ఫ్లైట్ డోర్ తెరిచేందుకు యత్నం.. కేరళ వ్యక్తి అరెస్ట్
ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే.. తాజాగా ఒక ప్యాసింజర్ ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించి అరెస్ట్ పాలయ్యాడు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. క్యాబిన్ సిబ్బందిపై దాడి చేసి.. అనంతరం విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. భద్రతాపరమైన ముప్పు ఉందన్న భయంతో పైలట్ ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. అనంతరం కేరళకు చెందిన ప్యాసింజర్‌ను అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల యవకుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి సోమవారం తెలిపారు. శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత నిందితుడు అబ్దుల్ ముసావిర్ నడుకండీని అరెస్టు చేసినట్లు సహర్ పోలీసు అధికారి వెల్లడించారు.
ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్‌సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎన్నికల ఫలితాల వేళ మండలి ఛైర్మన్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్‌సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు పడింది.
తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం
ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. రైలులోని మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుంది. రైల్వే డీసీపీ కెపిఎస్ మల్హోత్రా వివరాల ప్రకారం.. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.41 గంటలకు రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. అనంతరం ఐఓ అపోలో ఆసుపత్రి సమీపంలోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని మూడు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నట్లు ఘటనా స్థలంలో కనిపించింది. రైలు ఆగిపోయింది. ప్రయాణికులు ఇతర కోచ్‌లకు వెళ్లడం, రైలు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం రైల్వేశాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ తొత్తులు ఇచ్చినవే..
ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ తొత్తులు ఇచ్చినవే అని ఎన్టీవీతో మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ పేరిట బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. బీజేపీ సూచనల మేరకే ఎగ్జిట్ పోల్స్ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు అద్బుతమైన మెజారిటీ తో గెలుస్తోందని, బీజేపీ మూడు సీట్లలో మాత్రమే బలం ఉందన్నారు మంత్రి పొంగులేటి. ఐదు సీట్లలో కాంగ్రెస్ కు పోటీ ఉందని, ఈవీఎంలపై ఇండియా కూటమికి అనుమానాలు ఉన్నాయన్నారు.
హేమ అరెస్ట్.. బురఖాలో హాస్పిటల్ కు?
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ అవుతున్న నటి హేమను అక్కడి పోలీసులు వచ్చి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్ ద్వారా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అందరి లాగానే ఆమెను కూడా విచారణకు హాజరు కమ్మని కోరితే ఆమె తనకు వైరల్ ఫీవర్ ఉండడంతో విచారణకు హాజరు కాలేను అని చెప్పింది. మరోసారి నోటీసులు ఇచ్చినా మరొక సారి కూడా నోటీసులకి సమాధానం ఇవ్వలేదు సరి కదా విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
దయతో కాదు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ
బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజలు సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ అధికారుల దయతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు ఎస్ వెంకట వీరయ్య, సత్యవతి, నాయకులు కె కోటేశ్వరరావు, కె నాగభూషణం, గుండాల కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు జెండా పండుగ జరుపుకున్నారు. పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలనను ముందుకు తీసుకెళ్లిన ఘనత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ గురిపెట్టిన రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు.
ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముందంటే?
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ పోస్ట్‌లో పని చేస్తున్న ఐఎఎస్ దంపతుల 27 ఏళ్ల కుమార్తె బహుళ అంతస్తుల భవనంలోని 10వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ బైక్‌పై ఆమె మృతదేహాన్ని చూసిన గార్డు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కూటమి కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు కీలక సూచనలు
ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని చెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్ లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా కౌంటింగ్ జరుగుతోంటే పట్టు బట్టండని పిలుపునిచ్చారు.
లోక్ సభ ఎన్నికల్లో రూ.200 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం
లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మార్చి 1 నుంచి జూన్ 3వ తేదీ మధ్య రాష్ట్ర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.200 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పోలీసులు 466 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను (ఎఫ్‌ఎస్) ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రవి గుప్తా సోమవారం విడుదల చేసిన నోట్‌లో తెలిపారు.
కౌంటింగ్ నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
దేశ వ్యాప్తంగా ఏడు దశల పోలింగ్ జరిగింది. చివరి విడత జూన్ 1న ముగిసింది. ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే రిజల్ట్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు నగరంలోని ఏడు స్థానాల్లో జరగనుంది. ఈశాన్య ఢిల్లీలోని ఐటీఐ నంద్ నగ్రిలో కౌంటింగ్ జరగనుంది. దీంతో ఉదయం 5గంటల నుంచే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గగన్ సినిమా టి-పాయింట్ నుంచి వజీరాబాద్ రోడ్డు (మంగళ పాండే రోడ్)లోని నంద్ నాగ్రి ఫ్లైఓవర్ వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపారు