రోహిత్ శర్మ కెప్టెన్సీలో చారిత్రాత్మక విజయం.. సిరీస్ సమం
ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా, భారత్ 79 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్ 79 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య 6 టెస్టులు జరగగా, భారత్ 4 ఓడిపోయింది.
ఢిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్ టెర్రరిస్ట్ జావేద్ అహ్మద్ మట్టూ
జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అతడిని అరెస్టు చేసింది. మట్టూ జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భద్రతా సంస్థల జాబితాలో లోయలోని టాప్ 10 లక్ష్యాలలో ఒకడిగా ఉన్నాడు. అతని తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. మట్టూ సోపోర్ నివాసి కాగా.. చాలాసార్లు పాకిస్తాన్‌కు వెళ్లాడు. గత సంవత్సరం, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు, సోపోర్‌లోని తన ఇంటిలో మట్టూ సోదరుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వీడియో వైరల్‌గా మారింది.
బీసీ నాయకత్వాన్ని తయారు చేసే వర్సిటీ.. టీడీపీ
బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని ఆయన పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయకూడదనే మేనిఫెస్టోలో బీసీ రక్షణ చట్టం చేస్తామనే హామీనిచ్చామన్నారు. బీసీ ఉప ప్రణాళిక కింద రూ.75 వేల కోట్లు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశాడా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
అధికారం పోయిందనే అక్కసు బీఆర్‌ఎస్‌లో కనిపిస్తుంది
అధికారం పోయిందనే అక్కసు.. బీఆర్‌ఎస్‌లో కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడిలా పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించడానికే 35 రోజులు తీసుకుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారని, ధైర్యం కోల్పోయింది బీఆర్‌ఎస్ నేతలేనని ఆమె విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబరు 7న అని, 9వ తేదీనే రెండు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి సీతక్క. ఒకే సారి రుణమాఫీ అన్నారు.. ఐదేళ్లు చేశారు కేసీఆర్ అని, పదేళ్లు దోచుకున్న 420 లు మీరు అని ప్రజలు గుర్తించే ఓడగొట్టారన్నారు. తమది గడీల పాలన కాదని… గల్లీ బిడ్డల పాలన అనీ అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని… దీనిని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోవడం లేదన్నారు.
పొత్తులపై ఏపీ బీజేపీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఏపీలో బీజేపీ నేడు కీలక సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల యోజన భైఠక్ పేరుతో జరిగిన కీలక భేటీలో.. ఎన్నికల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఇతర పార్టీలతో పొత్తులపై నేతల నుంచి జాతీస సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ జీ అభిప్రాయాలు తీసుకున్నారు. పొత్తులపై ఏపీ బీజేపీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింది. పొత్తుల్లేకుండా పోటీ చేయగలమా అనే అంశం పైనా అభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలిసింది. పొత్తుల్లేకుండా పోటీ చేస్తే.. ఓట్లు పెరుగుతాయోమో కానీ.. సీట్లు రావని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. జనసేనతో పొత్తు కొనసాగుతోందనే అంశాన్ని నేతలు స్పష్టంగా చెప్పాలన్నారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఏయే సీట్లల్లో బీజేపీ పోటీ చేయడానికి ఆస్కారం ఉందనే అంశం పైనా చర్చించారు. ఏపీలో అమిత్ షా పర్యటనలోగానే పొత్తులపై క్లారిటీ ఇవ్వాలని నేతలు శివ ప్రకాష్ జీని కోరారు.
పురందేశ్వరితో నాదెండ్ల మనోహర్ భేటీ.. అందుకేనా?
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం. పొత్తుల నేపథ్యంలో పురందేశ్వరి – నాదెండ్ల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జనసేన-బీజేపీ మధ్య కొనసాగుతున్నట్లు ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కానిస్టేబుల్ భర్తీపై తొలగిన అడ్డంకి
15,644 పోలీసు కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లోగా ప్రారంభించాలని, త్వరితగతిన ఎంపికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి మరియు జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావుతో కూడిన ధర్మాసనం, ‘తప్పు ప్రశ్నల’ వివాదాన్ని తొలగించాలని కోరిన స్వతంత్ర నిపుణుల సంఘానికి మళ్లీ సూచించింది.
