్ట్రం గర్వపడేలా చేసిన తెలుగు జాతికి గర్వకారణం అని పురందేశ్వరి తెలిపారు.
మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోంది
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక మత్స్యకారులు, నేతన్నలతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది దుర్మార్గులు ఉంటారు.. అందులో బీఆర్‌ఎస్ ముందు ఉంటదని, బీఆర్‌ఎస్ వాళ్ళను పిలిచి నల్గొండ బాగుపడాలా వద్దా అని అడగండని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మన కాళ్లల్లో కట్టే పెడుతున్నారని, మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోందని సీఎం రేవంత్ అన్నారు. మన జీవితంతో చెలగాటం ఆడుతుంటే… చైతన్యంగా ఉండాలా లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకడు అంటున్నాడు.. లక్ష 50 వేల కోట్లు మూసీకి పెడుతున్నారని, దాంట్లో 25 వేల కోట్లు రేవంత్ దోసిండు అంటున్నాడు.. ఓరి సన్నాసి.. నేను దోచుకోవాలి అంటే నల్గొండ ప్రజలు సొమ్ము అవసరమా.. నువ్వు తెచ్చిన ధరణిలో కోకాపేట పై ఫోకస్ పెడితే డబ్బులు వస్తాయని ఆయన అన్నారు.
సిద్ధరామయ్య ‘‘మాస్ లీడర్’’.. అందుకే బీజేపీ ఖతం చేయాలని చూస్తోంది..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజాదరణకు భయపడి ఆయనపై బీజేపీ నిందలు వేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్య పవర్‌ఫుల్ మాస్ లీడర్, ఆయనతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన ప్రజానాయకులందర్ని అంతమొందించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగళూర్‌లో శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని, అంగన్ వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు కిషన్ రెడ్డి. నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. దిశా కమిటీ మీటింగులో అనేక విషయాలపై చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఏలూరు పోలీసులను అభినందించిన ముఖ్యమంత్రి..
ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గత త్రైమాసికంలో దొంగలు ఓ బైకును దొంగలించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన బైక్ ను ఎత్తుకెళ్లారు. అయితే.. బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కదిలించాయని చంద్రబాబు తెలిపారు. బైకుపై ఆధారపడిన కుటుంబాలకు.. రోజువారీ రవాణా, జీవనోపాధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.
పదేళ్లలో మూసీ శుభ్రం చేయని బతుకు.. ఓ బతుకా
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి కూడా లేదని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ వస్తుందని తెలిసి, ఆమెకు జామీన్ వచ్చే రోజు రెండ్రోజులు ముందే ఢిల్లీ వెళ్లిపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే మాట అనేవి అన్నాడు, తప్పు చేసినప్పుడు పెద్ద పెద్ద నాయకులే జైలుకెళ్లిపోతే కేటీఆర్ ను ఎవరూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం పదవిలో మార్పు ఉంటుందని వస్తున్న అంచనాలపై, కోమటిరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎం పదవిలో మార్పు లేదు అని స్పష్టం చేస్తూ, రేవంత్ రెడ్డి ఐదేళ్లు ఇంకా సీఎం గా ఉంటారని ధృవీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలు మూసీ నది పక్కన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.