నేడు సంగారెడ్డిలో సీఎం కేసీఆర్ పర్యటన
నేడు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ కేసీఆర్ నగర్ ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 145 ఎకరాల విస్తీర్ణంలో 1489.29 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,660 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలు అందుకొనున్నారు.
నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!
జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ‘బోనాల పండగ’ సందడి మొదలుకాబోతుంది. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర నేటినుంచి ప్రారంభం కానుంది. ముందుగా గోల్కొండ బోనాలు (Golconda Bonalu 2023) ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్‌లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభం కానుంది. జులై 10న ఊరేగింపు నిర్వహిస్తారు. మరోవైపు పాతబస్తీలో బోనాల ఉత్సవం జులై 16న ప్రారంభం కానుండగా.. జులై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు. మొత్తంగా నెల రోజుల పాటు బోనాల జాతర సందడి ఉండనుంది.
అటు గోల్కొండ, ఇటు ట్యాంక్ బండ్.. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. ఇవాల్టి నుంచి తెలంగాణలో ఆషాడ బోనాలు మొదలు కానున్నాయి. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. లంగర్ హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. అటు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం, ఇటు గోల్కొండ బోనాలు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్మారక కేంద్రం వరకు కళాకారులచే భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులకు వెళ్లే దార్లను మూసేయనున్నారు. వీవీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ, కర్బాల మైదాన్, రాణిగంజ్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులను మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదాన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా మళ్లించనున్నారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపునకు ట్రాఫిక్‌కు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్నారు.
పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె
ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూమార్తె. ఆమె ప్రస్తుతం లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తోంది. తను మహిళగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పురుషుడిలాగనే జీవించింది. అయితే ఇపుడు శారీరకంగా కూడా పురుషుడిగా మారాలని కోరుకుంటోంది. అందుకే 41 ఏళ్ల వయస్సులో ఆమె లింగ మార్పిడి చేసుకొని స్త్రీ నుంచి పురుషుడిగా మారడం కోసం లింగమార్పిడి చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఇది తన సొంత నిర్ణయమని.. దీనిపై ఎవరు రాద్ధాంతం చేయవద్దని స్పష్టం చేశారు. ఆమెనే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. తాను పుట్టుకతో మహిళనే అయినప్పటికీ.. చిన్నప్పటి నుంచి మానసికంగా పురుషుడి లాగానే జీవిస్తోంది. మానసికంగానే కాకుండా శారీరకంగానూ పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. ఇటీవల నిర్వహించిన ఎల్‌జీబీటీక్యూ వర్క్‌షాప్‌నకు హాజరయ్యారు. పుట్టినప్పటి నుంచి తాను పురుషుడిగా భావిస్తూ.. పురుషుడిగానే జీవిస్తున్న ఆమెకు అదే నమ్మకం మరింత బలపడింది. దీంతో 41 ఏళ్ల వయసులో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యులు, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్న ఆమె.. అందుకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ప్రధాని మోడీకి వైట్‌హౌజ్‌లో విందు.. నోరూరించే మెనూ ఇదే..
ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌజ్‌లోకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు బైడెన్ దంపతులు. జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో ప్రధాని పర్యటన బిజీబీజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ప్రధాని మోడీ విందులోని మెనూపై అందరి ఆసక్తి నెలకొంది. మోడీ శాకాహారి కావడంతో అందుకు తగ్గట్లుగా వంటలు ప్రిపేర్ చేయాల్సింది జిల్ బైడెన్ వైట్ హౌజ్ చెఫ్ నినా కర్టిస్‌ను కోరారు. వెజిటేరియన్ ఫుడ్ లో నినా కర్టిస్ కు మంచి ప్రావీణ్యం ఉంది.
విందుకు ముందు జిల్ బైడెన్ ఏర్పాట్లను మీడియాకు వివరించారు. జాతీయ పక్షి నెమలి నుంచి ప్రేరణ పొందిన థీమ్ నుంచి త్రివర్ణ పతాకాన్ని సూచించేలా డెకరేట్ చేశారు. భారతీయ రుచులతో ఈ వంటకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. మోనూలో ముఖ్యంగా మిల్లెట్స్ తో వంటకాలు చేశారు.
తండ్రి పనిచేసిన అదే పోలీస్ స్టేషన్‌లో కూతురికి పోస్టింగ్..
తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలను చూడాలని కలలు కంటారు. తమను మించిన వాళ్లు కావాలని కోరుకుంటారు. తాజాగా కర్ణాటకలో ఓ యువతి అదే చేతి చూపించింది. తండ్రి బాధ్యతలను తాను స్వీకరించింది, ఇన్నాళ్లు పోలీస్ ఇన్స్పెక్టర్ గా తండ్రి పనిచేసిన అదే పోలీస్ స్టేషన్ లో కూతురికి పోస్టింగ్ వచ్చింది. స్వయంగా ఆయనే తన కూతురికి బాధ్యతలు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే కర్ణాటక మాండ్యా జిల్లాలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్, తన సొంత కుమార్తె వర్షకు తన విధులను అప్పగించారు. ఈ అరుదైన ఘటనను పోలీస్‌స్టేషన్‌లో అందరూ చూశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన కుమార్తెకు వెంకటేష్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. గత ఏడాది పీఎస్ఐ( పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ ) పరీక్షల్లో వెంకటేష్ కుమార్తె వర్ష అర్హత సాధించారు. యాదృచ్చికంగా వర్షకు తండ్రి పనిచేస్తున్న అదే పోలీస్ స్టేషన్ లో, అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం.
