సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర నేతలు భేటీ..
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్ల పథకాలపై చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను సీఎంను అడిగి నేతలు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు ఆహ్వానించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ ప్రగతి కాముక రాజకీయ నాయకత్వం నేడు ఎంతగానో అవసరం ఉందన్నారు మహారాష్ట్ర నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ విధివిధానాల గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు. తాము పార్టీలో చేరడానికి తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు నేతలు. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన వారిలో.. ఛత్తీస్ ఘడ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్య ప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, చత్తీస్ ఘర్ సారంగద్ మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పసుల సమ్మయ్యపోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ లు ఉన్నారు.
ఆ గుట్టు తేలాలి.. మోడీకి, కేసీఆర్‌కి లేఖ రాస్తా
ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. పాదయాత్ర చేయడం కన్నా.. ప్రశాంతంగా పడుకోవడమే లోకేష్‌కు ఇష్టమని ఎద్దేవా చేశారు. తన పాదయాత్రలో భాగంగా సీఎం జగన్‌పై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్‌కు మాట్లాడటం రాదు అని దుయ్యబట్టారు. పాదయాత్ర లోకేష్ ప్రతిరోజూ 10 కిలోమీటర్లు కూడా నడవడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పాదయాత్ర చేయలేక తన కొడుకు పంపాడని, జనం లేక లోకేష్ ఖాళీ కుర్చీలకు స్పీచ్‌లు ఇస్తున్నాడని పేర్కొన్నారు. నిబంధనలు పాటించమని చెప్తుంటే.. అనవసరంగా పోలీసులను తిడుతున్నాడని మండిపడ్డారు. నారావారి పల్లె నుంచి వలస వెళ్లిపోయింది చంద్రబాబేనని, దత్తపుత్రుడు కూడా హైదరాబాద్‌కు వలస వెళ్లిపోయాడని కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు దెబ్బకు లోకేష్ బాబాయ్ ఏమయ్యాడో తెలియడం లేదని, పండగకు నారావారిపల్లెలో నీ బాబాయ్ ఎందుకు కనపడడు? అని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారని.. ఆరోజు చంద్రబాబు, కడప జిల్లా నేతలు పోలీసులతో ఏం మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు ఫోన్ కాల్స్‌పై సీబీఐ విచారణ జరపాల్సిందిగా డిమాండ్ చేశారు. అప్పటి డీజీపీ, టీడీపీ నేతల ఫోన్ కాల్స్‌పై విచారణ చేయాల్సిందేనని కోరారు. కడపలో జిల్లాలో గంటా శ్రీనివాస్‌ను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి, వివేకా ఓటమికి కారణమయ్యారని.. ఎన్నికల ముందు వివేకాను చంపి, కేసును సీఎం జగన్‌పై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఒంటరిగా పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచారని, వివేకాను అక్కున చేర్చుకున్న హృదయం జగన్‌ది అని తెలిపారు.
“పబ్లిక్ ఈజ్ ది మాస్టర్, మీరు వార్నింగ్ ఇవ్వలేరు”.. సుప్రీంకోర్టుపై న్యాయశాఖ మంత్రి సెటైర్లు..
కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ నెలకొంది. సుప్రీంకోర్టు కోలిజియం సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతుల వ్యవహారం గత రెండు నెలలుగా కేంద్రం పెండింగ్ లో ఉంచింది. అయితే నిన్న సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తాజాగా ఈ రోజు కేంద్రం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై మరోసారి న్యాయశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సుప్రీంకోర్టుపైనే సెటైర్లు పేల్చారు. ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిందని నేను వార్తల్లో చూశానని.. దీన్ని చూసి కొంతమంది నవ్వుకున్నారని అన్నారు. కానీ ‘‘ఈ దేశానికి యజమానులు ఈ దేశ ప్రజలే, మనం కార్మికులం మాత్రమే. యజమాని అంటే దేశ ప్రజలే అని, మార్గదర్శి రాజ్యాంగమే, రాజ్యాంగం ప్రకారం ఈ దేశం ప్రజలు కోరుకున్నట్లు నడపిండి. మీరు ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేరు’’ అని అన్నారు.
