నేటి నుంచే ఖాతాల్లో రైతు బంధు నగదు.. పదకొండో విడత సాయానికి సర్కారు సిద్ధం
పంట పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన `రైతు బంధు` మళ్లీ రాబోతోంది. పదకొండో విడుత నేటి నుంచి ఖాతాల్లో జమ కానుంది. తెలంగాణలో అర్హులైన రైతుల ఖాతాల్లో నేటి నుంచి రైతుబంధు సొమ్ము జమ కానుంది.నేటి నుంచి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేయనున్న ప్రభుత్వం.. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం రైతుబంధు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి, ఆపై వర్షాలు ప్రారంభమైనందున, అన్నదాతలకు రెండు దశల్లో పంట సహాయం అందించబడుతుంది. ఖరీఫ్ వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనుంది. పదకొండో విడతకు సంబంధించి 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందజేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈసారి 1.5 లక్షల మంది పాడు రైతులకు కూడా రైతుబంధు అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. మొత్తం 1.54 కోట్ల ఎకరాలకు గాను అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.7720.29 కోట్లు జమకానున్నాయి. ఈ ఏడాది 5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు రైతుబంధు సాయం అందనుంది. దాదాపు 4 లక్షల పోడు భూములకు రైతు బంధు అందుబాటులో ఉంటుంది.
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. వారి ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జూనియర్ న్యాయవాదులకు శుభవార్త చెప్పారు.. నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్ధిక సహాయం అందించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 2,677 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది.. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన ప్రకారం.. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5,000 చొప్పున స్టైఫండ్ ఇస్తూ వస్తున్నారు.. ఫిబ్రవరి 2023 నుంచి జూన్ 2023 అంటే 5 నెలలకు సంబంధించిన స్టైఫండ్‌ను ఒక్కొక్కరికి రూ. 25,000 చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు.. మొత్తం రూ. 6,12,65,000ను నేడు వర్చువల్‌గా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. యువ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు అండగా ప్రభుత్వం ఆర్ధిక చేయూత అందిస్తూ వస్తుంది.. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60,000 చొప్పున ఆర్ధిక సహాయం చేస్తూ వస్తున్నారు.. రెండు దఫాల్లో ఈ చెల్లింపులు చేస్తున్నారు.. మూడేళ్లకు మొత్తం రూ. 1,80,000 స్టైఫండ్ అందిస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్. వృత్తిపరంగా యువ న్యాయవాదుల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు.. అర్హులైన యువ న్యాయవాదులకు మూడేళ్ల పాటు నెలకు ఐదు వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు సీఎం జగన్..
కుప్పంలో భారీ పేలుడు
చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది.. కుప్పం పట్టణంలోని కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు సహా జిలెటిన్ స్టిక్స్ పేలినట్టు తెలుస్తోంది.. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు మురుగేష్, ధనలక్ష్మీ దంపతులు.. గుర్తు తెలియని దుండగులు ఆ దంపతుల ఇంటి గుమ్మం వద్ద… నాటు బాంబు, జిలెటిన్‌స్టిక్స్ పెట్టి పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ పేలుడుదాటికి ఇల్లు ధ్వంసం కాగా.. దంపతుల పరిస్థితి అత్యంత విషమంగా మారిపోయింది.. దీంతో.. కుప్పం పీఈఎస్ కు దంపతులను తరలించారు స్థానికులు.. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. ఎందుకు వారి ఇంటి వద్ద భారీ పేలుడు జరిపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. దంపతులను టార్గెట్ చేసిన దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణముందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసుల.. అయితే, స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది..
కర్నూల్‌లో మెడికో ఆత్మహత్య
విద్యా సంస్థల్లో కొందరు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలో తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. వైద్యవృత్తి లక్ష్యంగా.. ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతోంది.. తాజాగా, కర్నూలులో మరో మెడికో ప్రాణాలు తీసుకున్నాడు.. విశ్వభారతి మెడికల్ కాలేజీలో లోకేష్ అనే మెడికో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న లోకేష్ స్వస్థలం.. నెల్లూరు జిల్లా కావలిగా చెబుతున్నారు.. ఇక, లోకేష్ ఆత్మహత్య చేసుకున్న విషయంపై తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం ఇచ్చారు పోలీసులు.. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు పోలీసులు.. ఆత్మహత్యకు చదువులో ఒత్తిడా..? లేకా ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.. ఈ రెండు కాకుండా మరేదైనా కారణం ఉందా? అనే వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు.. చేతికి అందివచ్చిన కొడుకు.. త్వరలో డాక్టరై మా కష్టాలు తీర్చుతాడని కలలు గంటున్న ఆ పేరెంట్స్ ఆశలపై నీళ్లు చల్లి ప్రాణాలు తీసుకున్నాడు లోకేష్. కాగా, గతంలోనూ చదువుల ఒత్తడి.. ఇతర కారణాలతో మెడికోలో ఆత్మహత్య చేసుకున్న ఘటనలో చాలానే వెలుగుచూసిన విషయం విదితమే.
ఉప్పల్ స్కైవాక్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి రానుంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా వద్ద కాలినడకన రోడ్డు దాటే వారి కోసం ప్రత్యేక స్కైవాక్ అందుబాటులోకి రానుంది. భారీ సంఖ్యలో వాహనాలు ఇక్కడికి తరలివస్తున్న నేపథ్యంలో ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. నగరంలోని పెద్ద కూడళ్లలో ఒకటైన ఉప్పల్ సర్కిల్ వద్ద హెచ్‌ఎండీఏ స్కైవాక్‌ను ఏర్పాటు చేసింది. వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్‌ను నిర్మించడం విశేషం. భారీ సంఖ్యలో వాహనాలు ఇక్కడికి తరలివస్తున్న నేపథ్యంలో ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేశారు. 660 మీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న ఉప్పల్ స్కైవాక్ నిర్మాణానికి హెచ్ ఎండీఏ రూ.25 కోట్లు వెచ్చించింది. ఈ వంతెన ఉప్పల్, సికింద్రాబాద్, LB నగర్, రామంతాపూర్ రోడ్లు మరియు మెట్రో స్టేషన్‌తో అనుసంధానించబడి ఉంది. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా రోడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఎక్కడా రోడ్డు దాటాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, స్కైవాక్ నుంచి ప్రయాణించవచ్చు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్..! ABVP పిలుపు..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఏబీవీపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ‘మన ఊరు మన బడి’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇప్పటికీ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫారాలు అందలేదని, నిర్వహణ నిధులు కూడా ఇవ్వలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ నాయకులు నిరసన తెలిసిందే.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లొంగిపోయి ఎన్నికల నిధులకు అమ్ముడుపోయిందన్నారు.
నేడే మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. పర్యటన వివరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేడు, రేపు (26,27) తేదీల్లో అంటే రెండు రోజులు ఉంటుంది. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం షోలాపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. షోలాపూర్‌కు చెందిన భగీరథ్ బాల్కే అనే స్థానిక నాయకుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. షోలాపూర్‌లోని కొందరు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు (27) మంగళవారం ఉదయం పండరీపూర్, షోలాపూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి విఠోభరుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దారాశివ్ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు భారీ కాన్వాయ్‌లో రానున్నారు.
ఇండియాలో పోషకాహార లోపం.. 16 శాతంగా నివేదిక
మనిషి బ్రతకాలంటే ఆహారం తీసుకోవాలి. అందులో ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. పోషాకాహారం లేకపోతే ప్రజలు ఆరోగ్యంగా ఉండరు. పోషకాహార లోపంతో ఇండియాలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోషకాహార సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే పోషకాహార లోపం సమస్య కేవలం ఇండియాలోనే కాదు.. ఇది యూనివర్సల్ సమస్యగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపం ఉంది. అది 2021 కంటే 2023లో బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇండియాలో పోషకాహార లోపం సమస్య బాగానే ఉంది. ఇందులో కూడా ప్రధానంగా సూక్ష్మ పోషకాల లోపం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని ఆహార నిపుణులు పేర్కొన్నారు. దేశంలో ప్రజల ఆరోగ్యాలను హరిస్తున్న ఈ పైకి కనిపించని ఆకలి సమస్యను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార పాలసీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఎఫ్‌పీఆర్‌ఐ) ఇటీవల ది గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్టు(జీఎఫ్‌పీఆర్)-2023 పేరుతో నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపం సమస్యతో బాధ పడుతున్న వారి సంఖ్య 2021 నాటికి 76.8 కోట్లకు పెరిగింది. ఇది 2014లో 57.2 కోట్లుగా ఉండగా.. అదికాస్త 2021కి 34.2 శాతం పెరిగిందని నివేదిక పేర్కొన్నది. పోషకాహార లోపం సమస్య 2019-21 మధ్యలో ఆఫ్గానిస్థాన్‌లో 30 శాతం, పాకిస్థాన్‌లో 17శాతం ఉంది. భారత్‌లో 16 శాతం, బంగ్లాదేశ్‌లో 12 శాతం, నేపాల్‌లో 6 శాతం, శ్రీలంకలో 4 శాతంగా ఉన్నదని నివేదిక ప్రకటించింది.