అది ‘‘వక్ఫ్ బిల్లు’’ కాదు, ‘‘వక్ఫ్ విధ్వంస బిల్లు’’..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. రేపు, ఉదయం ఇండీ కూటమి ఎంపీలతో రాహుల్ గాంధీ సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,25,26,29ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇది వక్ఫ్ బిల్లు కాదని, వక్ఫ్‌ని ధ్వంసం చేసే బిల్లు అని అన్నారు. ఈ బిల్లుకు ఎన్డీయే మిత్రపక్షాలైన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, చిరాగ్ పాశ్వార్, జయంత్ చౌదరిలు మద్దతు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు.
రైతు భరోసా అమలుపై హరీష్ రావు ఆగ్రహం.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
రైతు భరోసా అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాట తప్పడం, రైతులను మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.
జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను మార్చి 31లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఆ హామీ ఇంకా నెరవేరలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 కల్లా రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏప్రిల్ 1వ తేదీ వచ్చేసినా ఆ నిధుల గురించి ఎలాంటి ప్రకటన రాలేదని ఆయన మండిపడ్డారు.
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగించింది జిల్లా కోర్టు.. ఆత్కురులో 9 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.. వంశీ రిమాండ్‌ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. మరోవైపు, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.. గన్నవరంలో సీతామహాలక్ష్మి అనే మహిళ స్థలం కబ్జా చేశారన్న కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది..
జర్మన్ యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై అత్యాచారయత్నం చేసిన అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్ వచ్చి, నగరాన్ని సందర్శిస్తున్న జర్మన్ యువతి, యువకుడు ఇద్దరూ స్నేహితుల వద్ద ఉండి అక్కడి ప్రదేశాలను చూస్తూ తిరుగుతున్నారు. అయితే.. నిన్న మార్కెట్ చూసేందుకు జర్మన్ యువతి, యువకుడు బయటకు వచ్చారు. మీర్‌పేట్ సమీపంలో జర్మన్ యువతి, యువకుడిని అస్లాం, అతడి స్నేహితులు చూశారు. నగరాన్ని చూపిస్తానని నమ్మించి జర్మన్ యువతి, యువకుడిని కారులో ఎక్కించుకున్నారు అస్లాం. జర్మన్ యువతి, యువకుడిని సెల్ఫ్‌డ్రైవ్ కారులో పలు ప్రాంతాల్లో తిప్పిన అస్లాం… నిన్న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టు రోడ్డువైపు కారును మళ్లించాడు. ఈ క్రమంలోనే ఫొటోలు దిగేందుకు కారు నుంచి అస్లాం స్నేహితులు, జర్మన్ యువకుడు దిగారు. కారు యూటర్న్ చేసుకొద్దామని జర్మన్ యువతిని కారులో తీసుకెళ్లిన అస్లాం… కారును నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడి నుంచి తప్పించుకున్న బాధిత యువతి… తన స్నేహితుడితో కలిసి ఫహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్మన్ యువతి ఫిర్యాదు మేరకు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ.. వేధించినా నిలబడ్డారు..!
ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీలు, ఎంపీపీలు, మున్సిపల్ కార్పొరేషన్లు.. ఇలా పలు చోట్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టడం.. అందులో మెజార్టీ సాధించినవారు విజయం సాధించారు.. అయితే, కూటమి ప్రభుత్వం కేసులు, వేధింపులు, ప్రలోభాలతో కొన్నింటిని కైవసం చేసుకుందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. అయితే, అధికార కూటమి పార్టీల వేధింపులను తట్టుకుని నిలబడిన ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ ప్రత్యేకంగా భేటీకాబోతున్నారు..
HCU వ్యవహారంపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూముల విషయంలో తీసుకున్న తాజా నిర్ణయంపై పెద్ద వివాదం రేగింది. ఈ వివాదం నేపథ్యంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు లు ప్రొఫెసర్ హరగోపాల్.. ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “HCU భూముల విషయంలో కొన్ని అపోహలు, అనుమానాలు వ్యాప్తి అవుతున్నాయి. ఆ తతంగంలో బీజేపీ, బీఆర్ఎస్ పక్షాలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కంచె గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాల భూమి న్యాయస్థానంలో ఉందని, HCU విద్యార్థులు, అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి సంబంధించిన చిన్న చిన్న భూములు మాత్రమే ప్రభుత్వం తీసుకోలేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు
హెచ్‌సీయూ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు లు ప్రొఫెసర్ హరగోపాల్.. ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో కేసు గెలిచామన్నారు. ప్రయివేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా వేల కోట్ల భూమిని కాపాడామని, ప్రజల ఆస్తిని కాపాడిన తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రయివేటు రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని మేము తాపత్రయపడుతున్నామని, పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. మేము చేసే ప్రతి పని సంపద ఎలా సృష్టించాలనే అని ఆయన తెలిపారు. ఇవి యూనివర్సిటీ భూములు కాదని, HCU కి సంబంధించిన ఇంచు భూమిని మేము తీసుకోమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాల్సిన అవసరం ఉందని, HCU భూముల్ని ప్రభుత్వం గుంజుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు భట్టి విక్రమార్క.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది 2,038 కోట్లు, 48 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయబడింది. ఈ సంవత్సరంలో 19 లక్షల 50 వేల ఆస్తులున్నా, 14 లక్షల 8 వేల మంది ప్రాపర్టీ ఓనర్స్ తమ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారు.
వైద్యం వ్యాపారంగా మారింది.. రోగులను డాక్టర్లు మానవతా దృష్టితో చూడండి..
గతంలో పోలిస్తే.. ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన ఏపీ మెడికల్ కౌన్సిల్ లో నామినేటెడ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆరుగురు సభ్యులను నామినేటెడ్ పోస్టుల్లో ఎన్నుకున్నాం.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను… మంచి అనుభవం కలిగిన డాక్టర్లను ప్రభుత్వం ఎన్నుకుందన్నారు.. తరతరాలుగా వైద్యుల్ని దేవుడు పోల్చేవారు.. ఇదివరకు పోలిస్తే ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారిందన్న ఆయన.. డాక్టర్లు రోగులను మానవత దృష్టితో చూడాలని సూచించారు.. వైద్యవృత్తి విలువలు పల్చబడ్డాయి.. అవసరం లేకుండానే ఎక్సరేలు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ లు తీస్తున్నారు.. అలాగే నార్మల్ డెలివరీ చేయడం మానేశారు.. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు.. ప్రభుత్వ డాక్టర్లు గానీ.. ప్రైవేట్ డాక్టర్లు గానీ నార్మల్ డెలివరీస్ చేస్తే బాగుంటుందన్నారు..
హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ వివాదానికి శుభం కార్డు.. దిగొచ్చిన HCA
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది.