*సీబీఐ విచారణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడం అనేది ఇన్వెస్టిగేష్‌న్‌లో ఒక భాగమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తీహార్ జైల్లో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అంశంపై జేడీ లక్ష్మీనారాయణ ఎన్టీవీతో మాట్లాడారు. కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టే సీబీఐ ఫర్మిషన్ తీసుకుందని తెలిపారు. కవితను విచారించాక తర్వాత ఏం చేయాలన్నదానిపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కవిత నుంచి సరైన ఆన్సర్ వస్తే ఇబ్బంది లేదు గానీ.. రాకుంటే మాత్రం కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆలెడ్రీ ఈడీ నుంచి కూడా సీబీఐ కొంత సమాచారం తీసుకునే ఉండే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒకే కేసును దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా సమాచారాన్ని షేర్ చేసుకుంటారని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.అప్రూవర్లు సమాచారం ఇచ్చినంత మాత్రాన ఉపయోగం ఉండదని.. తగిన ఆధారాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుందన్నారు. కాకపోతే అప్రూవర్లకు బెయిల్ దొరుకుతుందని వివరించారు. అప్రూవర్ల సమాచారానికి తగిన ఆధారాలు ఉండాల్సిందేనని.. వాళ్లిచ్చిన సమాచారంతోనే కేసులు కూడా నడవవన్నారు. కచ్చితంగా కొన్ని సాక్ష్యాలనైతే కలెక్ట్ చేయాల్సి ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇక దర్యాప్తు సంస్థలు ఏం కోరుకుంటాయో ఆ విధంగా న్యాయస్థానాలు కూడా సహకరిస్తుంటాయని చెప్పుకొచ్చారు. కోర్టులు ఎప్పుడు విచారణ విషయంలో జోక్యం చేసుకోవన్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు పక్కదారి పడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు. వాస్తనానికి ఇన్వెస్టిగేష్‌న్ సంస్థలకు కోర్టులు సహకరిస్తూ ఉంటాయని స్పష్టం చేశారు. ఇక దర్యాప్తు పూర్తయ్యాకే ఎవరికైనా బెయిల్ వస్తుందన్నారు. అటు తర్వాత దర్యాప్తు సంస్థలు సేకరించిన సమాచారం రుజువు అయితేనే నిందితులకు శిక్ష పడుతుందని.. లేదంటే విడిచిపెట్టేస్తాయన్నారు. దర్యాప్తు సంస్థల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయన్న సంగతి మాత్రం ఇప్పుడు తెలియదని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
*కేసీఆర్ బయలుదేరాడు ఇక ఆగడు.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతా
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి ఇవ్వాలని అంటే.. ఓ కాంగ్రెస్ మంత్రి నిరోధ్లు, పాపడాలు అమ్ముకుని బతకమని అంటున్నారని కేసీఆర్ తెలిపారు. చేనేత కార్మికులు నిరోధ్లు అమ్ముకోవాలా కుక్కల కొడుకుల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో తామేమి రనౌట్ కాలేదు.. తమకంటే కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. ఆ ఒకటిన్నర శాతం ఓట్లు కూడా తులం బంగారం, ఆరు గ్యారెంటీలు, లేడీస్ కి స్కూటీలు లాంటి మీ మోసపూరిత వాగ్దానాల వల్ల వచ్చాయి అని పేర్కొన్నారు. రైతుల కోసం దేశంలో ఎవరు చేయని పనులు