బీజేపీపై మంత్రి ఆదిమూలపు హాట్ కామెంట్లు..
బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి వేస్తామంటున్నారు.. భారతదేశం గర్వించదగ్గ మేధావి బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు అంటూ ఆరోపించారు. అంబేద్కర్ పేరు పలకటం కూడా బీజేపీ నేతలకు ఇష్టం లేదన్న ఆయన.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఓ కుట్ర జరుగుతోంది.. ఇంతకన్నా దారుణం ఇంకా ఏమైనా ఉంటుందా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చి వేస్తారట.. సమూలంగా తీసివేస్తారట అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్నే కాదు.. బీజేపీ వాళ్లు దళిత జాతినే మార్చివేస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. దళిత జాతిని తొక్కేస్తారు.. మైనారిటీలకు మద్దతు ఉండదు.. బీజేపీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
అప్పట్లో బై బై బాబు.. ఇప్పుడు జగన్ అనే నేను.. కౌంట్‌డౌన్ స్టార్ట్..!
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి.. ఓవైపు సిద్ధం పేరుతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తుండగా.. మరోవైపు ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడిగా సభలు నిర్వహిస్తూ.. వైసీపీపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. ఇక, ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కావడం.. సీట్లపై కూడా క్లారిటీ రావడంతో.. ఆ మూడు పార్టీలు ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాయి.. అయితే, గత ఎన్నికల సమయంలో.. ప్రచారంలో తన మార్క్ చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్.. విస్తృతంగా నెగిటివ్ ప్రచారం తీసుకొచ్చింది.. అప్పట్లో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైసీపీ ప్రధాన కార్యాలయం ముందు ‘బైబై బాబు..’ అంటూ కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేశారు.. రాష్ట్రంలోని ఇతర వైసీపీ ఆఫీసుల వద్ద కూడా ఇది దర్శనం ఇచ్చాయి.. అయితే, ఈ సారి ప్రచారంలో తన పంతాను మార్చింది వైసీపీ.. రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ కొలువుదీరి ఐదేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో.. మళ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది.. గతంలో 151 సీట్లలో విజయంతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ.. ఇప్పుడు వైనాట్ 175 పేరుతో ప్రచారం చేస్తోంది.. అంతేకాదు.. వైనాట్ కుప్పం అంటూ సీఎం జగన్ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నీ బిడ్డ ప్రభుత్వంలో మీకు మంచి చేకూరింది.. లబ్ధి జరిగితేనే ఓటు వేయాలని కోరుతున్నారు సీఎం జగన్.. ఎన్ని పార్టీలు జత కట్టినా.. టీడీపీ-జనసేన-బీజేపీ గుంపుగా వచ్చినా.. సింహం సింగిల్‌గానే వస్తుంది.. మరో సారి అధికారంలోకి వైసీపీ వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇదేసమయంలో.. గతంలో బైబై పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేసినట్టుగానే.. ఇప్పుడు మరో 73 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ”జగన్ అనే నేను” పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్‌లు ఏర్పాటు చేశారు..
పవన్‌పై పాల్ సంచలన వ్యాఖ్యలు.. ఇక, సినిమాలకు పనికిరాడు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవి లాగే పవన్ కల్యాణ్ తన పార్టీని అమ్ముకుంటున్నాడు.. తమ్ముడు కల్యాణ్ ఎంపీగా పోటీ చేసి వేల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు అంటూ ఆరోపించారు. ఇక, పవన్ తనకు ఒక్క సీటు ఇచ్చినా చాలనుకుంటాడు.. నాదెండ్ల మనోహర్‌కు సీటు లేదన్నా ఒకే అంటారంటూ సెటైర్లు వేశారు. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయమని హరిరామజోగయ్య చెప్పారు.. కానీ, పవన్ ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోతున్నారని విమర్శించారు. మరోవైపు.. పవన్ కల్యాణ్ ముసలోడు అయిపోయాడు.. ఇక సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్ చేశారు కేఏ పాల్.. ఇక, ఎన్నికలను ఏప్రిల్ లో నిర్వహించి మేలో ఫలితాలిస్తున్నారు.. దాని వలన ఈవీఎంలు మిస్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎలక్షన్ ను నిర్వహించవద్దని ఎన్నికల అధికారిని కలిశాను.. ఏపీకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోరానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ నుంచి బాబూ మోహన్, విశాఖ నుంచి కేఏ పాల్ ఎంపీలుగా పోటీ చేస్తున్నాం.. ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వైఎస్ షర్మిల తన ప్రాపర్టీల కోసమే అన్నతో గొడవపడుతుంది.. తెలంగాణాలో కాంగ్రెస్ ను తిట్టి మరలా 500 కోట్లకు కాంగ్రెస్ లోనే తన పార్టీని విలీనం చేశారని ఆరోపించారు.. ఇదే చివరి ఎలక్షన్.. మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే చట్టాలన్నీ మారిపోతాయి.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
