జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తుంది..
జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.. శ్రీకాకుళం జిల్లాలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 58 నెలలో 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం.. మీకు మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు సైన్యంలా నిలవండి అని కోరారు. అనేక కుట్రలకు చంద్రబాబు దిగజారుతున్నాడు.. ఎలాంటి మార్పులు తీసుకోచ్చామో.. కనీసం, ఆత్మ విమర్శ చేసుకున్నారా చంద్రబాబు? అని ప్రశ్నించారు. దోచుకోవడానికి… పంచుకోవడానికి అధికారం కావలట.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా.. ఆయన చేసిన ఓక్క మంచైనా గుర్తుకు వస్తుందా? అని నిలదీశారు.
వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
వాలంటీర్ల రాజీనామాతో మాకు సంబంధం లేదని హైకోర్టుకు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం.. ఇప్పటి వరకు 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు కోర్టుకు తెలిపిన ఈసీ.. 900 మందికి పైగా వాలంటీర్ల మీద చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.. ప్రభుత్వంలో ఉంటే వాలంటీర్ల మీద చర్యలు తీసుకుంటామని రాజీనామా చేసిన వారి విషయంలో మేమే సర్క్యులర్ ఎలా ఇవ్వగలమని కోర్టుకు చెప్పింది.. వాలంటీర్ల రాజీనామా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం.. అసలు ఎన్నికల కమిషన్‌కి ఏం సంబంధమని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఈసీ.. అయతే, రాష్ట్రంలోని 66 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేస్తే.. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తమకి సంబంధలేదని అనటం సరికాదని హైకోర్టులో వాదనలు వినిపించారు పిటిషనర్.. వేల సంఖ్యలో రాజీనామాలు ఎన్నికల సమయంలో జరిగితే దానిపై ఈసీ దృష్టి సారించింది చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రూల్స్ లో ఉందని వాదనలు వినిపించారు.. దీంతో, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. కాగా, వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని.. ఈ నేపథ్యంలో వారి రాజీనామాలు ఆమోదించవద్దని ఆదేశించాలంటూ.. బీసీ యువజనపార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
చిరంజీవిని నేను ఏమీ అనలేదు.. పవన్ కల్యాణ్,చంద్రబాబుకు సంస్కారం లేదు..!
చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అయితే, చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే.. కానీ, ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పానన్నారు. చిరంజీవిని నేను విమర్శించా అని చెప్పడం ద్వారా కొంత మందిని అయిన దగ్గర చేసుకోవచ్చు అని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారు.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారని మండిపడ్డారు. వాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన, టీడీపీకి సాగిల పడ్డాయన్న ఆయన.. ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయని బీజేపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. ఓడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక, డ్వాక్రా మహిళల గురించి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తూనే నవ్వొస్తుందన్నారు సజ్జల.. డ్వాక్రా మహిళలను మోసం చేసింది చంద్రబాబే.. రుణమాఫీలు చేస్తా అని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే.. అసలు పవన్ కల్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు తమ్ముడు రాముర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.? చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసులను స్పందించకపోగా.. బెదిరింపు దొరనికి దిగుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు చదివి వినిపించాలని అనుకున్న సిగ్గేస్తుంది. ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు. ఓటమి భయంతో నోటికి ఏదివస్తే అదే మాట్లాడుతున్నారన్నారు.
ముగిసిన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. 86 నియోజకవర్గాల మీదుగా సాగి..
