పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీక్ కేసులో కీలక పరిణామం
ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో అరెస్టైన బండి సంజయ్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో తాజాగా.. పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ పీపీ సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు.
హనుమకొండలోని 4వ ఎంఎం కోర్టులో ప్రభుత్వం తరుపున స్పెషల్ పీపీ వాదనలు వినిపించారు. బండి సంజయ్ పోలీసు విచారణకు సహకరించడం లేదని, పిటిషన్ లో పేర్కొన్న ప్రాసిక్యూషన్… ఈ కేసులో నిందితులు A-6 A-9కు బెయిల్ పై వాదనలు ముగిసినట్లు వెల్లడించింది. అయితే.. వాదనలు విన్న కోర్టు నిర్ణయం రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వ వేసిన పిటిషన్ ను హనుమకొండ జిల్లా కోర్టు తిరస్కరించింది. జిల్లా కోర్టు సూచన మేరకు ఫోర్త్ ఎం ఎం కోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు ప్రభుత్వం లాయర్. దీంతో కోర్టు విచారణ చేపట్టింది.
అమిత్ షా హైదరాబాద్ టూర్.. భారీ సభకు ఏర్పాట్లు
కర్ణాటక ఎన్నికలు వచ్చే నెలలో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నెక్ట్స్ టార్గెట్ తెలంగాణపై పెట్టింది.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 8 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అందులో భాగంగానే ఈ నెల 23న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పొలిటికల్ టూర్ లో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా కాషాయం పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా వచ్చే ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిస్తారని, ఆ పర్యటనతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు బీజేపీ దూకుడు పెరుగుతుందని కమలనాథులు చెబుతున్నారు. అమిత్ షా సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అమిత్ షా బహిరంగ సభకు ఇంకా ఐదు రోజులే సమయం ఉండడంతో కాషాయ నేతలు ఏర్పాట్లు మొదలుపెట్టనున్నారు. భారీగా జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సిరియన్ ఎడారిలో ఐసిస్ కిరాతకం.. 31 మంది పౌరులు హతం
సిరియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ సిరియాలోని హమా ప్రాంతంలో పుట్టగొడుగులను తీయడానికి వెళ్లిన 31 మందిని చంపింది. బ్రిటన్‌లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ కూడా నలుగురు గొర్రెల కాపరులను చంపి, ఇద్దరు జిహాదీలను కిడ్నాప్ చేసింది. హమాషహర్‌కు తూర్పున ఉన్న ఎడారిలో పుట్టగొడుగులను సేకరిస్తూ 31 మంది చనిపోయారు. ఈ సీజన్‌లో, సిరియన్లు పుట్టగొడుగులను సేకరించడానికి ఎడారికి వెళతారు. అవి అధిక ధరకు అమ్ముడుపోతాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి- ఏప్రిల్ మధ్య వందలాది మంది నిరుపేద సిరియన్లు పుట్టగొడుగులను వెతకడానికి ఎడారికి వెళతారని చెబుతారు. వాస్తవానికి, ఈ రోజుల్లో సిరియాలో కూరగాయలు ఖరీదైనవి.
ధోని లాంటి కెప్టెన్ లేడు.. ఇక ముందు రాలేడు : సునీల్ గవాస్కర్
టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల జల్లు కురుపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ ధోనినే అంటూ కితాబు ఇచ్చాడు. భవిష్యత్ లో కూడా తనలాంటి సారథి మరెవరూ రాబోరంటూ మిస్టర్ కూల్ ను సునీల్ గావస్కర్ ఆశానికెతాడు. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్ల అందించిన ఎంఎస్ ధోని.. ఐపీఎల్ లో చెన్నైకు కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే సీఎస్కే ను నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిపిన ఘనత ఎంఎస్ ధోనీదే. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ తో చెన్నై కెప్టెన్ గా 200 మ్యాచ్ పూర్తి చేసుకున్నాడని గావస్కర్ అన్నాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక సారథిగా 41 ధోని నిలిచాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ ల్లో సీఎస్కే రెండింట గెలిచింది.