చేశాం.. రైతు బంధు ఇచ్చాం.. రైతు బీమా ఇచ్చామని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్లకు తోక తెలియదు తొండం తెలియదని విమర్శించారు. కాళేశ్వరం పని అయిపోయింది అన్నోళ్లు మొన్న నీటిని ఎలా పంపింగ్ చేశారని దుయ్యబట్టారు. తాము వచ్చి పనులు చేస్తుంటే మిడ్ మానేరు కట్ట కొట్టుకుపోయింది.. ఆ మిడ్ మానేరు కట్ట కట్టింది కోమటిరెడ్డి కంపెనీ… తాము కోమటిరెడ్డిని జైల్లో పెట్టకపోదుమా..? అని ప్రశ్నించారు. గోదావరిలో నీళ్లు లేక ఆరు నెలలు వ్యాప్కోస్ తో కలిసి కష్టపడి ప్రాజెక్ట్ డిజైన్ చేశామన్నారు. ఏ టైంలో నీళ్లు నిల్వ చేసి ఎత్తిపోయాలో ఆలోచించి పని చేస్తే మే నెలలో మత్తళ్ళు దూకినాయని పేర్కొన్నారు. అప్పటి ఇంజనీర్లని అడిగితే మమ్మల్ని నిరోధించారు అంటున్నారు.. పిల్లర్ల కింద ఇసుక కదిలి రెండు పిల్లర్లు కుంగినయ్ నదుల్లో ఇది సహజం అని తెలిపారు. వీళ్లకు చేతగాకపోతే 50 వేల మంది రైతుల్ని తీసుకుని వీళ్లను తొక్కుకుంటా పోయి కుర్చీ వేసుకుని కూర్చుని మేడిగడ్డ నుంచి నీటిని తెస్తామని కేసీఆర్ తెలిపారు. తాము హైదరాబాద్ సహా రాష్ట్రమంతా ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చాం నీళ్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు మళ్లీ రోడ్ల మీదికి బిందెలు వస్తున్నాయి… ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి.. ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి… మిషన్ భగీరథ తిరిగి నడపండి అని అన్నారు. వెంటనే చర్యలు చేపట్టి 25 వేలు ఎకరాకు పరిహారం ఇవ్వాలి.. 500 బోనస్ ఇవ్వాలని కోరారు. కేసీఆర్ బయలుదేరాడు ఇక ఆగడు… ఒక్క జిల్లా రెండు జిల్లాలు కాదు.. ఎక్కడ సమస్య వున్నా.. అక్కడ గద్దలాగా వాలిపోతానని తెలిపారు.
*ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయింది అనే అసహనం కేటీఆర్ లో ఉంది.. మరో వైపు చెల్లె జైల్లో ఉందని ఆరోపించారు. ట్యాపింగ్ చేశాం అని కేటీఆర్ ఒప్పుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. విచారణలో వాళ్ళ బంధువులే నిజాలు చెప్తున్నారు.. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్నాడు.. తప్పుకు శిక్ష అనుభవిస్తారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు అనే వైపు విచారణ జరగాలని మంత్రి సీతక్క కోరారు. కేసీఆర్ వచ్చాకా ఇంటలిజెన్స్, పోలీసు వ్యవస్థ అంతా ప్రతిపక్షం మీదనే ఫోకస్ అని సీతక్క ఆరోపించారు. ట్యాపింగ్ చేసిన వాటిపై కేసీఆర్ రోజు సాయంత్రం సమాచారం తెచ్చుకునే వారని.. ఫోన్ ట్యాప్ వెనకాల కేసీఆర్ కుటుంబం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆ నలుగురే బాధ్యులని.. వాస్తవాలు బయటకు వస్తున్నాయని.. పొలం బాట పట్టారు కేసీఆర్ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి బయట పడేందుకు రైతు ముసుగు వేసుకుంటున్నరని దుయ్యబట్టారు. లిక్కర్ దందా, ఫోన్ ట్యాపింగ్ నుండి బయట పడేందుకు బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ కేసు విషయంలో మాత్రం అటు అధికార.. ఇటు ప్రధాన ప్రతిపక్షాల నడుమ మాటలు యుద్ధం కొనసాగుతోంది.
