విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జీవీఎల్ కీలక ప్రకటన..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కీలక ప్రకటన చేశారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై యథాతథ స్థితి కొనసాగించే విధంగా కేంద్రం సంకేతాలు పంపించిందన్నారు.. ఎన్నికల ముందు కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశం వ్యతిరేకతను తీసుకుని రాకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ఉక్కు శాఖ సహాయమంత్రి కులస్తే స్టీల్ ప్లాంట్ సందర్శించాల్సి ఉందన్నారు. యజామాన్యం, కార్మిక సంఘాలతో వేరు వేరుగా సమావేశమై కేంద్రం నిర్ణయం వెల్లడించాలని భావించారు. అయితే పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర మంత్రి పర్యటన రద్దు అయ్యిందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు ఎంపీ జీవీఎల్. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసిన ఎంపీ జీవీఎల్…స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. విశాఖ ఉక్కు పబ్లిక్ సెక్టార్ లో కొనసాగాలంటే లాభాల బాట పట్టించాలన్నారు.. ప్రజల ఆస్తిగా ఉన్న పరిశ్రమ పరిరక్షణ అందరి బాధ్యతగా పేర్కొన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ నష్టాలు., ఐరన్ ఓర్ మైనింగ్ ఇవ్వకపోవడం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందా..? అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని కార్మిక సంఘాలను కోరుతున్నాం.. కాంగ్రెస్ హయాంలో గత మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్-3ని ప్రారంభిస్తాం.. రాయబరేలిలో ఉన్న రైల్వే వీల్స్ ఫ్యాక్టరీ ద్వారా 2 వేల కోట్ల మూలధనం సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. NMDC ఆధ్వర్యంలో పిల్లేట్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఇక మనం గేర్ మార్చాలి.. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇకపై మరొక ఎత్తు..!
ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది.. ఇప్పటివరకూ మనంచేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. జగనన్న ఆరోగ్యసురక్ష, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? పేరుతో ప్రభుత్వ అభివృద్ధికార్యక్రమాలపై నెలరోజులపాటు ప్రచారంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆరు నెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయం అన్నారు.. 175 కి 175 వైనాట్.. ఇది పాజిబుల్ కాబట్టే… క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయన్నారు. అందుకే ఒంటిరిగా పోటీకి రాకుండా ప్రతిపక్షపార్టీలు పొత్తులకు వెళ్తున్నాయని దుయ్యబట్టారు. గడపగడపకూ కార్యక్రమంలో మన పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు.. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్మం, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకు వేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ ఉండడం ముఖ్యమైన విషయంకాగా, ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన అంశం అన్నారు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి.. విభేదాలను పరిష్కరించుకోవాలి. వచ్చే 6 నెలల్లో వీటిపై దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే.. చాలామందికి టిక్కెట్లు రావొచ్చు, మరికొంతమందికి ఇవ్వలేకపోవచ్చు.. ప్రజల్లో.. ఎవరికి ఇస్తే కరెక్టు అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు.. టిక్కెట్టు ఇవ్వనంత మాత్రాన.. ఆ వ్యక్తి మన మనిషి కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు సీఎం జగన్.
టీడీపీ పీఏసీ తొలి సమావేశం కీలక నిర్ణయాలు.. టీడీపీ-జనసేన నేతలతో జేఏసీ
టీడీపీ పీఏసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కమిటీ నియామకం తర్వాత తొలిసారిగా భేటీ అయ్యింది టీడీపీ పీఏసీ.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపై చర్చించారు.. గత కొన్ని రోజులు నుంచి కోర్టుల్లో జరుగుతున్న పరిణామాలు.. తాజాగా లోకేష్‌పై కేసు నమోదు వంటి అంశాలపై సమీక్ష జరిగింది.. క్షేత్ర స్థాయిలో రూపొందించుకోవాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది పీఏసీ.. జనసేనతో సమన్వయం కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన వ్యవస్థపై సమాలోచనలు చేశారు.. పీఏసీ భేటీకి యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, బీదా, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరు కాగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు నారా లోకేష్.. ఇక, టీడీపీ పీఏసీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంపై పోరాడేందుకు టీడీపీ-జనసేన నేతలతో కలిసి జేఏసీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేస్తాం.. దీనిపై జనసేనతోనూ కో-ఆర్డినేట్ చేసుకుంటామని తెలిపారు. అక్రమ కేసులతో చంద్రబాబు అరెస్ట్ చేసినా ప్రభుత్వం వైపు నుంచి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించారు.
ఈ నెల 28న సెలవు.. ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఈ నెల 28వ తేదీన సెలవుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ రోజైన సెప్టెంబర్ 28ని సెలవు రోజుగా పేర్కొంది.. అయితే, నెలవంక ఆధారంగా ముస్లిం మత పెద్దలు పండగ రోజును నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి 28న సెలవు దినంగా ప్రకటించింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. కాగా, ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ ప్రపంచ శాంతి కోరుతూ చివరి ప్రవక్తగా మహమ్మద్ ఎంపికయ్యాడు. ముస్లింలందరూ అత్యంత పవిత్ర గ్రంథంగా భావించే ఖురాన్ గ్రంథంలో వీటి గురించి పేర్కొన్న విషయం విదితమే.. అయితే, ప్రవక్త మహమ్మద్ ను విశ్వ శాంతి కోసం అల్లాహ్ నియమించారని, అందుకే తాను జన్మించిన రోజున.. ఆయనను స్మరించుకుంటూ ఈద్- ఎ మిలాద్ -ఉన్ -నబీ పండుగను జరుపుకుంటారు ముస్లిం సోదరులు.. మరోవైపు.. హైదరాబాద్‌లో వైభవంగా సాగే గణేష్ నిమజ్జనంతో పాటు.. మిలాద్ ఉన్ నబీ కూడా ఒకే రోజు రావడంతో.. ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీని వాయిదా వేసుకున్న విషయం విదితమే.
పెన్షన్ డబ్బు కోసం కొడుకు దారుణం.. నెలల తరబడి ఇంట్లోనే తల్లి మృతదేహం..
ఏలూరు తంగెళ్లమూడి యాదవ నగర్ ప్రాంతానికి చెందిన శరనార్ది నాగమణి అనే వృద్ధురాలు మృతి చెందింది.. అనే విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో పెన్షన్ డబ్బుకోసం తల్లి మృతిచెందినా.. ఖననం చేయకుండా శవాన్ని గోప్యంగా ఉంచరని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. భవనంపై భాగంలో గదిలో మృతదేహంఉండగా కింది పోర్షన్ లో ఆమె కొడుకు బసవ ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. బసవప్రసాద్ తో విభేదాలు కారణంగా భార్య అతనికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తల్లికి వచ్చే పెన్షన్ పైన ఆధారపడి బసవ ప్రసాద్ జీవనం సాగిస్తున్నాడు. వీరికి చుట్టుపక్కల వారితో కూడా సరైన సంబంధాలు లేకపోవడంతో వృద్ధురాలు మృతి చెందిన విషయం బయటికి రాలేదని చెబుతున్నారు.
రేపటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చివరి రోజు కీలక బిల్లులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.. ఇప్పటికే నాలుగు రోజుల పాటు సమావేశాలు జరగగా.. ఐదో రోజు అనగా రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.. రేపు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు.. అయితే, చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు -2023, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లు -2023లను సభలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.. మూడు అంశాల పై రేపు అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చలు సాగనున్నాయి.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు లో అక్రమాల పై షార్ట్ డిస్కషన్ జరగబోతోంది.. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యల పై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. మరోవైపు.. రేపటితో శాసన మండలి సమావేశాలు కూడా ముగియనున్నాయి.. రేపు ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న మూడవ రోజు శాసన మండలి సమావేశాలు.. ప్రశ్నోత్తరాల సమయంతో పెద్దల సభ ప్రారంభం అవుతుంది.. మండలి ముందుకు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు రాబోతోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం పై రెండవ రోజు చర్చ కొనసాగనుంది.. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి పై స్వల్ప కాలిక చర్చలు జరగనుండగా.. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
తెలంగాణలో లవ్ జిహాదీ ఘటనలు పెరుగుతున్నాయి
ప్రేమ పేరుతో ఓ వర్గం లవ్ జిహాదీలకు పాల్పడుతోంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. జక్రాన్ పల్లిలో ఓ దళిత యువతి పై హత్యాయత్నం చేయడం దుర్మార్గం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి.. నేరస్తులకు అధికార పార్టీ అండగా నిలుస్తోంది అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో లవ్ జిహాదీ ఘటనలు పెరుగుతున్నాయి.. మజ్లీస్ పార్టీ మద్దతుతో ఒక సామాజిక వర్గం హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేస్తోంది అని ఆరోపించారు. పేద మహిళలను వలలో వేసుకుని మోసం చేస్తున్నారు.. పథకం ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసి హత్యలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. మజ్లీస్ పార్టీ లవ్ జిహాదీ లను ప్రోత్సహిస్తోంది అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ఇలాంటి కేసులను నీరుగారుస్తున్నారు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లవ్ జిహాదీ లను నిషేదించాము అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ, క్రిస్టియన్ యువతులే లక్ష్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు టార్గెట్ చేసి మరీ ట్రాప్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాకెట్లలో ఉపయోగించే విడిభాగాలు భారత్‌కు చెందినవే..