ఏపీలో మండిపోతున్న ఎండలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గతం వారం రోజులుగా ప్రతిరోజు ఎండ తీవ్రత పెరుగుతుంది. వారం రోజుల వ్యవధిలో 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత చేరుకుంది. బెజవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, విశాఖలో విపరీతంగా వేడిమి పెరుగుతున్నాది. వడగాలుల తాకిడితో ఏపీలోని 100కి పైగా మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బకి 12 గంటల లోపే నగర వాసులు ఇళ్లకు చేరుతున్నారు. దీంతో నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి మరింతగా ఎండ తీవ్రత పెరగనున్నది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే ముందు తగిన జాగ్రత్త చర్యలతో బయటకు రావాలని IMD సూచించింది.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అనేక విజయాలు సాధించింది : అరుణ్ కుమార్ జైన్
2022-2023 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అనేక విజయాలు సాధించిందని వెల్లడించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే 131.854 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా 13051.10 కోట్ల ఆదాయం నమోదు చేసిందని వెల్లడించారు. 2022 – 2023 ఆర్థిక సంవత్సరం మధ్య ప్రయాణీకుల ద్వారా 5140.70 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా గత ఏడాది 2974.62 కోట్లు నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. టికెట్ తనిఖీ ద్వారా 211.26 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, దక్షిణ మధ్య రైల్వే ప్రారంభమైనప్పటి నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ట్రాక్ జోడింపును సాధించిందని ఆయన తెలిపారు.
49.8 కిలో మీటర్ల కొత్త లైన్లు, 151.38 కిలో మీటర్ల డబ్లింగ్, 182.17 కిలో మీటర్ల ట్రిప్లింగ్ పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఫలితంగా 383.35 కిలో మీటర్ల ట్రాక్ దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌కు జోడించబడిందని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1017 రూట్ కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయిందని, సికింద్రాబాద్ – కాజీపేట మధ్య హై డెన్సిటీ నెట్‌వర్క్ సెక్షన్‌లో గరిష్టంగా 130 Kmph వేగంతో రైళ్లను నడపడానికి అనుమతిని పొందిందన్నారు. వర్క్‌షాప్ చరిత్రలో అత్యధిక ఫలితాలు రైలు బోగీ కార్ఖానా, యాద్గిర్ ఈ సమయంలో అత్యధికంగా 482 బోగీ ఫ్రేమ్‌లను సాధించిందని, దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక స్క్రాప్ విక్రయాలను 391 కోట్లతో నమోదు చేసిందన్నారు. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ 2022 సందర్భంగా, కాచిగూడ, గుంతకల్ రైల్వే స్టేషన్‌లకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే మొదటి, రెండవ బహుమతులను పొందిందని, తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు 2022లో దక్షిణ మధ్య రైల్వే రెండు స్వర్ణాలను అందుకుందని ఆయన తెలిపారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేటి విచారణ వాయిదా.. రేపు రావాలని సీబీఐ నోటీసులు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి ( మంగళవారం) వాయిదా పడింది. ఈ రోజు ( సోమవారం ) మధ్యాహ్నం అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఆ విచాణను రేపటికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ్టి విచారణలో భాగంగా హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి హాజరయ్యే సమయంలో విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు ఇచ్చింది.
అయితే ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో నేటి మధ్యాహ్నం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్నందుకే సీబీఐ తన విచారణను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుసార్లు ఆయన్ను విచారించింది. అయితే దీనిపై సీబీఐ అధికారులు స్పందించారు. విచారణకు వస్తే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా?.. అని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ వెల్లడించింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు జరిగాయి. భాస్కర్ రెడ్డి పిటిషన్ పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
ప్రధాని మోదీకి లేఖ మల్లికార్జున్ ఖర్గే.. కుల గణనకు డిమాండ్
దేశంలో 2021 జనాభా లెక్కలను త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధానిని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులాన్ని అంతర్భాగంగా చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2011 కుల ప్రాతిపదికన జనాభా లెక్కలను బహిరంగపరచాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధానిని కోరిన తర్వాత ఖర్గే లేఖ రాయడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల సామాజిక న్యాయం, సాధికారత బలోపేతం అవుతుందన్నారు. కుల ప్రాతిపదికన జనాభా గణనను మరోసారి డిమాండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున నేను మీకు లేఖ రాస్తున్నాను అని ప్రధానికి రాసిన లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో తాను, తన సహచరులు ఈ డిమాండ్‌ను చాలాసార్లు లేవనెత్తామని ఖర్గే గుర్తు చేశాఉ. పలువురు ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఈ విషయాన్ని డిమాండ్ చేశారని ఖర్గే చెప్పారు.