కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు నోటీసులు
కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత పాటించటం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరికి వేర్వేరు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కల్పించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. నిబంధనల ప్రకారం 2 కిలో మీటర్ల లోపల ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కల్పించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతోందని పిటిషనర్ వాదనగా ఉంది.. తమ అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా ఫైనల్ లిస్ట్ ప్రకటించారని కోర్టుకు తెలిపారు పిటిషనర్.. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఆర్డీవోకి నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.
చేతులెత్తి నమస్కరిస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలిపించండి
తాను చాలా కమిట్మెంట్‌తో జనసేన పార్టీని ప్రారంభించానని.. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే, తనకు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో పవన్ మాట్లాడుతూ.. తనకున్న కెపాసిటీకి ఏదో ఒక పదవి పొందవచ్చని, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుత ఉన్న సీఎంలా తాను అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదని.. బటన్ నొక్కితే డబ్బులు పడతాయని చెప్పనని అన్నారు. ఉప కులాలు ఐక్యత చాలా అవసరమన్నారు. మీరు సరైన వ్యక్తిని నమ్మడం లేదని.. మీ విశ్వాసం, నమ్మకం సరైన వ్యక్తులపై పెట్టడం లేదని చెప్పారు. తాను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో తమని గెలిపించాలని పవన్ ప్రజల్ని అభ్యర్థించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఇసుకకి సంబంధించిన మూడు కంపెనీలు ఉన్నాయని.. 10 వేల కోట్లు వెళ్లిపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మీరు నాకు ఎంపీలు ఇవ్వండి, నేను పని చేయిస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్‌కి ఇంత ఓటు షేర్ ఉంది కాబట్టే పీఎం తనని పిలిపిస్తారన్నారు. అభివృద్ధి రోడ్డు మీద పడేయకూడదన్నారు. 40 గజాల్లో ఇల్లు ఏమీ వస్తుందని ప్రశ్నించారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థకి మీ కష్టం, మీ రక్తం, మీ శ్రమే కారణమన్నారు. మీ ఆదాయం సీఎం ముగ్గురుకి అంటగట్టేశాడని ఆరోపణలు చేశారు. మీరు నా కోసం నిలబడితే, మీ కోసం పోరాటం చేయగలనని పేర్కొన్నారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు అవ్వాల్సిన అవసరం లేదన్నారు. డబ్బు సంపాదించే కొద్దీ పోరాట పటిమ తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు.
2024 ఎన్నికల్లో మూకుమ్మడిగా పోటీ చేసినా.. వైసీపీకి పోయిందేమీ లేదు
2024 ఎన్నికల్లో మూకుమ్మడిగా పోటీ చేసినా.. వైసీపీకి పోయిందేమీ లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కంటే అధిక మెజారిటీతో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో రెండు రైతు బజార్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ మూస పోసిన విమర్శలకు అలవాటుపడ్డ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. మూగబోయిన యువగళం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్‌వి పార్ట్‌టైం ఛాలెంజ్‌లని, వాటిని పట్టించుకోవక్కర్లేదని అన్నారు. పక్క రాష్ట్రాలవి కాపీ కొట్టడం చంద్రబాబుకి అలవాటు అని దుయ్యబట్టారు. ఖరీఫ్ రైతులకు అన్నీ అందుబాటులో ఉన్నాయని మంత్రి కాకాణి.. రైతు బజారుల ప్రారంభం వినియోగదారుడికి, రైతుకి ఉపయోగకరమని అన్నారు. ‘నాడు నేడు’ అభివృద్ధి లాగానే.. 5 కోట్ల వ్యయంతో రైతు బజార్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఏపీ వ్యాప్తంగా 103 రైతు బజార్లు ఉన్నాయన్నారు. ఏపీఐఐసీ కాలనీలో, మధురా నగర్‌లలో కూడా రైతు బజారుల్ని ప్రారంభిస్తామన్నారు. 184 దుకాణాలు రైతుల కోసం అందుబాటులోకి తెచ్చామని.. ముఖ్యంగా దివ్యాంగులకు స్టాళ్ళు కేటాయించామని మంత్రి చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ విస్మరించారని, అందుకే 2019 ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు ఘోరంగా ఓడించారంటూ మంత్రి కాకాణి ధ్వజమెత్తారు. గతంలో జగన్ ఒక లక్ష్యం ప్రకారం పాదయాత్ర చేశారని.. కానీ లోకేష్ పాదయాత్రకు ఒక లక్ష్యం కానీ, ఒక ఉద్దేశం గానీ లేదని విమర్శించారు. ఓవైపు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే, మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టోనీ విడుదల చేశారని.. అది కూడా కర్ణాటక నుంచి కొన్ని, వైసీపీ మేనిఫెస్టోలోని కొన్నింటినీ కాపీ కొట్టారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీతో దోస్తీ చేసేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని.. గతంలో మోడీని తిట్టిన చంద్రబాబు, మళ్లీ ఇప్పుడు మోడీ దగ్గరికి వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. తన ఓటుకు నోటు కేసు గురించే కేంద్రంతో చర్చిస్తారని పేర్కొన్నారు.
