*పేదలకు మేలు చేశానని అనిపిస్తేనే ఓటు వేయండి..
రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్లు మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని.. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ మోసపోవడమేనని ఆరోపించారు. చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనన్నారు. ఎన్నికలు వస్తున్నాయని మన రాష్ట్రానికి వచ్చిన నాయకులని చూస్తే సుమతీ శతకం పద్యాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఎన్నికల కోసం ఇక్కడకు వచ్చిన నేతలు.. ఓడితే తిరిగి ఎక్కడకు వెళ్తారో అందరికీ తెలుసన్నారు. ఈ నాన్ లోకల్ కిట్టీ పార్టీ సభ్యులకు.. ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు రాష్ట్రాన్ని దోచుకోవడమే పని అని విమర్శలు గుప్పించారు. నేను చంద్రబాబు లాగా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని బడాయిలు చెప్పడం లేదని.. గత ఐదేళ్లలో కొత్తగా ఐదారు వ్యవస్థలు తీసుకు వచ్చి మీకు చూపించగలిగానన్నారు. ప్రతీ పేద ఇంటికి వెళ్లి అందించే పౌర సేవలు.. నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడులు.. ప్రతీ గ్రామంలో విలేజ్ క్లినిక్ లు.. ఆర్బీకే.. మహిళా పోలీస్.. డిజిటల్ లైబ్రరీ.. మీ కళ్ళ ముందే ఈ వ్యవస్థలు కొనసాగాలంటే నాకు మన పార్టీకి ఓటు వేయాలని సూచించారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అమ్మఒడి.. మీ పిల్లలకు మరో ఐదేళ్లు చదివించాలని మీకు ఉంటే మమ్మల్ని ఆదరించాలని ప్రజలను కోరారు. పేదలకు మేలు చేశానని మీకు అనిపిస్తేనే ఓటు వేయాలని కోరారు. అక్కాచెల్లెమ్మల బాగోగుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని.. ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇక మీదట ఈ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి మీ బిడ్డకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు మార్కు దోపిడీ సామ్రాజ్యం.. జన్మభూమి కమిటీ మాదిరి దోపిడీ లేకుండా ఉండాలంటే వైసీపీకి ఓటు వేయాలన్నారు. లంచాలు, అవినీతి లేని సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని సీఎం తెలిపారు. కూటమికి ఓటు వేస్తే డీబీటీ లో దత్తపుత్రుడికి, వదినమ్మకు ప్యాకేజీలు వెళ్తాయని ఎద్దేవా చేశారు. ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్.. అప్పుడు కూడా ఇవే డబ్బుతో మీకు ఎలా పంపించగలిగానో ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు మోసాలకు, ప్రలోభాలకు లొంగి మోసపోవద్దని సూచించారు. 2014లో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఇదే కూటమి ప్రతీ ఇంటికి పంపిన పాంప్లీట్ అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా వారు నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. “అప్పుడు హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ అన్నారు.. చేశారా.. చంద్రబాబు రద్దు చేస్తామన్న పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతున్నా.. ఆడబిడ్డ పుట్టగానే 25 వేలు డిపాజిట్ చేస్తామన్నారు.. చేశారా.. ఇంటింటికి ఉద్యోగం.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని అడుగుతున్నా.. అర్హులకు మూడు సెంట్ల స్థలం.. కట్టుకునేందుకు పక్కా ఇళ్లు కట్టించారా.. పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నారు.. చేశారా?” అని సీఎం జగన్ ప్రశ్నించారు.
*రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వచ్చే నెల అనగా మే 1నే పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ చేయాలని పేర్కొంది. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉండగా.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్లు లేనివారు, దివ్యాంగులు, రోగులకు మే 5 లోపు ఇంటివద్దే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. కాగా.. ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ నుంచి పక్కన పెట్టిన ఈసీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విధివిధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు.
