*బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేకే, గద్వాల లక్ష్మీ గుడ్‌బై
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవ్వరు చెప్పలేరు. కుడి ఎడమలు అటు ఇటు కాగానే ఎంత మార్పు. మూడు నెలల వరకు కీలక పదవులు అనుభవించిన వాళ్లు.. అధికారం పోగానే ఏదో పోగొట్టుకున్నట్టే ఫీలవుతున్నారో ఏమో తెలియదు గానీ.. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు అధికార పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. అధికారం పోయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా బీఆర్ఎస్ కీలక పదవులు అనుభవించిన కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కారు దిగి హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అధికారం పోగానే ఇంత మార్పా? అంటూ ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శనివారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని ఆమె తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే అధికార పార్టీలోకి వెళ్తున్నట్లు విజయలక్ష్మీ వెల్లడించారు. తనతో పాటు కొంత మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. పార్టీకి సంబంధించిన అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు కేశవరావు మీడియాతో చిట్‌చాట్ చేశారు. పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. కవిత అరెస్ట్ గురించి కూడా చర్చించామన్నారు. కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని.. అలాగే తనకు కూడా కేసీఆర్‌పై గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా తనకు బాగా సహకరించారన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నానని.. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన కుమారుడు విప్లవ్.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పడం మంచిది అని చెప్పుకొచ్చారు. తాను మాత్రం పార్టీ మారడం లేదని కేశవరావు కుమారుడు విప్లవ్ తేల్చిచెప్పారు. అలాగే తన సోదరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ పార్టీ మారతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తమ నాయకుడు కేసీఆరేనని విప్లవ్ స్పష్టం చేశారు.
*ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చా.. ఆలోచన చేయండి..
నంద్యాల జనసంద్రాన్ని తలపిస్తోందని సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ సభలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాల పాలన చూశారని.. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారని సీఎం అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతామని… ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి అంటూ జగన్ పేర్కొన్నారు . ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. ఈ ఎన్నికలు మోసాల చంద్రబాబుకు చివరి ఎన్నికలు కావాలన్నారు. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామని.. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామన్నారు. “నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చాం’’ అని సీఎం జగన్ వివరించారు. ఇటువైపు నేను ఒక్కడ్నే, అటువైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్.. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు.. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధమన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధమంటూ సీఎం జగన్ వెల్లడించారు. “డబుల్ సెంచరీ సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లు కూడా ముందుకు తీసుకువెళ్దాం..ఈ ఎన్నికల మనకు జైత్రయాత్ర.. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చా.. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం.. ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి.. వైసీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి.. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి.” అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రూ.2లక్షల 77 వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 58 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు ఓ అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ విద్యా దీవెన, వసతి దీవెన, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, మత్య్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, ముప్ఫు లక్షల ఇళ్ల పట్టాలు.. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. చదువులకు అనుసంధనం చేస్తూ కళ్యాణ మస్తు, షాదీ తోఫా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అమలు చేశామన్నారు. చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుందని సీఎం జగన్ విమర్శించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయన్నారు. గతంలో చంద్రబాబు రైతుల రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా అంటూ సీఎం ప్రశ్నించారు.” పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేల డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?” సీఎం ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటూ మరొకసారి మోసం చేయడానికి వస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
*కొడంగల్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యం
కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఓటు వేశారు. అనంతరం కొడంగల్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. అందుకే కొడంగల్‌ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. త్వరలో కొడంగల్ ప్రాంతానికి సిమెంటు పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా.. గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయని వెల్లడించారు. ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని రేవంత్ పేర్కొన్నారు. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవుతుందని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. భూసేకరణలో పట్టా భూములకు, అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అభివృద్ధికి సహకరించకపోతే మాత్రం కొడంగల్ ప్రాంతం నష్టపోతుందని చెప్పుకొచ్చారు. తాను ఎక్కడున్నా ఓ కన్ను మాత్రం కొడంగల్‌పై ఉంటుందని.. మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. కొడంగల్ ప్రాంతం అభివృద్ధిలో పరుగులు తీయాలన్నదే తన ఆకాంక్ష అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఎంత పెద్ద నాయకుడినైనా కొడంగల్ కుటుంబ సభ్యుడినేనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజారిటీ అందించాలని కోరారు. మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను మళ్లీ ఏప్రిల్ 8న కొడంగల్‌కు వస్తానని తెలిపారు. మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానన్నారు. ఇక ఏప్రిల్ 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు.
*గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 కార్లు దగ్ధం
రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కార్ల గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాలు నల్లటి పొగతో దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఇదిలా ఉంటే గోదాం పూర్తిగా దగ్ధమైంది.. ఈ ప్రమాదంలో 25 కార్లు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు. స్థానికులు సమాచారం అందించగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. మరోవైపు ఎండలు ఎక్కువగా ఉండడంతో త్వరగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంకోవైపు అగ్నికీలలు ఎగిసిపడడంతో ఒకదాని వెంట మరొకదానికి మంటలు అంటుకుని కార్లు తగలబడ్డాయి. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు నష్టం అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
*రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక నిందితుడి అరెస్ట్..
బెంగళూర్ నగరంలోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనకు సంబంధించి కీలక నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. పేలుడు ఘటనకు సహాయసహకారాన్ని అందించిన ముజమ్మిల్ షరీఫ్‌ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ సహా 18 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తూర్పు బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పేలుడులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ఉపయోగించినట్లు తేలింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కస్టమర్ వేషంలో కేఫ్‌లోకి వచ్చి అక్కడే బాంబు ఉన్న బ్యాగును పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాంబు పేలింది. ఈ ఘటనలో ఒక్కసారిగా దేశం అలెర్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. నిందితుడికి సంబంధించిన పలు వీడియోలు ఎన్ఐఏ విడుదల చేసి, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరింది. ఈ కేసులో ముఖ్య నిందితుడు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్‌ని ఉగ్రవాద దర్యాప్తు సంస్థ గుర్తించింది. మరో కుట్రదారుడు అబ్దుల్ మతీన్ తాహానున కూడా ఏన్ఐఏ గుర్తించింది. వీరిద్దరు పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారు. ఎన్ఐఏ ప్రకారం.. ముజిమ్మిల్ షరీఫ్ ఐఈడీని కేఫ్‌లో నిందితులకు సహకరించాడు. వారికి లాజిస్టిక్ సపోర్టు అందించాడు. ముగ్గురు అనుమానితుల ఇళ్లలో ఎన్ఐఏ మార్చి 17న సోదాలు నిర్వహించి, నగదు, పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఎన్‌ఐఏ ప్రకటించింది.
*ఫడ్నవిస్‌తో నవనీత్ కౌర్ దంపతుల భేటీ.. దేనికోసమంటే..!
మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అమరావతి ఎంపీ, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నవనీత్ కౌర్ దంపతులు కలిశారు. ఫడ్నవిస్ నివాసంలో ఆయనను కలిశారు. బుధవారం విడుదలైన బీజేపీ ఏడో జాబితాలో నవనీత్ కౌర్ పేరును ప్రకటించింది. అమరావతి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నవనీత్ కౌర్ పేరు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫడ్నవిస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 2019 ఎన్నికల్లో నవనీత్ కౌర్.. అమరావతి లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం ఆమె బీజేపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కమలనాథులు సీటును ప్రకటించారు. నవనీత్ కౌర్.. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా మెరిశారు. అందరికి సుపరిచితమైన నవనీత్ కౌర్ రాణా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నవనీత్ భారీ విజయం సాధించారు. పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈసారి బీజేపీ తరుపున ఆమెకే టికెట్ వస్తుందన్న ఊహాగానాలను పార్టీ నిజం చేసింది. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వమైన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ రాణాతో పాటు ఎమ్మెల్యే రవి రాణాలు పోరాడారు. ముఖ్యంగా ‘హనుమాన్ చాలీసా’ వివాదంతో దేశ రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. వీరిద్దరు ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించడం అప్పుడు సంచలనంగా మారింది. శివసేన కార్యకర్తల బెదిరింపులకు, ప్రభుత్వ బెదిరింపులను తట్టుకుని ఎంవీఏ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని నవనీత్ ఛాలెంజ్ చేశారు. ఈ పరిణామాల తర్వాత నుంచి బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆ పార్టీలో చేరారు.
*కాంగ్రెస్‌కి మరో షాక్.. బీజేపీలో చేరిన సావిత్రి జిందాల్..
