సూటిగా అడుగుతున్నా.. నేను పిల్ల బచ్చ అయితే.. మరి నువ్వేంటి బాబు..?
సూటిగా అడుగుతున్నా.. చెప్పవయ్య బాబు.. చెప్పు.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అనకాపల్లి జిల్లా చింతలపాలెం నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సిద్ధం సభను చూస్తే ప్రభంజనం అంటే ఏంతో ఏంటో అర్థం అవుతుంది.. ప్రజాప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన ప్రజా సైన్యం ఇక్కడ కనిపిస్తోందన్నారు. ఈ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజల భవిష్యత్ ను నిర్దేషించేందుకు జరుగుతున్నాయి.. ప్రతీ వర్గాన్ని మోసం చేసి.. .ఎన్నికల వచ్చేసరికి మరోసారి భ్రమలు కల్పించడానికి వస్తున్న మోసగాళ్లను ఓడించడానికి సిద్ధం కావాలని సూచించారు. జగన్ ను ఓడించాలని కూటమి… జనాన్ని గెలిపించాలని మనం పోరాడుతున్నాం.. చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు జరగబోతున్నాయి.. సిద్ధం సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరుగు పెడుతున్నాయన్నారు. కడుపు మంటతో నా మీద రాళ్లేయమని చెబుతున్నాడు… జగన్ ను కొట్టడానికి, హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూటమికి అధికారం కావాలి అంటూ అంటూ మండిపడ్డారు. జగన్ ఒక బచ్చా అని కూడా చంద్రబాబు అంటున్నాడు.. చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంశుడు గుర్తుకు వస్తున్నాడు అని దుయ్యబట్టారు సీఎం జగన్.. హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడికి కూడా ఏమైందో చూశాం… పేదలకు మంచి చేసి వుంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అంటూ సెటైర్లు వేశారు. కుట్రలు, మోసాలు, అబద్ధాలతో బాణాలు, రాళ్లు పట్టుకుని నా చుట్టూ మోహరించి వున్నారు.. దేవుడు, జనమే జగన్ కు తోడుగా ఉన్నారని తెలిపారు. ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కోవడం కోసం నక్కలు ఎగబడుతున్నాయి.. నేను బచ్చాను అయితే.. నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన నిన్నేమీ అనాలి చంద్రబాబు..? అంటూ నిలదీశారు. నేను బచ్చా అయితే జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమం 14ఏళ్ల కాలంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు..? అంటూ నిలదీశారు.
మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు..!
మేమంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించొద్దు.. మేం దణ్ణం పెట్టి చెబుతున్నాం.. హత్యలు, దాడులకు దూరంగా ఉండాలి అని విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరు అని హెచ్చరించారు.. తాడేపల్లిలో మేకా వెంకటరెడ్డి ఇంటిని సందర్శించి.. వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ హింసాత్మక చర్యలకు ఉపక్రమించింది. మనుషుల ప్రాణాలు తీసేనేదుకు సైతం వెనకాడటం లేదు. టీడీపీ గూండాలు మా వాళ్లని రెచ్చగొట్టి మరి బైక్ తో వచ్చి వేగంగా ఢీ కొట్టారు. ప్రాణాలు తియ్యాలన్న ఉద్దేశంతో ఈ రకంగా దాడులకు దిగుతున్నారు. మేం సంయమనంతో, నిగ్రహంతో ఉన్నా టీడీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. మేం కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది అని హెచ్చరించారు సజ్జల.. దాడులు వాళ్లే చేస్తున్నారు.. బాధితులు వాళ్లే అని మళ్లీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తున్నారు. మా వాళ్లు నిగ్రహంతో ఉన్నారు.. కాబట్టే టీడీపీ నేతలు ఇంకా ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు. శవాలపై పేలాలు ఎరుకోవాలని టీడీపీ చూస్తోందన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన దాడి మర్చిపోక ముందే మరో హత్యకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. మా మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని టీడీపీ నేతలకు చెప్తున్నాం. సిగ్గు లేకుండా జరిగిన దాడులను వెనకేసుకొచ్చి డ్రామా అని టీడీపీ నేతలు అంటున్నారు.. కానీ, రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ 20 రోజుల్లో వదులుతుందన్నారు. మేం రెచ్చిపోతే అది ఎక్కడికో దారి తీస్తుందని టీడీపీని హెచ్చరించారు.. మేం అంతా మౌనంగా ఉన్నాం.. అనవసరంగా వివాదాలు సృష్టించవద్దు.. మేం దణ్ణం పెట్టి చెప్తున్నాం హత్యలు, దాడులకు దూరంగా ఉండాలన్నారు. మీ దాడులకు మా రియక్షన్ వేరేలా ఉంటే టీడీపీ నేతలు తట్టుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే దాడులు చేయాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ నేతలు అంతా సమయమనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
