బ్యాండ్ బాజా బారాత్.. 22 నుండి 24వరకు 45 వేల పెళ్లిళ్లు
దేశ వ్యాప్తంగా వివాహాల సీజన్ మొదలైంది. ఈ సీజన్లో లక్షలాది సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇటు లక్నో నగరంలో బ్యాండ్ బాజా బారాత్ తో వివాహ పరిశ్రమ మరోసారి ఊపందుకుంది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే శుభ ముహూర్తాల సందర్భంగా లక్నోలో దాదాపు 45 వేల వివాహాలు జరగనున్నాయి. కళ్యాణ మండపం నుంచి బ్యాండ్ బాజా, బారాత్ వరకు సందడి ఉంటుంది. ఇందుకు సంబంధించి నగరంలోని అన్ని హోటళ్లు, మ్యారేజ్ లాన్‌లు, బాంకెట్ హాళ్లు బుక్ అయ్యాయి. అంతేకాకుండా బ్యాండ్, గుర్రపు బండి, క్యాటరింగ్‌లకు ప్రజలు అడ్వాన్స్ డబ్బును కూడా జమ చేశారు.
అయితే, ద్రవ్యోల్బణం వివాహాలపై ప్రభావం చూపుతుంది. హోటల్, క్యాటరింగ్, డెకరేషన్ రేట్లు 20-25 శాతం పెరగనున్నాయి. క్యాటరర్లు, హోటళ్ల వ్యాపారులు అతిథుల ప్లేట్ల ధరను రూ.300 నుంచి రూ.500కి పెంచారు. గతేడాది థాలీ రూ.1500-3000 ఉండగా, ఈసారి రూ.1800 నుంచి రూ.3500కు పెరిగింది. నవంబర్ 22 – డిసెంబర్ 15 మధ్య లక్నోలో వివాహాలకు 13 శుభ ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని చాలా వరకు మ్యారేజ్ లాన్‌లు, బాంకెట్ హాళ్లు, బండబాజాల బుకింగ్ హౌస్‌ఫుల్‌గా ఉంది. చాలా కమ్యూనిటీ సెంటర్లు బుక్ చేయబడ్డాయి. దాలిగంజ్, గోసాయిగంజ్ సహా నగరంలో దాదాపు 750 బ్యాండ్ పార్టీలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్ పెరగడంతో ఆపరేటర్లు పార్టీలను పెంచేశారు. అయినప్పటికీ, నగరంలోని చాలా బ్యాండ్‌లు, క్యాటరింగ్‌లు కూడా బుక్ చేయబడ్డాయి.
లింగయ్యను ఖతం చేస్తా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి పట్టణoలో కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం తరుపున ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్.. అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఇంకో పార్టీలో ఉంటే తప్పులేదు గానీ.. నకిరేకల్ అభివృద్ధి కోసం తాను పార్టీ మారితే తప్పని అనడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నమ్మక ద్రోహం చేసిన లింగయ్యను ఓడగొడుతా అంటూ మండిపడ్డారు. మునుగొడులో నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడగొట్టిన లింగయ్యను వదిలి పెట్టను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తను కాంగ్రెస్ లో చేరక ముందే వీరేశంకు టికెట్ ఇప్పించారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తొక్కనియ్యనని అన్నారు. తాను యుద్ధం చేయడం మొదలు పెడితే లింగయ్య కాలు చేయి తీయడం కాదు.. లింగయ్యను ఖతం చేస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 50 మంది దొంగలకు టికెట్ ఇచ్చాడు కేటీఆర్.. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ గెలవదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ దోచుకున్న డబ్బును ప్రజలకు పంచిపెడుతాం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాహుల్ గాంధీ రోడ్ షోలో మాట్లాడుతూ.. చాలా దూరం నుంచి చాలా మంది నన్ను చూడడానికి వచ్చారు అని అన్నారు. తెలంగాణ రాజకీయ సంబంధం కాదు రక్త సంబంధం జవహర్ లాల్.. ఇందిర గాంధీ, రాజీవ్ సోనియా గాంధీతో మీకు సంబంధాలు ఉన్నాయి.. కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమి చేసిందో నేను చెబుతాను కేసీఆర్.. మీరు చదివిన స్కూల్ కాంగ్రెస్ పార్టీదే నడిచే రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ యువ శక్తితో కాంగ్రెస్ కట్టింది.. 10 ఏళ్లుగా తెలంగాణనీ దోచారు దానికి అంతం పలికే రోజు వచ్చింది అని రాహుల్ గాంధీ విమర్శించారు.
62 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో.. ‘అభయ హస్తం’ హామీలు ఇవే..
