NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

హైదరాబాద్లో అఫ్జల్గంజ్ కాల్పుల దుండగులు..

అఫ్జల్గంజ్ కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠా ఇంకా రాష్ట్రం దాటలేదన్నారు. పూటకో డ్రెస్ తో హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆటోల్లో ప్రయాణిస్తూ.. పోలిసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా తెలిసి ఉండటం వల్లే.. అంత ఈజీగా తిరుగుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దుండగులకు ఎవరో ఒకరు హైదరాబాద్ కి చెందిన వాళ్ళే షెల్టర్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో దుండగులు తిరుగుతుండగా సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే, నిందితుల కోసం బీహార్, ఛత్తీస్‌గఢ్‌, రాయ్‌పూర్‌ లకు పంపిన ఎనిమిది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. కాగా, కర్ణాటకలోని బీద‌ర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలో డబ్బులు తరలిస్తున్న వాహనంపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు దోచుకుని హైద‌రాబాద్‌కు చేరుకోగా.. ఈ క్రమంలో అఫ్జల్ గంజ్ దగ్గర దొంగ‌ల‌కు బీద‌ర్ పోలీసులు కనిపించడంతో వారి నుంచి తప్పించుకోవడానికి ఓ ట్రావెల్స్ ఆఫీసులోకి ప్రవేశించి.. పోలీసులపైకి కాల్పులు జరుపుతుండగా.. అక్కడ ఉన్న ట్రావెల్స్ కార్యాల‌యం మేనేజ‌ర్‌కు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

పార్టీలకు, కులాలకు అతీతంగా నేను సంపాదించిన ఆస్తి ఇదే- బాలయ్య

బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘డాకు మహారాజ్’ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఈ మూవీ మొదటి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. బాలయ్య యాక్షన్, డైరెక్టర్ బాబీ విజన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజీఎం కాంబో సక్సెస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించగా. చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, బేబీ వేద అగర్వాల్, ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు సమన్యాయం చేశారు.  దీంతో చూడానికి మూవీ స్టోరీ రోటీన్ గానే ఉన్న తీసిన విధానం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తనికి బాలయ్య బాబు చెప్పనట్లుగానే ‘డాకు మహారాజ్’ తో ఈ సంక్రాంతి సీజన్‌లో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం..

నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇచ్చిన సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం.. గత ప్రభుత్వంలో రైతు బంధు దుర్వినియోగం అయ్యింది అని ఆయన ఆరోపించారు. మా సర్కార్ హయంలో కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామన్నారు.

ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా.. మా అమ్మకు అవార్డు రాలేదు : నరేష్

సీనియర్ నటుడు నరేష్ ఇటీవల పద్మ అవార్డుల ప్రదానం ప్రక్రియ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్ మాట్లాడుతూ, “పద్మ అవార్డులు అందుకోవడం భారతదేశంలో అత్యున్నత గౌరవంగా భావిస్తాం. కానీ ఇవి నిజంగా అర్హులైన వారికి అందుతున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా సేవలందిస్తున్నవారిని గుర్తించడంలో కొంతపాటి లోపం కనిపిస్తోంది. పద్మ అవార్డుల బరిలో రాజకీయాల ప్రభావం తగ్గి, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉంది.. కానీ, పథకాలు అమలు చేస్తున్నాం..

నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లక్ష్యాన్ని నీరు కార్చొద్దు అన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి అని ఆయన తెలిపారు. ఇక, రైతు భరోసాపై దుష్ప్రచారం చేశారు, గతంలో ఉన్న ఏ పథకాలు ఎత్తి వేయడం లేదు.. కొత్త పథకాలు అమలు చేస్తున్నామని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

అమిత్‌ షాను చూస్తే అసూయ కలుగుతుంది: సీఎం చంద్రబాబు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎంతో పట్టుదలతో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌)ను పర్యవేక్షిస్తున్నారని, ఆయన పని తీరు చూస్తే తనకు అసూయ కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు చేయలేని పనిని చేసే శక్తి ఎన్డీఆర్‌ఎఫ్‌కు ఉందన్నారు. జపాన్, నేపాల్, టర్కీ విపత్తుల సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సేవలు అద్భుతమని ప్రశంసించారు. కేంద్రం నుంచి ఇప్పటికే ఏపీకి చాలా సాయం అందిందని, ఇంకా చాలా సహకారం కావాలని అమిత్‌ షాను సీఎం కోరారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.

సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా ఉర్సు

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ తో కలసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఈనెల 23 నుండి 25 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా ఉర్సు అని ఆయన అన్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జాన్ పహాడ్ వద్ద కొత్తగా నిర్మించే ఎత్తి పోతల జవహర్ లాల్ నెహ్రూ పేరు పెడతామని, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

నచ్చితే కాళ్ళు, నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ ఆయన..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారని అన్నారు. నచ్చితే కాళ్ళు.. నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ రాజకీయ నేత చంద్రబాబని దుయ్యబట్టారు. ఏపీలో అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయి.. తెలంగాణ నుంచి 8 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి.. కృష్ణా జలాల సమస్య ఉంది.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,400 కోట్ల ప్యాకేజ్ ఏ లెక్కలో ఇచ్చారో కార్మికులకు కూడా అర్థం కావడం లేదన్నారు. హోంమంత్రి పర్యటన సమయంలో ఇలాంటి అనేక సమస్యలపై మాట్లాడాల్సిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుంది

తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(State office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు.. కాషాయ పార్టీలో చేరిన ఖైరతాబాద్‌కు చెందిన పలువురికి పార్టీ కండువా కప్పి.. ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీలో వీధిలైట్ల రిపేర్లకు 7 నెలల నుంచి నిధులు లేవని, లిక్కర్ సప్లై చేసిన కంపెనీలకు కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదనే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. అవినీతి కేసుల నుంచి రక్షించుకునే పనిలో బీఆర్ఎస్ ఉందని, ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి.

మహా కుంభమేళలో సిలిండర్ పేలుడు.. భారీ అగ్నిప్రమాదం..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు పరుగులు తీశారు. అనేక అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మండలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఒక క్యాంప్ సైట్‌లో మంటలు చెలరేగాయి, తర్వాత ఇవి పక్కనే ఉన్న ఇతర టెంట్లకు వ్యాపించాయి. మంటలను ఆర్పడంలో అగ్నిమాపక అధికారులకు సహాయం చేయడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలుడు వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.