*వైసీపీకి షాక్.. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ
వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింగి. అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మహమ్మద్ ఇక్బాల్ ప్రకటించారు. శాసనమండలి ఛైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఫ్యాక్స్ , మెయిల్ ద్వారా లేఖను ఇక్భాల్ పంపారు. మాజీ పోలీసు అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. హిందూపురం ఇంచార్జ్‌గా కొనసాగారు. నాలుగేళ్ల వరకూ పని చేసిన తర్వాత ఆయన స్థానంలో దీపికను ఇంచార్జ్‌గా నియమంచారు. ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
*రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి.. మళ్ళీ ప్రజలను మోసం చేయొద్దు అని సూచించారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారు.. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో మీరే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. 2023లో కూడా తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.. ఆ తర్వాత అన్ని హామీలను విస్మరించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు.. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అనేకసార్లు మాటతప్పిన మీరు, మళ్ళీ ఏ నైతిక ధైర్యంతో మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదు.. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా? ఒక్కదానినైనా అమలు చేశారా? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? అని ప్రశ్నించారు. “గత ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీల పేరుతో మహిళలు, రైతులు, పేదలకు ఇచ్చిన హామీలే కాకుండా మానిఫెస్టోలో కూడా అనేక రకాలైన హామీలను గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మాది గ్యారెంటీ అని మీరు, మీ సోదరి ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా ప్రకటించారు. మాదే గ్యారెంటీ అని, ఇదే వారంటీ అని మీరు ట్వీట్లు కూడా చేశారు”అని పేర్కొన్నారు. “మీ మాటలు నమ్మి, మీపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. రాష్ట్రంలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే సందర్భంగా కూడా ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించే పత్రంపై మీ సమక్షంలోనే సంతకాలు కూడా చేశారు. వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది. కానీ మీరిచ్చిన హామీలేవి తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని” లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని.. పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. “రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్ లోని 13వ పాయింట్ కింద ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే.. ఆ వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం చేస్తామని ఈసారి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఢిల్లీలో మీరు ఈ మ్యానిఫెస్టోను రూపొందించి విడుదల చేశారో లేదో తెలంగాణలో అందుకు భిన్నంగా జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. అలాంటి మీరు నైతికత గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు” అని విమర్శించారు. “మేనిఫెస్టోలో చెప్పిన నీతులకు, మీరు అధికారంలో ఉండి చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదు. దీంతో మీ మేనిఫేస్టోకు ఏ మాత్రం విలువ లేదని తేటతెల్లమైపోయింది. అయినా సరే, మీరు మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలంగాణకు రావడం అత్యంత దురదృష్టకరం. ప్రజలను ఎన్నిసార్లైనా సరే మోసం చేసి గెలవవచ్చు అనే మీ మొండి ధైర్యానికి నిజంగా ఆశ్చర్యం కలుగుతున్నది” అని లేఖలో ప్రస్తావించారు.
*భారతీయ విద్యార్థిని కాల్చి చంపిన కేసులో నిందితుడికి మరణశిక్ష అమలు..
22 ఏళ్ల క్రితం భారతీయ విద్యార్థిని చంపిన కేసులో దోషికి అమెరికాలో మరణశిక్ష అమలు చేశారు. ఓక్లహోమాలో భారతీయుడితో సహా ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపినందుకు 41 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన 24 ఏళ్ల భారతీయ విద్యార్థి శరత్ పుల్లూరు నిందితుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. స్టోర్ క్లర్క్‌గా పనిచేస్తున్న శరత్ పుల్లూరు, 40 ఏళ్ల జానెట్ మూర్‌లను మైఖేల్ డెవెన్ స్మిత్ హత్య చేశారు. ఈ ఘటన 2002లో జరిగింది. మెక్ అలెస్టర్‌లోని ఓక్లహోమా స్టేట్ పెనిటెన్షియరీలో గురువారం దోషి మైఖేల్ డెవెన్ స్మిత్‌కి ప్రాణాంతక ఇంజక్షన్ ద్వారా మరణశిక్ష విధించారు. ఓక్లహోమా అటార్నీ జనరల్ జెంట్నర్ డ్రమ్మాండ్ గురువారం స్మిత్ ఉరితీతపై ప్రకటన విడుదల చేశారు. ‘‘ ఈ రోజు జానెట్ మిల్లర్ మూర్, శరత్ పుల్లూరు కుటుంబాలకు శాంతి చేకూర్చాలని నేను ప్రార్థిస్తున్నాను. మైఖైల్ స్మిత్ చేతిలో హత్యకు గురైన వ్యక్తుల మంచివారు, వారు విధికి అర్హులు కాదు’’ అని అన్నారు. శరత్ పుల్లూరు చదువుకునేందుకు అమెరికా వచ్చాడు, ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉన్నాడని డ్రమ్మండ్ ప్రశంసించారు. అర్థరహిత హత్యలపై విచారం వ్యక్తం చేశారు. వారు తప్పుడు సమయంలో, తప్పుడు స్థానంలో ఉన్నందున వారు చంపబడ్డారని అన్నారు. గత నెలలో శరత్ సోదరుడు, హరీష్ పుల్లూర్ నిందితుడు స్మిత్‌కి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దని కోరారు. శరత్ మరణం తమ కుటుంబం చూపిన ప్రభావాన్ని హరీష్ కోర్టుకు వివరించారు.