దేశంలోని రాకెట్లలో ఉపయోగించే 95 శాతం విడిభాగాలు భారత్ నుంచి వచ్చినవేనని ఇస్రో ఛైర్‌పర్సన్ ఎస్.సోమనాథ్ మంగళవారం తెలిపారు. సీఎస్‌ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) 82వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇస్రో చీఫ్ ప్రసంగించారు. ఇస్రో నైపుణ్యం మొత్తం అంతరిక్ష డొమైన్‌లో విస్తరించి ఉందని.. రాకెట్, ఉపగ్రహ అభివృద్ధి, అంతరిక్ష అనువర్తనాలతో సహా అన్ని సాంకేతిక పనిని వివిధ భారతీయ ప్రయోగశాలల సహకారంతో ఈ ఘనత సాధించినట్లు ఆయన వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రాకెట్లలో ఉపయోగించే దాదాపు 95 శాతం పదార్థాలు, పరికరాలు, వ్యవస్థలు దేశీయంగానే లభిస్తాయని, కేవలం 5 శాతం విదేశాల నుంచి వస్తున్నాయని, ప్రధానంగా హై-ఎండ్ ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉన్నాయని ఆయన చెప్పారు. “నేషనల్ ల్యాబ్‌లు, డిఫెన్స్ ల్యాబ్‌లు, సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లతో సహా వివిధ భారతీయ ప్రయోగశాలలతో కలిసి మెటీరియల్ దేశీయీకరణ, సాంకేతిక సామర్థ్యాలు, పరిశోధనలపై దృష్టి సారించడం వల్ల ఈ విజయం సాధించబడింది” అని ఆయన చెప్పారు. భారతదేశంలో తయారు చేయబడిన రాకెట్లు, ప్రధాన కంప్యూటర్ చిప్‌ల కోసం ప్రాసెసర్‌లు, ప్రధాన కంప్యూటర్ చిప్‌ల వంటి క్లిష్టమైన భాగాల రూపకల్పన, తయారీతో సహా ఎలక్ట్రానిక్స్ దేశీయీకరణలో గణనీయమైన విజయాలను సోమనాథ్ హైలైట్ చేశారు. “అదనంగా ఇస్రో దేశంలోని ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్లు, డీసీ పవర్ సప్లై సిస్టమ్స్, బ్యాటరీ సిస్టమ్స్, సోలార్ సెల్స్ వంటి అవసరమైన భాగాలను అభివృద్ధి చేసింది” అని ఆయన చెప్పారు.
చైనా అతిపెద్ద సైన్యాన్ని నిర్మిస్తోంది.. ఆస్ట్రేలియన్ రాయబారి కీలక వ్యాఖ్యలు..
రెండో ప్రపంచ యుద్దం తరువాత చైనా అతిపెద్ద సాంప్రదాయిక సైనిక సమీకరణను ఏర్పాటు చేస్తోందని ఆస్ట్రేలియన్ రాయబారి మంగళవారం అన్నారు. అయితే ఈ సైనికీకరణ వ్యూహాత్మక ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్టకాలంలో చైనాతో ఆస్ట్రేలియా సంబంధాన్ని స్థిరీకరించకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. భారతదేశంలో ఆస్ట్రేలియన్ హైకమిషన్ గా ఉన్న ఫిలిప్ గ్రీన్ కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే చైనాతో మాకున్న ఉత్పాదక కార్యకలాపాలకు ఆస్ట్రేలియా ప్రాధాన్యత ఇస్తోందని, క్లిష్టకాలంలో మా సంబంధాలను స్థిరీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యయాని అన్నారు. ఇండియాస్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ‘‘కోల్‌కతా డైలాగ్ – ఆస్ట్రేలియా అండ్ ఇండియా: వర్కింగ్ టుగెదర్ టు బిల్డ్ ఐలాండ్ స్టేట్ రెసిలెన్స్’’ కార్యక్రమంలో మిస్టర్ గ్రీన్ కోల్‌కతాలో ప్రసంగించారు. రెండు రోజుల 13వ ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్ మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన సందర్భంగా కోల్‌కతా డైలాగ్ జరుగుతోంది. ఇండో-పసిఫిక్ ద్వీప దేశాల్లో క్లైమెట్ రిసిలెన్స్ నిర్మించడంతో పాటు ఈ ప్రాంతంలో బలవంతపు ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకోవడం, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం వంటి విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి రానున్న ఆడియో, వీడియో కాల్స్..
