జూన్ 8న మోడీ ప్రమాణస్వీకారం..‘8’వ తేదీనే ఎందుకు.? కారణం ఇదే..
ఇక లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్రమోడీ వరసగా మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈ రికార్డును పునరావృతం చేస్తున్నది మోడీ మాత్రమే. ఈరోజు మోడీ నివాసంలో ఎన్డీయే నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జేడీయూ నేత నితీష్ కుమార్ వంటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రపతిని కలిసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని సమాచారం. జూన్ 8 ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘8’వ తేదీనే మోడీ ఎందుకు ప్రమాణస్వీకారం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ సీజ్..
గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కొకైన్ పట్టుబడకుండ స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. కాగా.. ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు.
నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద గెలవలేదు
పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సమాజానికి తెలుసు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సొంత జిల్లాల్లో ఎమ్మెల్సీ, ఎంపీ గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారని, నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద గెలవలేదన్నారు. మల్కాజ్ గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు రఘునందన్ రావు. సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరి ఓడిపోతే మాట్లాడని రేవంత్ రెడ్డి కి మెదక్ గురించి ఎందుకు..? అని, హరీష్ రావు నాకు మద్దతు ఇచ్చారనీ తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో నీళ్ల మంత్రిగా ఉన్న హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి డబ్బులు పంచుతుంటే ఎందుకు ఆపలేకపోయావు..? అని ఆయన ప్రశ్నించారు.
తమిళనాడులో బీజేపీ ఫలితాలపై అన్నామలై కీలక వ్యాఖ్యలు..
తమిళనాడులో తమ ఉనికిని చాటాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో కనీసం 3 సీట్ల వరకు వస్తాయని అంతా భావించారు. కానీ నిజమైన ఫలితాల్లో సున్నాకే పరిమితమయ్యారు. ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న కోయంబత్తూర్ ఎంపీ స్థానం నుంచి ఆ పార్టీ చీఫ్ అన్నామలై గెలుస్తారని దేశం మొత్తం భావించింది. అయితే, ఈ స్థానంలో అధికార డీఎంకే అభ్యర్థి చేతిలో అన్నామలై ఓడిపోయారు. సీట్లు రాకున్నా గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ తన సీట్ల శాతాన్ని పెంచుకుంది.
అధికార పార్టీ డబ్బులతో ప్రలోభాలు పెట్టింది
రాష్ట్రంలో బీజేపీ నాయకులను గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉండాలని మమ్మల్ని గెలిపించారన్నారు. అనూహ్యంగా 35 శాతానికి పెరిగిన ఓటు బ్యాంక్ పెరిగిందని, అధికార పార్టీ డబ్బులతో ప్రలోభాలు పెట్టిందని, అయినా వారికి ఓటు బ్యాంక్ పెరగలేదన్నారు ఈటల రాజేందర్. ఈ ఎన్నికలు ఫలితాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ దే అధికారం అనే స్పష్టత వచ్చిందని ఆయన తెలిపారు. ఆరు నెలల్లో ప్రజలతో చీ కొట్టించుకున్న సీఎం రేవంత్ అని, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ లను ప్రతిష్టాత్మకంగా సీఎం తపుకున్నారన్నారు. అయినా ప్రజలు ఆయనను బంగపాటుకు గురి చేశారని, ఏ స్థానం ఎవరి జాగీరు కాదన్నారు ఈటల రాజేందర్.
హైదరాబాద్ లో వర్షం.. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం..
హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. ఇక జంట నగరలలో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఇలా అనేక ప్రాంతాల్లో గాలి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక సిటీ మరో వైపు చూస్తే.. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, పాత బస్తీ, మలక్ పేట, నాంపల్లి, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్ ప్రాంతాల్లో కూడా ఎడతెరపి కూడిన వర్షం కురుస్తోంది. దింతో నగరంలోని అధికారులు అప్రమత్తయ్యారు. ముఖ్యంగా వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరారు.
రేపు, ఎల్లుండి ఏపీలో వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పడే ఛాన్స్..!
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.
రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
‘మా’ నుంచి హేమ సస్పెన్షన్?
బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన సరే తాను హైదరాబాదులో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసి పెను వివాదానికి కారణమైంది నటి హేమ. బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తన పేరును కృష్ణవేణిగా నమోదు చేసిన ఆమె తన అసలు బెంగళూరు వెళ్ళలేదు అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఎట్టకేలకు పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి ఆమె మీద డ్రగ్స్ కేసుతో పాటు కేసును తప్పు దోవ పట్టిస్తుందని మరో కేసు కూడా నమోదు చేశారు. ఇక రెండుసార్లు విచారణకు హాజరు కాకుండా వాయిదా వేసే ప్రయత్నం చేసిన ఆమెను హైదరాబాద్ వచ్చి విచారించి మరి అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి హేమకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ కూడా కోర్టు విధించింది.
బలగం మొగిలయ్యకు ఆనారోగ్యం.. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి
బలగం మొగులయ్య తీవ్ర అస్వస్థకు గురైన సమాచారం తెలుసుకొని తక్షణం స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ బలగం మొగిలయ్యకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని అధికారులకు అదేశించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మొగులయ్యకు వరంగల్ లోని సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స ను అందిస్తున్నారు జిల్లా వైద్య శాఖ అధికారులు. బలగం సినిమా లో నటించి ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న నటుడు, బుడగ జంగాల కళాకారుడు బలగం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకొని అతని ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ జిల్లా వైద్య శాఖ అధికారుల తో మాట్లాడారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ. మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు మొగులయ్య కు డయాలసిస్ కి అవసరమైన మందులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందించారు. మొగిలయ్యా కు మెరుగైన చికిత్సను అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి (DMHO), ఎంజీఎం ఆసుపత్రి సూపరిoటెండెంట్ ను ఆదేశించారు.