బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం
శనివారం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు భూకంపం సంభవించింది. సముద్రం లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే సముద్ర అలలను పరిశీలిస్తున్నామని ఐఎండీ అధికారి తెలిపారు. ముందస్తుగా సునామీపై ఎలాంటి అంచనా వేయలేమని, హెచ్చరికలు జారీ చేయలేమని చెప్పారు.
ఏంటీ పృథ్వీ షా.. దరిద్రం నీ వెంటనే ఉన్నట్లుందిగా..
టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాకు నిలకడలేకపోవడంతో జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్2023 సీజన్లో సత్తా చాటి తిరిగి జట్టులో స్థానం సంపాదించుకుంటాడు అనుకుంటే ఘోరంగా విఫలం అయ్యాడు. ఇప్పుడు పేలవ ఫామ్‌తో షా సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో తన పూర్వపు ఫామ్‌ను అందుకోవడంతో పాటు టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలన్న కసితో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. నార్తాంప్టంన్ షైర్ టీమ్ తో జత కట్టాడు.
అయితే.. తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా దురదృష్టకరంగా అవుట్ అయ్యాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా శుక్రవారం గ్లౌసెస్టర్షైర్,నార్తాంప్టంన్ షైర్ జట్లు తలపడ్డాయి. నార్తాంప్టన్ షైర్ టీమ్ తరుపున అరంగేట్రం చేసిన షా 35 బంతులు ఎదుర్కొని కేవలం 2 ఫోర్లు, సిక్సర్‌తో 34 రన్స్ చేశాడు. క్రీజులో సెట్ అయ్యాడు ఇక భారీ స్కోరు చేస్తాడు అని అనుకునే క్రమంలో వైరటీగా ఔట్ అయ్యాడు. నార్తాంప్టంన్ షైర్ ఇన్సింగ్స్ 16వ ఓవర్లను గ్లౌసెస్టర్షైర్ బౌలర్ వాన్ మికెరన్ వేశాడు. ఈ ఓవర్లోని ఆఖరి బంతిని బౌన్సర్ గా వేశాడు.. స్ట్రైకింగ్‌లో ఉన్న పృథ్వీ షా పుల్ షాట్ ఆడబోయి.. బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు.
మొన్న వర్షాలకు నష్టపోయిన రైతులకే ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు
మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న వర్షాలకు నష్టపోయిన రైతులకే ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఎకరానికి 10 వేల చొప్పున పరిహారం ఇస్తానని చిటికె వేసిండు ..ఇప్పటి వరకు పరిహారం రాలేదని, ఇప్పుడు పాత స్కీం లు అన్ని బంద్ ..ఇప్పుడు అన్నీ కొత్తపథకాలు మొదలు పెట్టిండంటూ ఆయన ధ్వజమెత్తారు. బ్రిటిష్ కాలంలో కట్టిన కాల్వ ప్రాజెక్టు ఇప్పటికి మూడు సార్లు దెబ్బ తిన్నదని, మరమ్మతు చేయాలన్న స్పృహలేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. రైతులు, మత్స్యకారులు దాదాపు 50 లక్షల నష్టం వాటిల్లిందని, మూడు నెలల ముందు మద్యం టెండర్లు వేస్తుండు.. పోయినసారి 50లక్షల కోట్లు వస్తే ఈసారి 70 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది..ఈ డబ్బంతా ఏం చేస్తున్నావన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఎంతవరకు నష్టం జరిగింది వివరాలే లేవని, ఇప్పుడు ఈ నష్టం గురించి మరిచిపోవాలని కొత్తగా అంశాన్ని తీసుకొచ్చిండన్నారు.
పుంగనూరు అల్లర్లకు చంద్రబాబే కారణం..
