పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష
190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించబడింది. కోర్టు తన నిర్ణయంతో పాటు, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని కూడా అరెస్టు చేయాలని ఆదేశించింది. తీర్పు వినడానికి ఆమె అడియాలా జైలుకు హాజరయ్యారు. అక్కడ పోలీసులు ఆమెను అధికారిక అరెస్టు కోసం చుట్టుముట్టారు.
భోపాల్‌లో కుప్పకూలిన వంతెన.. తెగిపోయిన రెండు జిల్లాల సంబంధాలు.. ఇబ్బందుల్లో లక్షలాది మంది
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు ఆనుకుని ఉన్న బెరాసియాలో పార్వతి నదిపై నిర్మించిన వంతెన గురువారం అర్ధరాత్రి పగుళ్లు ఏర్పడి కూలిపోయింది. ప్రమాదం తర్వాత వంతెనపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వంతెన బెరాసియా-నర్సింగ్‌గఢ్ రోడ్డులో ఉంది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వంతెనను పరిశీలించారు. ఆ వంతెన 49 సంవత్సరాల పురాతనమైనది. చాలా శిథిలావస్థకు చేరుకుంది.
పెట్టుబడులకు స్వర్గధామం భారత్.. అదే మా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది!
భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు. ఇక, పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రతీ పెట్టుబడిదారుడికి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్‌ఎస్ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!
జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. తాము దీక్ష చేస్తేనే.. ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్‌ఎస్ ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా మోసాలపై ‘రైతు ధర్నా’ పేరుతో బీఆర్‌ఎస్ పోరాటం చేస్తోంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో రైతు ధర్నా చేపట్టింది.
బీఆర్‌ఎస్ రైతు ధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ‘జనవరి 26 నుండి రైతు భరోసా అమలు అవుతుంది. రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ రైతు దీక్ష అంటూ డ్రామా చేస్తుంది. మేము దీక్ష చేస్తేనే ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పుకునే పనిలో బీఆర్‌ఎస్ ఉంది. రైతులకు బోనస్ ఇచ్చింది మేము, మీరు కాదు. దేశంలో ఎక్కడా బోనస్ ఇవ్వట్లే. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారమూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. బీఆర్‌ఎస్ వడ్డీ మాత్రమే మాఫీ చేసింది. బీజేపీకి అసలు రుణాలు మాఫీ చేసే సంస్కృతి లేనే లేదు’ అని జీవన్ రెడ్డి విమర్శించారు.
ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అస్సలు వదిలి పెట్టొద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరినా సీఎం మాట్లాడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతుందన్నారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ‘రైతు ధర్నా’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘గత సంవత్సర కాలంగా చూసిన బెస్ట్ జోకును ఈరోజు పేపర్లో చూశాను. తెలంగాణను ఉద్ధరించాను, ఢిల్లీని ఉద్దరిస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి రాజధానిలో చెబుతున్నాడు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు చేయలేదు కానీ.. ఢిల్లీలో చేస్తాను అంటున్నాడు. ఫ్రీ బస్ తప్ప ఇచ్చింది ఏమీ లేదు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారు’ అని కేటీఆర్ విమర్శించారు.
చంద్రబాబు, అమిత్‌షా భేటీపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. ఈ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు.. డిన్నర్ మీటింగ్ లో సీఎం, కేంద్ర హోంమంత్రి.. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.. పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.. ఇక రేపు రాత్రికి విజయవాడ నోవాటెల్ లో అమిత్ షా బస చేసి.. ఎల్లుండి గన్నవరం నియోజకవర్గం కొండపావులూరులో జరిగే NDRF 20వ వ్యవస్ధాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అయితే, అమిత్‌షా ఏపీ పర్యటన.. సీఎం చంద్రబాబుపై భేటీపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి..
అయోధ్య కట్టిన రోజే స్వాతంత్య్రం వచ్చిందని అనడం సరికాదు
బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వక్రికరించే పనిలో ఉందని, మోడీ సర్కార్ రిమోట్ కంట్రోల్ మోహన్ భగవత్ దగ్గర ఉందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య కట్టిన రోజే స్వాతంత్య్రం వచ్చింది అని అనడం సరికాదని, భగత్ సింగ్ లాంటి వాళ్ళ త్యాగాన్ని అవమానించినట్టు అని ఆయన మండిపడ్డారు. మోడీ.. సమాధానం చెప్పాలని, అమిత్ షా…అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు వీహెచ్. చరిత్ర వక్రీకరిస్తున్నారని, బీజేపీ తీరు ప్రజలకు తెలియజేయాలని, పార్టీ కార్యకర్తలు, గాంధీనీ చంపిన వారు.. ఇప్పుడు చరిత్రను వక్రీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రేపు మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ ప్రారంభించనున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మైదుకూరులో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్నారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతిని కూడా మైదుకూరులోనే సీఎం చంద్రబాబు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10:30కి ఉండవల్లి నివాసం నుంచి ఉ.11:05 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఉ.11:50 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు కడప విమానాశ్రయం నుంచి మ. 12:10 నిమిషాలకు మైదుకూరులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. మ. 12 గంటల 20 నిమిషాలకు కేఎస్సీ కళ్యాణ మండపానికి చేరుకుని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మ. 1:50 నిమిషాలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. కేఎస్సీ కళ్యాణ మండపం నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వినాయక నగర్‌లోని మున్సిపల్ కార్మికుని ఇంటిని సందర్శించి చెత్త సేకరణ గురించి వివరిస్తారు.
విశాఖ ఉక్కుపై గుడ్‌న్యూస్.. భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేశారు.
కేసీఆర్ చేసిన కృషి సత్ఫలితాలను అందించింది..
తెలంగాణలో బీడుగా మారిన భూములకు కృష్ణా జలాలను మళ్లించే క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి సత్ఫలితాలను అందించిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కవిత తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. “కృష్ణా జలాల్లో మా వాటా మాకే” అనే కేసీఆర్ పోరాటం విజయవంతమై, దీని ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై విచారణ జరపాల్సిందిగా గత పదేళ్లుగా కేసీఆర్ చేసిన వాదనకు (Brijesh Kumar Tribunal) బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గుచూపడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్‌ఎస్ పార్టీ విజయమని ఆమె అన్నారు.