*పార్టీ లైన్‌లో గతంలో సీఎం జగన్‌పై విమర్శలు చేశా: కేశినేని నాని
జగన్‌ను, వైసీపీని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు. పాలసీ పరంగానే విమర్శలు చేశానన్నారు. విజయవాడ అభివృద్ధి నా అజెండా అని ఆయన పేర్కొన్నారు. జగన్ ఆర్థిక నేరస్థుడని చంద్రబాబే మాకు నూరిపోశారని కేశినేని నాని తెలిపారు. పార్టీ లైన్‌లోనే గతంలో సీఎం జగన్‌పై విమర్శలు చేశానన్నారు. 2014 -19 మధ్య చంద్రబాబు పాలనలో అనేక తప్పులు జరిగాయన్నారు. జగన్‌ను విమర్శించే ముందు చంద్రబాబు.. ఆయన చేసిన తప్పులు కూడా చూసుకోవాలన్నారు. ఈగోతో టీడీపీ నుంచి బయటకు రాలేదన్నారు. ఈగో ఉంటే వ్యాపారాన్ని మూయించినప్పుడు బయటకు వచ్చేవాడినన్నారు. చంద్రబాబు లోకేష్ నన్ను చాలా అవమానించారన్నారు. గత పదేళ్లుగా ఆవేదన ఉందని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోలేదన్నారు. చంద్రబాబుతో ఉన్నంతవరకు ఆయన బాగుండాలనే కోరుకున్నానన్నారు. జైలుకు వెళ్లినప్పుడు ఎమోషనల్ అయ్యానని.. అందుకే పూజలు చేయించానని తెలిపారు. కేశినేని ట్రావెల్స్ మూసివేతకు కారణం లోకేషే అంటూ కేశినేని నాని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్నో జరిగాయి.. అవన్నీ చెప్పలేనన్నారు. టికెట్లు ఇప్పిస్తానని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదన్నారు. తాను చెప్పిన వాళ్లలో ఒక్కరికి కూడా చంద్రబాబు పదవులు ఇవ్వలేదని కేశినేని నాని వెల్లడించారు. టికెట్ ఇస్తానని ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఎవరినో విమర్శించమని జగన్ తనకు చెప్పలేదన్నారు. నాకు నష్టం జరిగింది కాబట్టి విమర్శిస్తున్నానని చెప్పారు. బూతులు ఎవరు ఎక్కువ తిడితే టీడీపీలో వారికే పదవులు అని ఆయన విమర్శించారు. టీడీపీ నుంచి బయటకు వచ్చా బాగా తిట్టించారని.. నా కూతురు శ్వేతపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడించారన్నారు. వైసీపీకి ఏ విషయాలు చేరవేశానో చెప్పమనండని ఆయన అడిగారు. కేశినేని ట్రావెల్స్‌ను అర్ధాంతరంగా మార్చడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డానన్నారు. ఆస్తులు అమ్మి అప్పులు కట్టానన్నారు. ఎవరి దగ్గరా అప్పు తీసుకుని ఎగ్గొట్టలేదన్నారు. విజయవాడ అభివృద్ధి జరగాలంటే తానే ఎంపీ కావాలన్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే నా కూతురిని మేయర్‌గా నిలబెట్టానన్నారు.
*కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే.. హైదరాబాద్కు ఆ ప్రమాదముంది..!
కరీంనగర్ జిల్లా ఆలుగునూర్లో మానకొండూర్ నియోజకవర్గ బూత్ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే జూన్ 2 తరువాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రమాదముందని తెలిపారు. మాకు మూడో వంతు మెజారిటీ ఇవ్వండి రిజర్వేషన్లు ఎత్తేస్తం అని బీజేపీ వాళ్ళు అంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా పని చేసిన బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. బండి సంజయ్కు సవాల్ చేస్తున్నా.. ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బడా భాయి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని కేటీఆర్ ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చోటా భాయ్ రేవంత్ రెడ్డి కూడా అలాగే అబద్ధపు ప్రచారాలు చేశారన్నారు. ఆలుగునూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గుర్తుపట్టరని విమర్శించారు. ఓ డమ్మీ అభ్యర్థిని తీసుకువచ్చి కరీంనగర్ లో పోటీలో పెట్టారు.. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందని కేటీఆర్ తెలిపారు. రాముని పేరు చెప్పుకొని బీజేపీ నాయకులు బండి సంజయ్ ఓట్లు అడుగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న పేద ప్రజలను నమ్మించి మోసం చేశారు మోడీ.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కరోనా సమయంలో తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాల వెళ్ళే కూలీలకు ఫ్రీగా రైళ్లు వేయాలని విజ్ఞప్తి చేస్తే మోడీ పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే.. ఈడీ, సీబీఐ దాడులు అక్రమ కేసులు పెడుతారని ఆరోపించారు. నరేంద్ర మోడీని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే రాహుల్ గాంధీ మాట్లాడేది ఒకటి.. రేవంత్ రెడ్డి మరొకటన్నారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలిస్తే.. మళ్లీ సంవత్సరం లోపే కేసీఆర్ మళ్ళీ దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతారని కేటీఆర్ చెప్పారు.
*కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే..! హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ వాళ్లు గజగజ వణుకుతున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి మోడీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడని తెలిపారు. నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలనలో తిట్లు లేకపోతే దేవుని మీద ఒట్టు అని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని తాను చెప్పానని.. అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మంటే తోక ముడిచి రేవంత్ రాలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అవుతుందని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచారని వ్యాఖ్యానించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ కి నమ్మి ఓటేస్తే నీళ్లు లేని బావిలో దూకినట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు గ్రామాల్లో ప్రచారానికి వస్తే తరిమికొట్టండని సూచించారు. వడ్లలో తరుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లలో తరుగు పెట్టాలన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బావి దగ్గర 24 గంటల కరెంట్ వస్తే, కాంగ్రెస్ వచ్చాక 14 గంటలు వస్తుందని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయన్నారు. పదేళ్లు ఢిల్లీలో ఉన్న బీజేపీ తెలంగాణకి ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగాయని ఆరోపించారు. 4 వేల పెన్షన్ వచ్చినోళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. రానోళ్లు బీఆర్ఎస్ కి ఓటెయ్యండని అన్నారు. మహాలక్ష్మి పథకం అని మహిళల్ని మోసం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.
*నేహ మర్డర్‌పై స్పందించిన ప్రధాని.. ఓట్ బ్యాంక్ రాజకీయాలని కాంగ్రెస్‌పై ఫైర్..
ఇటీవల కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్(22) కాలేజ్ క్యాంపస్‌లో దారుణహత్యకు గురైంది. ఫయాజ్ అనే నిందితుడు కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేశాడు. ఈ హత్య కర్ణాటకలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఈ హత్య జరిగిందని బీజేపీ ఆరోపించింది. అంతేకాకుండా ఈ కేసులో లవ్ జిహాద్ కోణం ఉందని ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ మాత్రం ఇది వ్యక్తిగత విషయాల వల్ల జరిగిందని, దీంట్లో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పింది. ఇదిలా ఉంటే, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నేహా హత్యపై స్పందించారు. ‘‘రాష్ట్రంలో ఓ కూతురికి ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందింది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళకరంగా ఉంది. కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ చేసిన పాపాల వల్లే ఓ కాలేజ్ క్యాంపస్‌లో ఎవరినైనా హత్య చేసే దమ్ము, ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే వచ్చాయని, తమను కొద్దిరోజుల్లో రక్షిస్తారని వారికి తెలుసు’’ అని మోడీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉందని, నేరాలను నియంత్రించడానికి బదులు, కాంగ్రెస్ దేశవ్యతిరేక ఆలోచన ధోరణిని ప్రోత్సహిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్ని కాంగ్రెస్ బహిష్కరించడాన్ని ప్రధాని దుయ్యబట్టారు. ఓటు బ్యాంక్ ఆకలితో ఉన్నవారు రామ మందిర ఆహ్మానాన్ని తిరస్కరించారు. మరోవైపు అన్సారీ కుటుంబం మూడు దశాబ్దాలుగా రామాలయం కేసుపై పోరాడింది, సుప్రీంకోర్టు తర్వాత ఆయనను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తే, అతను కూడా ప్రాణప్రతిష్టకు హాజరయ్యారని ప్రధాని చెప్పారు.
*బీజేపీ రిజర్వేషన్లను తొలగించదు.. ఇది మోడీ గ్యారెంటీ..
