పిఠాపురం ప్రజలు ఆలోచించాలి.. లోకల్ హీరో కావాలా? సినిమా హీరో కావాలా..?
లోకల్ హీరో (వంగా గీత) కావాలా? సినిమా హీరో (పవన్ కల్యాణ్) కావాలా? మీరే ఆలోచించుకోవాలి అంటూ పిఠాపురం ప్రజలకు సూచించారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాకినాడలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో అభ్యర్థులను పరిచయం చేస్తూ.. గెలిపించాలని కోరిన ఆయన.. ఇక, పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతను పరిచయం చేస్తూ.. ‘పిఠాపురం నుంచి నాకు తల్లిలాంటిది.. నా అక్క గీతమ్మ నిలబడుతోంది.. పిఠాపురంలోని ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాలి.. లోకల్ హీరో కావాలా? లేకపోతే సినిమా హీరో కావాల్నా ఆలోచన చేసుకోవాలన్నారు.. అక్కకు ఓటు వేస్తే ఎప్పుడూ మీతోనే ఉంటుంది.. మీకు మంచి చేస్తుంది.. నేను కూడా దగ్గరుండి అక్కతో మంచి చేయిస్తాను.. కానీ, సినిమా హీరోకు ఓటు వేస్తే.. ఓటు వేయించుకునేవరకు మాత్రమే ఇక్కడ ఉంటాడు.. జ్వరం వచ్చినా కానీ, మళ్లీ అతడు హైదరాబాద్‌కు వెళ్లిపోతాడు.. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.. వంగా గీతపై మీ దీవెనలు ఉండాలని కోరారు సీఎం వైఎస్ జగన్..
జనసేనకు మరో షాక్.. పార్టీకి అమలాపురం ఇంఛార్జ్ గుడ్‌బై
ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు ఎన్నికల కోలాహలం.. మరోవైపు రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రాజీనామాలు, వలసలు కొనసాగుతూనే ఉండగా.. ఇప్పుడు జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది.. ఇప్పటికే కొందరు నేతలు.. టికెట్ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయగా.. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు.. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డీఎంఆర్ శేఖర్.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఈ మేరకు తన రాజీనామా లేఖను జనసేన పార్టీ అధిష్టానానికి పంపించారు శేఖర్.. 2019 ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకిదిగి ఓటమిపాలైన శేఖర్.. ఈ సారి అమలాపురం పార్లమెంట్ లేదా అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించారు.. చివరకు ఆయనకు నిరాశే మిగిలింది.. దీంతో, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. మరి, ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఏ పార్టీలో చేరతారు? అనేది తేలాల్సిన అంశం.
భర్తపై ఇండిపెండెంట్‌గా బరిలోకి భార్య..! ఇలా స్పందించిన దువ్వాడ..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. అయితే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. టెక్కలి నుంచి బరిలోకి దిగుతుండగా.. ఆయన భార్య వాణి సంచలన ప్రకటన చేయడం చర్చగా మారింది. టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న దువ్వాడ వాణి ప్రకటించారు.. ఈ నెల 22వ తేదీన నామినేషన్ వేయబోతున్నట్టు.. తన అనుచరుల దగ్గర వాణి ప్రస్తావించడం చర్చగా మారింది.. ఇక, తన భార్య వాణి నామినేషన్ వేస్తానన్న వ్యాఖ్యలపై టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం ఉంది.. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదన్నారు దువ్వాడ శ్రీనివాస్.. ఏం చేస్తాం.. కలియుగ ప్రభావం.. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు.. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా చెప్పుకొచ్చారు.. అయితే ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నాను అన్నారు.. నేను రాత్రికి రాత్రి రెడీమేడ్‌గా తయారైన నాయకుడిని కాదు.. పాతికేళ్ల రాజకీయ జీవితం నాదన్న ఆయన.. దమ్ముంటే తెలుగుదేశం నాయకులు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి? అని నిలదీశారు. టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది.. ఈ సారి 25 వేల ఓట్ల మెజార్టీతో టెక్కలిలో విజయం సాధిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ, టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్..
బీ ఫామ్ ఏ పార్టీది అయినా.. యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే..!
మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల కూటమి ఎలాంటిది అంటే.. బీ ఫామ్ ఏ పార్టీది అయినా.. యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే అంటూ దుయ్యబట్టారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కాకినాడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాకినాడ సిద్ధం.. ఇక్కడి జన సమూహాన్ని చూస్తుంటే కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తున్న నిండు గోదావరి కనిపిస్తోంది. అభిమాన నిండు గోదావరి కనిపిస్తోందన్నారు. మీ అందరి ముఖంలో ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే తపన కనిపిస్తోంది. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయి. ఒక వైపున ఎన్నికల నోటిఫికేషన్ నగార మోగింది. మరో వైపు పేదలంతా ఎన్నికల జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ.. సింహ గర్జన చేస్తున్నారు. ఇంటింటి, అక్క చెల్లమ్మలు, పెద్ద వర్గాల ఆత్మగౌరవం కాపాడుతున్న మన వైఎస్సార్ ప్రభుత్వానికి మద్దతుగా పలికేందుకు మీరంతా సిద్దమా..? అని ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. పేదలు పేదలుగానే ఉండాలన్న పెత్తం దారిలా దోపిడీని అరికట్టేలా ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్దమా..? అంటూ సభికులను ప్రశ్నించారు. రాబోయే 5 ఏళ్లు అంటే 1,820 రోజులు మన బతుకులు ఎలా ఉండాలో మన ఓటే నిర్ణయిస్తుంది.. మన బతుకులు మార్చే వారికే ఓటేయాలి. మీ జగన్ ద్వారా అందుతున్న పథకాలు భవిష్యత్ లో కూడా అందాలా లేక రాద్దు కావాలా అన్నది మీ ఓటే నిర్ణయిస్తుందన్నారు సీఎం జగన్.. ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తే అన్నీ పథకాలు ఇంటికే అందుతాయి. సాధ్యం కానీ హామీలతో మళ్ళీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారని గుర్తు పెట్టుకోవాలి. మీ బిడ్డ జగన్ కు ఓస్తే మీ ఊళ్ళో సచివాలయం కొనసాగుతుంది. బాబుకు ఓటేస్తే.. ఇవన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. ప్రతి ఊళ్లోకి జన్మభూమి కమిటీలు వచ్చేస్తాయి. ఫ్యాన్ కు ఓటేస్తేనే.. వృద్దాప్య పింఛన్లు, అక్క చెల్లమ్మలకు సాయం అందించే మీ బిడ్డ మార్క్ పాలన కొనసాగుతుంది. లేకుంటే బాబు మార్క్ పాలన వస్తుంది. దోచుకొని పంచుకునే విధానం వస్తుంది. చంద్రబాబుకు ఓటేస్తే పశుపుపతిలా ఇదేళ్లు మీ రక్తం తాగేందుకు వస్తారు అన్నారు. ఫ్యాన్ కు ఓటేస్తేనే రైతులకు ఊళ్ళో అందుతున్న వ్యవసాయ సేవలు పక్కాగా కొనసాగుతాయి. ఫ్యాన్ కు ఓటేస్తేనే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందుతాయి. టోఫెల్ ట్రైనింగ్ నుంచి ట్యాబ్ ల వరకు అన్నీ అందుతాయి. ఇవన్నీటితో మన పిల్లలకు అంది మరో పదేళ్లలో ప్రపంచంతో పోటీ పడతారు. మన పేదల పిల్లలు మాట్లాడే ఇంగ్లీషుకు పెత్తం దారుల పిల్లలు కూడా అసూయ పడతారని తెలిపారు.
ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే..!
ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నన్ను చూస్తే అడుగడుగునా నేను చేసిన అభివృద్ధి గుర్తొస్తుంది.. సీఎం జగన్ ను చూస్తే విధ్వంసం గుర్తొస్తుందన్నారు. ప్రజా నాయకుడు ఎప్పుడూ అభివృద్ధి చేసేవాడు కావాలి.. కానీ, కూలగొట్టేవాడు నాయకుడు కాదన్నారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే బైరవాని తిప్పా ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే వాళ్లం అని తెలిపారు… ఓట్ల కోసం వైసీపీ దొంగలు మీ ముందుకు వస్తారు… ఎందుకు పని చేయలేదో ప్రజలు నిలదీయాలన్నారు. అనంతపురం జిల్లాకు న్యాయం జరగాలంటే.. వైసీపీ పోవాలి.. ఎన్డీఏ కూటమి రావాలని సూచించారు. ప్రజలకు ఇచ్చింది ఎంత?.. జగన్ దోచుకుంది.. దొబ్బేసింది ఎంతో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.. జలగ మాదిరి… జగన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా జగన్ భరించలేక.. బెంగళూరుకు తరిమేశాడని ఆరోపించారు. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది.. పెట్టుబడులు తీసుకురావాలంటే చాలా కష్టం.. పరిశ్రమలు తరిమేయడం చాలా సులభం అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఎవరూ మాట్లాడకుండా.. వాస్తవాలు తెలుసుకొనీకుండా… కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక, ఎన్డీఏ కూటమి వల్ల ముస్లిం, మైనారిటీలకు ఎక్కడా హాని జరగలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లిం సోదరులకు ఏనాడు అన్యాయం జరగలేదని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
నేత కార్మికులకు రూ.50 కోట్లు.. బకాయిల చెల్లింపునకు సీఎం నిర్ణయం
నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.351 కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయి పడింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళనలు చేయడంతో పాటు బకాయిలను చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలుమార్లు అక్కడి కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బకాయిలు విడుదల చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని బకాయిలను క్లియర్ చేయాలని చెప్పారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫాంల తయారీకి సుమారు రూ. 47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్‌కు రూ. 14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపునకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది.
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తరవాత వెబ్ సైట్‌లో సర్వీస్ కమిషన్ పెట్టనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టులకు, సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం సాధ్యమైనన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కూడా సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేసింది సర్వీస్ కమిషన్.
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేత
గరుడ ప్రసాదం పంపిణీపై స్పందించారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. చిలుకూరు దేవస్థానంలో పంపిణీ చేయాల్సిన గరుడ ప్రసాదం పంపిణీని నిలిపిపేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారీగా భక్తులు వస్తుండటంతో ఇవాళ్టితో ప్రసాదం పంపిణీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం ఇచ్చామని వెల్లడించారు. మేం ఆశించిన దానికంటే వెయ్యి రెట్లు భక్తుల రావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అందుకే చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం వితరణ నిలిపివేశామన్నారు ప్రధాన అర్చకులు రంగరాజన్. రేపు, ఎల్లుండి ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలపైనే ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు.. తృణమూల్ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానేనని.. అలాగే కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్.. బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్, వామపక్షాలకు ఎవరూ ఓటు వేయొద్దని ప్రజలకు మమత పిలుపునిచ్చారు. మమత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మమత చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగమే అయినా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పశ్చిమబెంగాల్‌లో ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా? లేదంటే మరేదైనా ఉందా? అనేది కాంగ్రెస్ స్పందన బట్టి తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ కనీసం 40 సీట్లలో కూడా గెలవదు..
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొందరు నేతలు ( సచిన్ పైలట్ ) పగటి కలలు కంటున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. రాజస్ధాన్‌లో కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పైలట్ అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకుపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీ 400కి పైగా ఎంపీ స్థానాలు సాధిస్తుందన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 స్థానాలు గెలుచుకోవడం కూడా కష్టమేనని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇక, ఓటమి తప్పదని తెలిసే కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్యాలెట్ పేపర్ వాడిన రోజుల్లో పోలింగ్ బూత్‌లను లూటీ చేసే వారన్నారు. బ్యాలెట్ పేపర్లపై తప్పుడు మార్కింగ్ చేసేవారని పలు అక్రమాలు జరిగేవని ఆయన గుర్తు చేశారు. కానీ ఇవాళ ఈవీఎంల కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో చేయలేనిది.. బీజేపీ కేవలం పదేళ్లలో దేశ ప్రజలకు అనేక సేవలందించామని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.
