*14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?
జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. “కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?.. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?.. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?.. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. -సీఎం జగన్. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?” అంటూ సీఎం జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. నెల్లూరులో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. డిజిటల్ క్లాసులు, లైబ్రరీలు చంద్రబాబుకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. వెలిగొండ, శ్రీశైలం నుంచి నీళ్లు రాక ఫ్లోరైడ్‌తో జనం ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా పట్టించుకున్నారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వెలిగొండలో రెండు టన్నెళ్లు పూర్తి చేశామన్నారు. ప్రకాశం జిల్లాకు నీళ్లు తరలిస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు. అభివృద్ధి ఎవరు చేశారో నెల్లూరు నుంచి చెబుదామన్నారు సీఎం జగన్. నెల్లూరు జిల్లాలో రామయ్య పట్నం పోర్టు పనులు దాదాపు పూర్తికావస్తున్నాయని.. జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు కూడా పూర్తయ్యాయన్నారు. ఇదంతా కళ్ల ఎదుట కనిపిస్తున్న అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టామని.. టోఫెల్ పరీక్షలకు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనను తీసుకువచ్చామని.. పేద పిల్లలకు బై జ్యూస్ కంటెంట్‌ను ప్రవేశ పెట్టామని.. పిల్లలకు తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఉన్న పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామన్నారు. ఇది సుస్థిర అభివృద్ధి కాదా అన్న ఆయన.. గ్రామ స్వరాజ్యానికి నాంది పలికామన్నారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, వాలంటీర్లను నియమించామన్నారు. నాడు-నేడుతో ఆస్పత్రులలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబుకు కనపడటం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో పలువురు ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారని.. వెలుగొండ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ ను పూర్తి చేసి నీటిని ప్రకాశం కు తీసుకు వచ్చామన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌ల నిర్మాణం, గండికోట, చిత్రావతి ప్రాజెక్ట్‌లను మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామన్నారు.
*నా జన్మంతా సేవ చేసినా.. పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేను..
నా జన్మంతా ఈ ప్రాంతానికి సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. “గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ ను ఓడించలేరు. అమెరికాలో చదువుకునో, వారసత్వ రాజకీయలతోనో నేను మీ ముందుకు ముఖ్యమంత్రిగా రాలేదు. నేను చదువుకుంది వనపర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో. ఆనాడు చిన్నారెడ్డి గెలుపు కోసం రాతలు రాసినవాన్ని. మీ ఆశీర్వాదంతోనే ఈ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి 150 రోజులు కాకముందే.. కొందరు దిగిపో దిగిపో అంటున్నరు. ఈ పాలమూరు బిడ్డను ముఖ్యమంత్రి నుంచి దించడానికి ఇంకొందరు ఢిల్లీ నుంచి గొడ్డలి తీసుకుని బయలుదేరారు.ఇంకొందరు శత్రువు పంచన చేరి మనల్ని ఓడించాలని చూస్తున్నారు. డీకే అరుణమ్మ కాంగ్రెస్ ను ఓడించాలని చెబుతుంది. అరుణమ్మా.. కాంగ్రెస్ నీకు ఏం అన్యాయం చేసింది? నిన్ను గద్వాల కు ఎమ్మెల్యే గా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిని చేసినందుకా? అరుణమ్మకు ఇంత పేరు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ కాదా.? మోదీ చేతిలో చురకత్తివై నీకు ఇంత చేసిన కాంగ్రెస్ ను కడుపులో పొడవాలని చూస్తున్నావా?” ఎంతో గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని నేను అడగడం తప్పా? ఇది నేరమా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం ఢిల్లీలో మాట్లాడేవారు ఉండాలంటే వంశీ గెలవాలి. ముదిరాజు సోదరులను బీసీ డీ నుంచి ఏ గా మార్చేందుకు. సుప్రీంకోర్టులో సమస్యలు పరిష్కరించేందుకు వంశీ గెలవాలి. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు. వంశీచంద్ రెడ్డి ఎంపీగా గెలవాలి. మోదీ చుట్టంలా వచ్చి పోతారు. ఏనాడైనా అరుణమ్మ వీటిపై మాట్లాడిందా? ప్రాజెక్టులు రిపేర్లు చేయాలన్న ఆలోచన చేసిందా? రేవంత్ రెడ్డి నాపై పగ పట్టారని అరుణమ్మ అంటుంది. ఆమెకు నాకు ఏమైనా గెట్టు పంచాయితీ ఉందా? రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు అమిత్ షాతో పైరవి చేసి ఢిల్లీలో కేసులు పెట్టించింది. రేవంత్ రెడ్డిని జైలుకు పంపైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోంది. ఇక్కడ కల్తీ కల్లు దందాలు, క్రషర్ దందాలు, సారా దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసేవాళ్లు నన్ను బెదిరించి నాది తప్పు అని అంటున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీపై కేసీఆర్, హరీష్ మాట్లాడుతున్నారు.. 69 లక్షల మందికి రూ.7500 కోట్లు రైతు భరోసా అందించే బాధ్యత నాది.” కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోగా 2లక్షల రైతు రుణమాఫీ చేసి పాలమూరు రైతుల రుణం తీర్చుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. “రైతుల రుణం తీర్చుకోకపోతే నా ఈ జన్మ వృథా.హరీష్ రావు.. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి సిద్దిపేటకు పట్టిన శని వదిలిస్తా.. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. పాలమూరు జిల్లాలో బీజేపీని పాతరేయాలి. వంశీ చంద్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలి.”
*ఆ రెండు జిల్లాల జొన్న రైతులకు గుడ్న్యూస్.. క్వింటాళ్ల పరిమితి పెంపు
రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాలుకు మద్ధతు ధర రూ. 3180 చెల్లించి రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలు చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భములో.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఆ మేరకు ఎకరానికి ఇంతకుముందు ఉన్న పరిమితిని పెంచాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జొన్న పండించిన రైతుల విజ్ఞప్తి మేరకు మరియు సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం జొన్న కొనుగోళ్లపై ఆ రెండు జిల్లాలలో ఎకరాకు ఇంతకుముందు ఉన్న 8.85 క్వింటాళ్ల పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ, కొనుగోలు ఏజెన్సీ మార్క్ ఫెడ్ను తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ఆదేశించింది. కావున జొన్న రైతులెవరూ తొందరపడి తక్కువ రేటుకు అమ్ముకోవద్దని.. వారివారి పంట విస్తీర్ణాల నమోదు మేరకు పెంచిన దిగుబడి పరిమితి ప్రకారం ప్రభుత్వం జొన్న రైతులవద్ద నుండి మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా జొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేసింది.
*ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై విచారణ జరపాలని సీఐడీకి ఈసీ ఆదేశం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదం ముదురుతోంది. ఈ చట్టం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల అస్త్రంగా మారిందని పలువురు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు పలు సభల్లో తమ ప్రసంగాల్లో భాగంగా ఈ యాక్ట్ గురించి నెగిటివ్ గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి చెప్పుకొచ్చారు. దీనిని సీరియస్ గా తీసుకున్న ఈసీ తాజాగా పూర్తి విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాన ఆస్త్రంగా మారింది. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ దీనిపై స్పష్టత ఇచ్చారు. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని జగన్ గుర్తు చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అయితే.. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా “వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్ ఓ ల్యాండ్ గ్రాబర్” అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణ అనంతరం ఈసీ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాని ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏం జరగనుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
*నేను బ్రతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను
ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు. రేపల్లె లో ఆయన మాట్లాడుతూ.. “పక్క రాష్ట్రాల్లో పంటల దిగుబడి పెరుగుతుంటే, ఈ రాష్ట్రంలో మాత్రం దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల 3వేల మంది కౌలు రైతులు చనిపోయారు. చనిపోయిన రైతుల కుటుంబానికి, ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇచ్చిన పార్టీ జనసేన. రైతులకి లాభం చేకూర్చే ప్రభుత్వాలు కావాలి. నేను బ్రతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. భారత దేశ సమగ్రతకు భంగం వాటిల్లనివ్వను. అన్నం పెట్టే రైతుకు, అండగా లేని ప్రభుత్వాలు ఎందుకు. ప్రతి నియోజకవర్గంలోనూ త్రాగునీటి సమస్య ఉంది. కేంద్రం అందిస్తున్న జల్జీవన్ ప్రాజెక్టులు, ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడం లేదు. సాగు తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు? సముద్ర తీరంలో ఉన్న, రేపల్లె ను పర్యాటక కేంద్రంగా తయారు చేయవచ్చు. కానీ ఈ ప్రభుత్వం పేకాటలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారు.” పేకాట క్లబ్బుల మీద ఉన్న, జోరు హుషారు ప్రజా సమస్యల తీర్చడం మీద లేదని పవన అన్నారు. ఆయన మాట్లాడుతూ… “సమాజంలో బలమైన వ్యక్తుల కోసం చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి. బలహీనంగా ఉన్న వాళ్ల మీద బలమైన చట్టాలు ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా కాదా, ప్రజాస్వామ్యం గొంతు ఎత్తకపోతే బంగారు భవిష్యత్తు ఉండదు. తీర ప్రాంతానికి కోటలు లాంటి మడ అడవుల్ని కూడా కొట్టేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలాంటి వాడు బ్రతికే ఉంటాడు. అడ్డగోడుగా మీరు దాడులు చేస్తే, తిరగబడటానికి ఒకడుంటాడు. ఉమ్మడి కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చడానికి నేను బాధ్యత తీసుకుంటాను. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాల్వలో పూడికలు తీపిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ అత్యంత ప్రమాదకరం.. మీ భూమిలో మీరు లోన్ తీసుకోవాలన్న సాధ్యపడదు. ఒరిజినల్ డాక్యుమెంటో లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వవు. మీ ఇంటి బిడ్డకు పెళ్ళి చేయాలంటే, పసుపు కుంకాలు కింద డాక్యుమెంట్ లు ఇవ్వలేరు. ఇప్పటిదాకా ఏ హక్కులు లేకుండానే మన ఇళ్ల మీద పడి ఆస్తులు లాక్కుంటున్నారు. ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు మెజారిటీ అనేది చెప్పను కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చి తీరుతుంది. చిరంజీవి లాంటి వ్యక్తిని ,చంద్రబాబు లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు.”
*సెక్స్ స్కాండల్ కేసులో కీలక పరిణామం.. మహిళ కిడ్నాప్ కేసులో రేవణ్ణ అరెస్ట్..
సెక్స్ కుంభకోణం కేసులు కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వేలాది వీడియోలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి జేడీయూ నేత, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసు నమోదైంది. తాజాగా కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణను దేవెగౌడ నివాసం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టు అతని అరెస్ట్‌కు వ్యతిరేఖంగా రక్షణ కల్పించాలనే పిటిషన్‌ని తిరస్కరించిన తర్వాత అరెస్ట్ జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసులో ఏర్పాటు చేసిన సిట్ రేవణ్ణను అరెస్ట్ చేసింది. తన తల్లిని రేవణ్ణ, అతని సహాయకుడు కిడ్నాప్ చేశారని 20 ఏళ్ల యువకుడు ఫిర్యాదు చేశాడు. హెచ్‌డీ రాజు అనే యువకుడి ఫిర్యాదు మేరకు రేవణ్ణపై కిడ్నాప్ కేసు నమోదైంది. సెక్షన్ 364A (కిడ్నాప్) మరియు సెక్షన్ 365 (బలవంతంగా నిర్బంధించడం) కింద కేసు నమోదు చేయబడింది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించారు. కిడ్నాప్ కేసులో రేవణ్ణ బెయిల్‌పై విచారణ కొనసాగుతోంది. సదరు మహిళ 5 ఏళ్ల పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేసి, మూడేళ్ల క్రితం అక్కడ పని మానేసింది. ఏప్రిల్ 26న సతీష్ ఆమెను రేవణ్ణ పిలుస్తున్నాడని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత అదే రోజు ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ ఏప్రిల్ 29న ఆమెను మళ్లీ తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. బాధిత మహిళ కుమారుడు తన తల్లి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదైంది. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. రేవణ్ణ ఇంట్లో పని చేసే 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారం పెద్దగా మారడంతో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ వీడియోలు బయటపడటంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం వదిలి వెళ్లాడు. అతడిపై కర్ణాటక ప్రభుత్వం రెండు సార్లు లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి..
