హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచండి:
హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం.. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ పిల్‌ను దాఖలు చేశారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనున్న విషయం తెలిసిందే.
విద్యార్థులకు గుడ్‌న్యూస్:
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకరోజు తరగతులు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ పాఠశాలల్లో ఏప్రిల్ 23 వరకు ఒక పూట భోజనం పెట్టాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనానని అందించనున్నారు. అయితే 10వ తరగతి కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
రాష్ట్రంలో భానుడి ప్రతాపం:
తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, ఖమ్మం జిల్లా మధిర, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 38.9 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. నేటి నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం:
‘నేషనల్ ఇమ్యూనైజేషన్ డే’ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలతో సహా పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, విమానాశ్రయంలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చుక్కలు వేస్తారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో రాత్రి 8 గంటల వరకు పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. మార్చి 3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాల్ని తీసుకుని.. 4, 5, 6 తేదీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు.
జోషిమఠ్‌లో మళ్లీ గందరగోళం:
ఉత్తరాఖండ్‌కు చెందిన జోషిమఠ్ మరోసారి వార్తల్లో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 1200 ఇళ్లను డేంజర్ జోన్‌గా ప్రకటించింది. ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాలని కోరుతోంది. దీనికి సంబంధించి ఉత్తరాఖండ్ విపత్తు కార్యదర్శి ఒక నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బద్రీనాథ్ రాజేంద్ర సింగ్ భండారీ ప్రశ్నలు సంధించారు. ఇక ఇక్కడి నుంచి ప్రజలు ఎక్కడికి వెళ్తారని ఆయన ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను నిర్వాసితులకు తరలించే పథకం ఏమిటని ప్రశ్నించారు. ఈ నివేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్ భండారీ, జోషిమత్ బచావో సంఘశార్గ్య సమితి కన్వీనర్ అతుల్ సతీ కూడా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 1200 ఇళ్లు డేంజర్ జోన్‌లో ఉన్నాయని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. అయితే ఇక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారో ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు.
4 గంటలు ఐస్‌పై పడుకోబెట్టి:
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఓ యువకుడిపై దారుణం వెలుగుచూసింది. ఇక్కడ కరైరాలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని ఐస్ పై పడుకోబెట్టి దారుణంగా కొట్టారు. ముఖంపై మూత్రం పోసి పోశారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కరైరా పట్టణానికి చెందిన రైతు సాగర్ (28) జనవరి 29న కరైరాలోని ముంగావాలి కూడలి వద్ద నిలబడి ఉన్నట్లు ఫిర్యాదు దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆ తర్వాత ధర్మేంద్ర యాదవ్, ఆకాష్ యాదవ్, సౌరభ్ యాదవ్, బ్రజేంద్ర యాదవ్ కారులో వచ్చారు. పాత వివాదం కారణంగా వ్యక్తులు అతన్ని బలవంతంగా కారులో కూర్చోబెట్టి, కరోతా గ్రామంలోని ఆకాష్ యాదవ్ ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. కారులోనే అతడిపై దాడి జరిగింది. అయితే అతన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లిన తర్వాత అందరూ అతని పట్ల మరింత క్రూరంగా ప్రవర్తించారు. అతడిని ఐస్ పై పడుకోబెట్టి 4 గంటల పాటు కొట్టారు. అంతేకాదు నిందితుడు ముఖంపై మూత్రం పోశారు. అనంతరం రాత్రి 2 గంటల ప్రాంతంలో అతడిని కారులో ఎక్కించుకుని ముంగావలి తీరా వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. బాధితుడి సాగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన అంతా విన్న పోలీసులు సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.ఈరోజు బులియన్ మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,910గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 63,170గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,060గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,320గా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,910గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,170గా నమోదైంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 77,000గా ఉంది.
అల్లు అర్జున్ న్యూ లుక్:
అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బ్లాక్ షర్ట్ వేసుకొని గాగుల్స్ పెట్టుకొని కూల్ గా చూస్తున్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కొత్త లుక్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చేస్తున్నాడు.