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. హర్యానా కురుక్షేత్ర నుంచి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజులకే ఆయన తల్లి, హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరారు. 84 ఏళ్ల సావిత్రి జిందాల్, తన కుమార్తె సీమాతో కలిసి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తన సోషల్ మీడియా పోస్టులో కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించాలనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘‘నేను హిసార్ ప్రజలకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాను మరియు మంత్రిగా హర్యానా రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేశాను. హిసార్ ప్రజలే నా కుటుంబం. నా కుటుంబ సభ్యుల సలహా మేరకు ఈరోజు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు. సావిత్రి జిందాల్ ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియాలో లిస్ట్‌లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. దివంగత పారిశ్రామికవేత్త మరియు మాజీ మంత్రి OP జిందాల్ భార్య సావిత్రి జిందాల్ నికర విలువ 29.1 బిలియన్ డాలర్లుగా ఉంది. గతంలో హర్యానాలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014లో హిస్సార్ నుంచి బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. గుప్తా ప్రస్తుతం సైనీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. బీజేపీలో చేరిన తర్వాత.. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము కలిసి పనిచేస్తామని, మమ్మల్ని మోడీ పరివార్‌లో సభ్యులుగా చేసినందుకు బిజెపికి చెందిన ప్రతి ఆఫీస్ బేరర్ మరియు కార్యకర్తకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, మేము పార్టీ అంచనాలకు అనుగుణంగా నడుస్తామని ఆమె అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాన మంత్రి దార్శనికత తనని ఆకట్టుకుందని ఆమె చెప్పారు. హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో దశలో పోలింగ్ జరగనుంది.
*”గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..
తమిళనాడుకు చెందిన కే పద్మరాజన్ ఏకంగా 35 ఏళ్లుగా పోటీ చేస్తున్నారు. ‘‘గెలుపెరగని యోధుడి’’గా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే మొదలుకొని స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్ క్రియేట్ చేశారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 65 ఏళ్ల పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి జిల్లా నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, రాహుల్ గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలపై పోటీ చేసిన చరిత్ర పద్మరాజన్‌కి ఉంది. ‘‘ఎలక్షన్ కింగ్’’గా పేర్కొన్న ఆయన గెలుపొందడం తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో పోటీ చేయడమే తన విజయమని, మళ్లీ ఓడిపోయినా సంతోషమే అని చెబుతున్నారు. టైర్ రిపేర్ షాప్ నిర్వహించే పద్మరాజన్ హోమియోపతి మందుల అమ్మకంతో పాటు స్థానికంగా ఓ మీడియాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, ప్రతీసారి డిపాజిట్ కోల్పోయి లక్షల రూపాయల్ని కోల్పోయారు. 2011లో మెట్టూర్ అసెంబ్లీకి పోటీ చేసిన ఆయనకు ఒక్క ఆయన ఓటు తప్పితే, వేరే వారు ఓటేయలేదు. ఈ ఎన్నికల పరంపరలో అత్యధికంగా 6273 ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా తన పేరు లిఖించుకున్నారు. నిజంగా తాను ఒకవేళ గెలిస్తే గుండెపోటు వస్తుందేమో అని చమత్కరిస్తున్నారు ఆయన.
*పాకిస్తాన్-చైనా స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడ్డారు..
పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో రెండు రోజుల క్రితం జరిగిన మిలిటెంట్ దాడిలో ఐదుగురు చైనీయులు చనిపోయారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తు్న్న చైనా జాతీయులే టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడిపై అటు చైనా, ఇటు పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా-పాకిస్తాన్ స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ గురువారం పేర్కొంది. నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని షాంగ్లా జిల్లాలో పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కు చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వాళ్లంతా దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఈ పేలుడులో కనీసం ఐదుగురు చైనా జాతీయులు మరణించారు. వారితో పాటు డ్రైవర్ కూడా మరణించాడు. 2021 నుంచి చైనా నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బందిపై ఇది రెండో ఆత్మాహుతి దాడి. ఈ దాడిపై పాకిస్తాన్, చైనా ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశాంగ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అన్నారు. పాక్-చైనా సన్నిహిత సోదరులని, రెండు దేశాల స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడికి పాల్పడినట్లు ఆమె అన్నారు. ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. పాక్, చైనాలు ఉగ్రవాదులపై కృతనిశ్చయంతో వ్యవహరిస్తాయని, వారిని ఓడించాలని ఆమె అన్నారు. పాకిస్తాన్ లోని చైనా పౌరులకు, ప్రాజెక్టులకు రక్షణ, భద్రత ఇవ్వడానికి పాకిస్తాన్, చైనాతో కలసి పనిచేస్తూనే ఉంటుందని చెప్పింది.