*బాబోయ్.. చలి చంపేస్తోంది..
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే చలి జనం వణికిపోతున్నారు. ఉదయం మంచు కారణంగా రోడ్లు కనబడని స్థితిలో తొమ్మిది గంటల తర్వాత వాహనాలు రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇక, పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో.. ఏకంగా 6.6 డిగ్రీల సెల్సీయస్ కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు కురువడం సాధారణం అయినప్పటికీ శీతల గాలులు ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్నాయి. అలాగే, హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరుగుతుంది. గత వారం రోజులుగా నగరంలో రాత్రి వేళ్ళలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రికార్డ్ అవుతున్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చాలా మంది రాత్రిపూట, తెల్లవారు జామున వెచ్చని దుస్తులను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. ఈ సమయాల్లో ఆస్తమా, చర్మ సంబంధ, హృద్రోగ బాధితులు, చిన్న పిల్లలకు న్యూమోనియా వ్యాధుల భయం ఉన్నవారు జాగ్రత్తగా వహించాలని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే, ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలికి వణికిపోతున్నారు. చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉండగా.. హైదరాబాద్ నగరంలోను దాని ప్రతాపం చూపిస్తుంది.
*వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి
వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుపతి, తిరుమలలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రంత టోకెన్ కేంద్రాల వద్ద జాగారం చేశారు. దీంతో అధికారులు టోకెన్ల జారీ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే భక్తులు భారీగా తరలి రావడంతో.. కాస్తంత ముందుగానే నిన్న అర్ధరాత్రి నుంచే మొదలుపెట్టింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకెన్లు కోటా త్వరగతినే పూర్తైంది. మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు పూర్తి అయ్యేవరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ. ఇది ఉండగా.. టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా మాస్కులు ధరించాలని టీటీడీ భక్తులకు సూచించింది. మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాలకు భక్తులు ముందుగానే తరలి వచ్చారు. రద్దీ నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేసే టికెట్ కేంద్రాన్ని అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పరిశీలించారు. భక్తులు సంయమనం పాటించాలని కోరారు. రేపు వైకుంఠ ఏకాదశి. శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఎల్లుండి 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.
*వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ రాయితీ..?
వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతుంది. పెండింగ్‌లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. గత ఏడాది పెండింగ్ చలాన్లపై రాయితీ ఇవ్వగా.. ఫైన్లు కట్టేందుకు వాహనదారుల నుంచి భారీగా ఎగబడ్డారు. రాయితీ ఉన్న టైంలో దాదాపు 300 కోట్ల రూపాయల వరకు పెండింగ్ చలాన్లు వసూలు అయ్యాయి. మరోసారి ఇలాంటి ఆఫర్ ఇవ్వాలని పోలీస్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్వర్తులు త్వరలోనే వెలువడే ఛాన్స్ ఉంది. అయితే, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. ఎక్కడ ఎలాంటి తప్పు చేసినా.. ఫొటోలు క్లిక్‌మనిపించి ఆన్‌లైన్‌లో చలాన్లు పంపిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్లు విధిస్తున్నారు. ఇక, ఈ-చలాన్లు వసూలు చేయడం ట్రాఫిక్ పోలీసులకు భారంగా మారుతోంది. ఎక్కడైనా చెకింగ్ నిర్వహించినప్పుడు వెహికిల్ నెంబర్ ఆధారంగా చలాన్లు పెండింగ్‌లో ఉంటే అప్పుడే ఎక్కువగా వసూలు అవుతున్నాయి. చాలా మంది వాహనదారులు ఆన్‌లైన్‌లో తమ పెండింగ్ చలాన్లు చూసుకున్నా.. దొరికినప్పుడు కట్టుకుందాంలే అనుకునే ధోరణిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ రాయితీ ప్రకటిస్తే పెండింగ్ చలాన్లు వసూలు అవుతాయని ట్రాఫిక్ పోలీసులు అనుకుంటున్నారు. గతేడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉంటే.. వీటిని వసూలు చేసేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. బైక్‌లపై 75 శాతం, మిగిలిన వాటికి 50 శాతం రాయితీ ఇవ్వగా.. దీంతో వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించేందుకు జనం ఎగబడ్డారు. 45 రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.300 కోట్ల పెండింగ్ చలాన్లు వసూలు అయినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ప్రస్తుతం మళ్లీ పెండింగ్ చలానాల సంఖ్య భారీగా పెరిగిపోయింది.. దీంతో మరోసారి రాయితీ ప్రకటించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.
*బదిలీలు, పోస్టింగ్‌లపై ఈసీ మార్గదర్శకాలు.. ఏపీ సహా 4 రాష్ట్రాల సీఎస్‌లకు కీలక ఆదేశాలు
2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టులపై కొత్త ఆంక్షలు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల అధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు పంపింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండకూడదని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేసింది. నేరుగా ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఏ అధికారి సొంత జిల్లాలో ఉండకూడదని పేర్కొంది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో పని చేస్తున్న లేదా 2024 జూన్ 30 నాటికి మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకునే వారికి బదిలీలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.. బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించిన నివేదికను 2024 జనవరి 31లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఎన్నికల మార్గదర్శకాలు
* ఎన్నికలతో సంబంధం ఉన్న వారు సొంత జిల్లాలో ఉండరాదు
* దీర్ఘకాలంగా ఒకే చోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో ఉండకూడదు
* మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించకూడదు
* 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యే వారిని కొనసాగించొద్దు
* బదిలీలు, పోస్టింగుల వివరాలు జనవరి 31వ తేదీ లోగా ఇవ్వాలి
*నేడు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీ ప్రాంతాల్లో హైఅలెర్ట్
మావోయిస్టులు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దండకారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 22న భారత్ బంద్ పిలుపును బంద్ పిలుపును విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు కరపత్రాలను వదిలివెళ్లారు. ఇటీవల పోలీసులు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా మావోయిస్టులు బంద్ పిలుపునిచ్చినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఎనిమది మంది మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిసింది. అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.
*ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పండుగ పూట ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. సొంత ఊళ్లకు వెళ్లేవారి ప్రయాణం కత్తిమీద సాము లాంటిది.. ఓవైపు పండుగకు వెళ్లాలనే తాపత్రయం.. మరోవైపు.. ప్రైవేట్ బస్సులు, ప్రత్యేక బస్సుల దందా.. సామాన్యుడికి పండుగ పూట చుక్కలు కనబడేలా చేస్తున్నాయి.. అయితే, పండుగ సమయంలో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు.. సంక్రాంతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే.. కాచిగూడ-కాకినాడ టౌన్, హైదరాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.. ఈ నెల 28వ తేదీ నుంచి 2024 జనవరి 26వ తేదీ వరకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగుతాయి.. ఇక, ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.. తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడటౌన్-లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు రైల్వే అధికారులు.. పూర్తి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వేకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
*హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చి కారు ఇసుక లారీ ఢీ కొన్నాయి.. కారులో ప్రయాణిస్తున్న ఏటూరు నాగరంకు చెందిన నలుగురు మృతి చెందారు.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరు నాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16) ఉన్నారు. యాక్సిడెంట్లో మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవిలు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నలుగురు మృతదేహాలను సైతం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
*నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన ఇండియా కూటమి
పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి, మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ విపక్ష పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన సిఫార్సు లేఖ ద్వారా ఈ నెల 13న లోక్‌సభ గ్యాలరీలోకి కొందరు అగంతకులు సందర్శకులుగా ప్రవేశించి, పొగబాంబులు వదిలి అలజడి సృష్టించారు. ఈ దుర్ఘటన భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేయడమే నేరంగా పరిగణించిన మోడీ సర్కార్ ఉభయ సభల నుంచి ఆయా ఎంపీలను బహిష్కరించింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. అయితే, పార్లమెంట్ నుంచి 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి. ఇటు తెలంగాణలో కూడా ‘ఇండియా’ కూటమి పార్టీల నేతృత్వంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు దగ్గర భారీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాట పలువురు మంత్రులు కూడా పాల్గొంటారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘ఇండియా’ కూటమి పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
*దారుణం.. రూ. 200 తిరిగి ఇవ్వలేదని బట్టలు తీసి చితకబాదిన స్నేహితులు..
ఓ కుర్రాడు తన స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు.. కానీ తిరిగి ఇవ్వలేక పోయాడు.. దాంతో తన స్నేహితులు విచక్షణారహితంగా ప్రవర్తించారు.. ఫ్రెండ్ అని కూడా చూడకుండా బట్టలను ఊడదీసి దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. అతన్ని అలా ఫోటోలు, వీడియోలు తీస్తూ రాక్షస ఆనందం పొందారు… ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగు చూసింది.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ పార్కులో సదరు విద్యార్థి తన స్నేహితులతో కలిసి కూర్చున్నాడు. డబ్బులు తీసుకున్న ఫ్రెండ్ తన నలుగురు సహచరులతో కారులో పార్కు వద్దకు చేరారు. ఆ తర్వాత అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారు.. నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడున్న ఇద్దరు, కారులో ఉన్న నలుగురు కలిసి.. ఆ విద్యార్థికి బలవంతంగా మద్యం తాగించారు. డబ్బులు అడుగుతావా..? అంటూ అతనిపై విరుచుకుపడ్డారు. బట్టలూడదీసి తమ వద్ద ఉన్న బెల్ట్‌లు, కర్రలతో చితకబాదారు. ఆ తతంగాన్ని అంతా తమ ఫోన్లలో చిత్రీకరించారు. గంట పాటు వేధించిన తర్వాత ఆ బాలుడు ఎలాగో తప్పించుకున్నాడు.. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, బాధిత బాలుడు తన పేరెంట్స్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో కొంత మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం కఠిన చర్యలు తీసుకొనున్నట్లు పోలీసులు తెలిపారు.