ప్రముఖ సోషల్ మీడియా యాప్ X ఇప్పుడు తమ కస్టమర్లకు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. X Corp త్వరలో ప్రీమియం, సబ్‌స్క్రిప్షన్-మాత్రమే వినియోగదారులకు ఆడియో మరియు వీడియో కాల్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది, X CEO Linda Yaccarino గత నెలలో ధృవీకరించిన ప్రకారం.. ప్రతిదీ యాప్‌గా మార్చడంలో భాగంగా ప్లాట్‌ఫారమ్‌పైకి వీడియో కాల్‌లు వస్తాయని ధృవీకరించారు… టెక్ వెటరన్-టర్న్-ఇన్వెస్టర్ క్రిస్ మెస్సినా X యాప్‌లో కొత్త కోడ్‌ను వెల్లడించారు.. ఇది ఇతర ధృవీకరించబడిన వినియోగదారుల నుండి వారు అనుసరించే వ్యక్తుల నుండి లేదా వారి చిరునామా పుస్తకంలోని వ్యక్తుల నుండి ఆడియో మరియు వీడియో కాల్స్ కు మద్దతు ఇస్తుంది.. లిండా యొక్క సిజిల్ రీల్‌లో సూచించినట్లుగా, X త్వరలో ఆడియో మరియు వీడియో కాల్స్ ను అందించనుందని మెస్సినా X యొక్క ప్రత్యర్థి థ్రెడ్‌లలో పోస్ట్ చేసింది. మీరు ఆ ఫీచర్ కోసం చెల్లించవలసి ఉంటుంది, ఎందుకంటే స్కైప్ లేనందున X లో ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీచర్స్ విషయానికొస్తే..ఆడియో మరియు వీడియో కాల్‌లతో సందేశాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లవచ్చు.. ఫీచర్‌ను ఆన్ చేసి, ఆపై మీరు దీన్ని ఎవరితో ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి..భారీ లేఆఫ్‌లు మరియు ప్లాట్‌ఫారమ్ మార్పులతో సహా గత కొన్ని నెలల్లో భారీ గందరగోళాన్ని ఎదుర్కొన్న తర్వాత కూడా కంపెనీ విచ్ఛిన్నం అంచున ఉందని గత నెలలో యాకారినో చెప్పారు..ఈ ఫీచర్ వల్ల ఎన్నో లాభాలున్నాయాని తెలిపారు.. ముఖ్యంగా ఎవరికీ మీ ఫోన్ నంబర్‌ను ఇవ్వకుండానే వీడియో చాట్ కాల్‌లు చేయగలరు అని తెలియజేశారు. అలాగే డిజిటల్ చెల్లింపుల గురించి భవిష్యత్తు ప్రణాళికలతో పాటు దీర్ఘ-రూప వీడియోలు మరియు క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్‌ల వంటి ఇతర ఫీచర్‌ల గురించి కూడా తెలిపారు.
ఉచితంగా iPhone 15.. నమ్మితే బుక్కవుతారు జాగ్రత్త!
ఐఫోన్ 15కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వస్తోంది. ఇండియన్ పోస్టల డిపార్ట్మెంట్ కొత్త ఐఫోన్ 15 స్కామ్ గురించి వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్న తపాలా శాఖ ట్విట్టర్(X) ప్లాట్‌ఫారమ్‌లోని తన అధికారిక ఖాతా ద్వారా ఈ స్కామ్ గురించి వినియోగదారులకు తెలియజేసింది. ఇండియా పోస్ట్ లక్కీ విన్నర్స్‌కి కొత్త ఐఫోన్ 15 ఇస్తున్నట్లు ఒక పిషింగ్ మెసేజ్ వైరల్ అవుతోంది. దాన్ని షేర్ చేసి ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది, “దయచేసి జాగ్రత్తగా ఉండండి! ఇండియా పోస్ట్ ఏదైనా అనధికారిక పోర్టల్ లేదా లింక్ ద్వారా ఎలాంటి బహుమతిని ఇవ్వదు. ఇండియా పోస్ట్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం, దయచేసి అధికారిక వెబ్‌సైట్‌ను Indiapost.gov .in కు వెళ్లి సందర్శించండి.. ” ఇక ఒక వ్యక్తి నవరాత్రి కానుకగా iPhone 15ని గెలుచుకున్నట్లు తెలిపే వైరల్ మెసేజ్ స్క్రీన్‌షాట్ కూడా ఈ పోస్టులో ఉంది. ఇక ఈ బహుమతిని ఎలా క్లెయిమ్ చేయాలనే దానిపై కూడా సూచనలు అందించబడ్డాయి. వాట్సాప్‌లోని 5 గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు మెసేజ్ షేర్ చేస్తే బహుమతిని క్లెయిమ్ చేసేందుకు లింక్ ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఇక ఈ మెసేజ్ ఫేక్ అని, అలాంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయవద్దని ఇండియా పోస్ట్ హెచ్చరించింది. అక్కడే కొన్ని అనధికార లింక్‌లు ఇవ్వబడ్డాయి, వీటిపై క్లిక్ చేయడం మానుకోవాలని సూచించింది. స్కామర్లు గతంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లను ఉపయోగించి హానికరమైన దాడులకు పాల్పడ్డారు. ఆధార్ అప్‌డేట్, పాన్ అప్‌డేట్, రివార్డ్‌లను క్లెయిమ్ చేయడానికి లింక్‌లతో వచ్చే బ్యాంక్ సంబంధిత మెసేజ్‌లతో సహా అనేక సందేశాలతో డబ్బులు కొట్టేసేవారు.
