రాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. కారుతో తొక్కించి.. రాళ్లతో మోది..!
ప్రకాశం జిల్లాలో హత్యకు గురైన రాధ కేసు కలకలం రేపుతోంది.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద హత్యకు గురైన రాధ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.. గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన రాధ హత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలపై ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.. ఇంటి నుంచి వెళ్ళి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి సుధాకర్ రెడ్డి.. సెల్ లొకేషన్ ద్వారా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద రాధ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. రాధను కారుతో ఢీకొట్టి, రాయితో మోదీ అతి కిరాతకంగా హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.. రాధ హత్య కేసులో ఆమె స్నేహితుడు కాశిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. ఆర్థిక వ్యవహారంలో గత కొద్దికాలంగా స్నేహితునితో రాధకు విభేదాలు ఉన్నట్టు చెబుతున్నారు. రాధ స్నేహితుడు కాశిరెడ్డి మరికొందరితో కలసి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.. మరోవైపు.. కాశిరెడ్డి కోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.. రాధ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన నేపథ్యంలో రిపోర్ట్ వస్తే మరికొన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.. ఇక, రాధను కారుతో తొక్కించటం కంటే ముందు.. దుండగులు ఆమెను కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు, వారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు ఘటనా స్థలంలో పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. రాధ శరీరమంతా ఉన్న గాయాల ఆనవాళ్లను పరిశీలిస్తే నలుగురైదుగురు వ్యక్తులు దారుణంగా చంపినట్లుగా భావిస్తున్నారు.. వెలిగండ్ల మండలం గుండ్లోపల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు రూ.50 లక్షల అప్పు ఇచ్చారని, అతనే తన అనుచరులతో కలిసి తమ కుమార్తెను హత్య చేసి ఉంటారంటూ రాధ తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు..
హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం.. దుర్గం చిన్నయ్యపై వెలిసిన బ్యానర్లు
హైదరాబాద్ లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై హైదారాబాద్ లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడంతో సంచలనంగా మారింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ , మీడియా సంస్థల అధినేతలు విన్నపము అంటూ మాకు న్యాయం చేయాలని ప్లీక్సీలో ఉంది. స్త్రీల రక్షణ కల్పించాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుండి బెల్లంపల్లి నియోజవర్గ ప్రజలను కాపాడండి అంటూ.. వివిధ ఆరోపణలతో ఆరిజన్ డెయిరీ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం సృస్టిస్తున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో ఈ వ్యవహారం కాస్త సంచలనంగా మారింది. హైదరాబాదులోని పలు చౌరస్తాలలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫ్లెక్సీలు దుమారం రేపుతున్నాయి. రాత్రి రాత్రే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పలు ఆరోపణలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనమివ్వడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా బీఆర్ఎస్ భవన్, మీడియా కార్యాలయాల వద్దే ప్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యక్షమవడంతో తీవ్ర సంచలనంగా మారింది.
మేఘా పర్మార్‌ను అంబాసిడర్‌గా తొలగించిన ఎంపీ సర్కారు
మేఘా పర్మార్.. మధ్యప్రదేశ్ నుండి మౌంట్ ఈవెంట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి మహిళ. ఆమె పేరును ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్‌గా తొలగించబడిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 9న చింద్వారాలో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘా పర్మార్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన ఒక రోజు తర్వాత, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్న మేఘాను మహిళా, శిశు అభివృద్ధి శాఖ రద్దు చేసింది. ఐదు రోజుల తర్వాత, మే 15న, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్‌గా ఆమె పేరు కూడా తొలగించబడింది. ఈ పరిణామాన్ని అనుసరించి, కాంగ్రెస్‌లో చేరినందుకే మేఘాను అంబాసిడర్ పాత్ర నుండి తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. దేశం గర్వించేలా చేసిన మేఘా పర్మార్‌ను కాంగ్రెస్‌లో చేరడమే ఏకైక నేరంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అంబాసిడర్‌గా తొలగించారని ఆ పార్టీ నాయకుడు కేకే మిశ్రా అన్నారు.
విరాట్ విశ్వరూపం.. నాల్గో స్థానానికి ఆర్సీబీ
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 187 పరుగుల లక్ష్యఛేదనలో ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా వీర బాదుడు బాదాడు కోహ్లీ. 63 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి, సన్‌రైజర్స్ ఆటగాడు భువీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన గేల్ రికార్డును సమం చేశాడు కోహ్లీ. ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ సునాయాసంగా నెగ్గింది. 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేశాడు డుప్లెసిస్. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక రివర్స్ స్కూప్ తో బౌండరీ సాధించడంతో ఆర్సీబీ గెలుపు ముంగిట నిలిచింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 3 పరుగులు అవసరం కాగా… కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో ఈజీగా పరుగులు చేసిన ఆర్సీబీ విజయ ఢంకా మోగించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్…. 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది బెంగళూరు టీం.
అంబానీ లిఫ్ట్ చూశారా? డబుల్ బెడ్రూం అంత ఉంటుంది
భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ ఇల్లు `యాంటిలియా` గురించి వినే ఉంటారు. ముంబాయి అల్టామౌంట్ రోడ్‌లో యాంటిలియా భవనం ఉంది. ఇందులో మొత్తం 27 అంతస్తులు ఉంటాయి. యూకేకు చెందిన బకింగ్ హామ్ ప్యాలస్ తర్వాతే ఇదే అత్యంత ఖరీదైన భవనం. దీని విలువ రూ.12000 కోట్లు. దక్షిణ ముంబాయి మధ్యలో ఈ భవనం ఉంది. యాంటిలియా నుంచి ముంబాయి మొత్తం కనిపించడమే కాదు అరేబియన్ సముద్రాన్ని కూడా వీక్షించవచ్చు. 9 లిఫ్టులు కలిగి ఉన్న ఈ భవనంలో హెల్త్ స్పా, సెలూన్, మూడు స్విమ్మింగ్ పూల్స్, ఒక బాల్‌రూమ్, యోగా, డ్యాన్స్ స్టూడియోలు, విలాసవంతమైన లివింగ్ రూమ్స్, అతిపెద్ద గార్డెన్ ఉన్నాయి. ఈ యాంటిలియా భవనంలో ఆరు అంతస్తులు కారు పార్కింగ్ కి కేటాయించారు. మొత్తం 168 కార్లు పార్క్ చేసేందుకు కావాల్సినంత స్థలం ఉంటుంది. అలాగే ఈ భవనంలో దాదాపు 600 మంది ఉద్యోగులు నిత్యం పని చేస్తుంటారు. ముంబాయి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు యాంటిలియాలో స్నో రూమ్ కూడా ఉంటుంది. ఇక తీవ్రమైన భూకంపాలు సంభవించినప్పటికీ తట్టుకునేలా ఈ భవనాన్ని రూపొందించడం మరొక విశేషం.
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్..
ట్విట్టర్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు ఎలాన్ మస్క్.. అంటే ట్విట్టర్ యూజ్ చేసే అందరికీ కాకుండా ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రంమే ఇది వర్తిస్తుంది.. ఎన్నో పరిణామాల తర్వాత ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మస్క్.. కీలక మార్పులు చేస్తూ వచ్చారు.. ఇప్పుడు బ్లూ టిక్ సబ్‌స్కైబర్‌లు 2 గంటల వరకు నిడిది గల వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు.. Twitter బ్లూ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు రెండు గంటలు లేదా 8 జీబీ వరకు నిడివి ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ గురువారం రాత్రి ప్రకటించారు. “ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు 2 గంటల వీడియోలను (8GB) అప్‌లోడ్ చేయవచ్చు!” అని అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో రాసుకొచ్చారు. ట్విట్టర్ బ్లూ టిక్ యూజర్లు ఇతర ఫీచర్లతో పాటు ట్వీట్లను ఎడిట్ చేయగలరు.. ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేయగలరు. అదే నాన్-ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్ అయితే 140 సెకన్ల అంటే 2 నిమిషాలు, 20 సెకన్లు వరకు మాత్రమే వీడియోలను అప్‌లోడ్ చేయగలరు. కాగా, ఏప్రిల్ 1న, ఎలాన్ మస్క్ Twitter బ్లూ బ్యాడ్జ్ కోసం చందాను ప్రవేశపెట్టారు, ఇది గతంలో ఉచితంగా జారీ చేయబడింది. తరువాత ఇది ఒక చెల్లింపు సేవగా మారింది. భారతీయ వినియోగదారులు వెబ్‌సైట్ మరియు మొబైల్‌లో వరుసగా నెలకు రూ.650 మరియు రూ.900కి సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. సబ్‌స్క్రైబర్‌లు తమ ట్వీట్‌లను పోస్ట్ చేసిన 30 నిమిషాలలోపు ఐదు సార్లు సవరించవచ్చు, ఎక్కువ వీడియోలను పోస్ట్ చేయవచ్చు, 50 శాతం తక్కువ ప్రకటనలను వీక్షించవచ్చు మరియు కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. వారి పోస్టులకు కూడా కంపెనీ ప్రాధాన్యతనిస్తుంది. పాలసీల ప్రకారం, 90 రోజుల కంటే ఎక్కువ పాత ఖాతాను కలిగి ఉన్న వినియోగదారులు ఎగువ ఎడమ వైపున ఉన్న ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయడం ద్వారా Twitter బ్లూని యాక్సెస్ చేయవచ్చు.
నలభై ఏళ్ళ ‘బహుదూరపు బాటసారి’
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ అంటే అప్పట్లో జనానికి భలే క్రేజ్! ఏయన్నార్, దాసరి కలయికలో ఓ డజన్ సినిమాలు వెలుగు చూశాక వచ్చిన చిత్రం ‘బహుదూరపు బాటసారి’. ఈ సినిమాకు ముందు దాసరి దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం” వంటి హిట్ మూవీస్ జనాన్ని భలేగా అలరించాయి. వాటిలో ‘ప్రేమాభిషేకం’ ప్లాటినమ్ జూబ్లీ కూడా చూసింది. దాంతో దాసరి-అక్కినేని కాంబో అనగానే జనానికి సదరు చిత్రంపై ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఏయన్నార్ హీరోగా దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రంగా ‘బహుదూరపు బాటసారి’ జనం ముందు నిలచింది. 1983 మే 19న ‘బహుదూరపు బాటసారి’ వెలుగు చూసింది; జనాదరణ పొందింది. ‘బహుదూరపు బాటసారి… ఇటు రావోయి ఒక్కసారి…’ అంటూ ఘంటసాల గానం చేసిన పాటలోని పల్లవి మొదటి పంక్తినే తమ సినిమా టైటిల్ గా చేసుకున్నారు దాసరి. కథలోకి తొంగిచూస్తే – ప్రసాద్ ఓ సిన్సియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్. ఆయన భార్య ప్రభ. వారి పిల్లలు భాను, రాజా, సుహాసిని. అమ్మాయి మూగది. పిల్లలు సుఖంగా ఉండడం కోసం ప్రసాద్ సాదారణ జీవితం గడుపుతూ వారు ఆనందంగా ఉండేలా చూస్తూ ఉంటాడు. ప్రసాద్ పిల్లల కోసం నీతిగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటే, అతని పక్కనే ఉన్న అవతారం డబ్బులు ఇస్తే పిల్లలు చెడిపోతారని భార్యను, కొడుకులను క్రమశిక్షణ పేరుతో నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ప్రసాద్ పిల్లలు పెరిగి పెద్దవారై తాము కోరుకున్న అమ్మాయిలను పెళ్ళాడతారు. మూగ అమ్మాయి సుహాసినిని, మూగవాడైన నారాయణరావు పెళ్ళాడతాడు. ప్రసాద్ కు యాక్సిడెంట్ కారణంగా కాలు పోతుంది. దాంతో సర్వీస్ నుండి తొలగవలసి వస్తుంది. పిల్లలు నిరాదరిస్తారు. అయితే వారి అండ లేకుండానే జీవితం సాగించాలని పట్టుదలతో ప్రసాద్ ముందుకు పోతాడు. ఓ ధనవంతుని ప్రసాద్ రక్షిస్తాడు. తన ప్రాణాలు కాపాడిన ప్రసాద్ కోసం ఆ ధనికుడు వ్యాపారం చేయమంటాడు. ప్రసాద్ కు కలసి వస్తుంది. లక్షాధికారి అవుతాడు. పిల్లలు మళ్ళీ తండ్రి దగ్గరకు రావాలని చూస్తారు. అది ప్రసాద్ కు ఇష్టం ఉండదు. కానీ, భార్య రాణిస్తుంది. భార్య తన మాట కాదని, నిర్దయులైన పిల్లలను రానివ్వడం ప్రసాద్ కు నచ్చదు. దాంతో ఆస్తి మొత్తం భార్యపేరిట రాసి, ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు ప్రసాద్. ప్రభ, ప్రసాద్ ఉత్తరం చదివి అతని కోసం పరుగు తీస్తుంది. పిల్లలు మారిపోయి, తాము కూడా తండ్రిలాగా తమ కాళ్ళపై తాము నిలబడతామని వస్తారు. క్షమించమని వేడుకుంటారు. వారితో పాటు అవతారం కూడా వచ్చి, పిల్లలను క్షమించమంటాడు. వారి ప్రయాణం తమతో కాదని, నీతిగా ఎవరి కాళ్ళపై వాళ్ళు నిలబడాలని చెప్పి, భార్యతో కలసి ప్రసాద్ పడమరవైపు సాగిపోవడంతో కథ ముగుస్తుంది.
‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బద్దలు కొట్టిన ‘బలగం’
తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు. కమెడియన్ నుంచి హీరోగా మారిన ప్రియదర్శి నటించారు. కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కథానాయిక. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 3న ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ గా నిలిచింది. పల్లె వాతావరణం, కుటుంబ బంధాలు, అన్నాచెళ్లెల అనుబంధాలతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకుంది. ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మరోవైపు చిత్రంలోని ఎమోషనల్ సీన్స్, కుటుంబ నేపథ్య సన్నివేశాలు, తెలంగాణ ఆచారాలకు సంబంధించిన సందర్భాలు ఆడియెన్స్ చేత కంటతడి పెట్టించాయి. దీంతో ఈ చిత్రాన్ని ఊరూరా ప్రొజెక్టర్, తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రదర్శించారు. అంటే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అర్థమవుతోంది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని టీవీలోనూ ప్రదర్శించడంతో ఊహించని రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఏకంగా RRR రేటింగ్ నే దాటేసింది. మే7న ఈ చిత్రాన్ని స్టార్ మాలో టెలికాస్ట్ చేశారు. తొలిసారిగా టీవీలో రావడంతో థియేటర్లలో మిస్ అయిన వారు వీక్షించారు. దీంతో 14.3 రేటింగ్ దక్కించుకొని బుల్లితెరపైనా ‘బలగం’ సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ కు 19 రేటింగ్ రావడం విశేషం. హైదరాబాద్ నగరంలో బలగానికి 22 రేటింగ్ రేటింగ్ వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బలగం చిత్రం అవార్డుల పంట కూడా పండిస్తోంది. అంతర్జాయతీయ స్థాయిలోనూ అవార్డులను సొంతం చేసుకుంటుండటం విశేషం. 40కిపైగా అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ సిసిరోలియో అవార్డుని అందుకున్నాడు. ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను సాధించింది.