సీట్ల కోతపై స్పందించిన పవన్.. ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చింది.. సీట్లపై కూడా ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చారు.. అయితే, గతంలో అనుకున్న సీట్ల కంటే జనసేనకు మరింత కోత పడింది.. ఈ రోజు సీట్ల కోతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేను తీసుకున్న సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండి. జనసేన, టీడీపీ, బీజేపీలు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలని సూచించారు.. వైఎస్ జగన్ అధికారంలో ఉండకూడదు. ఒక్కడి దగ్గర ఇంత సంపద ఉండకూడదు అని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికే కాదు.. దేశానికే ముప్పు అని హెచ్చరించారు జనసేనాని.. ఏపీలో జగన్ పోవాలి.. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పోవాలి అంటూ నినాదాలు చేశారు.. గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు పవన్.. గ్రంధి భీమవరంలో చాలా మందికి బంధువే. మన కులస్తుడని గ్రంధిని వదిలేయాలా..? అని ప్రశ్నించారు ఓ వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల భీమవరంలో నిమ్మకాయ షోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి వచ్చిందన్నారు. తన డ్రైవరును చంపి డోర్ డెలివరి చేసిన అనంతబాబు మన కులస్తుడేనని వదిలేస్తామా..? జైలుకెళ్లిన అనంతబాబు బెయిల్ మీద వస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అనడం కరెక్టేనా..? అని నిలదీశారు. ఇక, పార్టీ పెట్టడానికి సొంత అన్నను కూడా కాదని వచ్చాను. సొంత అన్నను ఇబ్బంది పెట్టే వచ్చాను అన్నారు పవన్.. నేను గెలిచి ఉంటే భీమవరంలో డంపింగ్ యార్డును తొలగించేవాడిని. నేను చాలా హ్యాండ్సాన్ పొలిటిషీయన్ను.. పద్దతిగా మాట్లాడతాను.. కానీ, ఎదుటి వాళ్లు యుద్ధం కోరుకుంటే నేను దానికి రెడీ అన్నారు.
భీమవరాన్ని కొట్టి తీరాలి..
వచ్చే ఎన్నికల్లో జనసేన.. భీమవరాన్ని కొట్టి తీరాలి అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.. గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే.. బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారు. యుద్దం చేయనీకుండా నాకు సంకెళ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో కంటే పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్నా. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నా.. నేను బాధపడేవాడిని కాదన్నారు. సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు. కానీ, గతంలో నా ఒక్క సీటు గెలిచి ఉంటే.. ఇవాళ పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. గతంలో జరిగిన తప్పిదాలకు నేను పరిహరం కడుతున్నాను. ఇవాళ నవశకం ప్రారంభించాం అన్నారు. భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. పొత్తులను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యారని తెలపారు పవన్.. గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే.. నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు. తాను పోటీ చేయకుండా ఉంటే బాగుండేదని రామాంజనేయులు కొద్దిమందితో అన్నారు. గొడవలు పెంచే వారు నాకొద్దు.. తగ్గించేవారు కావాలి.. అందుకే రామాంజనేయులను పార్టీలోకి ఆహ్వానించాను అని తెలిపారు. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రంధి అడ్డుకున్నారని మండిపడ్డారు పవన్.. నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే గ్రంధి శ్రీనివాస్ అడ్డుకున్నారంటే.. ఎంత రౌడీయిజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ఇక, నాకు యుద్దం చేయడమే తెలుసు. కత్తి దూసినప్పుడు.. బంధువులంటే ఎలా..? అని ప్రశ్నించారు. భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్ ను తన్ని తరిమేయాలి అంటూ పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
వారిని విడిచేది లేదు.. మంత్రి విడదల రజిని వార్నింగ్
గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.. ఈ వ్యవహారంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మంత్రి విడదల రజిని.. తెనాలిలో గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక సాధారణ మహిళ ఆనందం వ్యక్తం చేస్తే ఆ సంతోషాన్ని నాలుగు రోజులు కూడా లేకుండా చేశారు.. టీడీపీ, జనసేన.. సోషల్ మీడియాలో టార్గెట్ చేసి ఒక మహిళ ప్రాణాలు తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకి మోసం చేయడమే తెలుసు , మంచి చేయడం తెలియదన్న ఆమె.. సీఎం వైఎస్ జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు.. ఒక మహిళను మానసికంగా వేధించి అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టి చివరికి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఫైర్ అయ్యారు. ఆ వేధింపులు తట్టుకోలేకే రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందన్నారు విడదల రజిని.. చనిపోయిన బీసీ మహిళ కుటుంబాన్ని చూస్తుంటే భాద వేస్తుంది.. మహిళలను భద్రంగా చూసుకుంటున్న జగనన్న ప్రభుత్వంలో, ఇలాంటి దుర్మార్గానికి టీడీపీ వడిగట్టిందని ఫైర్ అయ్యారు. ఒక మహిళ ప్రాణాలు పోయినా టీడీపీ వాళ్లకు జాలి కలగడం లేదు.. రాష్ట్రం మొత్తం బాధపడుతున్న, టీడీపీ నాయకులకు బాధ కలగడం లేదన్నారు. ఒక మహిళ చావును కూడా రాజకీయం కోసం టీడీపీ వాడుకుంటుందని ఆరోపించిన ఆమె.. చనిపోయిన మహిళ కుటుంబానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మహిళ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆ మహిళ చావుకి కారణమైన వారిని వదిలేది లేదు… ఇప్పటికే పోలీసులు చర్యలు ప్రారంభించారు.. చట్టపరంగా కఠిన శిక్షలు అనుభవిస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి విడదల రజిని.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శనాస్త్రాలు..
కరీంనగర్ జిల్లా కదనభేరి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా తాము అభివృద్ధిపై పోరాడుతామని తెలిపారు. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి..? అని ప్రశ్నించారు. ఐదు రూపాయల పని చేయని బండి సంజయ్ కి ఎందుకు ఓటెయ్యాలి..? అని ప్రశ్నించారు. తెలంగాణాలో వ్యవసాయ స్థిరీకరణ చేయాలని ఆలోచించాం.. చరణ్ సింగ్ లాంటి రైతుబిడ్డలు కూడా పెట్టని పథకాలు మనం రైతుల కోసం పెట్టుకున్నామన్నారు. ఈ విషయాలన్నీ కరీంనగర్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
దిగొచ్చిన ఎస్‌బీఐ! ఈసీకి డేటా అప్పగింత
మొత్తానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం సాయంత్రం ఎలక్టోరల్ బాండ్ల గురించిన డేటాను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. సుప్రీంకోర్టు కఠినమైన ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి ఎస్‌బీఐ సమర్పించింది. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు దిగివచ్చింది. ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని పలువురు రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మార్చి 11న విచారించింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన న్యాయస్థానం.. సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుబడుతూ బ్యాంకు అభ్యర్థనను కొట్టివేసింది.
సరిహద్దుల్లో పుట్టుకొస్తున్న చైనా గ్రామాలు.. భారత్-చైనా మధ్య ఘర్షణ తప్పదన్న యూఎస్ ఇంటెలిజెన్స్..
2024 ఆనువల్ థ్రెట్ అస్సెస్‌మెంట్ నివేదికలో భారత్, చైనాల మధ్య సాయుధ పోరాటం తప్పకపోవచ్చని యూఎస్ ఇంటెలిజెన్స్ అభిప్రాయపడింది. భారత సరిహద్దుల వెంబడి చైనా తన పుట్టగొడుగుల్లా గ్రామాలను విస్తరిస్తోందని చెప్పింది. భారత్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దళాల మోహరింపుకు చైనా ప్లాన్ చేస్తుందని, ఇది భారత్‌తో సాయుధ పోరాటానికి దారి తీసే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. వ్యూహాత్మక విస్తరణలో వాస్తవ నియంత్రణ రేఖకు ఎదురుగా తూర్పు, మధ్య ప్రాంతాల్లో చైనా గ్రామాల నెట్వర్క్‌ని విస్తరిస్తోంది. ఇటీవల భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఏ సమయాల్లో అయిన భారత దళాలను సరిహద్దుల్లో మోహరించేందుకు ఉద్దేశింపబడిన ‘సెలా టన్నెల్’ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ టన్నెల్‌కి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉండటం చైనా జిత్తులమారి తనానికి నిదర్శనంగా నిలుస్తోంది. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని చైనా తమ భూభాగంగా పేర్కొంటోంది. ఇది దక్షిణ టిబెట్ ప్రాంతంలో భాగమని వాదిస్తోంది. పలుమార్లు అరుణాచల్‌లోకి చైనా బలగాలు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి, అయితే భారత సైన్యం వీరిని సమర్థవంతంగా అడ్డుకుంది.