మంత్రి రోజాకు షాక్.. టీడీపీ గూటికి మంత్రి ప్రధాన అనుచరుడు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో.. అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు.. కొత్త వ్యూహాలతో విస్తృతంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అయితే, ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో.. వైసీపీ కీలక నేత, మంత్రి ఆర్కే రోజాకు షాక్ తగిలింది.. నగరిలో మంత్రి రోజాకు ఝలక్ ఇచ్చింది వ్యతిరేకవర్గం.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరారు మంత్రి రోజా ప్రధాన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుత్తూరులో కీలమైన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన అమ్ములు అలియాస్ ఎలుమలై.. ఆయనతో పాటు డీసీసీబీ జిల్లా మాజీ డైరెక్టర్ లక్ష్మీపతి యాదవ్, బిల్డర్ వెంకటముని తదితరులు టీడీపీ కండువా కప్పుకున్నారు.. రోజాకు మద్దతు ఇవ్వమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు చెప్పినా.. స్థానికంగా పట్టించుకోకపోవడంతో.. పార్టీకి నగరి వైసీపీ కీలక నేతలు దూరమయ్యారనే చర్చ సాగుతోంది.. ఇక, గత స్థానిక సంస్ధల ఎన్నికల్లో పుత్తూరులో మంత్రి రోజాపైనే అమ్ముల్లు అనుచరులు దాడి చేసిన విషయం విదితమే.
ఒక ఎన్నిక కోసం పిఠాపురం రాలేదు
తాను ఈ ఒక ఎన్నిక కోసం పిఠాపురం రాలేదని స్పష్టం చేశారు జనసేన అధినేత, పిఠాపురం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కావాలన్నారు.. పిఠాపురంలో నేను మాత్రమే కాదు.. వర్మ, నేను పోటీ చేస్తున్నాం అన్నారు. ఇక, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ.. సమిష్టి నాయకత్వంతో పిఠాపురంలో పనిచేస్తున్నాం అన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి.. కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్మ లేకుండా కాదు.. వర్మతో కలిసి పిఠాపురంలో పనిచేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు పార్టీలు పోటీ చేస్తున్నట్లు భావించాలని.. కూటమి అభ్యర్థుల విజయానికి అంతా కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కాగా, నేను ఒక ఎన్నిక కోసం పిఠాపురం రావడం లేదు, ఇక్కడే ఒక ఇల్లు తీసుకుని, ఒక పర్మనెంట్ కార్యాలయం తీసుకుని 54 గ్రామాల భాధ్యత తీసుకుంటాను అంటూ గతంలో పిఠాపురం వారాహి విజయ భేరి సభలో పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యూటర్న్..! కాంగ్రెస్‌కు షాక్..!
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం తన కేడర్ తో సమావేశమయ్యారు ప్రకాష్ గౌడ్.. అయితే, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ కు సూచించారు పలువురు నేతలు.. దీంతో, తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విరమించుకొని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెనుకడుగు వేశారు.. కార్యకర్తల సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.. అయితే, శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల గురించి చర్చించినట్లు తెలిపారు.. తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్టు వెల్లడించారు.. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, నాయకులతో సమావేశమై వారు సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారట.. అయితే శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ముఖ్య బీఆర్ఎస్ నాయకులతో సమావేశం చర్చలు జరిపారు.. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఉద్యమం నుండి పార్టీలో పనిచేసిన తమకు చెడ్డ పేరు వస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం కేడర్ ఆయన చెప్పారట.. దీంతో, ప్రస్తుతం పార్టీని వీడడం తన కేడర్‌కు ఇష్టం లేదని.. వారికి ఇష్టంలేని పని తాను ఎప్పటికీ చేయనని.. అందుకే బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని.. పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తానని.. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని తేల్చేశారు.. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దని మీ వెంట నేనున్నానని.. ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. అయితే, ప్రకాష్ గౌడ్ యూ టర్న్ తీసుకుని బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేయడంతో.. కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.
నా తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్నా.. రంజిత్ అన్న గెలుపు కోసం కృషి చేస్తా
నా తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్న.. నేను రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తాను అని స్పష్టం చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రంజిత్‌రెడ్డి.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. సభలు, సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.. ఇక, ఈ రోజు వికారాబాద్ బూత్ కార్యకర్తల సమావేశంలో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు వేం నరేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాంమోహన రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ లీడర్లు.. పెద్ద ఎత్తున్న పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.. ఇక, ఈ సమావేశంలో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లల మీద ఓట్టేసి చెబుతున్నా.. తాను చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.
రేవంత్ రెడ్డికి తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు.. ఆయన మాటల్లో నిజాల్లేవ్..
రేవంత్ రెడ్డికి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని.. అన్ని అబద్ధాలే మాట్లాడారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక లో ఏ రంగుతో పోటీ చేశానో, మెదక్ లో అదే రంగు తో పోటీ చేస్తున్ననని.. కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలవలేదా.? దుబ్బాకలో ఓడితే మెదక్ లో పోటీ చేయకూడదా.? అని ప్రశ్నించారు. ఇక్రిశాట్ 1972 లో ఏర్పాటు అయ్యిందని.. బీహెచ్ఎల్ 1964 నెహ్రూ కాలంలో ఏర్పాటు చేశారని చెప్పారు. ఇందిరా గాంధి హయాంలో ఇక్రిశాట్ లు, బీహెచ్ఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ సంస్థలు వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారన్నారు. 1980లో ఇందిరా గాంధి మెదక్ లో గెలిస్తే మెదక్ రైల్ వే లైన్ తెస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. 40 ఏళ్ళలో రాని మెదక్ రైల్ వే లైన్ ను మోదీ పదేళ్ళలో ప్రారంభించారన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామని చెప్పిన కాంగ్రెస్ నాయకుల మాటలను గుర్తు చేశారు. ఎంతమందికి కేసీఆర్ సొమ్మును పంచారో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. బీసీలకు లక్ష కోట్లతో పాటు కేసీఆర్ దోచుకున్న సొమ్ముతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న హామీని గుర్తు చేశారు.
ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్తుల భవనం
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈస్ట్ ఢిల్లీలోనే కల్యాణ్‌పురి ఏరియాలో సాయంత్రం ఒక్కసారిగా భవనం కూలిపోయింది. భారీ శబ్దంతో కూలిపోయింది. దీంతో సమీపంలో ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. మరోవైపు భారీ ఎత్తున దుమ్ము చెలరేగడంతో స్థానిక ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. భవనం కూలిన దృశ్యాన్ని స్థానికులు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. శనివారం నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్‌పురి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందని వెల్లడించారు. పెద్ద శబ్దంతో కూలిపోవడంతో.. ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి మబ్బులు చుట్టుముట్టాయి. అలాగే శిథిలాలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లపై పడ్డాయి. నిర్మాణ పనులు జరుగుతుండగానే భవనం ఓ వైపు ఒరిగింది. పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. సమీప ఇళ్లల్లోనే ప్రజలను ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు అప్రమత్తమై శిథిలాలను తొలగించారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా సహాయ చర్యలు చేపట్టి.. శిథిలాలను తొలగించారు.
ఇండియా కూటమి ప్రధాని ఎలాన్ మస్క్‌ని భారత్‌కి ఆహ్వానిస్తారు..
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వచ్చే వారం భారత పర్యటనకు వస్తున్నారని అంతా అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన తన భారత పర్యటనలో టెస్లా కార్ ప్లాంట్ కోసం 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిన ప్రకటిస్తారని, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతారని అంతా అనుకున్నారు. అయితే, ఎలాంటి కారణాలు లేకుండా పర్యటన వాయిదా పడింది. ఇదిలా ఉంటే మస్క్ పర్యటన వాయిదా పడటంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ప్రధాని మస్క్‌ని ఆహ్వానిస్తారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడేది ఇండియా కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ పదవీ విరమణ చేసే ప్రధానమంత్రిని కలవడానికి భారత్ వరకు వస్తున్నారు. ఇండియా కూటమి గెలుస్తుందని తెలుసుకుని తన పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇండియా కూటమి ప్రధాని త్వరలో ఆయనకు స్వాగతం పలుకుతారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను మరింత దూకుడుగా ప్రోత్సహిస్తుంది. నేను కూడా దాని వినియోగదారుడినే’’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఒవైసీ వ్యాఖ్యలపై మండి పడ్డ నిర్మలా సీతారామన్.. అసలేమన్నాడంటే?
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నయన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో ఒవైసీ ఓ బీఫ్ షాప్ గుండా వెళ్లి యజమానిని కలుసుకుని ప్రశంసించారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. “రెహాన్ బీఫ్ షాప్ జిందాబాద్. కైసే హో భాయ్? కట్టే రహో (రెహాన్ బీఫ్ షాప్ లాంగ్ లివ్. బ్రదర్ ఎలా ఉన్నారు? కసాయి పని చేస్తూ ఉండండి)” అని ఒవైసీ ఆ వీడియోలో బీఫ్ షాప్ యజమానికి చెప్పాడు ఒవైసీ. ఒవైసీ వ్యాఖ్యలపై సీతారామన్ స్పందిస్తూ.. అతని ప్రకటనలు “అసభ్యకరమైనవి” అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడంలో అతను నిపుణుడని నొక్కిచెప్పారు. ఒవైసీ ప్రకటనలు ఎంత అసభ్యకరంగా ఉన్నా.. ఆశ్చర్యం కలిగించవని, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అలాంటి ప్రకటనలు ఇవ్వడంలో నిష్ణాతుడని సీతారామన్ మీడియా సమావేశంలో అన్నారు. ఒవైసీ 2004 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం, అతను హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో హైదరాబాద్ కూడా ఉంది. మే 13న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
నెక్సాన్, బ్రెజ్జాకు చుక్కలే.. మహీంద్రా XUV 3OO ఫేస్‌లిఫ్ట్ సరికొత్త ఫీచర్లు..
మహీంద్రా XUV 3OO ఫేస్‌లిప్ట్ సరికొత్త పేరుతో మహీంద్రా XUV 3XOగా వస్తోంది. మరింత స్టైలిష్‌గా, మరిన్ని టెక్ లోడెడ్ ఫీచర్లతో ఈ నెల చివర్లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడేలా ఈ కార్‌ని మహీంద్రా రూపొందించింది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి కార్లకు మహీంద్రా XUV 3XO పోటీని ఇవ్వనునంది. ఈ పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఈ కార్ రాబోతోంది. ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారులో మరిన్ని ఫీచర్లను అందించనున్నారు. Adrenox Connect టెక్నాలజీతో రానుంది. ఈ Adrenox కనెక్ట్ యాప్‌తో మొబైల్ ద్వారా కారులోని ఉష్ణోగ్రతను రిమోట్‌గా సర్దుబాటు చేయగలరు. అయితే, ఇది ఎంపిక చేసిన వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. సమ్మర్‌లో ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మహీంద్రా XUV 3XO, LED DRLలతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంపులను కలిగి ఉంటుంది. 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో పాటు క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డు సరికొత్తగా కనిపించనుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉన్నాయి. డ్యూయల్-జోన్ ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ సిస్టమ్, వెంటిలేడెట్ సీట్లు, కొత్త స్టీరింగ్‌ని కలిగి ఉంటుంది. అన్నింటి కన్నా ముఖ్యంగా సెగ్మెంట్‌లోనే తొలిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉండబోతోంది. అయితే, ఇందులో ADAS ఫీచర్లు ఉంటాయో లేదో చూడాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లెవెల్-2 ADAS ఉండవచ్చని తెలుస్తోంది. పాత మోడల్‌లో ఉన్న ఇంజన్ ఆప్షన్లు కొత్త XUV 3XOలో ఉండనున్నాయి. దీని ధర రూ. 8.50 లక్షల నుంచి రూ. 16 లక్షలు(ఎక్స్-షోరూం) మధ్య ఉంటుందని అంచనా.