*’సలార్’ ఎక్స్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?
‘కేజీయఫ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో.. సలార్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్, పాటలు సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. సలార్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సీనీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. భారీ అంచనాల మధ్య ఈరోజు సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సలార్ సినిమా శుక్రవారం (డిసెంబర్ 22) విడుదలైంది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడ్డాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 1 గంట నుంచే షోలు పడుతున్నాయి. సలార్ సినిమా చూసిన ఫాన్స్ ఎక్స్ (ట్విట్టర్)లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ట్విట్టర్‌లో సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్‌కి ఇది ‘మాస్ కమ్ బ్యాక్’ అంటూ ఫాన్స్, నెటిజన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. ‘నీ యమ్మ మెంటల్ ఎక్కించిండు.. ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్‌గా ప్రశాంత్ నీల్ యూస్ చేశాడు’, ‘ఊచకోత కాదయ్యా.. ఇది రాచకోత. ప్రశాంత్ నీల్ ఏం తీశాడు భయ్యా సినిమా. రాజమౌళి, బోయపాటిని మిక్సీలో వేసి తీసినట్లున్నాయ్ ఫైట్స్’, ‘మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్. ‘హిట్టు కొట్టేశాం. కేజీఎఫ్‌ను మించి ఉందయ్యా సినిమా’, ‘ఇంటర్వెల్ సీన్ ఒక్కటి చాలు థియేటర్లో సీట్లు చింపేయడాని’, ‘ప్రభాస్ ఓపెనింగ్ సీన్ వేరే లెవల్. ప్రీ ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
*రాఖీ భాయ్ ఉన్నట్లా లేనట్లా?
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ షో పడే వరకూ పాన్ ఇండియా సినిమా అభిమానుల్లో ఉన్న ఏకైక డౌట్ ‘సలార్ సినిమాలో రాఖీ భాయ్ ఉన్నాడా లేదా’. ప్రభాస్ అండ్ యష్ ని ప్రశాంత్ నీల్ కలిపి చూపిస్తాడా? సలార్-రాఖీ భాయ్ క్లైమాక్స్ లో కనిపిస్తే ఆ యుఫొరియా ఏ రేంజులో ఉంటుంది? ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాడా లేదా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. డిసెంబర్ 22న అర్ధరాత్రి షోస్ పడగానే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. ప్రశాంత్ నీల్ ముందు నుంచి చెప్తున్నట్లే… సలార్ సినిమాకి KGF సినిమాకి లింక్ లేదు. యష్ అండ్ ప్రభాస్ కలిసి కనిపించరు, సలార్-రాఖీ భాయ్ లకి అసలు సంబంధం లేదు. KGF పీరియాడిక్ డ్రామా, సలార్ మాత్రం ప్రస్తుతంలోనే జరుగుతూ ఉంటుంది. అక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఒక ప్రపంచం అయితే ఇక్కడ ఖాన్సార్ ఇంకో ప్రపంచం. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని తీసుకొచ్చి రాఖీ భాయ్ క్యామియో మర్చిపోయేలా చేసాడు ప్రశాంత్ నీల్. టైటిల్ కార్డ్స్ పడే సమయంలో యష్ కి స్పెషల్ థాంక్స్ కార్డ్ పడడంతో థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరూ యష్ సినిమాలో ఉంటాడేమో అనుకున్నారు. సలార్ ఓపెనింగ్ సెరిమోనీకి యష్ వచ్చాడు కాబట్టి స్పెషల్ థాంక్స్ వేసాడు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క లింక్ తప్ప రాఖీ భాయ్ అండ్ సలార్ లకి ఎలాంటి లింక్ లేదు. సో ఆ హోప్ తో థియేటర్స్ కి వెళ్తే మాత్రం వెళ్లకండి, ఒకవేళ మీరు అలా వెళ్లినా కూడా రాఖీ భాయ్ క్యామియో అవసరం లేని ప్రభాస్ ని చూపించాడు ప్రశాంత్ నీల్.