సుప్రీంకోర్టులో కొత్తగా ఐదుగురు జడ్జీలు.. నోటిఫికేషన్ జారీ
సుప్రీంకోర్టులో ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమించింది కేంద్రం ప్రభుత్వం.. దీనిపై ఇవాళ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ పంకజ్ మిథాల్ (రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ సంజయ్ కరోల్ (పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ (పీవీ సంజయ్ కుమార్) నియామకానికి గత ఏడాది డిసెంబర్ 13న భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా (జడ్జి, పాట్నా హైకోర్టు) మరియు జస్టిస్ మనోజ్ మిశ్రా (జడ్జి, అలహాబాద్ హైకోర్టు) నియామకానికి ప్రధానమంత్రి కార్యాలయం ఫిబ్రవరి 2న ఆమోదం తెలిపిందని, ఆ తర్వాత నియామకం కోసం పేర్లను రాష్ట్రపతి భవన్‌కు పంపగా.. రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో.. నోటిఫికేషన్ జారీ చేశారు.. వచ్చే వారం ప్రారంభంలో కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, సుప్రీంకోర్టు కొలీజియం అసాధారణ రీతిలో మరో ఇద్దరి పేర్లను ఎస్సీ న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసిన మూడు రోజులకే ఈ నియామకం జరిగింది. కొలీజియం సాధారణంగా మరిన్ని సిఫార్సులను పంపే ముందు ఫైల్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉంటుంది. జనవరి 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. మొత్తంగా పంకజ్ మిట్టల్ (రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్), సంజయ్ కరోల్ (పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్), పీవీ సంజయ్ కుమార్ (మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్), అహ్సానుద్దీన్ అమానుల్లా (పాట్నా హైకోర్టు న్యాయమూర్తి), మనోజ్ మిశ్రా (అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి) త్వరలోనే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పెట్టబోతున్నారు.
కుడి చేతిలో ఖురాన్..ఎడమ చేతిలో అణుబాంబు.. ఆర్థిక సంక్షోభానికి పాక్ నాయకుడి పరిష్కారం
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పతనం అంచుకు చేరుకుంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు లభించడం లేదు. పిండి, వంటనూనెలు, నెయ్యి, వంట గ్యాస్, కరెంట్ ఇలా అన్నింటా కొరతే. ద్రవ్యోల్భణం ఆల్ టైం హైకి చేరుకుంది. దీంతో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. అయితే అక్కడి నాయకులు మాత్రం ఆర్థిక సంక్షోభానికి వింతవింత పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి పాకిస్తాన్ ను ఇస్లాం పేరుమీద అల్లా సృష్టించాడని..ప్రజలను కూడా అల్లానే ఆదుకుంటాడంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తెహ్రీక్-ఇ-లబ్బీక్ నేత సాద్ రిజ్వీ లాహోర్ లో జరిగిన ఓ సభలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి ఓ కొత్త ప్రతిపాదన సూచించాడు. ప్రస్తుతం ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆర్థిక సంక్షోభం కోసం పాక్ ప్రభుత్వం అన్ని దేశాలను అడ్డుకుంటుందని.. అలా కాకుండా పాక్ క్యాబినెట్ కుడి చేతిలో ఖురాన్, మరో చేతిలో అణు బాంబు సూటికేస్ పట్టుకుని స్వీడన్ చేరాలని సూచించారు. మీరంతా ఖురాన్ ను రక్షించడానికి ఇక్కడి వచ్చామని చెప్పండి, ప్రపంచంలోని అన్ని వరాలు మీకు వస్తాయని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ ప్రతీ ఇంటికి వెళ్లి భిక్ష అడుక్కోవద్దని ఇదే పరిష్కారం అని.. ఇలా చేస్తే ప్రపంచం అంతా మన పాదాల చెంతకు చేరుతుందని, లేకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ సవాల్ కూడా విసిరాడు.
సినీ పరిశ్రమకు విశ్వనాథ్ చేసిన సేవలు వెలకట్టలేనివి
కళాతపస్వి కే విశ్వనాథ్ ఇటీవల పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి రోజా ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. విశ్వనాథ్ భార్య, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆమె.. విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌పై ప్రశంసలు కురిపించారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని.. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి, కల్చర్‌కు చేసిన సేవ ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుందని అన్నారు. మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘విశ్వనాథ్ లేరని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి, సంస్కృతికి చేసిన సేవలు ఇంకెవరూ చేసి ఉండరు. తన సినిమాల్లో ఆయన తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాలు ఒక మెసేజ్‌ని అందించి, వాటిని ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి. ఒక దర్శకుడిగా, ఒక నటుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. తనని చూసి ఆదర్శవంతంగా ఎలా జీవించాలో నేర్చుకునేలా ఆయన జీవించారు. ఆయన క్రమశిక్షణతో ఉండటంతో పాటు ప్రతీ పని టైం టు టైం చేసేవారని వారి కుటుంబ సభ్యులు చెప్పారు. తెర మీద ఆయన కనిపించరు కానీ ఆయన పద్ధతులు కనిపిస్తాయి, క్రమశిక్షణ కనిపిస్తుంది, ఒక టీచర్‌ను చూసినట్టు భయం వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణంగా అనుభవించారు’’ అని చెప్పుకొచ్చారు.