రెండోసారి అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగిసింది. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. ఇవాళ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరంలో ఎండ్ అయింది. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర సాగింది. మొత్తం 86 నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్… ఇప్పటివరకు 16 బహిరంగసభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9చోట్ల భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. సిద్ధం సభలు జరగని జిల్లాలను టార్గెట్ చేసి.. ఈ యాత్ర షెడ్యూల్ ఫిక్స్ చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, మార్చి 10న ప్రకాశం జిల్లా మేదరమెట్లలో చివరిదైన నాలుగో సిద్ధం సభ నిర్వహించారు. ఆ సభలు జరగని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లారు జగన్. మార్చి 27న కడప జిల్లా ప్రొద్దుటూరులో బహిరంగ సభ జరిగింది. తర్వాత రోజు నద్యాలలో, ఆ తర్వాతి రోజు ఎమ్మిగనూరులో సభ నిర్వహించారు. రంజాన్ సందర్భంగా అనంతపురం జిల్లా కదిరిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు జగన్. ఉదయం వివిధ వర్గాలతో సమావేశాలు, తర్వాత బస్సుయాత్ర, సాయంత్రం బహిరంగ సభ.. ఇలా క్రమం తప్పకుండా ఓ పద్ధతి ప్రకారం జరిగింది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రతి జిల్లాలోనూ భారీగా జనస్పందన వచ్చింది. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే భేదం లేదు. ఎక్కడ బస్సుయాత్ర జరిగినా.. జగన్ కోసం జనం తరలివచ్చారు. ప్రతీ సభలో జగన్ ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేమంతా సిద్ధం యాత్రలో ప్రజలతో జగన్ కలసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బస దగ్గరికి వచ్చిన వారందరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్న తరువాతే ఆరోజు యాత్రను మొదలుపెట్టేవారు జగన్. ఇలా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు యాత్ర సాగించారు జగన్. ఇప్పుడు మూడో విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
రేపే వైఎస్ జగన్ నామినేషన్.. ముహూర్తం ఇదే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు జగన్. మూడో విడత ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ లోపు తన నియోజకవర్గం పులివెందులలో రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఇప్పటికే జగన్ తరపున పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు. రేపు మరో సెట్‌ని జగన్ స్వయంగా దాఖలు చేయనున్నారు. గురువారం ఉదయం 7 గంటల 45 నిమిషాలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటి నుంచి జగన్ బయల్దేరతారు. ఉదయం 8 గంటల 5 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కడప నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల వెళ్తారు. అక్కడ సీఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో జగన్ పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత బైరోడ్ పులివెందుల మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్‌కు చేరుకుంటారు. 11 గంటల 25 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల మధ్య నామినేషన్ కార్యక్రమం ఉంటుంది.
కేసీఆర్, హరీష్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని..అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో ఎలా కూర్చున్నాడని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గేసాడోగానీ కూలిపోయిందని విమర్శించారు. నువ్వు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రమ్మని.. కేసీఆర్ కు సవాల్ విసిరారు. హరీష్ రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండమన్నారు. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తానన్నారు. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదని విమర్శించారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోడీ హామీ ఇచ్చారని.. కానీ ఆత్మహత్యలు ఆగలేదన్నారు. రైతుల ఆదాయం పెరగలేదని.. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ మోసం చేశారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని తెలిపారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారన్నారు. బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుందని.. భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోండని ఓటర్లకు సూచించారు. కడియం శ్రీహరి నిజాయితీ చూసి పార్టీలో చేర్చుకున్నామన్నారు. ఈ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించండని కోరారు. ఆరూరి రమేష్ కు ఓటు వేస్తే.. అనకొండగా మారి మీ భూములను మింగేస్తాడని విమర్శించారు. నిజాయితీని వారసత్వంగా తీసుకున్న.. మీ కోసం కొట్లాడే కావ్యను గెలిపించండి.. వరంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ పై.. అన్న ధర్మపురి సంజయ్ ఫైర్
నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటింటికీ తిరుగుతూ మళ్లీ తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్నారు. మరో వైపు ధర్మపురి సంజయ్ అరవింద్ పై విరుచుకు పడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ దేవుని పేరిట రాజకీయాలు చేస్తోందని ధర్మపురి సంజయ్ అన్నారు. దేవునికి రాజకీయాలకు సంబంధం లేదని.. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం నైతికం కాదన్నారు. ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశారన్నారు. రైతులను నిట్టనిలువునా మోసం చేసిన బీజేపీకి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. టర్మరిక్ బోర్డు స్థాపించే ఆలోచన లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పిన మాటలను గుర్తు చేశారు. మోడీ గతంలో కర్ణాటకలో పసుపు బోర్డుపై ప్రకటన ఎలా చేశారని ప్రశ్నించారు. బీజేపీ చెప్పే అబద్ధాలు విని ప్రజలు మళ్ళీ మోసపోవద్దని చెప్పారు. అరవింద్ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. నిజామాబాద్ ఎంపీగా.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఓటర్లను కోరారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా తగ్గించి మత రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ యత్నం..
మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్‌కి వెన్నుపోటు పొడవడమే అని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. అంబేద్కర్ ఇలాంటి చర్యల్ని వ్యతిరేకించారని మోడీ అన్నారు. ఇటువంటి రిజర్వేషన్లను రాజ్యాంగం స్పష్టంగా నిషేధిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలో ముస్లింలను చేర్చే ప్రతిపాదను తీసుకువచ్చిందని, కాంగ్రెస్ ఓబీసీలకు పెద్ద శతృవుగా మారిందని, మీ భవిష్యత్ తరాలను నాశనం చేసే ఆట ఆడుతోందని దుయ్యబట్టారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను మన రాజ్యాంగంలో స్పష్టంగా నిషేధిస్తుంది, బాబాసాహెబ్ దీనికి వ్యతిరేకమని, కానీ కాంగ్రెస్ దీనికి పూర్తి విరుద్ధంగా ప్రజలను మోసం చేయడానికి ఆట ఆడుతోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. 2009, 2014 ఎన్నికల్లో కూడా తమ మేనిఫెస్టోలో మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల 15 శాతం కోటాని తగ్గించి మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని ప్రధాని మోడీ ఆరోపించారు.
సోదరి వివాహ కానుకపై వివాదం.. భర్తని కొట్టి చంపిన భార్య..
ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. చెల్లికి పెళ్లి కానుకలు ఇస్తున్నాడని తెలిసి ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె తరుపు బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలోని బారాబంకిలో జరిగింది. సోదరి పెళ్లికి LED టీవీని, బంగారు ఉంగరాన్ని బహూకరించాలని అనుకుంటున్నాడని అతనిపై భార్య కోపం పెంచుకుంది. ఈ విషయం భార్య,భర్తల మధ్య గొడవకు దారి తీసింది. గొడవ పెద్దది కావడంతో బాధిత వ్యక్తి కొట్టి చంపినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ కేసులో బాధితుడి భార్య, సోదరుడు సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చంద్ర ప్రకాష్ మిశ్రా, క్షమా మిశ్రా భార్యభర్తలు. సోదరి పెళ్లికి కానుక విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో భార్య క్షమామిశ్రా తన సోదరుడు ఇతర బంధువులను కదరాబాద్‌లోని తన నివాసానికి మంగళవారం పిలిచింది. ఈ సమయంలోనే వారంతా కలిసి చంద్ర ప్రకాష్‌ని తీవ్రంగా కొట్టారు. పోలీస్ సర్కిల్ ఆఫీసర్ (CO) ఫతేపూర్ డాక్టర్ బిను సింగ్ మాట్లాడుతూ.. చంద్ర ఏప్రిల్ 26న జరగబోయే తన సోదరి పూజా పెళ్లికి ఎల్ఈడీ టీవీ, బంగారు ఉంగరాన్ని కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు. అయితే, ఇది భార్య క్షమాకు నచ్చలేదు. ఈ విషయంలో బంధువుల జోక్యాన్ని చంద్ర ప్రశ్నిచంగా.. వారు అతడిపై కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చంద్రను ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులందరిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. చంద్రప్రకాష్‌కి గోపాల్ అనే ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ మోడీపై జేపీ మోర్గాన్ సీఈవో ప్రశంసలు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, ప్రభుత్వ నిర్ణయాలను జేపీ మోర్గాన్ సీఈవో ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికన్లకు సూచనలు కూడా చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని జేపీ మోర్గాన్ చేజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమీ డిమోన్ కొనియాడారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనలో తీసుకువచ్చిన సంస్కరణలను మెచ్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలను ప్రశంసించారు. వాటిలో కొన్నింటిని యూఎస్‌లో కూడా ప్రవేశపెట్టవచ్చని పేర్కొన్నారు. భారత నాయకుడి ముందు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆయన తన దేశాన్ని ఎలా నడిపిస్తున్నారన్నది యూఎస్ అధికారులు ఆలోచించుకోవాలన్నారు. మోడీ అద్భుతమైన పనితీరు చూపారని.. 400 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారని గుర్తుచేశారు. వారు మనతో వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు మనం వెళ్లి, ఉపన్యాసం ఇస్తామన్నారు. పనులు ఎలా చేయాలో పాఠాలు చెబుతాం కానీ.. భారత్‌లో అద్భుతమైన విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉన్నాయని కొనియాడారు. అలాగే గతంలో వారికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్ను వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉండేవని.. అవి అవినీతికి దారితీసేవన్నారు. ఆ సంక్లిష్టతను బ్రేక్ చేసి.. పన్ను వ్యవస్థను సంస్కరించారన్నారు. భారత్‌లో ప్రతీ పౌరుడిని గుర్తించే ఆధార్‌వ్యవస్థ ఉందన్నారు. 700 మిలియన్ల బ్యాంకు ఖాతాలున్నాయని.. సానుకూల మార్పు దిశగా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. అలాంటి వైఖరిని మన నేతలు పాటించాల్సిన అవసరం కాస్త ఎక్కువగానే ఉందని అమెరికన్లను ఉద్దేశించి జేమీ డిమోన్ ప్రసంగించారు. ఆయన ప్రసంగించిన ప్రసంగాన్ని ఎక్స్‌లో కేంద్రమంత్రి పీయూస్ గోయల్ పోస్టు చేశారు.
