జనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
అతి వేగం ప్రమాదకరం. వాహనాన్ని అతి వేగంగా నడపడం వల్ల వాహనం నడుపుతున్న వారికే కాదు ఇతర వాహన ధారులకి అలానే కాలినడకన వెళ్లే వాళ్ళకి కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగళూరులో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఐదుగురి పైకి ఒక కారు దూసుకెళ్లింది. లేడీహిల్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు నడిచి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.
దేశానికి ర్యాపిడ్ రైలు బహుమతిగా ఇచ్చిన ప్రధాని.. ఘజియాబాద్ నుండి పిల్లలతో ప్రయాణం
దేశం తన మొదటి ర్యాపిడ్ రైల్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) బహుమతిని పొందింది. మొదటి దశ కింద సాహిబాబాద్ నుంచి దుహై డిపో వరకు నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఉన్నారు. రేపటి నుంచి సాధారణ ప్రజలు కూడా ఈ రైలులో ప్రయాణించవచ్చు. ఈ మార్గంలో నడిచే రైళ్లకు ‘నమో భారత్’ అని పేరు పెట్టారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నిన్న పేరు మార్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్ మొదటి దశ 17 కిలోమీటర్ల పొడవు ఉంది. అంటే ఇప్పుడు ప్రయాణికులు ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ నుండి దుహై డిపోకు ప్రయాణించవచ్చు. సాహిబాబాద్ నుంచి దుహై డిపోకు రైలు ఛార్జీని రూ.50గా ఉంచారు. ప్రీమియం కోచ్ కోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రైలును జెండా ఊపి ప్రధాని మోడీ కూడా అందులో ప్రయాణించారు. ప్రధాని మోడీ పాఠశాల విద్యార్థులతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.
‘ఏపీ హేట్స్ జగన్’.. సీఎంపై టీడీపీ పుస్తకం..
ఏపీ హేట్స్ జగన్ అనే పేరుతో పుస్తకాన్ని విడుదల చేసింది టీడీపీ.. జగన్ హయాంలో జరిగిన పరిణామాలు.. పెరిగిన ధరలు.. పన్నుల భారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ హేట్స్ జగన్ అనే పుస్తకాన్ని రూపొందించారు.. మద్యం, ఇసుక, మైనింగ్ వంటి అంశాల్లో భారీ అవినీతి జరిగిందని పుస్తకంలో టీడీపీ ముద్రించింది.. వివిధ వర్గాలపై దాడులు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య ఆరోపణలు.. దళితులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపిస్తూ ఏపీ హేట్స్ జగన్ బుక్ లెట్ రిలీజ్ చేశారు.. ఇక, ఈ సందర్భగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అంటున్నారని తెలిపారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వృద్ధులు, వికలాంగులు సహా అన్ని వర్గాల వారు జగన్ రెడ్డి బాధితులే అని విమర్శించారు.
కేవలం స్టడీ కోసమే ఒప్పందం.. రూ.4 వేల కోట్ల స్కాం ఏంటీ..? వాటీజ్ దిస్ నాన్సెన్స్..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-ఐబీ ఒప్పందాన్ని తప్పుబడుతోన్న జనసేన పార్టీ.. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.. అయితే, విద్యారంగంపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. సెలిబ్రిటీ పార్టీ (జనసేన) మళ్లీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐబీ ఒప్పందంపై మళ్లీ విమర్శలు చేస్తున్నారు. ఐబీ ఒప్పందంలో ఏదో స్కాం జరిగిందనే ఆరోపణలు చేశారు. ఫైనాన్స్, న్యాయ విభాగాలు అభ్యంతరం తెలిపినా ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అసలు పేదలకు నాణ్యమైన విద్య అందకూడదనా..? ఆ సెలిబ్రిటీ పార్టీ ఉద్దేశ్యం అంటూ నిలదీశారు.. ఐబీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎక్కడుందో చెప్పాలన్న ఆయన.. కేవలం ఇంటర్నేషనల్ కరిక్యులమ్ కోసం స్టడీ చేయడమే ఒప్పందంలో ఉన్న సారాంశం.. కేవలం స్టడీ చేయడం కోసమే ఒప్పందం చేసుకుంటే.. రూ. 4 వేల కోట్ల స్కాం ఏంటీ..? వాటీజ్ దిస్ నాన్సెన్స్..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీపై దుష్ప్రచారం.. తిప్పికొట్టాల్సిన బాధ్యత మనదే..