టిక్‌టాక్‌పై మారిన ట్రంప్ స్వరం.. ఉద్దేశమేంటంటే..!
టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా తాజా కామెంట్లు ఉన్నాయి. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్ లాభం పొందుతుందని ట్రంప్ ఆరోపించారు. యూజర్ల సమాచారం సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు టిక్ టాక్‌పై నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా కూడా దీనిపై చర్యలకు సిద్ధమైంది. కానీ న్యాయపరమైన సమస్యల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి దీనిపై చర్చ మొదలైంది. బుధవారం టిక్‌టాక్‌పై నిషేధం విధించే బిల్లును రిపబ్లికన్లు యూఎస్ హౌస్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు మద్దతుగా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. దీనిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్ లాభపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
టాప్ ప్లేయర్లను కాదని ఐసీసీ అవార్డును కైవసం చేసుకున్న యశస్వి జైస్వాల్..!
ప్రస్తుత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ క్రికెట్ చరిత్రలో రికార్డుల మోత మోగిస్తున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా ముగిసిన టీమిండియా, ఇంగ్లాండ్ టీంల మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారించడంతో అనేక కొత్త రికార్డులను సృష్టించాడు. తాజాగా ముగిసిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి ఇంగ్లాండ్ బౌలర్లని ఉతికిపారేశాడు. ఇందులో ముఖ్యంగా వరుస డబుల్ సెంచరీలు సాధించిన యంగ్ ప్లేయర్ గా జైస్వాల్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక, ఈ సిరీస్ లో యశస్వి జైస్వాల్ 712 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎంతో అద్భుతమైన ఆటతీరుతో ముందుకు వెళ్తున్న యశస్వి జైస్వాల్ ను తాజాగా ఐసీసీకి చెందిన అవార్డు వరించింది. ఇక ఈ విషయం చూస్తే.. ఫిబ్రవరి నెలకు గానూ జైస్వాల్ ను ” ప్లేయర్ ఆఫ్ ది మంత్ ” గా ఐసీసీ ఎన్నుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కొరకు జైస్వాల్ తో పాటు న్యూజిలాండ్ నుండి కేన్ విలియమ్సన్, శ్రీలంక నుండి పాతుమ్ నిస్సాంకలు గట్టి పోటీ ఇచ్చారు. ముందుగా ఈ ముగ్గురు ఆటగాళ్లను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఐసీసీ నామినేట్ చేయగా.. ఇందులో న్యూజిలాండ్ కు చెందిన కేన్ విలియమ్సన్, శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంకలను వెనక్కినెట్టి జైస్వాల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుపొందాడు.
ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్.. ఫొటోలు చూశారా?
బి-టౌన్‌లో రెండు పెద్ద పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రియాంక చోప్రా కజిన్ మీరా చోప్రా పెళ్లి ఈరోజు గ్రాండ్ గా జరుగగా, రేపు కృతి కర్బందా, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి చేసుకోబోతున్నారు. తెలుగులో బంగారం సహా పలు సినిమాలు చేసిన మీరా చోప్రా ఇప్పుడు వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను వివాహం చేసుకుంది. మీరా చోప్రా 2005లో ఎస్‌జె సూర్యతో కలిసి అన్బే ఆరుయిరే అనే తమిళ చిత్రంతో వినోద పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె బంగారంతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించింది MS రాజు రొమాన్స్ డ్రామా వానలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత, ఆమె విక్రమ్ భట్ 1920 లండన్‌లో శర్మన్ జోషితో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సతీష్ కౌశిక్ కామెడీ-హారర్ చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్, అజయ్ బహ్ల్ క్రైమ్ డ్రామా సెక్షన్ 375లో రిచా చద్దా అక్షయ్ ఖన్నాతో కలిసి ఆమె నటించింది. మార్చి 12న అంటే నేడు జైపూర్‌లో వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్-మీరా చోప్రా వివాహ వేడుక జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. మీరా చోప్రా ఎరుపు రంగు లెహంగాలో అందంగా కనిపించగా, రక్షిత్ ఐవరీ షేర్వానీలో మెరిశారు. మీరా చోప్రా మెహందీతో పాటు సంగీత్ వేడుక కూడా చాలా సరదాగా జరిగింది. ప్రియాంక మరియు పరిణీతిలాగే, వారి కజిన్ మీరా కూడా తన డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌ను ఎంచుకున్నారు. ఈరోజు జైపూర్‌లో రక్షిత్‌తో కలిసి మీరా ఏడు అడుగులు వేసింది. మరోవైపు బాలీవుడ్ నటులు పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా రేపు మార్చి 13న పెళ్లి చేసుకోనున్నారు. మీరా చోప్రా పెళ్లికి ఫ్యామిలీతో పాటు సినీ పరిశ్రమ, వ్యాపార రంగానికి చెందిన కొందరు ప్రముఖులు హాజరయ్యారు. మార్చి 12 సాయంత్రం 4:30 గంటలకు వివాహం, రాత్రి 9 గంటల నుండి విందు మరియు రిసెప్షన్‌ను షెడ్యూల్ చేశారు. మీరా ఇప్పుడు రాజస్థాన్‌ను తమ వివాహ గమ్యస్థానంగా ఎంచుకున్న ప్రముఖుల జాబితాలో చేరింది. ఆమె కజిన్ ప్రియాంక చోప్రా డిసెంబర్ 2018లో జోధ్‌పూర్‌లోని ప్రసిద్ధ ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్నారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ గత సంవత్సరం జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. దీనికి ముందు, విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ రాజస్థాన్‌లోని రణతంబోర్ సమీపంలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకున్నారు.