స్వతంత్ర నిపుణుల సంఘం నుంచి రెండో అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు కోరింది. ఇది నిరుద్యోగ యువత మనస్సుల్లో ఒక స్పష్టతను తెస్తుంది మరియు ఇది రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై గొప్ప విశ్వాసాన్ని కలిగిస్తుంది” అని బెంచ్ పేర్కొంది. తెలుగులోకి అనువదించని 57, 122, 130, 144 ప్రశ్నలకు ఇచ్చిన మార్కులను మినహాయించాలని రిక్రూట్‌మెంట్ బోర్డును సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తలతో కూడిన రెండవ స్వతంత్ర నిపుణుల బృందానికి ఈ పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పు ప్రశ్నలను తొలగించిన వివాదాన్ని సూచించాలని డివిజన్ బెంచ్ TSLPRBని ఆదేశించింది. తప్పుడు ప్రశ్నల వివాదం, ప్రశ్నలను తొలగించడం, తెలుగులో ప్రశ్నలను ముద్రించకపోవడంపై విచారణ జరపాలని బాడీని కోరింది.
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారు..
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకొచ్చే ఇబ్బందేం లేదన్నారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో తన పార్టీని విలీనం చేస్తామంటే అక్కడ కాంగ్రెస్ శ్రేణులు వద్దన్నాయన్నారు. అక్కడ లాభం లేదనే కాంగ్రెస్‌లో విలీనం చేయించలేదన్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరితే తమ ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుందన్నారు. అలాంటప్పుడు ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా? అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే 1 శాతం ఓట్ల వల్ల వైసీపీకి నష్టం ఏం లేదన్నారు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారన్నారు నాని. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని జగన్ వైసీపీ శ్రేణులకు చెప్పారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి
2023 అక్టోబర్ 21న కాళేశ్వరంకు చెందిన మేడిగడ్డ ప్రాజెక్టు ఏడవ బ్లాక్‌లోని 19-21 పియర్స్ కుంగిపోయాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అదే సమయంలో అన్నారం ప్రాజెక్టు ముందుభాగంలో కూడా బుంగపడి నీరు బయటకు వచ్చిందని, ఈ రెండు ప్రమాద ఘటనలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంలో సర్వత్రా అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించిందని, న్యాయ విచారణ కాకుండా సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నామన్నారు. స్వతంత్ర సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ తదితర శాఖలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందేనన్నారు.
జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చా.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ మాటే తమకు వేదమని, ఆయన ఆదేశాలు సిరసావహిస్తామని కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే వెల్లడించారు. జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యానని ఆయన అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రజల కోసమే కష్టపడ్డానన్నారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా పని చేస్తామన్నారు.
బ్రేకింగ్.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈగల్..
ఎట్టకేలకు అనుకున్నదే అయ్యింది.. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫ్లిమ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కలిసి సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఈ చర్చల్లో సంక్రాంతి రేసు నుంచి ఒక సినిమా తప్పించడానికి చర్చలు జరిగాయి. ఈ మీట్ అనంతరం దిల్ రాజు.. ఈగల్ ను ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. చివరి వరకు కూడా ప్రమోషన్స్ వదలకుండా చేశారు. అయితే చివరకు ఈగల్ వెనక్కి తగ్గింది.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్ర్తీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి తెలియజేసారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తూ శాఖను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలో, వారి జీవన ప్రమాణాలు పెంపొందించడంలో గ్రామీణ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారి పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి నివాసానికి చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. తన సతీమణి సురేఖను వెంటపెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రజా భవన్ లో ఉంటున్న భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. భట్టి విక్రమార్క ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో భట్టి విక్రమార్కకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం పదవి చేపట్టిన భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాను వచ్చానని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.