ఛీ..నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.. స్టార్ హీరో వేధింపుల రూమర్స్ పై నిత్యా క్లారిటీ
స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్.. ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అక్టోబర్ 6 న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిత్యా బిజీగా ఉంది. అందులో భాగంగానే నిత్యా.. ఒక కోలీవుడ్ స్టార్ హీరో తనను వేధించాడు అని చెప్పినట్టు వార్తలు రావడంతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఆ స్టార్ హీరో ఎవరు.. ? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఒక ఫేమస్ వెబ్ సైట్.. నిత్యాను ఇంటర్వ్యూ చేస్తే.. అందులో ఆమె స్టార్ హీరో గురించి చెప్పిందని తెలుపడంతో.. చాలామంది అది నిజమే అని నమ్మారు. అంతేకాకుండా ఆ స్టార్ హీరో అతనే అంటూ పేర్లు కూడా జోడించి విమర్శలు మొదలుపెట్టారు. ఇక ఇంత జరుగుతుండడంతో ఒక జర్నలిస్ట్.. ఇదే విషయాన్ని నిత్యాకు తెలిపాడు. ఆమె ఈ విషయమై ఫైర్ అయ్యింది. అందులో ఎటువంటి నిజం లేదని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. “ఫాల్స్ న్యూస్.. ఇది అస్సలు నిజం కాదు. నేనే ఎవరికి ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఒకవేళ ఈ రూమర్ ను ఎవరు స్ప్రెడ్ చేసారో తెలిస్తే .. నాకు చెప్పండి నేను ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎవరైనా ఈ రూమర్ గురించి చెప్తే.. దయచేసి అడ్డుకోండి. కేవలం క్లిక్‌లను పొందడం కోసం ఈ రకమైన తప్పుడు వార్తలను రూపొందించి ప్రజలను ఆకర్షితులను చేయాల్సిన అవసరం ఏముంది.. దయచేసి ఈ రూమర్స్ ను నమ్మకండి” అంటూ నిత్యా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ రూమర్ స్ప్రెడ్ చేసిన వెబ్ సైట్ ను కనుక్కొని వాటికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
సీతారామం సీక్వెల్.. నిర్మాత స్వప్న ఏమన్నదంటే..?
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక ఒక కీలక పాత్రలో నటించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతమైన ప్రేమ కావ్యంగా చరిత్రకెక్కింది. ప్రేమకు డబ్బు అవసరం లేదని, కులమతాలు పట్టింపు లేదని నిరూపించింది. ప్రేమించిన మనిషి, ఉన్నా లేకున్నా.. అతని జ్ఞాపకాలలో ఒక మనిషి బతికేయొచ్చు అని ఈ సినిమా చూపించింది. రామ్ గా దుల్కర్.. సీతగా మృణాల్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి. ఇంతటి అద్భుతమైన ప్రేమ కథకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం ప్రతి సినిమాకు సీక్వెల్స్ వస్తూ ఉండడంతో.. ఈ సినిమాకు కూడా సీక్వెల్ వస్తుందేమో అని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. ఇక తాజాగా ఈ సీక్వెల్ పై నిర్మాత స్వప్న స్పందించింది. ఈ బ్యానర్ లోనే ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ వస్తుంది. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న స్వప్న.. సీతారామం సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. “కొన్ని సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిల్లో సీతారామం ఒకటి. సీక్వెల్ గురించి నా మనసులో ఏం లేదు. దర్శకుడు హను రాఘవపూడి ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలను బట్టి ఈ సినిమాకు సీక్వెల్ ఉండదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.