రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!
కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం భరిస్తాయి. ఇది కాకుండా, రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత లింక్డ్ బోనస్ (PLB) ఆమోదించబడింది. ఇందులో భాగంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ఇవ్వనున్నారు. కేబినెట్ నిర్ణయంతో 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
లక్ష కోట్లతో వ్యవసాయ అభివృద్ధి పథకాలకు ఆమోదం!
తాజాగా కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి రూ. 1 లక్ష కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాల విషయానికి వస్తే.. ‘PM రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (PM-RKVY)’ , ‘కృషి ఉన్నతి యోజన (KY)’. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి PM-RKVY, స్వయం సమృద్ధి కోసం ఆహార భద్రత సాధించడానికి కృషి ఉన్నతి యోజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు వ్యవసాయ పథకాలకు మొత్తం రూ.1,01,321.61 కోట్లు ఖర్చు చేయనున్నారు.
నేడు ముద్దపప్పు బతుకమ్మ.. ఏం చేస్తారంటే!!
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. ఆడబిడ్డల ఆత్మీయ వేడుక బతుకమ్మ. బుధవారం (అక్టోబర్ 2) నుంచి అక్టోబర్ 10న అంటే తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. రెండు రోజులు ఎంగిలి పూల బతుకమ్మను జరుపుకున్న మహిళలు నిన్న రెండో రోజు అటుకుల బతుకమ్మను వేడుకగా జరుపుకున్నారు. ఇవాళ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. ఈ రోజున, ముద్ద పప్పు, పాలు, బెల్లంతో చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రేపు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేప బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తారు. ఇలా బతుకమ్మను తంగేడు పూలు, గునుగు పువ్వులు, కట్ల పువ్వులు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీత జడలు వంటి రకరకాల పూలతో అలంకరించి ప్రతిరోజు తొమ్మిది రోజుల పండుగను జరుపుకుంటారు. బతుకమ్మలో భాగంగా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజల జీవన సౌందర్యాన్ని జానపద పాటల ద్వారా తెలియజేసేందుకు ఊరూరా ప్రయత్నిస్తోంది. ప్రతిరోజు అమ్మవారిని వివిధ నైవేద్యాలతో పూజిస్తారు. చివరి రోజు ఆడబిడ్డలు ఆడిపాడి పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మ.. మళ్లొచ్చే ఏడాది తిరిగి రావమ్మ.. అని వీడ్కోలు పలుకుతారు. నీళ్లలో నిమజ్జనం చేసి వాయినం ఇచ్చి పుచ్చుకుంటారు.
నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం రేణిగుంట చేరుకుంటారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. రాత్రి 9 గంటలకు బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేషు వాహనసేవలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ వకుళమాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది.
లంక గ్రామాల్లో వరద బాధితులు ఆందోళన
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం లో, ఇటీవల వచ్చిన వరదల దెబ్బకు అనేక కుటుంబాలు విలువలాడుతున్నాయి… అధికారుల నిర్లక్ష్యంతో, లంక గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలకు కనీస నష్టపరిహారం అందనేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి… దీంతో సర్వం కోల్పోయిన వలస కుటుంబాలు, చెట్ల కింద పుట్ల గట్టున తలదాచుకుంటున్నారు… 10 సంవత్సరాల క్రితం గోదావరి జిల్లా నుండి, వలస వచ్చిన కొన్ని కుటుంబాలు, కొల్లూరు సమీపంలో నివాసం ఉంటున్నాయి, స్థానికంగా ఇటుక బట్టీల్లో, ఇతర వ్యవసాయ భూముల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు….గత నెల లో వీళ్ళపై వరద విరుచుకుపడింది …ఈ నేపథ్యంలో వరద నుండి తప్పించుకునేందుకు ప్రాణాలతో బయటపడ్డారు కానీ, తమకు జీవనాధారమైన ఇళ్లను, వస్తువులను సర్వస్వాన్ని కోల్పోయారు వలస కుటుంబాలు …అయితే అప్పటినుంచి అధికారులు వస్తూపోతూ ఉన్నారు కానీ, తమకు ఎలాంటి సాయం అందించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు… ఒకపక్క ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి వరద బాధితుడికి సాయం అందాలని చెప్తున్నా ,అధికారుల నిర్లక్ష్యంతో తమకు ఎలాంటి సాయం అందడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నాయి వలస కుటుంబాలు…. పిల్లలతో వేప చెట్టు కింద తలదాచుకుంటున్నామని ,వరద పోయి నెల రోజులు అవుతున్న ,తమకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు….
వికారాబాద్‌లో సంచలనం.. ఒకేసారి ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐ లపై వేటు..
తెలంగాణలో పోలీసుల ప్రక్షాళన మొదలైంది. అక్రమ దాడులను దుర్వినియోగం చేస్తున్న పోలీసు అధికారులపై వేటు పడింది. మల్టీజోన్-2లోని తొమ్మిది జిల్లాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలను వీఆర్‌వోలుగా కొనసాగిస్తూ మల్టీజోన్-2 ఐజీపీ వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌లో పెట్టినవారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్‌ఐలుగా ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఐజీ తెలిపారు. త్వరలో వారిని లూప్‌లైన్‌కు బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒక సీఐ, 14 మంది ఎస్సైలు బదిలీ అయిన సంగతి తెలిసిందే.
నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు… తిరుమలలో ట్యాక్సీలకు అనుమతి నిరాకరణ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ధ్వజారోహణానికి ముందుగా నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని గురువారం రాత్రి శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సేనాధిపతి విష్వక్సేనుల ఉత్సవం ఘనంగా జరిగింది, మాడ వీధుల్లో వారి ఊరేగింపు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం 5:45 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది, ఇది బ్రహ్మోత్సవాలను ప్రారంభించనుంది. రాత్రి నుంచి తొమ్మిది రోజుల పాటు మలయప్ప స్వామి వివిధ వాహనాల్లో ఊరేగించనున్నాడు. బ్రహ్మోత్సవాలు 12వ తేదీన చక్రస్నానంతో ముగియనున్నాయి. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్, విజయశాంతి రియాక్షన్
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాములమ్మ విజయశాంతి కొండా సురేఖ కామెంట్స్ కు తప్పుపడుతూ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు..
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ లక్ష్మీ తాయారమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం అమ్మవారు ఆదిలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమపూజ నిర్వహించారు. ఈ నెల 12 వరకు రోజూ అమ్మవారిని అలంకరించనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర కూడా నిర్వహించనున్నారు. మరోవైపు రాజన్నసిరిసిల్ల జిల్లాలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. ఈ సందర్భంగా ఇవాళ రెండవ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మ చారిణి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ ,చతుష్టోపచార పూజలు, ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేశారు.