*నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడా చెదురుమొదురు వర్షాలు కురుస్తూ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. దయచేసి వ్యవసాయ మరియు ఉపాధి పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండొద్దన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలల్లో సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
*నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు. శ్రీవారి తెప్పోత్సవాల సందర్భంగా పలు సేవల్ని రద్దు చేశారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు. అంతకాదు మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ సూచించింది. ఇవాళ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు. రెండో రోజున(21న) రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడో రోజున(22న) శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో విహరించి, భక్తులను అనుగ్రహిస్తారు. నాల్గవ రోజున ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
*మహువా మోయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు.. కేసుపై లోక్‌పాల్ విచారణ
క్యాష్ ఫర్ క్వెరీ కేసులో టీఎంసీ నేత, బహిష్కరణకు గురైన ఎంపీ మహువా మోయిత్రాపై లోక్‌పాల్ సీబీఐ విచారణకు ఆదేశించింది. మహువా మోయిత్రాపై ఐపీసీ 203(ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని కోరింది. దీనితో పాటు ప్రతి నెలా దర్యాప్తు పురోగతిని లోక్‌పాల్‌కు తెలియజేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. నవంబర్ 2023లో సిబిఐ లోక్‌పాల్ ఆదేశాలపై పిఇ అంటే ప్రాథమిక విచారణను ప్రారంభించింది. నివేదికను లోక్‌పాల్‌కు సమర్పించింది. ఆ తర్వాత ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. మహువా మోయిత్రా పారిశ్రామికవేత్త హీరానందానీ నుండి డబ్బు తీసుకున్నారని.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో ఇంకా కేసు నమోదు కాలేదని, లోక్‌పాల్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. కేసు నమోదు చేయడానికి ముందు, DoPT ఒక ఉత్తర్వు జారీ చేసింది, ఆ తర్వాత CBI కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తుంది.
*కేంద్రమంత్రిపై ఈసీకి ఫిర్యాదు చేసిన డీఎంకే..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంగించారని డీఎంకే ఫిర్యాదులో పేర్కొంది. ‘‘ఎంకే స్టాలిన్ పార్టీ దేవాలయాల నుంచి డబ్బును దొంగిలించి హిందూ మతాన్ని నాశనం చేస్తుంది’’ అని ఆమె ఇటీవల ఆరోపించారు. డీఎంకే పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి చేసింది తప్పుడు ప్రకటన అని.. ఎన్నికలకు సంబంధించి ఒక నిర్దిష్ట మతానికి చెందిన మతపరమైన భావాలను ప్రేరేపించే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని డీఎంకే ఫిర్యాదు చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత బీజేపీ సీనియర్ నేత ఈ ప్రసంగం చేశారని పార్టీ ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలనే ఆశతో, మా పార్టీ, మా నాయకుడి ప్రతిష్టను తగ్గించడానికి ద్వేషపూరిత, పరువు నష్టం కలిగించే ప్రసంగాలను చేస్తున్నారని డీఎంకే ఆరోపించింది. ‘‘తాము ఎప్పుడూ దేవాలయాలకు, ఏ మతానికి వ్యతిరేకంగా పనిచేయలేదని, వాస్తవానికి మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన దేవాలయాలకు చెందిన భూములను అక్రమ ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నామని, మా పార్టీ ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని మతాల అభివృద్ధికి సహకారం చేస్తోంది’’ డీఎంకే చెప్పింది.
*పేద రైతు చేసిన పనికి జిల్లా కలెక్టర్ షాక్..!
పార్వతీపురం మన్యం జిల్లాలో గత సంవత్సరాలుగా ఓ ఏనుగుల గుంపు రెచ్చిపోతుంది. ఈ విషయంకాను ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. ఆ రైతు చేసిన నిరసనకు జిల్లా వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఓచోట రైతుల ఆస్తులు, పంట పొలాలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏనుగుల దాడిలో 10 మందికి పైగా మృత్యువాత పడగా, అనేకమంది గాయాల పాలయ్యారు. జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలలో కొన్ని ఏనుగులు గుంపుగా ఏనుగుల సంచరిస్తూ ప్రజలని బెంబేలెత్తిస్తున్నాయి. ఆ ప్రాంతాలలోని ప్రజలు సాయంత్రం తర్వాత ఇంటి నుండి బయటకు రావాలంటేనే గుండెల్లో వణుకు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి. ఇదే క్రమంలోనే ఓ ఏనుగుల గుంపు మరోసారి కొమరాడ మండలం గారవలస ప్రాంతంలో రెచ్చిపోయాయి. ఇందులో భాగంగానే గారవలస గ్రామానికి చెందిన వెంకట నాయుడు అనే ఓ రైతు తన పంట పొలాల్లో కూరగాయలు పండించినవాటిని., సమీపంలోని పార్వతీపురం పట్టణానికి సైకిల్ పై తీసుకెళ్లి అమ్ముకొని అతని కుటుంబం జీవనం సాగిస్తుంది. ప్రతిరోజు లాగే ఉదయాన్నే తన గ్రామం నుండి కూరగాయలు సైకిల్ పై తీసుకొని పార్వతీపురం పట్టణానికి వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి సడన్ గా పంట పొలాల్లో నుండి ఏనుగుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. అదే విషయంలో అటుగా వస్తున్న వెంకటనాయుడును చూసిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసాయి. దాంతో వెంకట నాయుడు సైకిల్ ను రోడ్డు పైనే వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే ఏనుగుల దాడిలో అక్కడే ఉన్న ఓ సైకిల్ ను ధ్వంసం చేశాయి. దీంతో తమ జీవనోపాధి అయిన సైకిల్‌ను చూసి రగిలిపోయాడు. దింతో ఎలాగైనా సరే తనకు జరిగిన అన్యాయం పై అధికారులతో మాట్లాడాలని అనుకున్నాడు. దింతో అతను ధ్వంసమైన సైకిల్ ను భుజాన వేసుకొని సుమారు 15 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ ఉన్న కలెక్టర్ ని కలిసి తన సైకిల్ ను చూపించి మీ అధికారుల వల్ల తనకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దెబ్బకి కలెక్టర్ నిషాంత్ కుమార్ ఒకింత షాక్ గురయ్యాడు. అక్కడే తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనీ, తక్షణమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. ఆ పెద్ద రైతు పరిస్థితి అర్థం చేసుకున్న కలెక్టర్ అతనికి సహాయం చేస్తానని హామీ ఇచ్చి.. వెంటనే వెంకటనాయుడును ఆదుకోవాలని సదరు అధికారులకు ఆదేశించారు.
*ఫోన్లలో మెసేజులు.. బీజేపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు బిజెపి ప్రభుత్వంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు నమోదైంది. ప్రధాన ఎన్నికల అధికారి చండీగఢ్.. “వికాస్ భారత్ సంపర్క్” బ్యానర్‌తో కేంద్ర ప్రభుత్వ విజయాలను మరో సారి గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో వాట్సాప్ సందేశాలను పంపడంపై ఫిర్యాదును “తగిన చర్య” కోసం ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఫిర్యాదును విచారించిన తర్వాత జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమిక సాక్ష్యాలను కనుగొంది. గత వారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. పోల్ ప్యానెల్ ‘CVigil’ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు స్వీకరించబడింది. ఈ విషయంపై అధికారిక ప్రకటనలో ఫిర్యాదుదారుని పేర్కొనలేదు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత ప్రభుత్వ విజయాలను ప్రదర్శించేందుకు ఒక ప్రభుత్వ విభాగం సోషల్ మీడియాను, ముఖ్యంగా వాట్సాప్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోందని ప్రకటన పేర్కొంది. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, చండీగఢ్ ఈ విషయాన్ని తగిన చర్య కోసం ECIకి సిఫార్సు చేశారు. ‘వికాస్ భారత్ సంకల్ప్’ పేరుతో వెరిఫైడ్ వాట్సాప్ ఖాతా ద్వారా ప్రధాని మోదీ లేఖ పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరడం గమనార్హం. ఇది ఇలా వ్రాయబడింది, “ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వానికి చెందిన వికాస్ భారత్ సంపర్క్ కేంద్రం ద్వారా ఈ లేఖను పంపబడింది. గత పదేళ్లలో, దేశంలోని 80 కోట్ల మందికి పైగా పౌరులు నేరుగా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందారు. భారత ప్రభుత్వం, భవిష్యత్తులో మేము మిమ్మల్ని కూడా కలుస్తాము. అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ మద్దతు, మీ సూచనలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి, మీరు పథకాలకు సంబంధించి మీ అభిప్రాయాలను వ్రాయవలసిందిగా అభ్యర్థించబడ్డారు.”
*ఖైదీల ఆగడాలు అరికట్టేందుకు సరికొత్త ప్లాన్!
దేశంలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆరు చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫోన్‌లు, బేస్ టవర్ల మధ్య సిగ్నల్ ప్రసారాలు నిలిపివేసే ఈ జామర్లను రూ.11.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల జైలు లోపల ఇకపై 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్కులు పనిచేయవు. ఇప్పటికే జైల్లో కాల్ బ్లాకింగ్ కోసం టవర్స్ ఆఫ్ హార్మోనియస్ కాల్ బ్లాకింగ్ వ్యవస్థ ఉండగా.. దీనికి ఈ 15 జామర్లు అదనమని పేర్కొన్నారు. ఈ జామర్ల ఏర్పాటు రెండు నెలల క్రితమే ప్రారంభం కాగా.. ఈ నెలఖరుకు పనులు పూర్తికానున్నాయని తిహాడ్ జైలు డీజీ సంజయ్ బానీవాల్ వెల్లడించారు. తీహార్ జైలులోని తొమ్మిది జైళ్లలో హైసెక్యూరిటీ ఉండే ఆరు జైళ్లలో ఈ జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం 19 వేల మంది ఖైదీలు ఉండగా.. తీహార్, మండోలి, రోహిణి.. ఈ మూడు జైళ్లలో 10 వేల మంది ఖైదీల సామర్థ్యంతో ఉన్నాయి. తిహాడ్‌లో ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక స్థాయిల్లో తనిఖీలు చేసినప్పటికీ ఖైదీలు తరచూ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా జైలు గోడల వెలుపల నుంచి మొబైల్‌ఫోన్లు తరచూ విసిరేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్నేళ్లలో జైలు లోపల ఉన్న గ్యాంగ్‌స్టర్లు వీడియో కాల్స్ చేయడం, వారి సెల్‌ఫోన్లో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు బయటి వారికి బెదిరింపు కాల్స్ చేయడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఖైదీల ఆగడాలను అరికట్టేందుకు మొబైల్ సిగ్నల్స్‌ను నియంత్రించేలా జామర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీలోని మూడు జైళ్లలో అనధికారికంగా మొబైల్ ఫోన్‌లను వినియోగించే సమస్యను పరిష్కరించడానికి గత ఏడాది లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.
*ముంబై ఇండియన్స్ జట్టులో చేరని జస్ప్రీత్ బుమ్రా.. కారణం అదేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే 17వ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ సైలెంట్‌గా ఉంది. ఫ్రాంచైజీలన్నీ తమ పూర్తి జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు, జెర్సీ ఆవిష్కరణలు చేస్తుంటే.. ముంబై మాత్రం ఏ హడావుడి చేయడం లేదు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా జట్టుతో కలవకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మార్చి 21న అహ్మదాబాద్‌లో జస్ప్రీత్ బుమ్రా జట్టుతో కలుస్తాడని ముంబై ఇండియన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ అనంతరం నేరుగా ముంబైలోని తన ఇంటికె వెళ్లిన బుమ్రా.. విశ్రాంతి తీసుకుంటున్నాడు. ముంబై తన తొలి మ్యాచ్ మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనున్న నేపథ్యంలో 21న బుమ్రా జట్టుతో కలవనున్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ఆడాడు కాబట్టి.. గుజరాత్ మ్యాచ్‌కు ముందు అతనికి మూడు రోజుల ప్రాక్టీస్ సరిపోతుందని ముంబై టీమ్స్ వర్గాలు తెలిపాయి. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ప్రకటించడాన్ని ముంబై జట్టులో మెజార్టీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందులో బుమ్రా కూడా ఉన్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే బుమ్రా ఆలస్యంగా జట్టులో చేరుతున్నాడట. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 కోసం ఎప్పటినుంచో సన్నద్ధమవుతున్నాడు. మార్చి 12 నుంచి ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభం అయింది. మార్చి 18న రోహిత్ శర్మ ముంబై జట్టుతో కలిశాడు. చీలమండ గాయంతో ఆటకు దూరమైన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆడడంపై క్లారిటీ లేదు. ఎన్‌సీఏ నుంచి ఫిట్‌నెస్ విషయంలో సూర్యకు క్లియరెన్స్ రావాల్సి ఉంది. గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న సూర్య.. చీలిమండ, స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే.
*స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంటున్నాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు స్వల్పంగా పెరిగాయి.. బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 పెరిగింది.. అలాగే కిలో వెండి పై రూ. 100 మేర పెరిగింది… హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ పసిడి ధర రూ. 66,340 గా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే రూ. 60,810 కు చేరింది.. వెండి ధర కిలో రూ. 80,400 కు చేరింది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,530గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,020గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,380 కాగా.. 24 క్యారెట్ల 10 ధర రూ.65,870గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.60,900.. 24 క్యారెట్ల ధర రూ.66,440గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,380 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.65,870గా నమోదైంది.. ఇక వెండి ధరల విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. స్వల్పంగా పెరుగుదల కనిపించింది.. కిలో వెండిపై రూ.100 పెరిగి .. రూ.77,000లుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000 కాగా.. ముంబైలో రూ.77,000గా ఉంది. చెన్నైలో రూ.80,000గా కొనసాగుతుండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,400లుగా ఉంది. తక్కువగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,800గా ఉంది.