*చిక్కుల్లో లాలూ.. ఆయుధాల కేసులో అరెస్ట్ వారెంట్
సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయుధాల కేసులో తాజాగా ఆయనకు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆర్జేడీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధపడుతున్న తరుణంలో లాలూకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. దాదాపుగా 30 ఏళ్ల నాటి ఆయుధాల కేసులో శుక్రవారం గ్వాలియర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇది ఆగస్ట్ 23, 1995 మరియు మే 15, 1997 మధ్య ఫారం 16 కింద ఆయుధాల సేకరణకు సంబంధించిన కేసు ఇది. ఈ కాలంలో మూడు వేర్వేరు సంస్థల నుంచి ఆయుధాలు, కాట్రిడ్జ్‌లు పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అప్పటి నాటి కేసులో ఇప్పుడు లాలూకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఆర్జేడీకి పెద్ద షాకిచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంకోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇబ్బందికరంగా మారింది. మొత్తం ఈ కేసులో 23 మంది చిక్కుకున్నారు. ఆరుగురిపై విచారణ కొనసాగుతోంది. ఇక ఈ కేసులో ఇద్దరు మరణించారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. 1998, జూలైలో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇక ఈ కేసులో లాలూ తండ్రి పేరు తప్పుగా నమోదు చేశారు. అప్పట్లో పెద్ద వివాదం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియా కూటమికి ఇది పెద్ద షాక్‌కు గానే పేర్కొనవచ్చు. ఇప్పటికే కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ, జేజేఎం పార్టీలు ఈడీ కేసుల్లో ఇరుక్కుని ఇరాకటంలో పడ్డాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టై జైల్లో ఉన్నారు. ఇరువురికి ఇంకా బెయిల్ లభించలేదు. ఈడీని అడ్డంపెట్టుకుని కేంద్రం ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇలా ఒక్కొక్కరు జైలుకెళ్లడం ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బే. ఇక గతంలోనే దాణా కుంభకోణం కేసులో లాలూకు జైలు శిక్ష పడింది. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా పడింది. లూలూ జైలు శిక్ష కూడా అనుభవించారు. తాజాగా జారీ అయిన అరెస్ట్ వారెంట్‌పై ఆర్జేడీ ఎలా పోరాటం చేస్తుందో చూడాలి.
*ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ అప్రమత్తం..
ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు గంభీరంగా ఉన్నాయి. ఇజ్రాయిల్‌పై దాడికి పరోక్షంగా హమాస్‌కి ఇరాన్ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల సిరియాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు జనరల్స్‌తో పాటు 13 మంది మరణించారు. ఈ దాడికి ఇరాన్ ప్రతీకార దాడులు జరుపుతుందనే అనుమానంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ సామర్థ్యాన్ని ఇజ్రాయిల్ విస్తరించింది. పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం ఏప్రిల్ 5 తర్వాత ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ భావిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో బాంబు షెల్టర్లను తెరవడం ప్రారంభించింది. జీపీఎస్ నావిగేషన్ సేవల్ని నిలిపేస్తున్నారు. సైనికులకు సెలవుల్ని రద్దు చేసింది, వైమానిక రక్షణ కమాండ్‌ని విస్తరించింది. మరోవైపు పాలస్తీనియన్లకు మద్దతు తెలిపేందుకు ఇరాన్ ఈ రోజును ‘జెరూసలేం డే’గా పాటిస్తోంది. సిరియా రాజధానిలోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై వైమానిక దాడిలో ఇరానియన్ కుడ్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ మహ్మద్ రెజా జహేదీ మరనించారు. ఇరాన్ అత్యున్నత మిలిటీరీ అధికారి చనిపోవడంతో ఆ దేశం ఇజ్రాయిల్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2020లో యూఎస్ డ్రోన్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించారు. ఈ దాడి తర్వాత రెజా జహేదీ మరణం అత్యున్నత స్థాయి హత్యగా పరిగణించబడుతోంది. ఇరాన్ ఇప్పటి వరకు నేరుగా ఇజ్రాయిల్‌పై దాడి చేయకుండా దూరంగా ఉంది. ఇటీవల జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడి పరిస్థితుల్ని మరింత సంక్షోభంలోకి నెట్టాయి. తప్పకుండా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతుందనే అనుమానంతో ఇజ్రాయిల్ అధికారులు జీపీఎస్ జామింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాధ్యమైన గైడెడ్ క్షిపణులను, డ్రోన్ల దాడులను నిరోధించేందుకు జీపీఎస్ నావిగేషన్ సేవలను కట్ ఆఫ్ చేశారు. ఇజ్రాయిల్ తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసింది. ముందు జాగ్రత్తగా టెల్ అవీవ్‌లో బాంబు షెల్టర్‌లను తెరిచింది.