పొరుగు దేశాల సంబంధాలపై నవాజ్ షరీఫ్ కుమార్తె కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ పొరుగు దేశాలతో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న దేశాలతో ఘర్షణ పడొద్దని.. స్నేహంగా ఉండాలని వ్యాఖ్యానించారు. హృదయం తలుపులు తెరవాలంటూ శాంతి వచనాలు పలికారు. ఈ మాటలు తన తండ్రి మాటలని ఆమె చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు.. పంజాబీ సోదరుల నుంచి శుభాకాంక్షలు అందాయని తెలిపారు. తాను పాకిస్థానీని.. అలాగే పంజాబీని కూడా అని చెప్పారు. భారత పంజాబీల్లానే తాము కూడా ఆ భాష మాట్లాడాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మా తాత మియాన్ షరీఫ్.. అమృత్‌సర్‌లోని జాటి ఉమ్రాకు చెందినవారని గుర్తుచేశారు. ఒక పంజాబీ భారతీయుడు జాటీ ఉమ్రా నుంచి మట్టిని తీసుకువచ్చినప్పుడు దానిని మా తాత సమాధి దగ్గర ఉంచినట్లు వ్యాఖ్యానించారు. భారత్ నుంచి కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి వచ్చిన సిక్కులను ఉద్దేశించి మరియం నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఫిబ్రవరిలో మరియం పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పాకిస్థాన్ చరిత్రలో ఒక రాష్ట్రానికి మహిళ ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేవరకు ఆ దేశంతో చర్చలు ఉండవని భారత్ తేల్చిచెప్పింది.
‘నింద’ పడిందంటున్న వరుణ్ సందేశ్
ఆడియెన్స్ ఎక్కువగా ఇప్పుడు కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో సినిమాలు చేస్తే కనుక థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి డైరెక్ట్ చేశారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను టీం రిలీజ్ చేసింది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రాబోతోన్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే ఎన్నో హింట్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఒక పల్లెటూరి ఊరి వాతావరణం, ఆ చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్న న్యాయదేవత విగ్రహం కూడా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంట పోస్టర్‌తోనే ఎంతో ఆసక్తికిని రేకెత్తించారు. ఇక ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఆల్రెడీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు చూపించారని, వారంతా కూడా సినిమాను మెచ్చుకున్నారని టీం చెబుతోంది. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. వరుణ్ సందేశ్ తో పాటు ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
తమన్నా, రాశి ఖన్నాల ‘బాక్’ వెనక్కి వెళ్ళింది.. ఆరోజే రిలీజ్ !
అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాలుగో చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో రిలీజ్ కి రెడీ అవుతోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదల తేదీ వాయిదా వేస్తూ కొత్త తేదిని అనౌన్స్ చేశారు. మే 3న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘పంచుకో’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసి తెలుగు ప్రమోషన్స్ ని దూకుడుగా చేయబోతున్నారు మేకర్స్. ఇక అవ్నీ సినిమాక్స్ P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. ఇక ఈ సినిమాకి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమా మాత్రమే కాదు ఈరోజు రిలీజ్ కావాల్సిన శశివదనే సినిమాతో పాటు లవ్ మౌళి అనే సినిమా కూడా వాయిదా పడింది. అయితే సెన్సార్ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాలో వాయిదా పడ్డట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు వచ్చేవారం ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ కావాల్సిన దిల్ రాజు కుమారుడు ఆశిష్ రెడ్డి లవ్ మీ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.