దక్షిణాది చిత్రసీమలో మరో విషాదం!
కొత్త సంవత్సరం చిత్రసీమకు అచ్చిరాలేదు. సీనియర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒకరి తర్వాత ఒకరు చిత్రసీమను వీడి దివికేగుతున్నారు. జమున, కె. విశ్వనాథ్ మరణవార్తలను ఇంకా పూర్తి స్థాయిలో జీర్ణించుకోకముందే… ఈ రోజు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన మధురగాయని వాణి జయరాం కన్నుమూశారు. ఆమె మరణానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. ఇదే సమయంలో మరో మరణవార్త దక్షిణాది సినీ అభిమానులను విషణ్ణ వదనులను చేసింది. ఎన్టీయార్, కృష్ణతో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, కృష్ణంరాజు, చిరంజీవితో ‘పులి-బెబ్బులి’ చిత్రాలను తీసిన సీనియర్ తమిళ నిర్మాత ఆర్. వి. గురుపాదం బెంగళూరులో ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. నాలుగైదు దశాబ్దాల క్రితమే సినీ సంగీత విభాగంలోకి ఆర్. వి. గురుపాదం అడుగుపెట్టారు. ఆ తర్వాత సంగీత దర్శకులతో ఉన్న సాన్నిహిత్యంతో మ్యూజిక్ కండక్టర్ గా ఎదిగారు. దక్షిణాదిలోని అగ్ర నటీనటుల చిత్రాలకు పనిచేశారు. ఆపైన నిర్మాతగా మారారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇరవైకు పైగా సినిమాలను నిర్మించారు. పలు చిత్రాలను ఇతర భాషల నుండి అనువదించారు. ‘సత్యవాది హరిశ్చంద్ర’ పేరుతో ఓ టీవీ సీరియల్ నిర్మించారు. సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్, తమిళ, కన్నడ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ లోనూ సభ్యులుగా ఉన్న గురుపాదం మూడు రోజుల క్రితమే చెన్నయ్ లో నిర్మాతల సమావేశానికి హాజరయ్యారని సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఉదయం ఆయన బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూయడాన్ని నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నయ్ లో ఆర్. వి. గురుపాదం అంత్యక్రియలు జరుగుబోతున్నాయి. ఆయనకు దాదాపు ఎనభై సంవత్సరాలు. దక్షిణాది చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు వచ్చాయిని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. తాజాగా టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. వారిద్దరి మధ్య స్వల్ప విభేదాలున్న మాట వాస్తమేనని చెప్పాడు. ధోనీ రిటైర్ అయ్యాక ఆ గొడవలు ఎక్కువయ్యాయని తెలిపాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం, అప్పటి కోచ్ రవిశాస్త్రి ఈ సమస్యను ఎలా పరిష్కరించాడనే విషయాన్ని తన ఆటో బయోగ్రఫీ కోచింగ్ బియాండ్ – మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్‌లో రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్. “2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం గురించి చాలా చర్చ జరిగింది. రోహిత్, కోహ్లీ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. విరాట్ క్యాంపు, రోహిత్ క్యాంపు అని టీమ్‌లో రెండు సెపరేట్ గ్రూపులు కూడా ఉండేవి. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం యూఏఈ వెళ్లాం. అక్కడికి వెళ్లగానే రవిశాస్త్రి, విరాట్ , రోహిత్‌ను తన రూమ్‌కు పిలిపించుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అనుకున్నాడు. ‘సోషల్ మీడియాలో ఏం జరిగిందో వదిలేయండి.. మీరు ఇద్దరూ టీమ్‌లో సీనియర్ క్రికెటర్లు.ధోనీ రిటైర్ అయ్యాక ఇప్పుడు మీరు ఇద్దరూ టీమ్‌లో మిగిలిన వారికి రోల్ మోడల్‌గా ఉండాలి. మీ మధ్య ఏమున్నా అవన్నీ పక్కనబెట్టేసి కలిసి ముందుకు వెళ్లాలని నేను అనుకుంటున్నా..’ అని తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరిలోనూ మార్పు వచ్చింది. నవ్వుతూ పలకరించుకోవడం, మాట్లాడుకోవడం మొదలెట్టారు.ఇద్దరూ తమ సమస్య ఏంటో కూడా చెప్పలేదు. ఒకరి మీద ఒకరు కంప్లైట్స్ ఇచ్చుకోలేదు. కొత్తగా మొదలెట్టాలని చేతులు కలిపారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు.. అన్నింటికి ముందు టీమ్.. రవిశాస్త్రి నమ్మింది ఇదే..” అని శ్రీధర్ చెప్పాడు.