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. శుక్రవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 పేజీల్లో… 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ సాధారణ మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఇందులో భూమి, విద్యార్థులు, డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ ప్రకటనతో పాటు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఈ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఈ మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన అంశాలను ఇందులో పొందుపరిచినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలు అమలు చేస్తామని, మేనిఫెస్టోలో చెప్పిన వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ దళితులు, గిరిజనుల ప్రయోజనాల కోసమే మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రజల మధ్య పంచాలని అన్నారు. పేదలకు హక్కులు కల్పించేందుకు పలు అంశాలను ప్రస్తావించిన ఆయన.. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
“డీప్‌ఫేక్” అతిపెద్ద ముప్పు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ఇటీవల కాలంలో పలువురు సెలబ్రెటీల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ కావడం వివాదాస్పదం అయింది. అసభ్యకరంగా ఉన్న ఈ వీడియోలపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ డీప్‌ఫేక్ అనేది ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటిని, ఇది సమాజంలో గందరగోళానికి కారణమవుతోందని శుక్రవారం అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యలయంలో బీజేపీ దీపావళి మిలన్ కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. డీప్‌ఫేక్‌ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని దుర్వినియోగం చేసే విషయంలో పౌరులు, మీడియా సిబ్బంది ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘‘తాను పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందని, తెలిసిన వాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారని, ఈ డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు, ప్రజలు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించాలి.’’ అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తాను గర్భా చేస్తున్న డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడారు. ఇది నిజమైందిగా ఉందని, తాను చిన్నప్పటి నుంచి గర్భా ఆడలేదని చెప్పారు. మహిళలతో మోడీని పోలి ఉన్న వ్యక్తి గర్భా చేస్తున్నట్లు సృష్టించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల బాగా వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని దీనిపై స్పందించారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయితే వెంటనే ప్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని చాట్‌జీపీటి బృందాన్ని కోరినట్లు ప్రధాని వెల్లడించారు.
ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..
ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ భాగంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన అంచనాలు తెలియరాలేదు. దక్షిణ ద్వీపమైన మిండానాలోలోని సారంగని ప్రావిన్స్‌లో భూకంప వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూమి అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు చేయలేదు. ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదు, కానీ పర్వతాలు ఎక్కువగా ఉన్న ద్వీపంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.
తాను ఇప్పటి వరకు చూసిన అత్యంత బలమైన భూకంపం ఇదే అని 27 ఏళ్ల కిషియా లేరాన్ తెలిపారు. ఆమె భూకంప కేంద్రం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో ఉంటున్నాడు. అక్కడ సమావేశంలో ఉన్న సమయంలోనే భూకంపం వచ్చిందని, తన చుట్టూ ఉన్న వ్యక్తులు భయాందోళనతో పరుగులు తీశారని చెప్పింది.
మనీ, మద్యంతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు..
బీఆర్‌ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందన్నారు. మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందన్నారు. వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేస్తామని బీఆర్‌ఎస్ హామీ నెరవేరలేదన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్‌లో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ ప్రసంగించారు. కృష్ణా జలాలు తీసుకోస్తామని మోసం చేశారన్నారు. మాదనపూర్ నుంచి ఇక్కడ తండాలకు రోడ్లు వేయించింది తానేనని.. పదేళ్లలో ఈ ప్రాంతానికి కేసీఆర్ చేసిందేం లేదన్నారు.
అమిత్ షా షెడ్యూల్ లో మార్పులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్నారు అమిత్ షా. అయితే.. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రికి అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే.. షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకోవడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగం పేట ఎయిర్‌పోర్ట్‌కి అమిత్ షా చేరుకుంటారు. అనంతరం.. 12.50కి గద్వాల చేరుకోనున్న కేంద్ర హోం మంత్రి.. 1.35 నిమిషాల వరకు గద్వాల సభలో పాల్గొననున్నారు. 1.45కు గద్వాల నుంచి నల్లగొండ బయలుదేరనున్న అమిత్ షా.. 2.45కు నల్లగొండ చేరుకుంటారు. 3.35 వరకు నల్లగొండ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్..
తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్ అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డ అన్నారు. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారన్నారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు రేవంత్ రెడ్డి. నమ్ముకున్నవారికి ద్రోహం చేశారన్నారు. పదేళ్లలో ఒక అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవిచూశారని, వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందన్నారు రేవంత్ రెడ్డి.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని, తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందన్నారు రేవంత్ రెడ్డి. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారని, కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారని, ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన అన్నారు.
‘జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’ పుస్తకం ఆవిష్కరణ
అమరావతిలోని సెక్రటేరియట్‌లో ‘జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు తమ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలుపుతూ పుస్తక రచన జరిగింది. సీఎం జగన్ చేసిన కృషి, ప్రజల అభిప్రాయాలు, వివిధ వర్గాల సమాచారం జోడించి రచన జరిగినట్లు పుస్తక రచయిత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
సీఎం జగన్ చాతుర్యాన్ని, పరిపాలన తీరుని, 49 ఛాప్టర్లుగా పుస్తక రచన చేసిన వేణుగోపాల్ రెడ్డికి మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందనలు తెలిపారు. 75 సంవత్సరాల స్వతంత్రం అనంతరం కొత్త పరిపాలన విధానాలు అమలుచేస్తున్న సీఎం గురించిన పుస్తకం రచించారని.. ఈ పుస్తకం భావితరాలకు ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ అధినేత గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలీదు..
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూములకు హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనివల్ల 20 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో కరవు మండలాలను ఏ విధంగా ప్రకటిస్తారనే విషయం టీడీపీ నేతలకు అర్థం కావడం లేదన్నారు. దీనికి కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయన్న మంత్రి.. ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని కరవును నిర్దారిస్తారన్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా కరవు మండలాలను ప్రకటించారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ కొన్ని మీడియాలలో మాత్రం నిత్యం ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.