మూలపేట పోర్టుకు శంకుస్థాపన.. ప్రత్యేక ఏంటి?
శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు.. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు.. దీనికోసం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. విశాఖపట్నం నుండి చాపర్ లో శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంటారు.. ఉదయం 10.15 గంటలకు మూలపేట చేరుకోనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 10.30 – 10.47 గంటల మధ్య మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.. అనంతరం బీచ్ లో గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు ఉంటాయి.. ఉదయం 11.35 గంటలకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు.. దీంతోపాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. ఉదయం 11.40 – మధ్యాహ్నం 12.30 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి, భూములు ఇచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
మరికొన్ని కార్యక్రమాలకు శ్రీకారం..
ఇక, సీఎం జగన్ తన పర్యటనలో శ్రీకారం చుట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేస్తారు.. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.. మరోవైపు.. విష్ణుచక్రం, మూలపేటకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని నిర్మించబోతోంది.. ఇక, మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనావేస్తున్నారు.
తెలంగాణలో నేటి నుంచి బూస్టర్ డోస్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. భారత్‌లోనూ కరోనా భయపెడుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మళ్లీ కరోనా వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో ఇప్పటికే రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇదిలావుంటే.. తెలంగాణలో కూడా కరోనా సంక్షోభం మొదలైంది. తాజాగా రాష్ట్రంలో మరో 21 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, మహబూబాబాద్ జిల్లాలో నెల రోజుల్లోనే దాదాపు 40 మంది విద్యార్థులు పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించారు. బూస్టర్ డోస్‌గా కార్బో వ్యాక్సిన్ వేయనున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఇందుకోసం ప్రస్తుతం 5 లక్షల కార్బో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
సిద్దిపేటలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు.. ఒకే రోజు ఆరు ఘటనలు
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓటిపి అనే దాన్ని చెప్పి, దాని ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎత్తులకు సైబర్ కేటుగాళ్లు పైఎత్తులు వేసి ప్రజల డబ్బును దోచుకుంటున్న తీరు ఇది. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని.. సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు లావాదేవీల్లో ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేసి డబ్బుల్ని కొట్టేస్తున్నారు.ఇప్పుడు ఈ తరహాలో మోసాలపై ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా సైబర్ క్రైమ్ పోలీసులకు వస్తున్నాయి. వరుసగా ఇలాంటి ఫిర్యాదులు వస్తుండడంతో జంటనగరాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆన్‌లైన్ చీటింగ్‌లపై మరింతగా అవగాహన కల్పిస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నార వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నా ప్రజలు మాత్రం ఇలాంటి సైబర్ కేటుగాళ్ల చేతుల్లో మోసపోతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
6 రోజుల పాటు ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ. ఇవాళ్టి నుంచి ఆరురోజులపాటు విచారించనుంది. ఈనెల 24 వరకు ఆయన్ని ప్రశ్నించనుంది సీబీఐ టీమ్.. అయితే, ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది ఇప్పటికే తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని తెల్పింది. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే ఇవ్వాలని సూచించింది. ఈనెల 25న తుది తీర్పు ఇస్తామని హైకోర్టు చెప్పడంతో.. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలను కలిపి విచారణ చేయనుంది సీబీఐ.
అతీక్ అహ్మద్ కేసులో అధికారులకే మైండ్ బ్లాంక్..! ఎలా సాధ్యమైంది..?
మాఫియాడాన్ అతీక్ అహ్మద్ శకం ముగిసింది. దీంతో అతడి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. మరోవైపు అతీక్ అక్రమాస్తుల వివరాలను అధికారులు బయటకు లాగుతున్నారు. ఆ వివరాలు చూస్తే అధికారులకే మైండ బ్లాంక్ అవుతోంది. పదుల్లో కాదు వందలు, వేల కోట్లకు పైగా ఆస్తులు అతీక్ సంపాదించినట్లు తెలుస్తోంది. అతీక్ కన్నుపడితే ఏ ఆస్తి అయినా కబ్జా కావాల్సిందే. ఇవ్వను అనడానికి లేదు. అంటే వాళ్లుండరు. అలా ఎంతోమంది మాయమైపోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదు. ప్రభుత్వ భూములు, వ్యాపారుల ఆస్తులు, రైతుల పొలాలు ఏదైనా సరే కోరుకుంటే కబ్జా అయిపోవాల్సిందే. అతీక్ తను సంపాదించిన ఆస్తుల్లో చాలాభాగం బినామీల పేరిట ఉంచాడు. ఇప్పుడు వారందరినీ గుర్తించడం సవాల్‌గా మారింది. రాజకీయనాయకులు, వ్యాపారులు, పెద్దపెద్ద కాంట్రాక్టర్లు కూడా అతీక్‌కు బినామీలుగా చెబుతున్నారు. గతంలో అరెస్టు చేసినప్పుడే ఈడీ 11వందల 68కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. అందులో 4వందల కోట్లకుపైగా విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. మరో 750కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, కబ్జా నుంచి విడిపించడం, కూల్చేయడం వంటివి చేశారు. జైల్లో పెట్టినా కూడా అతీక్ ఆగడాలు ఆగలేదు. 2018లో డియోరా జైల్లో ఉన్న సమయంలో మోహిత్ జైస్వాల్ అనే వ్యాపారిని కిడ్నాప్ చేయించాడు. అతడిని జైలుకు రప్పించుకుని అక్కడే కొట్టాడు. 40 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను తన పేరిట రాయించుకున్నాడు.
ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్… ఇంటర్నేషనల్ లెవల్ కి ఇండియన్ సినిమా
ఇండియన్ సినిమా బౌండరీలని మొదటిసారి దాటించిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాహుబలి 2 సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా ఆల్బర్ట్ హాల్ లో ప్రిమియర్ అవ్వడం అదే మొదటిసారి. ఇప్పుడు మరోసారి ఇండియన్ సినిమా బౌండరీలని దాటిస్తూ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ మూవీ ‘ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్’ లో స్క్రీనింగ్ చెయ్యనున్నారు. ప్రభాస్ హీరోగా ‘టి సిరీస్ ఫిలిమ్స్’ 550 కోట్ల బడ్జట్ తో భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్న మైథలాజికల్ జానర్ మూవీ ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాపై ప్రభాస్ ఫాన్స్ లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. రిలీజ్ కన్నా ముందే స్పెషల్ స్క్రీనింగ్ కి రెడీ అయ్యింది ఆదిపురుష్ మూవీ. జూన్ 13న అమెరికాలోని న్యూయార్క్ లో జూన్ 7 నుండి 18 వరకూ జరిగే ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ సినిమా స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నారు. ఒక ఇండియన్ సినిమా ట్రిబెకా ఫెస్టివల్ లో స్క్రీనింగ్ అవ్వడం ఇదే మొదటిసారి. గతంలో బాహుబలి సినిమాతో ఇండియాన్స్ సినిమా ప్రైడ్ ని రాయల్ ఆల్బర్ట్ హాల్ వరకూ తీసుకోని వెళ్లడంలో భాగమైన ప్రభాస్, ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో కూడా భాగం అవ్వడం విశేషం. టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఆదిపురుష్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ ని కాంప్లిమెంట్స్ గా మార్చుకుంటూ ఆదిపురుష్ సినిమా రోజురోజుకీ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది. మరి జూన్ 16న ఆడియన్స్ ని ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.