సీఎం రమేష్‌ను కడపకు పార్సిల్ చేసేందుకు నన్ను పెట్టారు.. డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి.. తమ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు అభ్యర్థులు.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ.. ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తున్నారు.. అయితే, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగనున్న సీఎం రమేష్‌పై హాట్ కామెంట్లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ ను కడపకు పార్సిల్ చేయడానికే నన్ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు.. స్థానికేతరులను, డబ్బు సంచులు తెచ్చే అభ్యర్థులను.. అనకాపల్లి ఓటర్లు చిత్తుచిత్తుగా ఓడిస్తారని తెలిపారు. నిన్నటి వరకు సీఎం రమేష్ కు అనకాపల్లి ఎక్కడుందో తెలియదు.. ఆ అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇక, సీఎం రమేష్ రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారస్తుడు.. పదవిని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించడమే అతని పని అంటూ ఆరోపణలు గుప్పించారు ఏపీ డిప్యూటీ సీఎం, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు.
ఇది చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం..
ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. వైసీపీకి ఓటువేసి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా.. అందులో భాగంగా పూతలపట్టులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. నిజం ఒకవైపు అబద్ధం ఒకవైపు ఉంది.. మంచి ఓవైపునా చెడు మరోవైపునా ఉంది.. ధర్మం ఒకవైపు.. అధర్మం మరోవైపు ఉన్నాయి.. మూడుసార్లు అధికారం ఉండి మోసం, అన్యాయం, చెడు, చీకటి ప్రజల రిటన్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. ఇది చంద్రబాబుకు.. రాష్ట్ర ప్రజలకు మధ్య జరుగుతోన్న యుద్ధం.. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు సీఎం జగన్.. చంద్రబాబు సహా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసినా పార్టీ, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీతో పాటు దత్తపుత్రుడు కలసి వైఎస్ జగన్ మీదా పోటికి వస్తున్నారని హెచ్చరించారు సీఎం జగన్.. చంద్రబాబు చేసినా అభివృద్ధి ఏంటి? జగన్ చేసిన అభివృద్ధి ఎంటో తెలుసుకొని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మీమీ బ్యాంకు స్టేట్‌మెంట్ ఒకసారి చూసుకొండి.. ఎవరు ఎక్కవగా డబ్బులు వేశారు చూసుకోండి.. ఎవరి వల్ల ఎక్కువ లబ్ధి పొందారో చూసుకుని ఓటు వేయండి అని సూచించారు. ఇక, ఇంటికి వెళ్ళి పెన్షన్ లు ఇచ్చే వాలంటీర్లను పధకం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ తో లేకుండా చేయాలని చూశాడని విమర్శించారు. చంద్రబాబు మనిషి కాదు ఒక శాడిస్టు అంటూ మండిపడ్డారు. మళ్లీ జగన్ గెలిస్తేనే నేరుగా మీఇంటికి పథకాలు వస్తాయన్నారు సీఎం వైఎస్ జగన్.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు.. వారికి దూరంగా ఉండండి..!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. పేద ప్రజల మనసు ఎరిగిన జగన్మోహన్ రెడ్డి పాలనతోనే వారికి న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని అన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలోని రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు కాపులను అనగదొక్కాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి అక్కున చేర్చుకున్నారని అన్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో కాపుల ద్రోహి పవన్ కల్యాణ్‌తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు ఓడిపోక తప్పదని ధీమా వ్యక్తం చేశారు ముద్రగడ.. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేసాడని విరుచుకుపడ్డారు. పవన్ బుద్ధిలేని పనులు చేస్తున్నాడని, ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. దుమ్ము పడకూడదు, దూళిపడకూడదు, నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. చంద్రబాబు, పవన్ వంటి నీచ రాజకీయ నాయకులను ప్రజలు నమ్మరని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పి పేదల మనిషి జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కడతారని అన్నారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.
పశుపతి అంటే పరమశివుడు.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తా..