రిజర్వేషన్లను తొలగించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇది మోడీ హామీ అని చెప్పారు. ఎస్సీ/ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ‘‘అబ్కీ బార్ 400 పార్’’ అని పిలుపునిస్తోందని, ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల తరుపున ఆదివారం ఆయన ప్రచారం చేశారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే తమకు రెండు పర్యాయాలు పూర్తి మెజారిటీ ఉందని అయినా కూడా రిజర్వేషన్లను తాము ముట్టుకోలేదని, పీఎం మోడీ రిజర్వేషన్లకు మద్దతుగా ఉన్నారని, ఎలాంటి రిజర్వేషన్లు తొలగించమని మోడీ హామీ ఇస్తున్నారని అమిత్ షా అన్నారు. కరసేవకులను చంపిన వారికి, రామ మందిరాన్ని నిర్మించినవారిని ప్రజలు ఎంచుకోవాలని కోరారు. రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకాకపోవడాన్ని అమిత్ షా ప్రస్తావించారు. కాంగ్రెస్, రాహుల్ బాబా, అఖిలేష్ యాదవ్ పార్టీ 70 ఏళ్లకు పైగా రామాలయాన్ని అడ్డుకుందని, మీరు మోడీని రెండోసారి ప్రధానిని చేశారు, అయోధ్య రామ మందిరం నిర్మితమైందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్ పురిలో ఆయన బీజేపీ అభ్యర్థి జైవీర్ సింగ్ ఠాకూర్ కోసం ప్రచారం చేశారు. ‘‘ అఖిలేష్ జీ, డింపుల్ జీ ఎవరి భయం వల్ల మీరు రామ మందిరా శంకుస్థాపనకు వెళ్లలేదు?? ప్రజలు వెళ్లడం లేదా..?తమ ఓటు బ్యాంకు పోతుందనే భయంతో సమాజ్‌వాదీ పార్టీ నేతలు వేడుకలకు హాజరు కాలేదు’’ అని అమిత్ షా దుయ్యబట్టారు. కానీ బీజేపీ ఓటు బ్యాంకులకు భయపడటం లేదు, శ్రీరాముడు జన్మించిన చోట మేం ఆలయాన్ని నిర్మించామని అన్నారు. ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని ఎవరని ప్రశ్నించారు. 23 ఏళ్లుగా ముఖ్యమంత్రి, 10 ఏళ్లు ప్రధానిగా, ఎలాంటి ఆరోపణలు లేని నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నారని అన్నారు. ఒక వైపు వేసవిలో థాయ్‌లాండ్ విహారయాత్రలకు వెళ్లే రాహుల్ గాంధీ ఉన్నారని అమిత్ షా అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ప్రతిపక్షాలు తమ ఓటు బ్యాంకు కోసమే పరిరక్షిస్తున్నాయని ఆరోపించాయని అన్నారు. పేదలకు ఉచిత రేషన్ మరియు ఇళ్లతో సహా బిజెపి ప్రభుత్వ పథకాలను గురించి చెప్పిన షా, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఉచిత రేషన్ పథకం 2029 వరకు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
*ఉన్నావ్‌లో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు-ట్రక్కు ఢీ, ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో బంగార్మావు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సఫీపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, ట్రక్కు డ్రైవర్ కూడా ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు సయ్యద్ వాడా సఫీపూర్ నివాసి ఇంతియాజ్ ఖాన్ అలియాస్ లాడ్లీ (70), లుకయ్య బేగం (25), సుశీల (30)గా గుర్తించారు. మరో ముగ్గురిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాయపడిన వారిలో.. గంజ్మురాదాబాద్ నివాసి సోను, ముండా ఫతేపూర్ చౌరాసి నివాసి వందన, సికర్హానా పోలీస్ స్టేషన్ నివాసి తడియాన్వా హర్దోయ్ నరేంద్ర పాల్, మౌ పోలీస్ స్టేషన్ నివాసి సుకేష్, రోషన్ నగర్ కాన్పూర్ నివాసి తరన్నుమ్, మచారియా కాన్పూర్ నివాసి నయీమ్, ఆశారామ్ పాల్ నివాసి సికర్హానా పోలీస్ స్టేషన్‌కు చెందిన మడియాన్వా జిల్లా హర్దోయ్ మరియు శీతల్‌గంజ్ మార్కెట్‌కు చెందిన అనీష్ ఉన్నారు. అంతేకాకుండా.. గాయపడిన వారిలో మృతురాలు లుకయ్య బేగం ఎనిమిదేళ్ల కుమారుడు హస్నైన్ కూడా ఉన్నారు.
*ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. బెంగళూరు ఘన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 24 బంతుల్లో ఉండగానే గెలుపొందింది. గుజరాత్ భారీ స్కోరు చేసినప్పటికీ.. ఆర్సీబీ బ్యాటర్లు విల్ జాక్స్ (100*) సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆర్సీబీ విజయం నమోదు చేసుకుంది. అతని ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అంతకుముందు.. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (70*), డుప్లెసిస్ (24) పరుగులతో రాణించారు. ఈ ఇన్నింగ్స్ లో గుజరాత్ బౌలర్లకు విల్ జాక్స్, విరాట్ కోహ్లీ ఊచకోత చూపించారు. 10 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీకి ఇది 3వ విజయం. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. మరోవైపు.. అటు గుజరాత్ బౌలింగ్ లో కేవలం సాయి కిషోర్ ఒక్కడే ఒక్క వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (84*) పరుగులతో రాణించాడు. షారూఖ్ ఖాన్ (58), డేవిడ్ మిల్లర్ (26*), గిల్ (16), సాహా (5) పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 200 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.