నేటి నుంచి చంద్రబాబు విచారణ.. సీఐడీ అడిగే ప్రశ్నలివేనా..?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.. ఇదే సమయంలో.. రెండు రోజుల సీఐడీ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ మేరకు సీఐడీ విచారణ జరగనుంది. సీఐడీ కస్టడీ నేపథ్యంలో ఏసీబీ కోర్టు నిబంధనలు జారీ చేసింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు.. ఇక, చంద్రబాబు సీఐడీ విచారణ కోసం సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం చేశారు జైలు అధికారులు.. పర్యవేక్షణ బాధ్యతలు డిప్యూటీ సూపరిడెంట్ కు అప్పగించారు.. 25 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం చేశారు.. సీఐడీకి చెందిన ముగ్గురు డిఏస్సీ స్థాయి అధికారులు, నలుగురు సీఐలు, ఏఎస్ఐ, కానిస్టేబుల్, వీడియోగ్రఫర్, ఇద్దరు ఆఫీషియల్ మధ్యవర్తుల సమక్షంలో ఈ విచారణ జరగనుంది.
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.. గత మూడు రోజులగా కొన్ని జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతుండగా.. దాని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.. ఈ రోజు కోస్తాతో పాటుగా రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు అలర్ట్ చేసింది వాతావారణశాఖ.. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇక, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.. మరోవైపు తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి.. ఈ రోజు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణశాఖ. కాగా, ఈ సారి అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు.. కృష్ణా బేసిన్‌లోని నదులు, ప్రాజెక్టులకు ఇంకా అనుకున్నస్థాయిలో నీరు చేరకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
శంషాబాద్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికులు 300 మంది..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలో కార్యకలాపాలన్నీ స్తంభించాయి. శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఖతార్ వెళ్లాల్సిన విమానం శంషాబాద్ లో ల్యాండింగ్ ఎందుకు చేస్తున్నారో అర్థంకాని గందరగోళ పరిస్థితి ప్రయాణికుల్లో నెలకొంది. దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించడంతో 300 మంది ప్రయాణికుల మైండ్ బ్లాంక్ అయ్యింది. కాసేపు విమానం ఎందుకు మళ్లించారో అర్థంకానీ గందరగోళపరిస్థితి నెలకొంది.
ఒకే దేశం, ఒకే ఎన్నికపై కమిటీ తొలి సమావేశం.. ఈ అంశాలపై చర్చించే అవకాశం
దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించి, సిఫారసులు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై మాజీ రాష్ట్రపతి కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ తెలుసుకుంటుంది. దీని అమలు విధానాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమయంలో సాధ్యమయ్యే అడ్డంకులు చర్చించబడతాయి. దాని చట్టపరమైన అంశాలు చర్చించబడతాయి. అంతకుముందు సెప్టెంబర్ 2న ఒకే దేశం ఒకే ఎన్నికపై ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్‌కె సింగ్, సుభాష్ సి కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 1990లో, లా కమిషన్ తన నివేదికలో ఒక దేశం, ఒకే ఎన్నికలకు మద్దతు ఇచ్చింది. లా కమిషన్ కూడా పార్టీ సంస్కరణల గురించి మాట్లాడింది. అలాగే నోటా ఆప్షన్ ఇవ్వాలని లా కమిషన్ కోరింది.