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్ ప్రాంతంలో సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలయ్యాయి. గత ఏడాది సైన్యంపై వరసగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఈ దాడిలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. దాడి జరిగిన ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ‘‘ జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. షాసితార్ సమీపంలోని ఎయిర్ బేస్ లోపల వాహనాలు భద్రపరచబడ్డాయి. సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి’’ అని భద్రతా దళాలు వెల్లడించాయి.
*దేశవ్యాప్తంగా దంచికొడుతున్న ఎండలు.. ఈ రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్
దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్ర రూపంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. కాగా.. ఇంతటి ఎండల్లో ఒక చల్లటి వార్త బయటికొచ్చింది. రాబోయే రోజుల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. చాలా చోట్ల ప్రజలు వేడిగాలులను ఎదుర్కొనే అవకాశం ఉంది.. అయితే కాలక్రమేణా పరిస్థితి మెరుగుపడి వేడిగాలులు తగ్గుతాయని పేర్కొంది.
వాతావరణం ఎలా ఉంటుంది..?
మే 5 వరకు తూర్పు భారతదేశంలో మరియు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో మే 6 వరకు తక్కువ తీవ్రతతో వేడి తరంగాలు ఉండవచ్చు, అయితే తరువాత పరిస్థితి మెరుగుపడి వేడి తరంగాలు తగ్గుతాయి. అంతేకాకుండా.. మే 5-6 తేదీలలో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, బలమైన గాలులతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 5-9 మధ్య తూర్పు భారతదేశంలో వర్షంతో పాటు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. బలమైన గాలులు కూడా వీయవచ్చు. దీని తీవ్రత మే 6-7 తేదీలలో చాలా ఎక్కువగా ఉంటుంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో మే 5-9 మధ్య ఉరుములు, బలమైన గాలులు వీయవచ్చు.
ఈశాన్య భారతదేశంలో ఆరెంజ్ అలర్ట్..
వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఈశాన్య భారతదేశంలో మే 5-6 తేదీలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మే 5న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపురలోని ఏకాంత ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు (115.5-204.4 మి.మీ.) కురిసే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్..
రాజస్థాన్ నుండి తెలంగాణ వరకు హీట్ వేవ్ అలర్ట్ ఉంది. మే 4 నుంచి మే 8 వరకు వివిధ రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్, కోస్తా ఆంధ్రా, యానాం, రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని ఏకాంత ప్రదేశాలలో శనివారం వేడిగాలులు వీచే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో బుధవారం వరకు వాతావరణం వేడిగా ఉంది..
మే 5న గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకాల్, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ మరియు తెలంగాణ మీదుగా వివిక్త ప్రదేశాలలో వేడిగాలులు సంభవించవచ్చు. మే 6-7 తేదీలలో ఇంటీరియర్ కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, సౌరాష్ట్ర మరియు కచ్‌లలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా.. పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మే 7-8 తేదీలలో వేడి గాలులు వచ్చే అవకాశం ఉంది. మే 8న తూర్పు రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్‌లోని వివిక్త ప్రదేశాలలో హీట్ వేవ్ ఏర్పడవచ్చు.
