మొరాయించిన సర్వర్లు.. మ్యానువల్‌గా రిజిస్ట్రేషన్లు.. అసలు కారణం అదేనా?
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా సర్వర్లు మొరాయించాయి.. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం తరలిరావడంతో.. సర్వర్లు బిజీగా మారి మొరాయించినట్టు చెబుతున్నారు.. ఈ ఎఫెక్ట్‌తో రెండు రోజులుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి.. దీంతో, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర రద్దీ పెరుగుతోంది.. ఇదే, సమయంలో, సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆఫీసుల దగ్గర ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి మ్యానువల్‌గా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొంది.. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం.. సర్వర్లలో సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో మ్యానువల్‌గానే రిజిస్ట్రేషన్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే, జూన్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఉద్దేశ్యపూర్వకంగానే రిజిస్ట్రేషన్లు చేయడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు సాధారణ ప్రజలు.. గంటల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చిందని.. అయినా.. రిజిస్ట్రేషన్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలా ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపడం సరికాదని అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దని, నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. కాగా, జూన్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి జనం భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూ కట్టడంతోనే సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెబుతున్నారు..
నేను సామాన్యుడిని.. నేను ఎంపీని కాదు..
రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ ఎన్నారై శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అమెరికాలోని మూడు నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులతో, అమెరిక్ చట్టసభ సభ్యులతో సమావేశం కానున్నారు. మంగళవారం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న రాహుల్ గాంధీకి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ శామ్ పిట్రోడా, ఐఓసీ ఇతర సభ్యులు స్వాగతం పలికారు. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం రాహుల్ గాంధీ విమానాశ్రయంలో రెండు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇమ్మిగ్రేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ క్యూలో నిల్చోని ఉండగా.. పలువురు ప్రయాణికులు అతనితో సెల్పీలు తీసుకున్నారు. క్యూలో ఎందుకు నిలుచున్నారని.. అక్కడి ప్రయాణికులు ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ‘‘నేను సామాన్యుడిని.. ఇది నాకు ఇష్టం.. ఇక ఎంపీని కాదు’’ అని సమాధానం ఇచ్చారు. ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముచ్చటించనున్నారు. ఆ తరువాత వాషింగ్టన్ లోని చట్ట సభ సభ్యులతో సమావేశం కానున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. జూన్ 4న న్యూయార్క్‌లో బహిరంగ సభతో తన పర్యటనను ముగించబోతున్నాడు. రాహుల్ గాంధీ నిజమైన ప్రజాస్వామ్యం దృక్పథాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పర్యటన ఉందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ శామ్ పిట్రోడా అన్నారు. ఢిల్లీ కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన రెండు రోజుల తర్వాత రాహుల్ గాంధీకి ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్ట్ లభించింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఆయన డిప్లామాటిక్ పాస్ పోర్టు సరెండర్ చేసి సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
కొత్త రకం మాఫియా.. బెంగళూరులో వెలుగులోకి
లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియాతోపాటు రియల్ ఎస్టేట్ మాఫియా చూశాం.. కానీ బెంగళూరులో ఈ మధ్య కొత్త మాఫియా పుట్టుకొచ్చింది. అదే పంక్చర్ మాఫియా.. అదేంటీ పంక్చర్ మాఫియా ఎంటనీ ఆచ్చర్యపోతున్నారా? అవును ఇది నిజం. ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు నగరంలో పంక్చర్ మాఫియా వచ్చింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌ను స్కూటీ పంక్చర్ అయ్యేలా పంక్చర్ షాపులకు దగ్గరలో చిన్న మేకులు, మొనదేలిన తీగలను వేసి కారు, బైక్ టైర్లు పంక్చర్ అయ్యేలా చేసి.. వారు తమ పంక్చర్ షాపుకు వచ్చేలా చేసుకుంటున్నారు మాఫియాదారులు.. అదేంటో చూద్దాం.. బైక్‌పై గానీ లేదా కార్‌లోగానీ వెళుతుంటే ప్రయాణం మధ్యలో టైర్ పంక్చర్ అయితే ఎంతో కష్టంగా ఉంటుంది.. రాత్రిపూట బైక్ పంక్చర్ అయినా.. లేకపోతే కుటుంబంతో వెళుతున్న సమయంలో కారు పంక్చర్ అయినా ఎంతో నరకం చూస్తాం. ఆ టైమ్‌లో పంక్చర్ షాపుల కోసం వెతుక్కోవడం.. దగ్గరలో ఉన్న వారిని పంక్చర్ షాపు ఎక్కడ ఉందని అడిగి దగ్గరలో ఉన్న పంక్చర్ షాపుకు వెళతాం.. టైర్ పంక్చర్ వేయించుకొని తిరిగి మన ప్రయాణం కొనసాగిస్తాం. ఇప్పుడు బెంగళూరులో పంక్చర్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరు శివారులో పంక్చర్ దుకాణానికి అటూ ఇటుగా కిలోమీటర్ సమీపానికి రాగానే వాహనం టైరు పంక్చర్ అవుతోంది. దగ్గర్లోని పంక్చర్ షాపు వద్దకు వాహనాన్ని తీసుకెళ్తే.. వాళ్లు ట్యూబ్ పాడైందని, ఇంకేదో అయ్యిందని చెప్పి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొంత మందైతే.. టైరు కూడా పాడైందని చెప్పి మార్పిస్తున్నారు. తరచూ ఇలా జరుగుతుండటంతో కొంత మంది వాహనదారులకు అనుమానం కలిగింది. ఏంటని ఆరా తీయడంతో కొత్త రకం మాఫియా గుట్టు రట్టైంది.
పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎక్కడంటే
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాఠశాలలకు మే 31 వరకు ఇచ్చిన వేసవి సెలవులను పొడిగించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించినట్టు పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. మంత్రి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టలేదని, అందువల్ల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 1వ తేదీకి బదులుగా 7వ తేదీన పాఠశాలల్ని పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబ్‌సకు విధించిన నిబంధనల్ని సడలించి, అనుమతి ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో వున్న 127 ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీబీఎస్‌ఈ పాఠ్యాంశాన్ని అమలు పరిచేందుకు అనుమతులు లభించాయని.. అందువల్ల సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల కొనుగోలు పనులు ప్రారంభిచామని మంత్రి తెలిపారు. తొలి విడతగా కారైక్కాల్, మాహే, యానాం ప్రాంతాలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తున్నామన్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఉచిత యూనిఫారం, సైకిళ్ల పంపిణీ జరిగిందని చెప్పిన మంత్రి.. ఒకటిన్నర నెలలో ల్యాప్‌టాప్‌లను కూడా అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన పథకాలన్నింటినీ ప్రభుత్వం దశల వారీగా నేరవేరుస్తుందన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
150 మెడికల్ కాలేజీలకు గుర్తింపు రద్దు!.. ప్రతిపాదనలు రెడీ
దేశంలో 150 మెడికల్ కాలేజీలకు ఈ ఏడాది 2023-24లో గుర్తింపు రద్దయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ సిద్ధం చేసినట్టు సమాచారం. నెల రోజులుగా ఎన్‌ఎంసీ చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డ అంశాల ఆధారంగా కమిషన్ ఆయా కాలేజీలకు ఈ ఏడాది(2023-24) గుర్తింపును ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఎన్‌ఎంసీ ప్రమాణాలను పాటించకపోవడంతోపాటు.. నిబంధనలు అమలు చేయని 40 కాలేజీలు ఇప్పటికే గుర్తింపును కోల్పోయినట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. కాలేజీల గుర్తింపు రద్దు చేయడానికి ప్రధాన కారణం సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడంతోపాటు నిబంధనలను పాటించకపోవడమేనని అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ నిబంధనలు అమలు చేయని.. సరిపడా బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయని మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించాలని, మంచి వైద్యులను తయారు చేయాలని కేంద్ర మంత్రి సూచించిన విషయం తెలిసిందే.
మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి 300 మంది ఉగ్రవాదులు.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ హెచ్చరిక..
జాతుల సంఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. మైయిటీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 80 మందికి పైగా ప్రజలు మరణించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మణిపూర్ వెళ్లారు. శాంతి స్థాపన కోసం పలు పార్టీలతో సంభాషించారు. మరోవైపు తిరుగబాటుదారుల ముగుసులో ఉగ్రవాదులు గ్రామాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మణిపూర్ సరిహద్దును అనుకుని ఉన్న మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హింసకు ఉగ్రవాదులు కారణం అవుతున్నారు. గ్రామాలపై దాడులు చేయడానికి తిరుగుబాటుదారులను ఉపయోగించుకుంటున్నట్లు మైయిటీలు, కుకీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. శాంతిని నెలకొల్పడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మరియు భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మణిపూర్‌లో శాంతి మరియు సాధారణ స్థితిని తీసుకురావడంలో పాల్గొన్న ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రోజు ఇంఫాల్ లో సమావేశం అవుతున్నారు. ఇదిలా ఉంటే మయన్మార్ నుంచి లుంగీలు ధరించిన వారితో సహా 300 మంది ఉగ్రవాదులు మణిపూర్(భారత్)లోకి మయన్మార్ నుంచి చొరబడినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిషికాంత సింగ్ (రిటైర్డ్) హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.. ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, భారత సైన్యాన్ని ట్యాగ్ చేశారు. లుంగీలు ధరించడాన్ని మయన్మార్ సరిహద్దుల్లోని తిరుగుబాటుదారులను సూచిస్తుంది. వారు పౌరుల మాదిరిగానే లుంగీలు ధరిస్తారు. వీరంతా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు. లెఫ్టినెంట్ జనరల్ సింగ్ 40 ఏళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి 2018లో పదవీ విరమణ చేశారు. అతను ఇంటెలిజెన్స్ కార్ప్స్‌లో కూడా ఉన్నాడు. మణిపూర్ రాష్ట్రం మయన్మార్ తో 400 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది. దీంట్లో కేవలం 10 శాతం కంటే తక్కువగా కంచె నిర్మించారు. మణిపూర్ మయన్మార్, లావోస్, థాయ్ లాండ్ సరిహద్దుల ట్రైజంక్షన్ అయిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’. ఇక్కడ నుంచి ఈశాన్య భారతంలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.
ముద్దు పెడితే భయంకరమైన వ్యాధి వస్తుందా? లక్షణాలు?
ముద్దు పెట్టుకుంటే ప్రేమ పెరుగుతుందని అందరు అనుకుంటారు.. ఇక లవర్స్, కపుల్స్ మూడ్ వస్తుందని భావిస్తారు.. మూడ్ రావడం ఏమో కానీ భయంకరమైన వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది? ఎవరికీ వస్తుంది? లక్షణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో లేదా ముద్దు వ్యాధి అనికూడా అంటుంటారు.ఈ ముద్దు వ్యాధి ఎక్కువగా కౌమారదశ, యువకులనే ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..ఈ వ్యాధి ఎప్స్టీన్-బార్ వైరస్, లేదా EBV వల్ల వస్తుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది.. ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకితుంది..సలైవా ద్వారా ఈజీగా సోకుతాయి.. ఈ వ్యాధి లక్షణాలు.. అలసట, గొంతు నొప్పి, కనీసం 100.4 ఉష్ణోగ్రతతో జ్వరం, రోజంతా లేదా రాత్రి మొత్తం చెమటలు, వికారం, తలనొప్పి, చలి, ఒంటి నొప్పులు, దగ్గు, ఆకలి వెయ్యక పోవడం ఉంటాయి.. ఈ ముద్దు వ్యాధి బారిన పడకూడదంటే ముందుగా మీ చేతులను తరచుగా సబ్బు, గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవడం అలవాటు చేసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే మీకు ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటికి కర్చీఫ్ ను అడ్డం పెట్టుకోండి.. అప్పుడే ఈ వ్యాధి తీవ్రత తగ్గుతుంది.. నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఎప్పుడు శుభ్రంగా ఉండాలి..