ఏపీలో ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై:
ఏపీలో ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై (నామినేషన్ల పరిశీలన) జరగనుంది. ఏపీ వ్యాప్తంగా లోక్‌సభ సెగ్మెంట్లకు 1102, అసెంబ్లీ సెగ్మెంట్లకు 5960 మేర నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇండిపెండెంట్లు, డమ్మి అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు, మూడేసి సెట్లు దాఖలు చేశారు. వచ్చిన నామినేషన్ల సెట్లను నేడు ఎన్నికల అధికారులు పరిశీలన చేయనున్నారు. స్క్రూట్నీ తర్వాత నామినేషన్లు తగ్గనున్నాయి. స్క్రూట్నీలో ఒకే అయ్యాక డమ్మి అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. ఈ నెల 29వ తేదీన నామినేషన్లు వెనక్కి తీసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మే 13వ తేదీన ఒకే విడతలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
28 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం:
ఏప్రిల్ 28 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం మొదలెట్టనున్నారు. 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో సీఎం పాల్గొంటారు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 1 వరకు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు (ఏప్రిల్ 27) వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం:
కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి జాతీయ రహదారిపై ఓ షాప్ లో మంగలు ఎగిసిపడ్డాయి. టైరు పంచర్, కూలర్ల విక్రయ దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు పక్కనే ఆనుకుని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకోవడంతో పూర్తీగా వాహనాలు దగ్దమయ్యాయి. కూకట్ పల్లి జాతీయ రహదారి కావడంతో ప్రయాణికులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధం కాగా, 10 ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జూబ్లీహిల్స్‌లో కోటి వజ్రాభరణాలు చోరీ:
రూ.కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–71లోని నవనిర్మాణ్ నగర్‌లో నివసించే బాబ్జీ భాగవతుల అనే రిటైర్డ్ ఉద్యోగి తన భార్య శీలతో కలిసి ఈ నెల 20న బెంగుళూరు నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. అక్కడ ట్యాక్సీ మాట్లాడుకుని నవనిర్మాణ్ నగర్‌లోని తన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఫిలింఛాంబర్ ఎదురుగా విజేత సూపర్ మార్కెట్ వద్ద ట్యాక్సీ డ్రైవర్ కారును ఆపి శుభ్రం చేసుకున్నాడు. కొద్దిసేపటికి వారిద్దరినీ ఇంటి వద్ద దింపడమే కాకుండా కారు డిక్కీలో ఉన్న రెండు సూట్‌కేసులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు. ఈ నెల 24న సాయంత్రం బాబ్జీ సూట్ కేసుల్లో ఉన్న ఆభరణాలను భద్రపరిచేందుకు చూడగా అందులో ఉండాల్సిన జ్యువెలరీ బాక్స్ కనిపించలేదు. ఆ జ్యువెలరీ బాక్స్‌లో మూడు డైమండ్ నెక్లెస్‌లు, మూడు జతల డైమండ్ చెవి రింగులు ఉన్నాయని, వీటి విలువ రూ.కోటి ఉంటుందని ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ట్యాక్సీ డ్రైవర్‌పై అనుమానం ఉందని, కారును ఆపినప్పుడు డిక్కీలో నుంచి వాటిని తీసి ఉంటాడని, లేదా ఇంట్లోకి సూట్‌కేసులు తెచ్చే క్రమంలో జ్యువెలరీ బాక్స్‌ను చోరీ చేసి ఉండవచ్చునని తెలిపాడు.
ముంబైలో ఈడీ దాడులు:
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం పత్రా చాల్ కేసులో రూ.73.62 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఇది ముంబైలోని గోరేగావ్‌లో గురు ఆశిష్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ (GACPL) నిర్వహిస్తున్న పత్రా చాల్ ప్రాజెక్ట్ రీడెవలప్‌మెంట్‌లో అక్రమాలకు సంబంధించిన కేసు. అటాచ్ చేసిన ఆస్తుల్లో పాల్ఘర్, దపోలి, రాయ్‌గఢ్, థానే, చుట్టుపక్కల ఉన్న నిందితుడు ప్రవీణ్ రౌత్, అతని సన్నిహితుల అనేక ల్యాండ్ పార్శిల్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, MHADA, ముంబై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా 1860 IPCలోని వివిధ సెక్షన్ల కింద M/s GACPL, రాకేష్ కుమార్ వాధావన్, సారంగ్ కుమార్ వాధావన్, ఇతరులపై ED FIR నమోదు చేసింది. 11 డిసెంబర్ 2020తేదీ ఛార్జ్ షీట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించబడింది.
అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సన్నాహాలు:
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి సంకేతాలు అందడంతో స్థానిక కాంగ్రెస్ కమిటీ చురుగ్గా ప్రచారం చేస్తుంది. కాగా, నేడు లేదా రేపు రాహుల్ గాంధీ బృందం అమేథీకి వెళ్లబోతుంది. నేటి నుంచి అమేథీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కానీ, బీజేపీ మినహా ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ఇప్పటి వరకు అమేథీలో ప్రకటించలేదు. అయితే, గురువారం నాడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి పై స్థాయి నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో కాంగ్రెస్ కార్యాలయంలో సీనియర్ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి.
సియాచిన్ సమీపంలో రహదారిని నిర్మిస్తున్న చైనా:
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని సియాచిన్ గ్లేసియర్ కు అతి సమీపంలో చైనా కొత్తగా రహదారిని నిర్మిస్తోంది. శర వేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని ఉపగ్రహ ఆధారిత ఛాయాచిత్రాల ద్వారా భారత రక్షణ శాఖ నిపుణులు వెల్లడించారు. గత ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే ఈ రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తిగా భారతదేశ ప్రాదేశికత సమగ్రతల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు తెలిపారు. దేశ సార్వభౌమాధికారికతను కించ పరిచే చర్యగా దీనిని భారత్ పరిగణిస్తుంది. ప్రపంచంలోనే అతి ఎతైన యుద్ధ ప్రాంతంగా సియాచిన్ గ్లేసియర్స్‌కు పేరు ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగంలో సియాచిన్ దగ్గర చేపట్టిన పనులు మౌలిక స్థాయిని దాటి ఇప్పుడు రహదార్ల ఏర్పాటు దిశగా కొనసాగుతున్నాయి.
ఆ సీన్ నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది:
తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మృణాల్ జెర్సీ హిందీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేసారు. తాను వరుణ్ ధావన్ కి పెద్ద అభిమానిని మృణాల్ తెలిపారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలిపారు.ఈ సినిమా మొదటిరోజు షూటింగ్ సమయంలో తాను ఎంతో భయపడినట్లు చెప్పారు. అయితే షాహిద్ నవ్వుతూ ఉండడంతో తనని చూస్తూ అలా ఉండిపోయానని, ఆయన ఆన్ స్క్రీన్ పై ఎలా నవ్వుతూ ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే నవ్వుతూ కనిపిస్తారని మృణాల్ తెలిపింది.