కోహ్లీ నామస్మరణతో మార్మోగిన ఉప్పల్ స్టేడియం.. రేపే మ్యాచ్..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరో మ్యాచుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో మార్చి 27న హైదరాబాద్, ముంబై జట్లు తలపడగా.. ఏప్రిల్ 5న హైదరాబాద్, చెన్నై జట్లు తలపడ్డాయి. ఇకపోతే గురువారం నాడు హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే స్టేడియంకు ఆటగాళ్లు చేరుకొని ప్రాక్టీస్ ఉమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాడైన విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం దగ్గరికి వచ్చారు. కోహ్లీ వచ్చిన సమయంలో క్రికెట్ అభిమానులు కోహ్లీ.. కోహ్లీ.. అంటూ పెద్దగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగింది. ఈ మ్యాచ్ కు సంబంధించి స్టేడియంలో 2500 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం ఉన్న పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మ్యాచ్ కోసం ఆర్టీసీ, అలాగే మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులను నడపబోతున్నాయి. ఇక ఈ సిరీస్ లో హైదరాబాదులో మరో నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి. ఇక వాటి వివరాలు చూస్తే.. మే 2న హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య, మే 8న లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య, మే 16న హైదరాబాద్, గుజరాత్ ల మధ్య, మే 19న హైదరాబాద్, పంజాబ్ మధ్య మ్యాచులు జరగనున్నాయి.
ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా..
తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. నాగార్జున పాత్ర స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించి చాలా కాలం అయిపోయింది. మరి కుబేరలో నాగ్‌ను ఎలా చూపిస్తారో చూడాలి.. ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. యంగ్, మధ్య వయసు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించింది.. మొత్తానికి మరో హిట్ ను నాగ్ తన ఖాతాలో వేసుకున్నాడు.. మరో రెండు సినిమాలను నాగ్ లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..
‘ తమ్ముడు ‘ సినిమా కోసం పెద్ద సాహసం చేస్తున్న నితిన్..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు. ఇక రాబిన్‌హుడ్ వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `తమ్ముడు సినిమాను చేస్తున్నాడు.. తమ్ముడు సినిమా కథ కొత్తగా ఉండబోతుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.. ఇటీవల నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో నితిన్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారట. నేటి నుంచే ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది.. ఈ ఫైట్ సీన్ సినిమాలో హైలెట్ గా అవ్వనుందని టాక్.. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ ను షూట్ చేస్తున్నారు.. అంతేకాదు ఈ ఫైట్ సీన్ కోసం దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ ను పెట్టనున్నట్లు సమాచారం.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇందులో నితిన్‌కి ఇద్దరు హీరోయిన్లుంటారని సమాచారం.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాబోతుందని సమాచారం..
బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక బిజినెస్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన హైదరాబాదులో ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబి సినిమాస్ అనే ఒక మల్టీప్లెక్స్ ని నిర్వహిస్తున్నారు. మరోపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఒకప్పుడు కేవలం తాను చేస్తున్న సినిమాల్లోనే నిర్మాణ భాగస్వామిగా ఉంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాదులో ఏషియన్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ అనగానే ఒక ల్యాండ్ మార్క్ గా మారిపోయింది. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ హైదరాబాదులో ఒక పాపులర్ విసిటింగ్ ప్లేస్ గా కూడా మారిపోయింది అని చెప్పక తప్పదు. ఇక ఇప్పుడు మహేష్ బాబు తన బిజినెస్ ని ఎక్స్పెండ్ చేస్తున్నాడు. మరోసారి ఏషియన్ సంస్థతో కలిసి ఇదే ఏఎంబి పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పూజ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ మేరకు ఏషియన్ సంస్థ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ పూజా కార్యక్రమాలలో ఏషియన్ సంస్థ చీఫ్ సునీల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొంత మంది పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులు కానీ మహేష్ బాబు టీమ్ గాని ఎవరు హాజరైనట్లుగా కనిపించడం లేదు.