భార్యకు మద్దతుగా ప్రచారబరిలో శివన్న..
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 9న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ భార్య గీత పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అవసరమైనప్పుడు తాను ప్రచారంలో పాల్గొంటా అని ఆయన బెళగావిలో చెప్పారు. తన భార్య కోసం ప్రచారం చేయాలని తన తోటి నటీనటులను అడగలేదని అన్నారు. ‘‘తాము గెలవడానికి వచ్చాము. ప్రచారంలో పాల్గొనాలని ఇతర నటీనటులను ఒత్తిడి చేయము. ఈసారి వేడి ఎక్కువగా ఉంది. వారు ఒత్తిడికి గురికాకూడదు. కానీ మేము పిలిస్తే వారు వస్తారు. దాన్ని అడ్వాంటేజ్‌గా మేం తీసుకోవాలని అనుకోవడం లేదు. మనం యాక్టర్లకు స్పేస్ ఇవ్వాలి’’ అని అన్నారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారు.
రవితేజ పక్కన హీరోయిన్ గా ఛాన్స్.. రాత్రికి రాత్రే లేపేశారు.. నెగిటివ్ కామెంట్స్
నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది. ఇక బిగ్ బాస్ తరువాత దివి.. అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ మధ్యనే దివి లంబసంగి అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. భరత్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. తాజాగా భరత్ రాజ్, దివి జంటగా దావత్ షోలో సందడి చేశారు. ఇక ఈ షోలో దివి.. తన గతాన్ని నెమరువేసుకుంది. అవకాశాల కోసం ఎంతగా తిరిగింది.. ? అవకాశాలు రాక ఎలా ఏడ్చింది.. ? అన్ని చెప్పి ఎమోషనల్ అయ్యింది. ” నేను సినిమాల్లోకి వస్తాను అని అనుకోలేదు. ఇంట్లో, బాత్ రూమ్ లో ర్యాంప్ వాక్ చేస్తూ ఉండేదాన్ని. నా ఫేస్ మీదనే రిజెక్షన్స్ వచ్చాయి. ఒకరు సన్నగా ఉన్నారని రిజెక్ట్ చేస్తే.. ఇంకొందరు లావుగా ఉన్నారని రిజెక్ట్ చేశారు. సన్నగా అవ్వమంటారు.. సన్నగా అయితే రిజెక్ట్ చేస్తారు. రీసెంట్ గా రవితేజ గారి సినిమాలు నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఉన్నాను అందులో సార్ పక్కన లీడ్ లాగా.. ఒక 5 డేస్ లో షూట్ స్టార్ట్ అవ్వాలి. రాత్రికి రాత్రే అమ్మాయి మారిపోయింది” అని చెప్పుకొచ్చింది. ఇక శేఖర్ మాస్టర్ డైరెక్షన్ లో ఫోక్ సాంగ్ చేస్తే దాని కింద కూడా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ లేదు. దీనికి డ్యాన్స్ రాదు.. నువ్వెంటీ ఇలా ఉన్నావ్.. నీ డ్యాన్స్ ఏంటి ఇలా ఉంది అంటూ కామెంట్స్ చేశారు అని చెప్పుకొచ్చింది. ఇక భరత్ సైతం ఇలాంటి కామెంట్స్ పెట్టి డబ్బు సంపాదించి వచ్చిన డబ్బుతో తినే అన్నం ఎలా తిరుగుతుందో తెలియడం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.