NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

రాహుల్ గాంధీ ‘దేశద్రోహి’,‘సోరోస్ ఏజెంట్’.. దూషించిన బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్…

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.

‘‘నిన్న ప్రతిపక్ష నేతపై బీజేపీ నేతలు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఎవరిపై ప్రవేశపెట్టామో వారిని సభలో ఈ రోజు కూడా మాట్లాడేందుకు అనుమతించారు. స్పీకర్ ప్రభుత్వ ఒత్తిడిలో ఉన్నారు’’ అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘‘మోడీ అదానీ భాయ్ భాయ్’’ అనే సందేశాన్ని కలిగిన టీషర్టుని ధరించి కాంగ్రెస్ నిన్నటి నుంచి ఆందోళన చేస్తోంది. అయితే, అదానీ డీప్ స్టేట్ కాంగ్రెస్ పార్టీని నిరోధించదు అని ఆయన అన్నారు.

సంక్రాంతిలోగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తాం..

సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. అమరావతిలో భారీ బడ్జెట్‌తో రహదారుల నిర్మాణం చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రోడ్లపై అధ్యయనం చేశామని.. త్వరలోనే పీపీపీ మోడల్‌లో రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు.

గతంలో పక్క రాష్ట్రం తెలంగాణలో ఏపీ రోడ్లపై జోకులు వేసుకునే వారని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో 42 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేశామని దినపత్రికలో రాశారని, ఎక్కడ నిర్మించారో చూపించాలన్నారు. ఓర్వకల్లు అభివృద్ధికి రూ.3 వేల కోట్లు కేంద్రం నిధులు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి గార్గేయపురం వరకూ రోడ్డు పనులు పరిశీలించామన్నారు. కర్నూలు-గుంటూరు రహదారి విస్తరణ.. కర్నూలు నగర రోడ్లు వెడల్పుకు డీపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి చెప్పుకొచ్చారు.

శ్రీకృష్ణ టెంపుల్‌కు రికార్డ్ విరాళాలు.. కేజీ గోల్డ్, రూ.23 కోట్ల నగదు

రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ శ్రీకృష్ణుడి ఆలయానికి భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. ఆలయ అధికారులే షాక్ అయ్యేలా విరాళాలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆలయంలో రెండు నెలల తర్వాత అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ప్రఖ్యాత ఆలయం ఇది. తమ కోర్కెలు నెరవేరుతాయన్న ఆశతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే వచ్చిన భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఈసారి ఎన్నడూ లేనంతగా అపూర్వమైన కానుకలు రావడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. రెండు నెలల తర్వాత హుండీ లెక్కించగా.. కిలో బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు, వెండి పిస్టల్, వెండి తాళం-కీ, వేణువులు వంటి ప్రత్యేకమైన వస్తువులు, రూ.23 కోట్ల నగదు విరాళంగా వచ్చాయి. ఆలయం ప్రారంభం తర్వాత ఇంత మొత్తంలో కానుకలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కకట్టనున్నారు.

ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తారు?.. సెటైర్లు వేసిన అంబటి రాంబాబు

ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు. లోకేష్ బయటకు వచ్చి మాట్లాడడు.. ప్రతి దానికి పవన్ వస్తారంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. చెడు ఉంటే పవన్ వస్తారు.. అది పక్కకి పోతుందన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న ఇదంతా నడిచినంత సేపు నడుస్తుందంటూ విమర్శించారు.

చంద్రబాబు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా ఎన్నికల్లో హామీలు ఇచ్చారని.. ఏ హామీ నెరవేర్చక ప్రజల్లో వ్యతిరేకత పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అందులో భాగమే ఇటీవల తిరుమల లడ్డు కల్తీ ప్రచారమంటూ ఆయన అన్నారు. ఇప్పుడు తాజాగా కాకినాడ పోర్టు కొనుగోలు ఒప్పందాలపై చేస్తున్నారన్నారు. ఏపీలో చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు.

రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫోర్స్ ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాన్ని (SDRF) ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్ర హోం శాఖ నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 2,000 మంది సిబ్బందితో అగ్నిమాపక శాఖ పర్యవేక్షణలో SDRF ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు కేటాయించిన ప్రత్యేక బోట్‌లను కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. భారీ అగ్నిప్రమాదాలు, భూకంపాలు మరియు వరదలు వంటి అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడానికి SDRF ఏర్పాటు చేయబడింది. విపత్తు ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్నిమాపక కేంద్రాలను SDRF స్టేషన్లుగా మార్చడం జరుగుతుంది.

పార్లమెంట్‌కి రూ.50,000 తీసుకెళ్లడం అసాధారణం కాదు..

కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన రాజ్యసభ సీటు వద్ద నుంచి రూ. 50,000 దొరకడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సభ చైర్మన్ జగదీప్ ధంఖర్ విచారణకు ఆదేశించారు. అయితే, ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ శుక్రవారం స్పందించారు. సభలోకి రూ. 50,000 నగదును తీసుకెళ్లడం అసాధారణం లేదా అనుమానాస్పదంగా లేదని ఆయన అన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఇతర ఎంపీలు కూడా పార్లమెంట్‌కి ఇదే మొత్తాన్ని తీసుకెళ్లినట్లు అంగీకరించారు.

ప్రమాదంలో 108 అంబులెన్స్ పైలట్ దుర్మరణం.. ఆరా తీసిన మంత్రి

అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై మంత్రి ఆరా తీశారు. వైజాగ్‌లో జరుగుతున్న డీప్ టెక్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. డీప్ టెక్ కాంక్లేవ్ నుండి బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. కుటుంబాన్ని అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

కేటీఆర్, హరీష్‌లు రెచ్చగొడుతున్నా రైతులు ఎక్కడ కూడా ధర్నాకు దిగలేదు

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజక వర్గ అబివృద్ధికి 27 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 54000 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. గ్రూప్ పరీక్షలు పేపర్ లీక్ లేకుండా యధావిధిగా నడిపించినామన్నారు షబ్బీఆర్‌ అలీ. కేటీఆర్, హరీష్ లు రెచ్చ గొడుతున్నా ధాన్యంకు మద్దతు ధర ఉందని రైతులు ఎక్కడ కూడా ధర్నా కు దిగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటికి 15 లక్షల అన్నావు ఎక్కడా.. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చినవు మోదీ అని ఆయన అన్నారు. అదానీ మీద ఎన్ని కంప్లెట్స్ వచ్చిన ఎందుకు అతన్ని వెనకేసుకు వస్తున్నావు మోదీని ఆయన అన్నారు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో మెగా పేరెంట్ టీచర్ మీట్…

ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవబోతోంది. ఏపీ వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్ టీచర్ మీట్ జరగనుంది. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్‌ టీచర్‌ మీట్‌ నిర్వహిస్తున్నారు. 38,319 మండలపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు.. 2,807 మునిసిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2843 ప్రభుత్వ పాఠశాలల్లో రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ సమావేశం నిర్వహించనున్నారు. కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహంలో చేసిన మార్పులు ఇవే..

డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ, ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ప్రత్యేకంగా రూపొందించారు. ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అధికారులు వెల్లడించారు. విగ్రహ రూపులేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. విద్యాసంస్థలు కేటాయించిన కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్‌, భద్రాద్రి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఏపీలోని చిత్తూరు, అనకాపల్లి, శ్రీసత్యసాయి, గుంటూరు, కృష్ణ, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

 

Show comments