భారత అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ!
వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
2011 నుంచి భారత్ ఒక్క ప్రపంచకప్ టోర్నీని కూడా గెలవలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ 2011ని భారత్ దక్కించుకుంది. ఆపై 2013లో ధోనీ నాయకత్వంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పటికి 10 ఏళ్లు అవుతున్నా.. టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ టైటిల్ లేదు. 2015, 2019లో వన్డే ప్రపంచకప్‌లు.. 2012, 2014, 2016, 2021, 2022లో టీ20 ప్రపంచకప్‌లు జరిగినా భారత్ గెలవలేకపోయింది. ఇక 2019, 2023లో టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్యూటీసీ) ఫైనల్లో కూడా టీమిండియాకు నిరాశే ఎదురైంది. దాంతో ఓ ఐసీసీ ట్రోఫీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
నేడు తెలంగాణ సీఈవోతో కేంద్ర ఎన్నికల బృందం భేటీ
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగానే నిన్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రానికి చేరుకుంది. నాలుగు రోజుల పాటు సీఈసీ బృందం హైదరాబాద్ లోనే మకాం వేసి కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీ శాఖ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్‌తో భేటీ. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, 24న చీఫ్ సెక్రటరీతో సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలు, 2023లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తుంది.
అస్సాంలో వరదలు.. 20 జిల్లాల్లో 1.20 లక్షల మందిపై ప్రభావం..
ఈశాన్య రాష్ట్రం అస్సాం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ బ్రహ్మపుత్ర నదితో పాటు ఇతర నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా జిల్లాలో వరద భీభత్సం సృష్టిస్తోంది. బుధవారం అస్సాంలో పరిస్థితి మరింత దిగజారింది. 20 జిల్లాల్లో 1.20 లక్ష మంది వరదబారిన పడ్డారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం.. అస్సాంతో పాటు పొరుగు రాష్ట్రాలు, పక్కన ఉన్న భూటాన్ దేశంలో కుండపోత వర్సాల కారణంగా అనేక నదులు నీటి మట్టాలు ప్రమాదకరంగా పెరిగాయి. దీంతో లోతట్లు ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి.
బజలి, బక్సా, బార్‌పేట, బిస్వనాథ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూగఢ్, గోలాఘాట్, హోజాయ్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిత్‌పూర్, తముల్‌పూర్, ఉడల్‌గురి జిల్లాల్లోని 45 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 780 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బజలి, దర్రాంగ్, కమ్రూప్ (మెట్రో), కోక్రాఝర్ మరియు నల్బరీ జిల్లాల్లో కూడా పట్టణ వరదలు సంభవించాయి. నల్బరి జిల్లాలో 44707 మంది, బక్సాలో 26571 మంది, లఖింపూర్‌లో 25096 మంది, తముల్‌పూర్‌లో 15610 మంది, బార్‌పేట జిల్లాలో 3840 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. వరదల కారణంగా 1.07 లక్షల పెంపుడు జంతువులు, కోళ్లు దెబ్బతిన్నాయి.
పలుకరించిన తొలకరి.. నేడు, రేపు వర్షాలు
తెలంగాణకు తొలకరి పలుకరించింది. రుతుపవనాలు తెలంగాణలోని పలు ప్రాంతాలను మొదటిసారిగా తాకడంతో నగరంలో బుధవారం చినుకులు, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. రుతుపవనాలు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని తాకాయి. రుతుపవనాల రాక తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది. తొలకరి చినుకులు పడగానే పుడమి పులకరించింది. వడగాల్పులతో ఉడికిన జనం వాన జల్లులతో సేద తీర్చుకున్నారు. వాస్తవానికి ఈ నెల ప్రారంభం నుంచే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. కేరళ నుంచి ఆంధ్రాకి విస్తరించి.. దాదాపు పది రోజుల పాటు అక్కడే నిలిచిపోయారు. కాగా.. ఇక రాష్ట్రంలో తొలుత దక్షిణం, ఆ తర్వాత ఉత్తర, మధ్య భాగాల్లోకి రుతు పవనాలు ప్రవేశించి విస్తరిస్తాయి. అయితే.. ఈసారి మాత్రం దాదాపుగా మూడు వారాలు ఆలస్యమైంది. ఇన్ని రోజులు ఎండ వేడికి ఉక్కిరి బిక్కిరి అయిన నగర వాసులు.. ఈ వర్షంతో కాస్త కూల్ అయ్యారు.