అంగరంగ వైభవంగా 19వ ఎడిషన్ ఆసియా క్రీడలు నేడు ప్రారంభం
19వ ఎడిషన్ ఆసియా క్రీడలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో ఆసియాలోని 40 విభిన్న క్రీడలు, 45 దేశాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పటికే సెప్టెంబరు 19న కొన్ని క్రీడా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ, సెప్టెంబరు 23న జరగనున్న ఆసియా క్రీడల ప్రారంభోత్సవం అధికారికంగా టోర్నీ ప్రారంభం కావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. భారతదేశంలో ఈ ఈవెంట్ ఎప్పుడు, ఏ సమయంలో ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. ఆతిథ్య దేశం గొప్ప సంస్కృతి, వారసత్వానికి ప్రాతినిధ్యం వహించడం.. పాల్గొనే దేశాలలో క్రీడా స్ఫూర్తిని నింపడం వేడుక లక్ష్యం. ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి.చైనాలో జరగాల్సిన ఆసియా క్రీడలు 2022లో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆసియా క్రీడలు 2023 ప్రారంభ వేడుక హాంగ్‌జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం పని 2018లో పూర్తయింది. ఇందులో దాదాపు 80,000 మంది ప్రేక్షకులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేయబడింది. ప్రారంభ వేడుకతో పాటు స్టేడియం రాబోయే ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఫేస్‌బుక్‌లో ఈ మార్పు గమనించారా..? దాని వెనుక కథంటే..?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడూ.. ఎన్నో అప్‌డేట్‌లు తన యూజర్లకు అందుబాటులోకి తెస్తుంది. మేటా నేతృత్వంలోని ఫేస్‌బుక్ తాజాగా తన లోగోలో చిన్న మార్పులు చేసింది.. తన లోగో, వర్డ్‌మార్క్ మరియు రియాక్షన్ ఎమోజీలను రీడిజైన్ చేసింది. కంపెనీ కొత్త లోగో ముదురు రంగులో ఉండి చిన్న అక్షరం ‘f’ని ఉపయోగిస్తున్నప్పటికీ, మునుపటి లోగో మాదిరిగానే కనిపిస్తుంది. అసలు ఫేస్‌బుక్ కొత్త లోగో మార్చాల్సిన అవసరం ఏంటి.. కొత్త లోగో వెనుక ఉన్న కథ ఏంటో ఓసారి తెలుసుకుందాం.. ఎఫ్‌బీ కొత్త లోగో ఎంత భిన్నంగా ఉంది? ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ Meta ఇప్పటికే దాని వెబ్‌సైట్‌లో లోగోను మార్చింది మరియు వర్డ్‌మార్క్ కూడా Facebook Sans ఫాంట్‌గా మార్చబడింది. చిన్న మార్పులు చేసింది.. కొత్త లోగో మునుపటి వలె అదే నీలం రంగును ఉపయోగిస్తుంది.. కానీ విభిన్న టైపోగ్రఫీని కలిగి ఉంది. ఫేస్‌బుక్ లోగోను మార్చిన తర్వాత, ఫేస్‌బుక్ లోగో యొక్క బోల్డ్, మరింత ఎలక్ట్రిక్ మరియు దీర్ఘకాలం రీడిజైన్ చేయడమే మా లక్ష్యం అని కంపెనీ అధికారికంగా తెలిపింది. లోగోలో ‘f’ ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి మరింత కాంట్రాస్ట్ ఉపయోగించబడింది. లోగో మార్పు వెనుక, కంపెనీ మూడు కీలక అంశాలపై దృష్టి సారించింది. బ్రాండ్ యొక్క అత్యంత జనాదరణ పొందిన అంశాలను ఎలివేట్ చేయడం, ఫేస్‌బుక్‌ని బ్రాండ్‌గా ఏకీకృతం చేయడం మరియు సమగ్రమైన రంగుల సెట్‌ను సృష్టించడం వంటివి ఇందులో ఉన్నాయి. సోషల్ మీడియా దిగ్గజం ప్రస్తుతం 2 బిలియన్లకు పైగా రోజువారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉందని వెల్లడించింది. కొత్త లోగోతో, కంపెనీ మరింత ప్రత్యేకమైన మరియు తాజా గుర్తింపును సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ప్లాట్‌ఫారమ్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఫేస్‌బుక్ లోగోలో మార్పులతో పాటుగా మారిన రియాక్షన్‌లు మరియు ఎమోజీలకు కొత్త డిజైన్‌ను అందించింది. వచ్చేనెలలో కొత్త ఎమోజీని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపింది. ఫేస్‌బుక్ ప్రస్తుతం తన యాప్‌ను రీడిజైన్ చేసే పనిలో ఉందని, ఇందులో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.
రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు ఇవే
ఫోల్డబుల్ ఫోన్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉండే ఈ ఫోన్ ను కొనాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ఫాంటం భారత్ మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీని తీసుకువచ్చేసింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ ఫోన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన కంపెనీ రెండో ఫోల్డబుల్ ఫోన్ ను శుక్రవారం ఆవిష్కరించింది. వచ్చేనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇక దీని ధర కూడా రూ.50 వేల లోపే ఉండనుండటం విశేషం. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ ఫోన్ 8GB+256GB స్టోరేజీతో వస్తుంది. ఇక ఇది ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ రంగులలో రానుంది. 6.9 Inches ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ AMOLED ఇన్నర్ డిస్‌ప్లేను ఇది కలిగి ఉండనుంది. సర్క్యూలర్ AMOLED డిస్‌ప్లే 1.32 Inchesతో వస్తుంది. ఇక్కడి నుంచే నేరుగా మెసెజెస్‌కు రిప్లయ్ కూడా ఇవ్వొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ 8050 ప్రాసెసర్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13.5 వర్షన్ మీద పని చేస్తుందీ పోన్. ఇది రెండేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. దీనిలో వస్తున్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే దీంట్లో ఉండే 8GB ర్యామ్‌ను రెట్టింపు స్థాయికి అంటే 16GB వరకు పెంచుకోవచ్చు. ఇక బ్యాటరీ కెపాసిటీ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000mAh వస్తుంది. ఇక మనందరికి ఎంతో ముఖ్యమైన కెమెరా విషయానికి వస్తే 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, క్వాడ్ ఫ్లాష్ లైట్ యూనిట్‌తో 13-అంగుళాల మెగా పిక్సెల్ సెన్సర్ విత్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా లభిస్తుంది. ఇక సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 5జీతోపాటు వై-ఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పోటీపడనుంది. ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్ల కంటే తక్కువ ధరకే వస్తూ ఉండటంతో దీనిని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది.
