గన్‌మెన్‌లను సరెండర్ చేసిన మాజీమంత్రి బాలినేని.. డీజీపీకి లేఖ
ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు.. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న బాలినేని.. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేశారు.. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరిన బాలినేని.. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్ సమక్షంలో ఎస్పీని కోరారు బాలినేని.. పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. కాగా, ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు బాలినేని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని.. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అంటూ ఆవేదన వెలిబుచ్చారు.. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని.. అందుకే తన గన్‌మెన్‌లను తక్షణం సరెండర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు బాలినేని.. అయితే.. మాజీ మంత్రి, అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే ఇప్పుడు తన గన్‌మెన్‌లను సరెండర్ చేస్తూ లేఖ రాయడం జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది.
చంద్రబాబు పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..
టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా.ఎమ్.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు కొనసాగనున్నాయి.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభంకానుంది.. ఈ రోజు 45వ ఐటెమ్ గా లిస్ట్ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించనున్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముకుల్ రోత్గి వాదనలు కొనసాగించనున్నారు.. కాగా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు.. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి ఏపీ ప్రభుత్వ వాదనలు పూర్తికానందున ఈ రోజు మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే ముకుల్‌రోహత్గీ తన వాదనలను కొనసాగించనున్నారు.. కాగా, హైకోర్టులో దాఖలుచేసిన క్వాష్‌పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గత నెల 22వ తేదీన తీర్పును వెలువరించింది.. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తుండగా.. ఈ రోజు ఇరుపక్షాల వాదనలు ముగించనున్నారు.. మరోవైపు.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.. దీంతో.. ఇవాళ చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ ముగిసన వెంటనే.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ సాగనుంది.
నేడు సిద్దిపేట, సిరిసిల్లకు సీఎం.. బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు భారీ ఏర్పాట్లు
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ముందుగా సిరిసిల్ల బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో, ఆ తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇందుకోసం రెండు పట్టణాలను కేటాయించారు. సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అర కిలోమీటరు దూరంలోని విశాలమైన స్థలంలో బీఆర్ ఎస్ పార్టీ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల కటౌట్లతో సిరిసిల్ల పట్టణం గులాబీమయమైంది. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందిని తరలించాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ముఖ్య నేతలంతా సీఎంకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లలో చేరారు. నాగదేవత గుడి నుంచి సిరిసిల్ల వైపు వెళ్లే బైపాస్ రోడ్డులోని మైదానంలో భారీ బహిరంగ సభకు వేదికను ఏర్పాటు చేశారు. సభా వేదికను గులాబీ రంగు వస్త్రాలతో అందంగా అలంకరించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సభా స్థలం, పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. జనసమీకరణ లక్ష్యంగా మండల, గ్రామాలకు ఇన్ చార్జిలను నియమించారు. ఎన్నికల నగారా మోగిన అనంతరం సిద్దిపేటలో సీఎం కేసీఆర్ నిర్వహించిన సభకు పార్టీ నేతలు, శ్రేణులు హాజరుకానున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు పెద్దఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు సభా వేదిక, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభమవుతుందని పార్టీ నేతలు వెల్లడించారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. సిద్దిపేట నేల బిడ్డ సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. లక్ష మందితో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి 20 వేల మంది యువకులు మోటారు సైకిళ్లపై అసెంబ్లీకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న వాహనాలు, పార్టీ ఏర్పాటు చేసిన వాహనాలపై ప్రజలు తరలివచ్చి సిద్దిపేట పేరును ప్రపంచ పటంలో నిలిపిన సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వాద సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నేడే స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!
నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించనుంది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో స్వలింగ సంపర్కుల జంటలు చాలానే ఉన్నాయి. సుప్రియో చక్రవర్తి-అభయ్ డాంగ్, పార్థ్ ఫిరోజ్ మెహ్రోత్రా-ఉదయ్ రాజ్ ఆనంద్.. పలువురు పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని 20కి పైగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రత్యేక వివాహ చట్టంలో మతాంతర, కులాంతర వివాహాలకు రక్షణ ఉందని పిటిషన్లలో పేర్కొన్నారు. స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. పరస్పర అంగీకారంతో ఇద్దరు పెద్దల మధ్య స్వలింగ సంపర్కం నేరమని 2018లో సుప్రీం కోర్టు ప్రకటించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377లోని భాగాన్ని కోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత గే వివాహాలకు చట్టపరమైన హోదా కల్పించాలనే డిమాండ్ వచ్చింది. చివరకు 2022లో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ఈ ఏడాది ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. నేడు తీర్పు వెలువరించనుంది.
తమిళనాడులో దారుణం.. భర్త ప్రాణాలు తీసిన భార్య సీరియల్ పిచ్చి!
ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ అభిమాన సీరియల్ వస్తుందంటే చాలు.. అన్ని పనులు పక్కనపెట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు. సీరియల్ వస్తున్న సమయంలో పక్కన ప్రపంచాన్ని అస్సలు పట్టించుకోరు. భర్త, పిల్లలు ఛానెల్ మార్చమన్నా.. కొందరు ససేమిరా అంటారు. ఈ సీరియల్ పిచ్చి వలన భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ భర్త ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. భార్య సీరియల్ పిచ్చితో ఓ భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం… తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో భార్యాభర్తలు నిషా, ఆశీర్వాదం నివాసం ఉంటున్నారు. ఆశీర్వాదం ఆఫిస్ నుంటి ఇంటికి వచ్చే సరికి భార్య నిషా తనకు ఇష్టమైన సీరియల్ చూస్తోంది. ఛానల్ మార్చాలంటూ భార్య నిషాను ఆశీర్వాదం కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆశీర్వాదంకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఛానల్ మార్చాలంటూ ఆశీర్వాదం పట్టుపట్టాడు. దాంతో చిన్న గొడవ కాస్త తీవ్ర స్ధాయికి చేరింది. నిషా కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. అదే కోపంతో ఆశీర్వాదం కూడా ఇంటి నుండి బయటికి వెళ్లాడు. నిషా తిరిగి ఉదయం ఇంటికి రాగానే ఆశీర్వాదం ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య నిషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బిగ్ బాస్ బ్యూటి అశ్విని మహేష్ సినిమాలో నటించింది తెలుసా?
తెలుగులో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. విమర్శలు, ప్రశంసలు అందుకుంటుంది.. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్న సంగతి తెలిసిందే.. ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో అని జనాలను ఆలోచనలో పడేస్తుంది.. సీరియల్ బ్యాచ్ తో పాటు కొత్త ముఖాలను కూడా హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్.. అందులో ఒకరు అశ్విని.. ఈ అమ్మడు గురించి చాలా మందికి తెలియదు.. నిజానికి ఈ అమ్మడు సినిమాలో నటిగా చేసింది.. ఈ అమ్మడు గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అశ్వినిని అక్టోబర్ 8వ తేదీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్.. హౌస్ లోకి వెళ్లిన తర్వాత అశ్విని తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగు పెట్టినటువంటి ఈ అశ్విని ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఈమె ఇదివరకు ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అశ్వినికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా హాట్ టాపిక్ అవుతుంది.. అదేంటంటే ఈ అమ్మడు మహేష్ బాబు సినిమాలో కూడా నటించింది అట.. అవునా ఏ సినిమాలో అనే సందేహం రావొచ్చు..మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక రెండో అక్క పాత్రలో నటించారు. అశ్విని ట్రైన్లో జరిగే సన్నివేశాలలో కీలక పాత్ర పోషిస్తూ తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అశ్విని తరచూ తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చిన ఈ అమ్మడును ప్రేక్షకులను ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి..
చంద్రముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ లారెన్స్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమాను డైరెక్టర్ వాసు సీక్వెల్ గా తెరక్కించాడు. ఈ సినిమా కు విడుదల ముందు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. భారీ హైప్ తో ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా విడుదల అయింది.అయితే విడుదల అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది.కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించడం,అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించడం, లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ సీక్వెల్ చంద్రముఖి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేపోయింది. దాదాపు 60కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నలభై కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు 20 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.తెలుగు వెర్షన్ అయితే డిజాస్టర్‌గా నిలిచింది. రజనీకాంత్ చంద్రముఖి తరహాలో హారర్, థ్రిల్లింగ్ అంశాలు ఈ సీక్వెల్‌లో మిస్సయ్యాయనే విమర్శలొచ్చాయి. చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సుభీక్ష ప్రధాన పాత్రలు పోషించారు.ఇదిలా ఉంటే థియేటర్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోన్నట్లు సమాచారం.తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చంద్రముఖి 2 రిలీజ్ కానున్నట్లు తెలిసింది. చంద్రముఖి 2 కథ విషయానికి వస్తే చంద్రముఖి ప్యాలెస్ నుంచి చాలా ఏళ్ల క్రితం వెళ్లిపోయిన ఆత్మ మళ్లీ తిరిగొస్తుంది. మదన్ (లారెన్స్) కుటుంబాన్ని ఇబ్బందిపెడుతుంది. చంద్రముఖి ఆత్మ బారి నుంచి మదన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా కథ.అయితే ఓటీటీ రిలీజ్‌కు ముందే చంద్రముఖి 2 సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి హెచ్‌డీ ప్రింట్ పైరసీ సైట్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపించడంతో ఈ సినిమా యూనిట్ వెంటనే అప్రమత్తం అయింది.