*మరో రెండ్రోజుల్లో ఎన్నికలు.. పశ్చిమ బెంగాల్‌లో బాంబులు కలకలం
పశ్చిమ బెంగాల్‌లో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హింసకు పేరుగాంచిన ముర్షిదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఐసిడీఎస్ కేంద్రాలు, ఆట స్థలాలలో బాంబ్ స్క్వాడ్ అనేక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. బాంబుల తయారీకి సంబంధించిన కొన్ని కెమికల్స్ లభ్యమయ్యాయి. కాగా.. బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే.. బాంబులను నిర్వీర్యం చేసేందుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు పోలీసులు సమాచారం అందించారు. అయితే ఎన్నికలకు ముందు ముర్షిదాబాద్ సెంటర్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు రికవరీ చేయడంపై యంత్రాంగం ఆందోళన చెందుతోంది. శనివారం ఉదయం పోలీసులు రాయ్‌పూర్‌లోని ఖిదిర్‌పద శ్మశానవాటిక, దోమ్‌కల్‌లోని నిశ్చింత్‌పూర్, ఫర్జిపాడా ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అక్కడ 16 బాంబులు ఉన్నట్లు గుర్తించారు. సాకెట్ బాంబులు, బాంబుల తయారీకి వాడే పదార్థాలను నైలాన్ బ్యాగుల్లో పెట్టి ప్లాస్టిక్ బకెట్లలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఐసీడీఎస్ కేంద్రం వెనుక ప్లాస్టిక్ సంచులలో బాంబులు లభ్యమయ్యాయి. ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. బాంబుల ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మూడో దశలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్, ముర్షిదాబాద్ రెండు స్థానాలకు, పొరుగు జిల్లాలోని మాల్దా నార్త్, సౌత్ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. కాగా.. ఈ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది.
మరోవైపు.. బాంబు రికవరీ తర్వాత రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. దొంకల్ జోనల్ కమిటీ కార్యదర్శి ముస్తాఫిజుర్ రహమాన్ మాట్లాడుతూ.. తృణమూల్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. స్వయంగా బాంబులు పెట్టి, ప్రతిపక్షం పేరుతో తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే.. రక్తపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తృణమూల్ డోమ్‌కల్ బ్లాక్ ప్రెసిడెంట్ హాజికుల్ ఇస్లాం తెలిపారు. ప్రజలు అట్టడుగు స్థాయి అభివృద్ధిని చూసి ఓటేస్తారని.. ఎవరినీ భయపెట్టాల్సిన అవసరం లేదని, ‘బాంబు సంస్కృతి’ అసలు ప్రతిపక్షాలదేనని అన్నారు. అక్కడక్కడ బాంబులు పెట్టి పోలీసులకు సమాచారం ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ముర్షిదాబాద్ లోక్‌సభ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అందుకే ముర్షిదాబాద్‌పై కమిషన్ అదనపు నిఘా పెట్టింది. మూడో రౌండ్ ఓటింగ్‌లో కూడా ముర్షిదాబాద్‌లో అత్యధిక కేంద్ర బలగాలు ఉంటాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి 190 కంపెనీల సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు.
*తైవాన్‌పై దాడికి చైనా, రష్యా మిలిటరీలు కలిసి పనిచేస్తున్నాయి: అమెరికా.
తైవాన్‌పై దండయాత్ర చేయాలని గత కొన్ని రోజులుగా చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ని భయపెట్టేందుకు క్రమంగా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో తైవాన్‌ని కవ్విస్తోంది. ముఖ్యంగా చైనా నౌకలు, యుద్ధవిమానాలు తైవాన్ సరిహద్దుల్ని అతిక్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా సంచలన విషయాన్ని చెప్పింది. తైవాన్‌ని స్వాధీనం చేసుకోవడంతో పాటు సైనిక సమస్యలపై రష్యా, చూనాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కొనేందుకు రెండు దేశాలు సమన్వయంతో కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నాయని అమెరికా పేర్కొంది. ‘‘మేము చైనా, రష్యాలు మొదటిసారిగా తైవాన్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజ్ చేయడం, తైవాన్ విషయంలో రష్యా వారితో కలిసి పనిచేయాలని చైనా ఖచ్చితంగా కోరుకుంటోందని గుర్తించాం. వారు ఎందుకు చేయకూడదనే కారణం మాకు కనిపించడం లేదు’’ అని ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అవ్రిల్ హైన్స్ గురువారం కాంగ్రెస్‌కు సాక్ష్యంగా చెప్పారు. రష్యా, చైనాలు ఖచ్చితంగా సహకరించే వాతావరణంలో పనిచేయడం ఆందోళన కలిగివే విషయమని లెఫ్టినెంట్ జనరల్ జెఫ్రీ క్రూస్ వెల్లడించారు. ఈ రెండు దేశాలు రాజకీయ, ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకుంటున్నాయని హెయిన్స్ చెప్పారు.