సన్ రైజర్స్ హైదరాబాద్ మరో రికార్డు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ మ్యాచ్ పవర్‌ప్లే దశలో అత్యధిక స్కోర్‌ను సాధించింది ఎస్ఆర్‌హెచ్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఈ కొత్త రికార్డుకు వేదికగా మారింది.. రికార్డు స్థాయి ప్రదర్శనతో SRH మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది. ఈ ఫీట్ జట్టు యొక్క దూకుడు బ్యాటింగ్ వ్యూహాన్ని చూపడమే కాకుండా.. లీగ్‌లో ఓపెనింగ్ భాగస్వామ్యాలకు కొత్త రికార్డును సెట్ చేస్తుంది. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని అందుకోగా.. అభిషేక్ శర్మ 10 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దీంతో.. హైదరాబాద్.. 2017లో డర్హామ్‌పై నాటింగ్‌హామ్‌షైర్ చేసిన 106/0 రికార్డును బద్దలు కొట్టింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.. దీంతో.. హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగింది.
నటి ఆమని కాస్టింగ్ కౌచ్ కష్టాలు.. అవి చూపాలని ఒత్తిడి చేశారంటూ!
సీనియర్ నటి, ఒకటప్పటి హీరోయిన్ ఆమని సంప్రదాయమైన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది.. అయితే అలాంటి ఆమెకు కూడా క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు తప్పలేదని ఆమె వెల్లడించింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన లైంగిక వేధింపులను బయటపెట్టారు. తన కెరీర్ మొదట్లో చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాటలతో ఇబ్బంది పెట్టేవారని ఓ తమిళ దర్శకుడు అయితే ఏకంగా స్ట్రెచ్ మార్క్స్ మీకు ఉన్నాయా లేదో చూపించండి అని నేరుగా అడిగాడని అతనికి సమాధానం చెప్పలేక అక్కడ నుంచి లేచి వెళ్లిపోయానని ఆమని చెప్పారు. బాడీలో ఎవరికి చెప్పుకోలేని చోట్ల కూడా వారికి చూపించాలని ఇబ్బంది పెట్టిన దర్శకులు కూడా ఉన్నారని, ఆమె అన్నారు. అంతేకాక ఆమె మాట్లాడుతూ పెద్ద ప్రొడక్షన్ సినిమాల్లో నటీనటులతో చాలా బాగా ఉంటారు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కేవలం సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగేవారు అని ఆమని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాల విషయంలో ఈ వేధింపులు చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ విషయంలో జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని, నా జీవితంలో అలాంటి రోజు రానుందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయని అప్పట్లో ఎక్కువగా సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి తెలియకపోయేదని తెలిపింది. తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారని, వాళ్లను దాటుకుని నా వరకూ ఛాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పాలని అన్నారు.
పురోహితుడిపై దారుణం.. తీవ్ర స్థాయిలో కోన వెంకట్, హరీష్ శంకర్ ఫైర్
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. తాజాగా ఒక పురోహితుడిని ఒక వివాహ వేడుకలో అత్యంత దారుణంగా అవమానిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. దానిని ఒకప్పుడు టిడిపిలో ఉండి ప్రస్తుతం బిజెపిలో ఉన్న సాధినేని యామిని శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తనకు తెలియదు కానీ ఇలా ఒక నిసాహాయమైన స్థితిలో ఉన్న పురోహితుడిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఆమె రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది, నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతుంది. తాజాగా ఇదే విషయం మీద తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒక రచయిత, మరొక స్టార్ డైరెక్టర్ ఇద్దరు స్పందించారు. ఈ విషయం మీద వారిద్దరూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక రచయిత కోన వెంకట్ స్పందిస్తూ ‘ఇది అత్యంత హేయనీయం.. ఖండనీయం, అన్ని కులాలను , మతాలను సమాన దృష్టితో చూడడంలో బ్రాహ్మణులు ముందుంటారు, వారిని గౌరవించక పోయినా పర్వాలేదు.. అవమానించకండి’ అని ట్వీట్ చేశారు. దీనికి చేతులు చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని జత చేశారు. ఇక ఇదే వీడియో పై స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ‘ఇదం బ్రాహ్మం.. ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అని ట్వీట్ చేశారు. ఇక ఇదే వీడియో మీద బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై సహా అనేక మంది స్పందిస్తున్నారు.