మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించిన మనోజ్
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తుతెలియని వారు తనపై దాడి చేశారని.. తనకు, తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచుమనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్‌బాబు రాచకొండ సీపీ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మౌనిక, మనోజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. కాబట్టి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ను మోహన్ బాబు కోరారు. తాజాగా మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మనోజ్ కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానన్నారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరమన్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇంటి నుంచి మా కుటుంబానికి దూరంగానే ఉంటున్నామని మనోజ్ తెలిపారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా తిట్టారన్నారు. ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజీ కెమెరాలు మాయమైపోయాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్‌కి ఎందుకు వెళ్ళాడు అందరికీ తెలుసన్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని అన్నారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయ్ రెడ్డి ,కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదని.. ఆస్తులు కావాలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. నేను, నా భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని మంచు మనోజ్ తెలిపారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని.. విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంచు మనోజ్ వెల్లడించారు.
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు.. సీఎం చంద్రబాబు నిర్ణయం
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి.. 25 మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి ముగ్గురు మంత్రులుగా ఉండగా.. కూటమి పొత్తులో భాగంగా 4 మంత్రి పదవులు రావాల్సి ఉంది. ఈ క్రమంలో నాగబాబు మంత్రిమండలిలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
విషాదం.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు గల్లంతు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో అరకు విహారయాత్రకు వెళ్ళి తిరిగి స్వగ్రామం పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో విజయ్ కుమార్ భార్య, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో గల్లంతైన భార్య ఉమ, పెద్ద కుమారుడు మనోజ్, చిన్న కుమారుడు రోహిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. విహారయాత్ర విషాదంగా మారిన ఘటన కోనసీమ వాసులను కలసివేసింది. పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య ఇద్దరు కుమారులతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి గత రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. కారు రావులపాలెం మండలం ఈతకోట వద్దకు వచ్చేసరికి విజయ్ కుమార్‌కు నిద్రమత్తుతో కళ్ళు మూతలు పడుతున్నాయని రోడ్డు పక్కన ఆపారు. భార్య ఉమ నాకు డ్రైవింగ్ వచ్చు కదా ఇంకా పది కిలోమీటర్ల దూరంలో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పింది. దీనికి భర్త అంగీకరించడంతో భార్య ఉమ కార్ డ్రైవింగ్ చేస్తూ పోతవరం బయలుదేరారు. కారు ఊడిముడి వచ్చిన తర్వాత అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు కుమారులు మృతి చెందగా, భర్త విజయ్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన కోనసీమ వాసులను కలిసి వేసింది. మరో ఐదు కిలోమీటర్ల దూరంలో స్వగ్రామం చేరుకుంటారనే సమయంలో ఈ ప్రమాదం జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కంటతడి పెడుతున్నారు. ఘటనా స్థలం అరణ్య రోదనగా మారింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పి.గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ(92) కన్నుమూత.
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఈరోజు (డిసెంబర్ 10) తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని సదాశివనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయనకు 92 ఏళ్లు కాగా.. వృద్ధాప్య వ్యాధితో బాధపడుతున్న ఎస్‌ఎం కృష్ణను చికిత్స నిమిత్తం తొలుత వైదేహి ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. డా. సత్యనారాయణ మైసూర్, డా. సునీల్ కారంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఎస్‌ఎం కృష్ణ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. మే 1, 1932న కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరు తాలూకా సోమనహళ్లి గ్రామంలో జన్మించిన ఎస్‌ఎం కృష్ణ పూర్తి పేరు సోమనహళ్లి మల్లయ్య కృష్ణ. ఎస్‌ఎం కృష్ణ తన ప్రాథమిక విద్యను హత్తూరులో, సెకండరీ విద్యను మైసూర్‌లోని శ్రీ రామకృష్ణ విద్యాశాలలో, తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ని మైసూర్‌లోని మహారాజా కాలేజీలో, లా డిగ్రీని యూనివర్సిటీ లా కాలేజీలో పూర్తి చేశాడు. ఆయన డల్లాస్, టెక్సాస్, యూఎస్‌ఏలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ డీసీలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.
పార్లమెంట్‌లోకి జమిలి బిల్లు.. ఎన్నికలు ఎప్పుడంటే..!
జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదించి.. 2029లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. బిల్లు ఆమోదం పొందేందుకు కనీసం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం ఉంటుంది. 245 రాజ్యసభ సీట్లలో ఎన్డీఏకి 112 సీట్లు ఉన్నాయి.. ప్రతిపక్షానికి 85 సీట్లు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడానికి ప్రభుత్వానికి కనీసం 164 ఓట్లు అవసరం. అలాగే లోక్‌సభలోని 545 సీట్లలో 292 స్థానాలు ఎన్డీఏకు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజారిటీ 364 ఉండాలి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అనేది తెలియాలి. దేశ వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది. దీనిపై ఎన్డీఏ-2లోనే మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది. దేశ వ్యాప్తంగా ఆయా పార్టీల అభిప్రాయాలను సేకరించి.. రిపోర్టును కేంద్రానికి అందించారు. దీనికి ఇటీవలే మోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బిల్లు పంపగా ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించడమే మిగిలి ఉంది. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అయితే దీనిపై సుదీర్ఘ చర్చలు ఉంటాయి. అలాగే బిల్లు ఆమోదానికి మెజార్టీ కూడా అవసరం ఉంటుంది. జమిలి బిల్లును ఆమోదించేందుకు బీజేపీకి అంత బలం లేదని కాంగ్రెస్ పేర్కొంది. కచ్చితంగా బిల్లు వీగిపోతుందని తెలిపింది. మరోవైపు జమిలి ఎన్నికలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇండియా కూటమి పార్టీలు మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెడితే.. ఏం జరుగుతుందో చూడాలి.