ఈనెల 22న సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఈనెల 22న(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ లను ప్రారంభించి.. అనంతరం 11 గంటలకు పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పక్కన నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O. Ms. 82 జారీ చేసిందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.184 కోట్ల 87లక్షల 55 వేల నిధులు మంజూరు కాగా, మొత్తం వ్యయంలో 25శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 75 శాతం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఖర్చు చేయనుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రధానంగా పారిశ్రామికవాడల్లో జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అవసరమైన అత్యాధునిక శస్త్ర చికిత్స విభాగాలు సైతం ఇందులో ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఈజిప్టుకు ప్రధాని మోదీ.. ఈ నెల 24 నుంచి 2 రోజుల పాటు పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 24 నుంచి ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి ఆహ్వానం మేరకు మోడీ రెండు రోజుల పర్యటన జూన్ 24న ప్రారంభం కానుంది. 1997 తర్వాత భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి. దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం తన మొదటి ఈజిప్టు పర్యటనలో సందర్శించనున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులర్పించేందుకు ప్రధాన మంత్రి హెలియోపోలిస్ యుద్ధ శ్మశానవాటికను కూడా సందర్శించనున్నారు. అల్-సిసిని కలవడానికి ముందు, భారతదేశంతో సంబంధాలను పెంపొందించడానికి ఈజిప్టు అధ్యక్షుడు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం అయిన ఇండియా యూనిట్‌తో ప్రధాని చర్చలు జరుపుతారు. ప్రధాని మోదీ భారతీయ సమాజంలోని ప్రజలతో సంభాషించనున్నారు.
వియత్నాంకు స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కిర్పాన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన భారత్
ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గ్యాంగ్ సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వివిధ ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సంబంధాలపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశారు. చర్చల తర్వాత వియత్నాం పీపుల్స్ నేవీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి వియత్నాంకు భారత్ స్వయంగా నిర్మించిన ఇన్-సర్వీస్ క్షిపణి కార్వెట్ ఐఎన్‌ఎస్ కిర్పాన్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. చర్చల సందర్భంగా, రాజ్‌నాథ్ సింగ్, వియత్నాం ప్రతినిధులు ఇప్పటికే ఉన్న సహకార రంగాలను, ముఖ్యంగా రక్షణ పరిశ్రమ సహకారం, సముద్ర భద్రత, బహుళజాతి సహకారం రంగాలలో దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను గుర్తించారు. ఈ రోజు ఢిల్లీలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్‌తో జరిగిన ఫలవంతమైన సమావేశంలో భారత్-వియత్నాం రక్షణ సంబంధాల పూర్తి స్థాయిని సమీక్షించారని ఈ సమావేశం గురించి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్లు.. ఈ రీఛార్జ్‌లతో 5జీ డేటా, 15 ఓటీటీ ఛానెల్స్ ఫ్రీ
తన యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు తీసుకొచ్చింది ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్.. ఒక్కో ప్లాన్‌పై అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ నుండి 5జీ డేటా యాక్సెస్ ప్రకటించింది.. అంతే కాదు.. డిస్నీ+ హాట్‌స్టార్ తో పాటు 15 రకాల ఇతర ఓటీటీ ఛానెల్స్‌ను ఫ్రీగా యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.. ఎయిర్‌టెల్ ప్రస్తుతం డిస్నీ, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సహా మరిన్ని ఓటీటీ ఛానెల్‌లను ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ఉచిత సభ్యత్వాలను అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అపరిమిత ఇంటర్నెట్ నుండి 5G డేటా యాక్సెస్ మరియు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ల వరకు, ఎయిర్‌టెల్ అందరికీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల శ్రేణిని కలిగి ఉంది. దాని పోటీదారు జియో వలె కాకుండా, ఎయిర్‌టెల్ ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది, తద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన షోలను ప్రసారం చేస్తూ అపరిమిత ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు.
