హోం మంత్రితో నటి జత్వానీ భేటీ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు.. నాకు నష్టపరిహారం ఇవ్వాలి..!
ముంబై నటి జత్వానీ వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతోంది.. ఇప్పటికే కీలక అధికారులపై వేటు వేసింది సర్కార్.. అయితే, ఆ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు జత్వానీ.. అరగంట పాటు భేటీ జరిగింది.. తన మీదున్న కేసును విత్ డ్రా తీసుకోవాలని హోం మంత్రిని కోరారు జత్వానీ కుటుంబం. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సినీ నటి జత్వానీ.. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోం మంత్రికి వివరించాను. పోలీసులు నా విషయంలో.. నా ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది.
విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు..
విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్ లో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటుంది. ఇటీవల వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థి ఇంటికి వెళ్లి వార్డెన్ అబ్రహం మొబైల్ ఫోన్ కు హాయ్ అంటూ మెసేజ్ చేసింది. ఇద్దరూ ఫోన్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వార్డెన్.. విద్యార్థినికి ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి తెలిపింది. దీంతో ఈ విషయాన్ని విద్యార్థి తండ్రి బుధవారం పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోనే వార్డెన్ కనిపించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానిక పాఠశాల ఆవరణలోనే వార్డెన్‌ను కొట్టడంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అతడిని తొలగించాలని కోరారు. విద్యార్థిని బంధువులు ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో ప్రిన్సిపాల్.. వార్డెన్ ను ఆఫీసు గదిలో బంధించాడు. ఈ విషయంలో స్కూల్ యాజమాన్యం తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుచేసిన వార్డెన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. పిల్లలపై ఇలా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపిన ప్రిన్సిల్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. వార్డెన్ ను తొలగించకుండా.. అతనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.
‘కాంగ్రెస్- పాకిస్థాన్‌ల ఉద్దేశాలు.. ఎజెండా ఒక్కటే’
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాజకీయాలు వేడెక్కాయి. పాక్ రక్షణ మంత్రి ఇచ్చిన ప్రకటన కారణంగా ఎన్‌సీ, కాంగ్రెస్ రెండూ బీజేపీ టార్గెట్‌గా మారాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. అమిత్ షా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో..” కాంగ్రెస్, పాకిస్థాన్‌ల ఉద్దేశాలు, ఎజెండా ఒక్కటేనని పేర్కొన్నారు. “ఆర్టికల్ 370, 35ఏ పై కాంగ్రెస్, జెకేఎన్‌సీకి పాకిస్థాన్ రక్షణ మంత్రి మద్దతు ఇవ్వడం మరోసారి కాంగ్రెస్‌ను బట్టబయలు చేసింది. కాంగ్రెస్, పాకిస్థాన్ ఉద్దేశాలు, ఎజెండా ఒక్కటేనని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ దేశప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తున్నారు.” అని రాసుకొచ్చారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు..
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు రిమాండ్‌ను పొడిగించారు. మరో 14 రోజుల పాటు అంటే.. అక్టోబర్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో.. రెండు రోజుల విచారణలో భాగంగా పలు ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టినట్లు సమాచారం. మరోవైపు.. రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. పోలీసులు వేసిన ఎక్స్టెన్షన్ రిమాండ్ పిటిషన్ పరిశీలించిన కోర్టు.. అక్టోబర్ 3 వరకు నందిగం సురేష్‌కు రిమాండ్ విధించింది. కాగా మరియమ్మ అనే మహిళ మృతి కేసులో తుళ్లూరు పోలీసులు వేసిన పిటి వారెంట్‌ను మంగళగిరి కోర్టు తిరస్కరించింది. తుళ్లూరు పోలీసులు మరియమ్మ మృతి పై మరింత లోతుగా దర్యాప్తు చేసి.. అందులో నందిగం సురేష్ పాత్ర ఏంటో స్పష్టం చేయాలని మంగళగిరి కోర్టు ఆదేశించింది.
రేపు నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన
రేపు నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పరిశీలించనున్నారు. అమెరికాలోని రాబిన్ సన్ సంస్థ నూతన టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో SLBC పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడేది లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అయితే మరోవైపు.. నూతన టెక్నాలజీతో ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉందంటుని అధికార వర్గాలు వెల్లడించాయి. రేపు కేబినెట్‌లో ఎజెండాగా SLBC అంశంపై చర్చ జరుగనుంది. అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై వివక్ష చూపిందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఈ నెల 20న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల SLBC టన్నెల్ పరిశీలన, ఇరిగేషన్ అధికారులతో సమీక్షతో నల్గొండ జిల్లా ప్రాజెక్టుల దశ మారనుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.
కాసేపట్లో జనసేన అధినేతతో బాలినేని భేటీ..
కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. నోవాటెల్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని బయలుదేరారు. పవన్‌తో భేటీ అనంతరం లాంఛనంగా జనసేన పార్టీలో చేరే విషయాన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించనున్నారు. కాగా.. నిన్న వైసీపీ పార్టీకి బాలినేని శ్రీనివాస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపించారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం.. బంధుత్వం ఉన్న నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.. ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని.. సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు.. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అయితే, 2019లో మళ్లీ గెలిచి వైసీపీ ప్రభుత్వం తొలి రెండున్నరేళ్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. ఇక, మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు బాలినేని.. మరోవైపు, గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ టికెట్ విషయంలోనూ వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి వార్తల్లో ఎక్కారు.. ఎన్నికలకు ముందు నుంచే బాలినేని.. అసంతృప్తితో ఉన్నారనే చర్చ సాగినా.. ఇప్పుడు కూడా తన ప్రాధాన్యత దక్కడంలేదంటూ ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు.
ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యానికి చిన్నారి బలి
ఆస్పత్రి యాజమాన్యం చేసిన తప్పు ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే అధికారుల తీరుతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలలో 45 రోజుల పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. బాబు మృతికి కారణాన్ని తెలుసుకునేందుకు 10 రోజుల తర్వాత మృతదేహాన్ని బయటికీ తీసి పోస్టుమార్టం చేశారు. ఈ నెల 5న జ్వరంతో ఉన్న 45 రోజుల పసికందు దష్విక్ ని తల్లిదండ్రులు అనురాధ, ప్రభులింగం సంగారెడ్డిలోని శిశురక్ష ఆస్పత్రిలో జాయిన్ చేశారు. పరీక్షలు చేయగా చిన్నారికి డెంగ్యూ వచ్చిందని వైద్యులు చెప్పారు. ఈ నెల 8న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా బాబుకి సీరియస్ గా ఉందని నిలోఫర్ కి రిఫర్ చేసి చేతులు దులుపుకున్నారు శిశురక్ష ఆస్పత్రి డాక్టర్లు. నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా బాబు చనిపోయి 3 గంటలు అవుతుందని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి బాబుని ఖననం చేశారు. మరునాడు తప్పుడు రిపోర్టులు ఇచ్చారని శిశురక్ష ఆస్పత్రి ల్యాబ్ ని DMHO సీజ్ చేశారు. దీంతో తమ బాబు మృతికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేయగా. నేడు బాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
మాకు ఎవరు ఇస్తారు అవకాశాలు అనుకోకూడదు..
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా పీసీసీగా నియామకం అయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ NSUI అధ్యక్షుడిగా ఉన్నాని ఆయన అన్నారు. మహేష్ అన్న నాకంటే ఎక్కువ శ్రమ పడ్డారు.. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నారని, వారసత్వ రాజకీయాలు కాకుండా క్షేత్ర స్థాయిలో బలహీన వర్గాల నుండి జెండా పట్టుకొని పైకి వచ్చామన్నారు పొన్నం ప్రభాకర్. మాకు ఎవరు ఇస్తారు అవకాశాలు అనుకోకూడదని, పోరాట చేయాలి గుంజుకోవాలి.. కొట్లాడాలన్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ జీత్నా హిస్సేదారి ఉత్నా బాగీదారి అని కుల గణన చేసి తీరుతామని పార్లమెంట్ లో చెప్పారని, రాబోయే తరాలలో బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ లకు న్యాయం జరుగుతుందన్నారు. బలహీన వర్గాల మంత్రిగా కుల గణన కు సంబంధించి అసెంబ్లీ లో బిల్లు పెట్టుకున్నాం.. నిధులు కేటించుకున్నామన్నారు మంత్రి పొన్నం.
మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా సురక్షిత నీటి సరఫరా..
రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలి.. ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. నిరంతరాయంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల్లో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని అందించాల్సి ఉందని.. ఇందులో 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేయగలిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, అందువల్ల కేవలం 5 జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా ట్యాప్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు.
జానీ మాస్టర్ అరెస్ట్ .. పోలీసుల అధికారిక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశాం అని బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, అప్పుడు ఆమె మైనర్ అని పేర్కొన్నారు. ముంబై లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొన్న పోలీసులు మైనర్ మీద రేప్ కావడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా పెట్టామని వెల్లడించారు. ఇక గాలింపు మొదలు పెట్టి జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొస్తున్నాం అని పేర్కొన్న పోలీసులు రేపు కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. జానీ బాషాపై పోక్సోతో పాటు రేప్ కేసులు నమోదు చేశామని పేర్కొన్న పోలీసులు ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని అన్నారు. మైనర్ గా ఉన్న సమయంలో అత్యాచారం చేసినందున పోక్సో సెక్షన్ యాడ్ చేశామని వెల్లడించారు. జానీ బాషా లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారంతో పాటు దాడికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.