క్రియేటర్లకు గుడ్ న్యూస్.. కొత్త యాప్ తీసుకుస్తున్న యూట్యూబ్
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక వీడియోను రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా చాలా చేసిన తరువాతే ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పనులు అన్నింటిని తేలిక చేసేయనుంది యూట్యూబ్. దీని కోసం యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దాని ద్వారా వీడియోస్ ను క్రియేట్ చేసే విధంగా యాప్ ను రూపొందించనున్నారు. దీని ద్వారా వీడియోలను చాలా సులభంగా రూపొందించవచ్చు. ఈ విషయాన్ని గూగుల్‌మాతృ సంస్థ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఎక్స్ (ట్విటర్)లోప్రకటించారు. వీడియో క్రియేట్‌లో ప్రెసిషన్ ఎడిటింగ్ , ట్రిమ్మింగ్, క్యాప్షనింగ్ , ఆటోమేటిక్ వాయిస్‌ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. చాట్ బాక్స్‌లో మనం అనుకున్నది టైప్ చేయడం చేస్తే AI- దానంతటకదే వీడియో లేదా చిత్రాన్ని జోడించేలా ‘డ్రీమ్ స్క్రీన్’ అనే కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వార కేవలం టాపిక్ కు సంబంధించినవే కాకుండా ట్రెండింగ్ లో ఉన్న విషయాలకు సంబంధించిన వీడియోలు, ఇమేజ్ లు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్‌టైం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నవారికి మరింత అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. టిక్‌టాక్ మాదిరిగానే బీట్ మ్యాచింగ్ టెక్నాలజీతో ఉండే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్‌ను కూడా ఇందులో వినియోగదారులు వాడుకోవచ్చు. ఇక ఈ యాప్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో ఫీచర్లను మనం ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ కొరియా, ఇండోనేసియా, సింగపూర్, భారత్ సహా కొన్ని మార్కెట్లలో ఆండ్రాయిడ్ బీటా యూజర్లలకు అందుబాటులో ఉంది. ఇక వచ్చే ఏడాది నుంచి ఈ యాప్ ను ఐవోఎస్ యూజర్లకు కూడా ప్రవేశపెట్టనున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
ఏం క్రియేటివిటి బాసూ.. ఇంజనీర్లు పనికిరారు.. వీడియో చూస్తే షాకే..
దేశ వ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఇంజనీర్లను కూడా పక్కన పెట్టేసేలా వినాయకుడి విగ్రహాలను అద్భుతంగా తయారు చేశారు.. ఒక్కో విగ్రహం ఒక్కో వింతను తలపిస్తుంది.. అద్భుతలను సృష్టించారు.. చంద్రయాన్ 3 వినాయక మండపం అందరిని ఆకట్టుకోగా, ల్యాండింగ్, టెకాఫ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు మరో వినాయకుడి వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగానే వినాయడును చూసినట్లే ఉంటుంది.. సజీవంగా ఉండే వినాయకుడిని చూసినట్లే ఉంటుంది.. ఆ విగ్రహ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూసేద్దాం.. సోషల్ మీడియాలో వినాయక విగ్రహంకు సంబంధించి గతేడాది వీడియో తాజాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో కూర్చుని ఉన్న వినాయకుడు భక్తులు వచ్చి పాదాలు తాకగానే వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా లేచి నిలబడతాడు.. మళ్లీ ఆశీర్వదించి యదాస్థానంలో కూర్చుంటాడు.. నిజంగానే వినాయకుడా అనే సందేహం కూడా జనాలకు కలుగుతుంది.. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు.. ఈ వినాయకుడుకు పాదాల్లో ఉంది.. ఈ వీడియో ప్రస్తుతం మీడియాలో తెగ వైరల్ అవుతుంది..