ఈ నెల 3న దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 3న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు రానున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వాలంటీర్ దారుణ హత్య.. కారణమేంటంటే?
అనకాపల్లి జిల్లాలో వాలంటీర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఈ ఘటనకు కారణమని అనుమానిస్తుండగా.. మృతుడి శరీరంపై విచక్షణ రహితంగా గాయాలు వున్నాయి. మృతుడు మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామానికి చెందిన నడింపల్లి హరి అని గుర్తించారు. బుధవారం రాత్రి 8గంటల సమయంలో స్నేహితులు పిలవడంతో బయటకు వెళ్లినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలో గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని కాలువ దగ్గర పొలాలలో మృతదేహాన్ని రైతు గుర్తించాడు. అత్యంత కిరాతకంగా చంపిన సంఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం ఏఎస్పీ, ఇద్దరు సీఐలు క్లూస్ టీంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరిగే కేరళ రాష్ట్రంలో గవర్నర్ ఆర్ఎస్‌ఎస్ కార్యకర్త కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.
గోదావరి ఎక్స్‌ప్రెస్ పరుగులకు 50 ఏళ్లు.. ఘనంగా వేడుకలు
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ ముద్దుబిడ్డ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకుంది. 50ఏళ్ల క్రితం విశాఖ – హైదరాబాద్ డెక్కన్ మధ్య ప్రారంభమైన రాకపోకలు నిరంతరాయంగా కొనసాగిస్తోంది గోదావరి ఎక్స్‌ప్రెస్. సేఫ్టీ, సమయ పాలనలో పక్కగా వుండే ఈ రైలు ఒకప్పుడు రాజధానికి వెళ్ళడానికి అత్యంత అనువైనది మాత్రమే కాదు ప్రయాణీకులకు సెంటిమెంట్ కూడా. బుల్లెట్ రైళ్ల వైపు కాలం పరుగులు పెడుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా 50వసంతాల వేడుకలు జరుపుకుంటోంది గోదావరి ఎక్స్‌ప్రెస్.
అధిష్టానానికి కాంగ్రెస్ నుంచి ఎంపీ స్థానాలకు పోటీ చేసే వారి లిస్ట్
ఖమ్మం పార్లమెంటు సీటు పై పలువురి కన్ను పడింది. కాంగ్రెస్ లోని ముఖ్యులు ఈసీటుకోసం ప్రయత్నాలు ప్రారంబించారు. ఇందులో బాగంగా పది మంది లిస్టును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించింది. మరో వైపున ఖమ్మం ఎంపి గా సీటు మల్లు నందినికి ఇవ్వాలని కోరుతు గాంధీ భవన్ లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అలా అందించిన వారు అంతా భట్టి వర్గీయులు .. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీ మాత్రం పది మంది లిస్టును పార్టీ అధిష్టానానికి ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారిలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ లకు సీటు ఇవ్వాలని కోరారు. అదే విదంగా జిల్లా నుంచి పోటీ పడుతున్న వారి జాబితాను కూడ అధిష్టానం ఇచ్చింది. ఇలా ఇచ్చిన వారి లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కొడుకు తుమ్మల యుగందర్ ఉన్నారు.
టార్గెట్ లక్షద్వీప్.. నిర్మలమ్మ కీలక ప్రకటన
గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఒకెత్తు అయితే.. లక్షద్వీప్‌పై ఆమె చేసిన ప్రకటన మరొకెత్తు. బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీప్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా స్పెషల్‌గా ఫోకస్ అయ్యాయి. దీనికి ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణమేంటంటే ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలే.
ఇండియా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న దేశం. అన్ని రంగాల్లోనూ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. భారత్‌లో అనేకమైన ఆహ్లాదరకమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. విదేశీయులు ఎక్కువగా భారత్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. పైగా ఇండియా సంస్కృతి, సాంప్రదాయాలకు పేరుగాంచిన దేశం. ఇన్ని విశిష్టతలు భారత్‌కు మాత్రమే సొంతం.
మాతో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు
పార్టీ ఫిరాయింపుల పై షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడకొడతం అంటూ కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎలా కులుస్తావో మేము చూస్తాం, మేము ద్వారాలు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవడం ఖాయమని ఆయన వెల్లడించారు. మాతో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఫిరాయింపులు వద్దని మా హై కమాండ్ చెప్పడం వల్లే ఆగామని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదని, కాంగ్రెస్ బీజేపీ మధ్యే పోటీ అని ఆయన అన్నారు.
బడ్జెట్‌లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్
బడ్జెట్‌లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలకు గత బడ్జెట్‌లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు.. ఇప్పుడు కూడా కేటాయించారని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారని.. ఖచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదన్నారు. చట్టంలో ఉన్న అంశాలన్నీ కేంద్రం నెరవేరుస్తుందన్నారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే అధిక లాభాలు కేంద్రం నుంచి వస్తాయన్నారు. రైల్వే జోన్ అంశం బీజేపీ పూర్తి చేస్తుందని.. రైల్వే జోన్‌కి ఏపీ ప్రభుత్వం భూమిని ఇవ్వలేదన్నారు. కేంద్రం హామీ ఇచ్చినవి అన్ని కేంద్రం నెరవేరుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా అగమ్యగోచరంగా ఉందని.. దేశంలో జెండా ఎత్తేసిందని ఎంపీ జీవీఎల్ ఎద్దేవా చేశారు.
హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్
మనీలాండరింగ్ కేసులో బుధవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో హేమంత్‌ను జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ హేమంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని సోరెన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు.