*తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయాల దగ్గర భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తున్నారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలు తరలివస్తున్నారు. ఇక, ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే పుణ్యం దొరుకుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక, భద్రాద్రి శ్రీరాముడి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు గరుడవాహనంపై రాముడు, గజవాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇచ్చారు. అలాగే, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారు జామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం చేశారు. ఉదయం 5గంటల నుంచి భక్తులకు ఆలయాధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామున భారీ ఎత్తున తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు భారీగా పోటెత్తారు. తిరుమలలో నేటి ఉదయం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు ఆ శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. అలాగే, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు భారీగా తరలివచ్చారు. దీంతో పాటు ఏలూరులోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. దీంతో ఆలయ ప్రాంతం, పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఇక, హైదరాబాద్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ( మినీ తిరుపతి ) సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు.
*తొమ్మిదేళ్ల పాలనపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు ‘స్వేద పత్రం’ రిలీజ్ చేయనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని ఆయన చెప్పుకొచ్చారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బ తీస్తే సహించబోమని మాజీమంంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. విఫల రాష్ట్రంగా చూపిస్తే భరించమని, అందుకే జరిగిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించేందుకు తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం శ్వేత పత్రాల రూపంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుస నివేదికలు ఇచ్చారు.. తమకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో గణాంకాలు ప్రవేశ పెట్టే ఛాన్స్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు.. కానీ, అందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ భవన్ లో ఈ స్వేదపత్రం విడుదల చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
*తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్ కేసులు..ఒక్కరోజులో ఎన్నంటే?
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 29 ఉండగా ఈరోజు మళ్లీ పెరిగింది.. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 30 కి పైగా చేరింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో దాదాపు 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది.. రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్ సోకింది. నిలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.. పదేళ్ల లోపు చిన్నారులకు,60 ఏళ్లు పైబడిన వారికి తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉంచినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉందని అధికారికంగా తెలిపారు.. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలను అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తుంది..
*ప్రత్యేక హోదా తేవడానికే కొత్త పార్టీ.. పొత్తులపై క్లారిటీ ఇచ్చిన జేడీ లక్ష్మీనారాయణ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది.. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఇదే సమయంలో.. అసలు పార్టీ ఎందుకు పెడుతున్నాం.. తమ లక్ష్యం ఏంటి? అనే విషయాలను వివరిస్తూనే.. మరోవైపు పొత్తులపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీగా అభివర్ణించారు వీవీ..ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవడానికి జై భారత్ నేషనల్ పార్టీ పెట్టానని ప్రకటించారు సీబీఐ ఎక్స్ జేడీ.. నిరుద్యోగం ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉందని.. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడడంలేదన్న ఆయన.. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం అన్నారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజే ముద్దన్నారు కొందరు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. కానీ మెడలు వంగలేదు. ప్రత్యేక హోదా రాలేదన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు. మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడమని పేర్కొన్నారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తామని ప్రకటించారు. సరైన పాలసీలు లేకపోవడం వల్లే ఉపాధి లభించడం లేదు. రాజకీయాలు కొన్ని కుటుంబాలకు పరిమితం అయ్యాయి. ఎవరో నాన్నగారు ఓ హోదాలో వాళ్ల పిల్లలకూ అదే హోదా ఉండాలా..? అని ప్రకటించారు. అంగబలం, అర్ధబలం లేదు.. కానీ ప్రజల నైతిక బలం మాకుంది అన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతోన్న వేళ.. పొత్తులు కీలకంగా మారాయి.. అధికార వైసీపీ మరోసారి ఒంటరిగానే బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి.. ఆ దిశగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇక, బీజేపీ ఇప్పటి వరకు జనసేనతో ఉన్నా.. ఎన్నికల నాటికి టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తుందా? అనే చూడాలి.. ఇలాంటి సమయంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మేం ఓట్లు చీల్చం.. సీట్లు చీల్చి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అవకాశం పోయిందనే బాధ లేదు. ప్రభుత్వాలు ఐదేళ్లూ ఉండని పరిస్థితి.. ఎప్పుడు కూలుతాయో తెలియదంటూ హాట్ కామెంట్లు చేశారు. నేను రాజకీయాల్లోకి దిగలేదు.. దూకాను అని పేర్కొన్నారు. మేం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం.. నా కాళ్ల మీదే మేం ఎదుగుతామని పొత్తులపై తేల్చేశారు వీవీ లక్ష్మీనారాయణ.
*జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరిట కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక చీకటి రోజుగా గుర్తిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని పెట్టారని.. కానీ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ సపోర్టర్ అంటూ ఆరోపించారు. వంద కోట్లకు, వెయ్యి కోట్లకు అమ్ముడు పోవడమా అంటూ విమర్శలు గుప్పించారు. జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ మూసేసారని, షర్మిల పార్టీ మూసేసారని, ఆయన కూడా మూసేస్తారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్‌లు నా పార్టీలో చేరారన్నారు. గతంలో కూడా కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు.. తాను తప్ప వేరే ఎవరు తీర్చలేరని కేఏ పాల్ తెలిపారు. కనీసం వడ్డీలు కూడా కట్టలేరని.. సాకులతోనే కాలం గడిపేస్తారంటూ చెప్పుకొచ్చారు. దేశంలో, రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని కేఏ పాల్ సూచించారు. ప్రజాశాంతి పార్టీకి త్వరలోనే గుర్తు కూడా రానుందని కేఏ పాల్ వెల్లడించారు. ఇక.. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ రూ.1000 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. గతంలో.. తనను విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడీ, అమిత్ షా కోరారని.. కానీ తాను వెళ్లలేదని కేఏ పాల్ తెలిపారు.
*ప్రభాస్ సలార్ తొలి రోజు రికార్డ్ వసూళ్లు..ఎన్ని కోట్లో తెలుసా?
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబట్టింది.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజే అదరగొట్టాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్స్ మాములుగా లేవు..శుక్రవారం ఒక్కరోజే మొత్తం రూ.175 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. వాటిల్లో దేశీయంగా రూ.135 కోట్లు వసూలు కావడం గమనార్హం. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సాక్‌నిల్క్ కథనం ప్రకారం దేశీయంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూ.49 కోట్లు కాగా, శుక్రవారం ఒక్కరోజే రూ.60 కోట్లు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో చిత్రీకరించారు. భారత్‌లో ఆన్‌లైన్ బుకింగ్స్ రూ.42 కోట్లు దాటాయి. తొలి రోజే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్స్ రూ.180 కోట్లు ఉంటాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.45 కోట్లు వసూలు చేస్తే భారత్ బాక్సాఫీసు వద్ద రూ.135 కోట్లు వసూలవుతాయని చెబుతున్నారు.. ఈరోజు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఇక ప్రభాస్ ఖాతాలో భారీ వసూళ్లను సాధించిన సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమాకు రెండో భాగం ‘శౌర్యాంగ పర్వం’ అని టైటిల్ పేర్లు ఖరారు చేశారు. దేవా/ సలార్‌గా ప్రభాస్, వరద రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమన్నార్‌గా జగపతి బాబు, ఆద్యగా శ్రుతి హసన్ నటిస్తున్నారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడంతోపాటు పలు భాషల్లో విడుదలైంది.. షారుఖ్ ఖాన్ డుంకీ కూడా విడుదలైంది.. ఇందులో సలార్ దూసుకుపోతుందని టాక్..
*బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
పసిడి ప్రియులకు భారీ షాక్..గత రెండు మూడు రోజులుగా పసిడి ధర మార్కెట్ లో పరుగులు పెడుతుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 58,000కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 230 వరకు పెరిగింది.. పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది.. వెండి కిలో పై రూ. 300 పెరిగి రూ. 81,000 చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,230గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. అదే విధంగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,550గా ఉంది.. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,230గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి.. వెండి విషయానికొస్తే.. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా భారీగా పెరిగింది.. ఈరోజు వెండి ధర రూ. 300 పెరిగి 79,500కి చేరింది..హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 81,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 79,500.. బెంగళూరులో రూ. 76,750గా ఉంది… మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..