చిత్తూరు జిల్లా పుంగనూర్ ఘటనపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. సీఎం జగన్ తన సుదీర్గ పాదయాత్రలో ఎక్కడా కత్తులు, కటార్లతో అల్లర్లకు పాల్పడ లేదు అని ఆయన కామెంట్స్ చేశారు. సీఎం జగన్ కు పట్టం కట్టిన ప్రజల తీర్పును నలభై ఐదు ఏళ్ళు రాజకీయ అనుభవం, సుమారు పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు గౌరవించటం లేదు అని డిప్యూటీ సీఎం తెలిపారు. జగన్, పెద్దిరెడ్డిలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చంద్రబాబు కక్ష గట్టాడు అని పేర్కొన్నారు. అందుకే బ్రాంది బాటిళ్ళు, కత్తులు, రకరకాల తుఫాకీలతో చంద్రబాబు తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అని డిప్యూటీ సీం నారాయణ స్వామి అన్నారు.
ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రారా నా కొడక్కల్లారా అని పిలుస్తున్నాడు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఎస్ఐ, సీఐలను బట్టలిప్పి కొడతా అంటూ నోరు పారేసుకోవడం తగదు అని ఆయన పేర్కొన్నారు. ఈ అల్లర్లను ప్రోత్సహించింది సాక్షాత్తూ చంద్రబాబే.. సీఎం జగన్, డీజీపీల సహనాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.. అల్లర్ల నిందితుల్లో ఏ1గా చంద్రబాబును చేర్చాలి అని డిప్యూటీ సీఎం చెప్పారు. పుంగనూర్ లో నిన్న( శుక్రవారం ) టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేయడంతో ఈ వివాదం చెలరేగింది. టీడీపీ అధినేత తీరుపై అధికార వైసీపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది
రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని, కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారిందని మండిపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వము బురద జల్లుతోందని, మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలు అవుతుందన్నారు. ఇది నిజాం రాజ్యాంగం కాదు… నేను నా కుటుంబం అంటే కుదరదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజు ఎంతో దూరం లేదని, కుటుంబ పార్టీలది స్వార్థ రాజకీయ… దేశాన్ని దోచుకోవడమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం డీఎన్ఏ ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కి దగ్గర సంబంధం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రి గా పని చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో సంసారం చేస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబం తో కాపురం చేస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
దారుణం..రెండో తరగతి విద్యార్థినిపై పిన్సిపాల్ అత్యాచారం..
చదువు నేర్పించాల్సిన గురువు బాలికపై దారుణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. బాలికకు బాగాలేదని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు.. అస్వస్థతకు గురైన చిన్నారిని, వైద్యం పేరుతో ఇంటికి తీసుకెళ్లి ఈ అగాయిత్యానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గపు ప్రిన్సిపాల్.. రెండో తరగతి చదువున్న విద్యార్థి అనుకోకుండా అస్వస్థకు గురైంది.. అయితే 10 ఏళ్ల చిన్నారి అస్వస్థకు గురైందని తెలుసుకున్న ప్రిన్సిపాల్ తరగతి గదికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం తన ఇంటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో ఈ దుర్మార్గానికి పాల్పడ్డట్లు పోలీసులు కేసు నమోదు చేశారు..
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఓ స్కూల్లో వెలుగు చూసింది.. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వర్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో.. చిన్నారి పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక భయాందోళనకు గురై పాఠశాల పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి ప్రిన్సిపాల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు..
కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించింది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు అంతరిక్ష నౌక జూలై 14న ప్రయోగించినప్పటి నుంచి చంద్రునిలో మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో ప్రకారం రాత్రి 7 గంటలకు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం చంద్రయాన్ సరిగ్గా పనిచేస్తోందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ ఈరోజు లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ (LOI) ద్వారా తన కక్ష్యను చంద్రుని కక్ష్యలోకి మార్చుకుంది. ఆగస్టు 6న అనగా 23 గంటల తర్వాత కక్ష్యను తగ్గించనున్నారు.
జూలై 14, 2023న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఎల్వీఎం-3 రాకెట్లో ప్రయోగించిన చంద్రయాన్-3 భూమి, చంద్రుని మధ్య అంతరిక్షంలో మూడు లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. అంతరిక్ష నౌక ఆగస్టు 1న భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసింది. చంద్రుని వైపు తన ట్రాన్స్-లూనార్ ప్రయాణాన్ని ప్రారంభించింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ (ISTRAC) ద్వారా దీనిని అమలు చేశారు. ఈ కీలకమైన ఆపరేషన్ వ్యోమనౌక వేగాన్ని తగ్గించి, చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రం దానిని స్థిరమైన చంద్ర కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి వీలు కల్పించింది. అంతరిక్ష నౌక ఇప్పుడు చంద్రుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుందని అంచనా వేయబడింది. తదుపరి రోజుల్లో దాని దూరాన్ని క్రమంగా తగ్గించడానికి ప్రణాళికాబద్ధమైన విన్యాసాలు ఉన్నాయి.