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. దానిని తిప్పికొట్టాల్సిన భాద్యత మీ అందరిపైనా ఉందంటూ పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.. అనకాపల్లి జిల్లా
నర్సీపట్నంలో వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పధకాలకు వివరించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. నవంబర్ 1 నుంచి జగనన్నే మరలా ఎందుకు సీఎం కావాలి అనే దానిపై రెండు రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని.. అనంతరం గ్రామంలోని పార్టీ ప్రతినిధులపై ఇళ్లపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు ఏ తప్పు చేయలేదు.. నేను, ప్రజలు నమ్ముతున్నారు
చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష ఉంది.. చంద్రబాబునాయుడు అమాయకుడు.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా.. ప్రజలు కూడా నమ్ముతున్నారని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు దుర్మార్గమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం తగ్గుతోందన్నారు. చంద్రబాబు కేసులో రుజువులు ఎక్కడ ఉన్నాయి.. చూపించండి..? అని నిలదీశారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్ర ఉందని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజాస్వామ్యవాదులు నోరు విప్పాలని పిలుపునిచ్చారు.
సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే..
సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనే పదానికి కవల పిల్లలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటేసినట్టే అన్నారు. కేసీఆర్, రాహుల్ గాంధీ తెలంగాణ గల్లీల్లో కొట్లాడుతారన్నారు. ఢిల్లీలో కలిసి అలయ్ బలయ్ చేసుకుని చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీది అన్నారు. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారని తెలిపారు. కేసీఆర్ ని ఓడించండి..బీజేపీని గెలిపించండని కోరారు. నీళ్లు, నిధులు, నియామకం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అడ్డగోలుగా వ్యయం పెంచి పూర్తి చేశారన్నారు. అయినా కూడా 60 శాతం భూములకు నీళ్లు అందడం లేదని మండిపడ్డారు. ఈ పదేళ్ళలో 5 లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
గగన్ యాన్ కౌంట్ డౌన్.. రేపు నింగిలోకి టీవీ–డీ1
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్ కౌంట్ డౌన్ ఇవాళ సాయంత్రం షార్ రేంజ్ శ్రీహరికోటలో రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2025లో సొంత రాకెట్ తో అంతరిక్షంలోకి తమ వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకురావాలని భారత అంతరీక్ష పరీశోధనా సంస్థ యోచిస్తుంది. ఎస్కేప్ సిస్టమ్ ను పరీక్షించడంలో భాగంగా ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(TV D1) ఫ్లైట్ ను రేపు (అక్టోబర్21) ఉదయం 8 గంటలకు నింగిలోకి పంపనున్నారు. నాలుగు టెస్ట్ ఫ్లైట్ లలో ఇది మొదటిది అని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదు.. తెలంగాణకు ఏ టీం..
మంత్రి కేటీఆర్ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జిట్టాకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్మాట్లాడుతూ.. బాలకృష్ణారెడ్డి దారి తప్పిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గన్ పార్కు దగ్గరకు రమ్మని సవాల్ చేస్తున్నారని, నవ్వాలా సావాలా అర్ధం కావడం లేదన్నారు. అమర వీరులుగా మార్చిన వారే అమరవీరుల స్థూపం దగ్గరకు రమ్మంటారని, బీ ఆర్ ఎస్ ఎవ్వరికీ బీ టీం కాదు ..తెలంగాణ కు ఏ టీం ..అవ్వల్ దర్జా టీం అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
విజయవాడ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మూలా నక్షత్రం సందర్భంగా ఆరో రోజు అయిన నేడు (శుక్రవారం) కనకదుర్గదేవి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మూలా నక్షత్రం కానున్న నేపథ్యంలో కనక దుర్గ అమ్మవారిని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం పర్యటన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 186 (81 శాతం) మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికలో తెలిపింది. 230 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సగటున రూ. 10.76 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారని, ఇది 2013లో ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే సగటు రూ. 5.25 కోట్ల కన్నా 105 శాతం ఎక్కువ అని, 2008లో ఎన్నికైన ఎమ్మెల్యే సగటు రూ. 1.44 కోట్ల కన్నా 647 శాతం ఎక్కువ అని తెలిపింది. నివేదిక ప్రకారం 129 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 107(83శాతం) మంది కోటీశ్వరులే కాగా.. 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 76 (78 శాతం) మంది కోటీశ్వరులే. నలుగురు స్వతంత్య ఎమ్మెల్యేల్లో ముగ్గురు కోటీశ్వరులే అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
రాహుల్ గాంధీ బస్సుయాత్రలో అన్ని అసత్యాలే
రాహుల్ గాంధీ బస్సుయాత్రలో ఆయన అన్ని అసత్యాలే మాట్లాడారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఎవరో స్క్రిప్టు రాసిస్తే చదువుతున్నారే తప్ప.. అందులో ఏది వాస్తం ఏది వాస్తం కాదో గమనించడం లేదన్నారు. కాళేశ్వరం పథకంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని పాత పాటే పాడారు. ప్రాజెక్టు కు 80 వేల కోట్లు ఖర్చు అయితే. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో.. రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. రాహుల్ నిన్న, ఈరోజు తిరిగింది అంతా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లొస్తున్న ప్రాంతమే. నిన్న.. మంథని నుంచి.. ప్రాజెక్టు వద్దకు వెళ్లి వస్తే తెలిసేది. ఆ ప్రాజెక్టు ఎంత గొప్పదో అని మంత్రి గంగుల అన్నారు.