పశుపతి అంటే పరమశివుడు.. మానవాళి కోసం గరళాన్ని మింగిన శివుడిలా.. ప్రజల కోసం నేను శివుడి అవతారమెత్తాను అంటూ.. సీఎం వైఎస్ జగన్ తనను పశుపతి అంటూ చేసిన కామెంట్‌కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కొత్తపేటలో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. పశుపతి అంటూ నన్ను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడడం చూసి నవ్వుకున్నా. ఎందుకంటే.. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడేందుకు వచ్చిన పరమశివుడు. గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళిని కాపాడాడు. అదే విధంగా నాపై ఎన్నో రకాల దాడులు చేశారు. అవహేళనలు చేశారు. అటు పవన్ కల్యాణ్ పై కూడా నిందలేశారు. మేం అన్ని రకాల అవమానాలను భరించాం. ఒకే నిబద్దత, ఒకే ఆలోచనతో నిలబడ్డాం. తెలుగుజాతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని రకాల దాడుల్ని ఎదుర్కొన్నాం. దాడులు ఎదుర్కోవడమే కాదు.. బుల్లెట్ మాదిరిగా దూసుకెళ్తాం అన్నారు. రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు. ఎక్కడ చూసినా అదే స్పందన. గెలుపు మనదేనన్న ధీమా కళ్ల ముందు కనిపిస్తోంది. నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తున్నాం అన్నారు చంద్రబాబు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎదురు చూసినట్లు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రెండు బటన్లు నొక్కి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే కోనసీమలో ఎప్పుడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసింది ప్రజల కోసమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుండి ఒకే మాటపై నిలబడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగా పడ్డ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టడం కోసమే బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నాం అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై జూపల్లి ఫైర్
మాజీ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. నవ్వితే నాలుగేళ్లు అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ ప్రగతి భవన్‌లో, ఫాంహౌస్‌లో పడుకున్నారని.. తమ ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజల కోసమే పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడునెలలు అయ్యిందని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామన్నారు. మీకు చేతకాక మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు, హరీష్‌కు నైతికత లేదు.. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడొద్దు, నిజాయితీగా మాట్లాడాలన్నారు. 12 సార్లు కాదు 30 సార్లు ఢిల్లీకి వెళ్తామని.. మా నాయకుడిని కలుస్తామని ఆయన అన్నారు. రైతుల గురించి బీఆర్‌ఎస్ నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. రాష్ట్రంలోని ఏ చౌరస్తాకు అయినా వస్తామని, గడిచిన పదేళ్లలో రైతులకు మీరు ఇచ్చిన వాటిపై చర్చిద్దామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాం..
రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, డా. సుఖ్ బీర్ సింగ్ సంధులతో కలసి నేడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, డీజీపీ రవీ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతియుతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివరించారు. రాష్ట్రంలో మొత్తం మీద శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, భూపాల పల్లి, ములుగు జిల్లాలపై, పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్‌తో సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు, తెలంగాణకు 860 కిలోమీటర్ల నాలుగు రాష్ట్రాల సరిహద్దు ఉందని, 154 చెక్ పోస్టులు తెరిచామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా శాఖలు సరిహద్దు రాష్ట్రాలతో కోఆర్డినేషన్ సమావేశాలను నిర్వహించాయని పేర్కొన్నారు.
మళ్లీ అధికారం బీజేపీదే.. ఎన్డీఏకి 399 స్థానాలు..
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తిరుగులేదని మరో సర్వే తేల్చి చెప్పింది. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్‌లో మొత్తం 543 ఎంపీ స్థానాలకు గానూ ఎన్డీఏ ఏకంగా 399 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బీజేపీకి సింగిల్‌గా 342 సీట్లు వస్తాయని తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి (తృణమూల్ కాంగ్రెస్ మినహాయించి) 94 స్థానాలను గెలుచుకుంటుందని, టీఎంసీ, వైఎస్సార్సీపీ, బీజేపీ, స్వతంత్రులు కలిసి 50 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. ఒపీనియన్ పోల్‌కి సంబంధించి మార్చి 1 నుంచి మార్చి 30 వరకు 543 ఎంపీ స్థానాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించింది. మొత్తం 1,79,190 మంది అభిప్రాయాలను సేకరించగా.. వీరిలో 91,100 మంది పురుషులు మరియు 88,090 మంది మహిళలు ఉన్నారు.
తీహార్ జైలు నుంచి సంజయ్ సింగ్ విడుదల.. భారీగా స్వాగతం
తీహార్ జైలు నుంచి ఆప్ లీడర్, ఎంపీ సంజయ్ సింగ్ విడుదలయ్యారు. బుధవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు సంజయ్ సింగ్‌కు స్వాగతం పలికేందుకు జైలు దగ్గరకు పెద్ద ఎత్తున ఆప్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే సంజయ్ సింగ్ కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం నినాదాలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 6 నెలల పాటు సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ట్రయిల్ కోర్టుకు కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఇదే జైల్లో ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక లిక్కర్ కేసులో ఇటీవలే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఉంది. గురువారం తీర్పు రానుంది.
రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ కీలక నిర్ణయం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు రెండేళ్లు గడుస్తుంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. భీకరమైన యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ రంగంలోకి యువ రక్తాన్ని నింపాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది. రెండేళ్ల నుంచి రష్యాతో ఉక్రెయిన్ పోరాడుతోంది. దీంతో సైనిక, ఆర్థిక నష్టాలను తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కోల్పోయిన సైనిక శక్తిని భర్తీ చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నిర్బంధ వయసును 27 నుంచి 25కు తగ్గించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని అక్కడి పార్లమెంటు గత ఏడాదే ఆమోదించింది. తాజాగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేయడంతో అమల్లోకి వచ్చింది. 5 లక్షల మంది సైనికులను సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు మూడు నెలల క్రితమే జెలెన్‌స్కీ తెలిపారు. ఈ సైనిక సమీకరణ అంశంపై గతేడాది అక్కడి పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే దీనికి ఆమోదం తెలిపేందుకు జెలెన్‌స్కీ ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. అంతేకాకుండా తాజా నిర్ణయం ద్వారా కొత్తగా ఎంతమంది ఉక్రెయిన్ సైన్యంలోకి వస్తారనే విషయంపై సైనికాధికారులు, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేదు.
షాకింగ్: విడాకులు తీసుకున్న పవన్ ‘బ్రో’ సినిమాటోగ్రఫర్.. నటికి గుడ్ బై!
ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన అనేక జంటలు వివాదాల కారణంగా విడాకులు తీసుకుంటూ ఉండగా ఇప్పుడు అలాంటి ఒక అంశం తెర మీదకు వచ్చింది. మలయాళ నటి మంజు పిళ్లై, అలాగే ఆమె భర్త, తెలుగులో నాలుగు సినిమాలు చేసిన సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుజిత్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2020లోనే మంజు నుంచి విడిపోయానని, ఈ మధ్య విడాకుల కూడా ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పాడు. అయితే మంజు ఇప్పటికీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అని సుజిత్ చెబుతన్నారు. ‘‘2020 నుంచి విడివిడిగా జీవిస్తున్నాం, మేము గత నెలలో విడాకులు తీసుకున్నాము. ఇప్పుడు నేను మంజుని స్నేహితురాలు అని పిలవాలనుకుంటున్నాను ఎందుకంటే మా స్నేహం ఇప్పటికీ ఉందని అన్నారు.
చిన్నప్పటి నయనతారని చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో?
నయనతార తన తండ్రి కురియన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే నయనతార తన చిన్న వయస్సులో తన తండ్రి ఎత్తుకుని ఉన్న పిక్ షేర్ చేసింది. “నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు, మై ఫరెవర్ లవ్, ఐ లవ్యూ అచ్చా(నాన్న) అని అంటూ నయనతార పిక్ తో క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇక నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అలాగే వారి పిల్లలు కురియన్ పుట్టినరోజును జరుపుకోవడానికి కొచ్చి చేరుకున్నారు. ఉయిర్, ఉలక తమ తాత కోసం మూడు ప్రత్యేక పుట్టినరోజు కేక్‌లతో వచ్చారని చెబుతున్నారు. చిన్నారులు తమ వేళ్లతో కేకులను పొడుస్తున్న వీడియోను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే డాడ్, మిస్టర్ కురియన్’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశాడు విఘ్నేష్. మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి నయనతార చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి. ‘‘నేను మా నాన్న, అమ్మ, కుటుంబం, ఎప్పుడూ మాట్లాడలేదు, నేను కుటుంబం – పని రెండింటినీ వేరుగా ఉంచడానికి ఇష్టపడే వ్యక్తినని చెప్పుకొచ్చింది. మా నాన్నను ఎప్పుడూ హీరోగానే చూశా, ఈ రోజు నా జీవితంలో ఒక ఆర్డర్ ఉంటే, పని చేయాలనే కోరిక ఉంటే, సమయపాలన ఉంటే, ప్రతిదీ మా నాన్న నుండి వారసత్వంగా వచ్చిందని అన్నారు. పని పరంగానే కాదు, నన్ను నేనుగా మార్చుకోవడంలో కూడా ఆయన నుంచే నేర్చుకున్నా అని ఆమె అన్నారు. నాన్న పనిలో ప్రభావవంతంగా ఉంటాడు, నేను ఎప్పుడూ మా నాన్నను చాలా పర్ఫెక్ట్‌గా చూశాను. అంతరాయం లేకుండా యూనిఫారంలో పని చేయడానికి మా నాన్నగారు వెళ్లి రావడం నాకు గుర్తుంది, అతని గురించి మంచి విషయాలు మాత్రమే విన్నాను అని ఆమె చెప్పుకొచ్చారు.