పాకిస్థాన్ ఆటగాళ్ల జీతాలను పెంచిన పీసీబీ..
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు శుభవార్త చెప్పింది. సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లకు ఇచ్చే జీతాలను భారీగా పెంచింది. గతంతో పోలిస్తే తాజా కాంట్రాక్ట్‌లో వారికి అందించే మొత్తాన్ని దాదాపు 4 రెట్లు పెంచినట్లు క్రిక్ఇన్ఫో పేర్కొంది. ప్రస్తుతం పాకిస్థాన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ కేటగిరీలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదీలు ఉన్నారు. అయితే, పీసీబీ వారికి నెలకు సుమారుగా రూ.13 లక్షలు ఇవ్వనుంది.. గతంలో నెలకు దాదాపు రూ.3.88 లక్షలు మాత్రమే వారికి ఇచ్చేది.. ఇక, పాకిస్థాన్ క్రికెటర్ల కాంట్రాక్ట్ గత జూన్‌లోనే ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రాక్టు లేకుండానే వాళ్లు ఆడుతున్నారు.
దీంతో ఇప్పుడు పెంచిన జీతభత్యాల ప్రకారం ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి దాదాపు కోటిన్నర రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. గతేడాది వరకు ఉన్న కాంట్రాక్టు ప్రకారం ఆ జాబితాలోని ఆటగాళ్లు వార్షికంగా మొత్తం రూ.50 లక్షల కన్నా తక్కువగా అందుకున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకు జీతాలు తక్కువగా ఇచ్చే బోర్డుల్లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒకటిగా ఉంది. కానీ తాజా అగ్రిమెంట్‌తో వారికి గతంతో పోలిస్తే పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తుంది.
సింగరేణికి బొగ్గు గనులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు
కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)కి బొగ్గు గనులు కేటాయించేలా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హామీ ఇస్తారని ఇంధన శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి అన్నారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ, వాటిని కేంద్రం వేలం ద్వారా కేటాయించిందని శనివారం ఇక్కడ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డి శ్రీధర్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, బొగ్గు బ్లాకుల వేలం కోసం నాలుగు సార్లు బిడ్లను ఆహ్వానించారు. ఒక కంపెనీ కోసం ఆదా చేయడం, అనేక ప్రైవేట్ ఏజెన్సీలు బిడ్లపై ఆసక్తి చూపడం లేదని ఆయన చెప్పారు.
‘ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్రం చేస్తున్న అన్ని నిబద్ధత చర్యలను ఎదిరించి సింగరేణి మనుగడకు భరోసా ఇస్తారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని జగదీశ్ రెడ్డి అన్నారు. కేంద్రం దుర్మార్గపు ఉద్దేశాలపై 2021 డిసెంబర్లో సింగరేణికి బొగ్గు బ్లాకులను నేరుగా కేటాయించాలని ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని మంత్రి తెలిపారు. MMDR చట్టంలోని సెక్షన్ 17A/11 A కింద గోదావరి లోయ బొగ్గు క్షేత్రాలలో బొగ్గు బేరింగ్ ప్రాంతాలను రిజర్వేషన్ లేదా కేటాయింపు కోసం బొగ్గు మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేయబడింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. ఇంకా, కేంద్ర ప్రభుత్వం 2023 జనవరిలో ఇచ్చిన సమాధానంలో తెలంగాణ ప్రభుత్వాన్ని వేలంలో పాల్గొని బొగ్గు బ్లాకులను పొందవలసిందిగా కోరిందని ఆయన చెప్పారు. టీఎస్ఆర్టీసీ, సింగరేణి తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాత్రమే కృషి చేస్తున్నారని అన్నారు.