కర్ణాటకలోని బెలగావిని యూటీ చేయండి.. మోడీకి ఆదిత్య థాక్రే విజ్ఞప్తి
కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీని కోరారు. బెలగావిలో మరాఠా మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. మరాఠీలకు జరుగుతున్న అవమానాన్ని సహించలేపోతున్నామన్నారు. బెలగావిలో అధిక జనాభా మరాఠీ మాట్లాడే వారే ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆదిత్య కోరారు. ఇక కర్ణాటక ప్రభుత్వం తీరుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే అసంతృప్తి వ్యక్తం చేశారు. బెలగావిలో నిరసనలు తెలుపుతున్న మరాఠీ కార్యకర్తలపై పోలీసుల్ని ప్రయోగించడాన్ని ఖండించారు. సరిహద్దులో మరాఠా మాట్లాడుతున్న ప్రజలపై కర్ణాటక ప్రభుత్వం అణచివేత వ్యూహాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అమిత్ షాతో గతంలో సమావేశం జరిగిందని గుర్తుచేశారు. సమావేశంలో సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. అయినా కూడా కర్ణాటక ప్రభుత్వం ఈ తరహాగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సోమవారం ఉదయం కర్ణాటకలోని సువర్ణ విధాన్ సౌధలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి కార్యకర్తలు, నేతలను ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
23 రోజుల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, జిరిబామ్, చురాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, ఫర్జాల్ జిల్లాల్లో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితిని సమగ్రంగా సమీక్షించిన తర్వాత రాష్ట్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, విద్యా సంస్థలతో పాటు వివిధ కార్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని మణిపూర్ ప్రభుత్వం నవంబర్ 19 (2024)న బ్రాడ్‌బ్యాండ్ సేవలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది . అయితే, Wi-Fi లేదా హాట్‌స్పాట్‌ల కనెక్షన్స్ కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కాగా, భవిష్యత్తులో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేసే అవకాశం ఉన్నప్పటికి.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు ఇంటర్నెట్ వినియోగదారులందరూ దూరంగా ఉండాలని రాష్ట్ర హోం శాఖ తెలిపింది. ఇక, జిరిబామ్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీయడంతో పాటు ఇంఫాల్ లోయలో హింస చోటు చేసుకోవడంతో.. ఎమ్మెల్యేల ఇళ్ళు, ఇతర ఆస్తులపై అనేక మంది నిరసనకారులు దాడి చేయడంతో తొమ్మిది జిల్లాల్లో నవంబర్ 16న ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే, మణిపూర్‌లో గత సంవత్సరం మే నుంచి మైటీలు, కుకీల మధ్య జాతి హింసలో 250 మందికి పైగా మరణించారు.. అలాగే, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..!
ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు. ఇది భారతీయులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే, అమెరికాకు రావాలని అనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్థులు డైరుక్టుగా అమెరికాకు వచ్చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి 13,099 మంది నేరస్థులు యూఎస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వొద్దని తెలిపారు. వారిని తక్షణం వెళ్లగొట్టాలని ఆయన చెప్పారు. ఇక, అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారు.. వారిలో చాలా మంది గొప్ప మంచి ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారు.. కాట్టి వారి సమస్య తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. డ్రీమర్స్ సమస్యకు ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారం కనుగొంటానని ట్రంప్ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్నారని, దీన్ని నిరోధించకపోతే ఆ రెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై రెండు దేశాలు హాహాకారాలు చేయగా కెనడా, మెక్సికోలు అమెరికాలో 51వ, 52వ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అమెరికా ఇప్పటికే కెనడాకు 10,000 కోట్ల డాలర్లు, మెక్సికోకు 30,000 కోట్ల డాలర్ల చొప్పున రాయితీలు ఇస్తోందనీ, వీటిని కట్టిపెట్టాల్సి ఉందన్నారు. చైనా తదితర దేశాలపై సుంకాలు పెంచితే సరకుల ధరలు పెరిగి సామాన్య అమెరికన్ పౌరులు నష్టపోతారని కంపెనీల సీఈవోలు కొందరు చేస్తున్న హెచ్చరికలను ట్రంప్ తోసిపుచ్చారు. సుంకాల సాయంతో తాను యుద్ధాలు ఆపానన్నారు.
హమ్మయ్య.. తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసింది
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా వచ్చిన చిత్రం తంగలాన్. అక్కడి బంగారు గనులు అక్కడి గిరిజనుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే తెరపై కళ్ళకి కట్టినట్టు తెరకెక్కించాడు దర్శకుడు పా రంజిత్. కాగా తంగలాన్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ కు ముందు కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. ఒకానొక టైమ్ లో తంగలాన్ డిజిటల్ రైట్స్ ఒప్పందాన్ని నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసుకుంది అనే టాక్ కూడా వినిపించింది. కానీ అవేవి వాస్తవం కాదని నిర్ ఫ్లిక్స్ మరోసారి వెల్లడిస్తూ తంగలాన్ ఓటీటీ స్టీమింగ్ డేట్ ను ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమాను ఈ మంగళవారం అనగా నేటి నుండి స్ట్రీమింగ్ తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందిలోను ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్. ఏదైతే ఏమి ఇంక అసలు ఓటీటీ రిలీజ్ కాదు అనుకున్న సినిమా మొత్తానికి ఓటీటీ రిలీజ్ అయింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.