గోల్డెన్ ఆఫర్.. తక్కువ ధరకే పసిడి మీ సొంతం..!
బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ.. మన సంప్రదాయాల్లో పసిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది.. ఇంట్లో జరిగే చిన్న శుభకార్యం నుంచి జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లి.. ఆ తర్వాత జరిగే.. ప్రతీ ఫంక్షన్‌లోనూ.. వారివారి స్థాయిలను బట్టి బంగారం ఉండాల్సిందే.. అందుకే.. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా..? గోల్డ్‌కు ఎంత డిమాండ్ ఉన్నా.. కొనుగోలు చేసేవారు ఎప్పుడూ ఉంటారు.. అయితే, ఇప్పుడు తక్కువ ధరకే గోల్డ్ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.. ఇక, గోల్డ్ కొనేవారు ఓవైపు.. మరోవైపు గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారు మరోవైపు భారీ సంఖ్యలోనే ఉంటారు.. ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 తొలి విడత సబ్‌స్క్రిప్షన్.. ఈ రోజు ప్రారంభమైంది. మార్కెట్ ధర కంటే తక్కువకే గోల్డ్ పొందవచ్చు.. అంటే గోల్డ్ మీ చేతికి రాదు.. కానీ, ఈ స్కీమ్ కింద గోల్డ్ బాండ్ పొందుతారు. ఇక, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24లో ఒక్కో గ్రాముకు రూ.5,926 చొప్పున ఇష్యూ ధరను నిర్ణయించారు. జూన్ 19వ తేదీ నుంచి.. అంటే ఈ రోజు నుంచి జూన్ 27వ తేదీ వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.. ఈ బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. వీటిని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో విక్రయిస్తారు. ఇక.. అంతా డిజిటల్ మయం అయిన తరుణంలో.. ఆన్‌లైన్‌లో ఈ బాండ్లను కొనుగోలు చేసేవారు గ్రాము బంగారంపై అదనంగా రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే.. ఆన్‌లైన్ మోడ్‌లో పేమెంట్ చేసేవారికి గ్రాము బంగారం రూ.5,876కే లభిస్తుందన్నమాట.
సీజన్ 7 కు అంతా రెడీ..హౌస్లోకి వెళ్లేవారి లిస్ట్ ఇదే?
బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే బిగ్ బాస్.. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 7వ సీజన్ ను జరుపుకుంటుంది.. త్వరలోనే ఆ సీజన్ ప్రారంభం కానుంది..అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్ రిజల్ట్ సాధించాలని చూస్తున్నారు.. కొత్త వ్యక్తులను తీసుకురావడంతో పాటు టాస్క్ లను కొత్తగా తీసుకురావాలనే ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది.. అందుకే ఈ సారి కొంత ఆలస్యంగానే సీజన్ 7 ప్రారంభం కాబోతుందని టాక్. అంతే కాదు పేరున్న స్టార్స్ ను కాస్త రేటు ఎక్కువైనా.. హౌస్ లోకి తీసుకురావాలి అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్..బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షో ఎప్పటి మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా హోస్ట్ గా కింగ్ నాగార్జుననే ఉంటారా… లేక గతంలో వినిపించిన పేర్లలో ఎవరైనా రావచ్చా అనేది ఆసక్తిగా మారింది.. ఇక షో యాజమాన్యం కూడా జనాల్లో ఈ సస్పెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
కొణిదెల ఇంట మూడో తరం రాకకు రేపే శుభముహూర్తం.. పూజలు చేయాలని అభిమానులకు పిలుపు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా వీరికి సంతానం లేకపోవడంతో అనేక రకాల ప్రచారాలు తేరి మీదకు వస్తూ ఉండేది. అయితే ఎట్టకేలకు వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు డాక్టర్లు రేపు ఉపాసనకు సంబంధించిన డెలివరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పుడు ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రవణం స్వామి నాయుడు ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. కొణిదెల ఇంట మూడో తరం రాకకు రేపే శుభ ముహూర్తం అంటూ ఆయన ఒక పోస్టర్ షేర్ చేశారు. మెగా కుటుంబంలో బుడిబుడి అడుగులకు శ్రీకారం, ఆ చిరంజీవి చిరు చిరు మురిపాలకు ఇదే ఆరంభం కావాలి, రామ్ చరణ్ ఉపాసన దంపతుల బిడ్డకు దేవదేవుల ఆశీర్వాదం అభిమానులై మనం చేసుకోవాలి అంబరాన్నంటే సంబరం, రామ్ చరణ్ ఉపాసన దంపతుల బిడ్డ పేరు మీద మెగా అభిమానులు రేపు అంటే జూన్ 20వ తేదీన మంగళవారం నాడు ఉదయం సమీప దేవాలయాల్లో పూజలు అర్చనలు చేయాలని కోరుకుంటున్నట్టుగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు పేర్కొన్నారు.
ఇరువురి భామల మధ్య బాలయ్య పాటతో నలిగావా.. మావా
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ కు జంధ్యాల అని పేరు తెచ్చుకున్న అనిల్ ప్రస్తుతం బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు. నేడు కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా సెట్ లో జరిగిన ఒక ఫన్నీ వీడియోను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. గతంలో అనిల్ రావిపూడి.. బాలయ్య సాంగ్ కు చిందేసిన విషయం తెల్సిందే. బాలయ్య.. బాలయ్య.. గుండెల్లో గోలయ్య సాంగ్ కు అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ తో కలిసి చిందేశాడు. ఇక దానికి రివెంజ్ గా అనిల్ ముందే.. కాజల్, శ్రీలీల.. బాలయ్య మరో సాంగ్ కు చిందేసి అనిల్ కు షాక్ ఇచ్చారు. నరసింహానాయుడు చిత్రంలోని చిలకపచ్చ కోక సాంగ్ లోని రెండు లైన్లకు శ్రీలీల, కాజల్ బాలయ్య స్టెప్స్ తో అదరగొట్టేశారు. రారా ఉల్లాస వీరుడా.. నీ సోకుమాడ.. నీదే నా పట్టుపావడా అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక మధ్యలో అనిల్ వచ్చి సూపర్ అని చెప్పినా.. ఇంకా మాది అవ్వలేదు అంటూ మిగతా మ్యూజిక్ కు కూడా ఈ ముద్దుగుమ్మలు చిందేసి అనిల్ రావిపూడికి తమ సత్తా చూపించారు. ఇక ఇందులో మరొక విషయమేంటంటే.. ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే కలర్ డ్రెస్స్ ల్లో కనిపించి ఔరా అనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇరువురి భామల మధ్య బాలయ్య పాటతో నలిగావా.. మావా అంటూ అనిల్ ను ఆటపట్టిస్తున్నారు. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి- బాలయ్య కాంబో ఎలాంటి హిట్ ను అందుకోనున్నదో చూడాలి.