రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం!
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ లక్ష్యం అని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు సిటీ పరిధిలోని కిసాన్ నగర్, ఏసీ నగర్లలోని పార్కుల ఆధునికీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఏసీబీ పేరుతో డబ్బులు డిమాండ్ చేసే నకిలీ కాల్స్‌పై డీజీ హెచ్చరిక
ఏసీబీ పేరుతో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ డీజీ అధికారికంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించకుంటే కేసు పెడతామని భయపెట్టే వారి మాటలను నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఏసీబీ లేదా స్థానిక పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని కోరారు.
కుంభ మేళాకు అర్థమే లేదు.. లాలూ యాదవ్ సంచలన ప్రకటన
మహా కుంభమేళాకు సంబంధించి ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. కుంభమేళా పనికిరానిదని, దానికి అర్థం లేదని ఆయన అన్నారు. అదే సమయంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రమాదం గురించి, ఒక విచారకరమైన సంఘటన జరిగిందని ఆయన అన్నారు. మృతులకు నివాళులు అర్పిస్తున్నాం. ఇది రైల్వే తప్పు. రైల్వే నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఇది రైల్వేల వైఫల్యం.. రైల్వే మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అవినీతి చేయను.. అవినీతికి పాల్పడితే ఒప్పుకోను!
అవినీతి అధికారులపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. అవినీతి చేస్తే తానే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా అని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు తనను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారని, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఎమ్మెల్యే పుట్టా హెచ్చరించారు. నియోజకవర్గంలో తాను అవినీతి చేయను అని, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదన్నారు.
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు నన్ను ఆశ్రయిస్తున్నారు. అవినీతి చేస్తే నేనే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా. అవినీతి చేసి వైసీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారు, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్. అధికారులకు జీతం వస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అవినీతి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు జరుగుతుంది. నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయను, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.
ఆస్తి కోసం తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపిన కొడుకు..
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఆస్తి వివాదం కారణంగానే నిందితుడు ఈ డబుల్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జబరులి గ్రామంలో జగదీష్ వర్మ (70), అతని భార్య శివప్యారి (68) నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు బ్రిష్కిత్ అలియాస్ లాలా.. చిన్న కొడుకు దేవదత్. జగదీష్ వర్మ వృత్తిరీత్యా కమ్మరి. చాలా రోజులుగా ఆయన పెద్ద కొడుకు బ్రిష్కిత్‌తో ఆస్తి విషయంలో వివాదం నడుస్తుందని.. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ అంటే చరిత్ర.. మహా సంగ్రామం నుండి వచ్చిన చరిత్ర ఆయన కుటుంబంది
బీజేపీ నేతలు.. బండి సంజయ్ లాంటి వాళ్ళకు అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్పాలన్నారని, రాహుల్ గాంధీ అంటే చరిత్ర.. మహా సంగ్రామం నుండి వచ్చిన చరిత్ర ఆయన కుటుంబం ది అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ.. ఆయన కుటుంబం గురించి బండి సంజయ్ మాట్లాడారని, అవగాహన ఉండి మాట్లాడారో లేకుండా మాట్లాడారో మరి అంటూ జగ్గారెడ్డి విమర్శించారు.. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అని, వాళ్ళు హిందువులు.. అని, బ్రాహ్మణులు హిందువులు కారా..? నీకేమైనా డౌట్ ఉందా..? అని బండి సంజయ్‌ని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదని, సోనియా గాంధీ ఏ మతం అని అడిగాడు సంజయ్ అని జగ్గారెడ్డి మండిపడ్డారు. నేను రెడ్డి… నా భార్య గౌడ్.. ఇప్పుడు మా ఆవిడని రెడ్డి అనే పిలుస్తారు కదా..? సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడు.. కాబట్టి సోనియా గాంధీ బ్రాహ్మణ కుటుంబమే అవుతుందన్నారు జగ్గారెడ్డి.
తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బందరులో బియ్యం దొంగ పేర్ని నాని ఉన్నాడు అని పేర్కొన్నారు. రైస్ కొట్టేసి భార్య పేరు మీద పెట్టాడు.. అరెస్టు ఒకటే పెండింగ్ లో ఉంది అని తెలిపారు. అరెస్టు కూడా త్వరలోనే జరుగుతుందని భావిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఇక, గుడివాడలో గుట్కా నాని ప్రస్తుతం అడ్రస్ కూడా లేదు.. ఎక్కడున్న అరెస్టు చేస్తామని గతంలోనే చెప్పాం చేస్తామని కొల్లు రవీంద్ర అన్నారు.
తొక్కిసలాట జరిగినా.. తగ్గని ప్రయాణికుల రద్దీ..
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి14, 15 ప్లాట్‌ఫాంలపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా.. ఈ ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు.. ఇప్పటికీ స్టేషన్ ప్రస్తుతం జనంతో కిక్కిరిసిపోయింది. రైళ్లు ఎక్కడానికి జనం ఎగబడుతున్నారు. చాలా మంది అత్యవసర విండో ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం
మహేశ్వరం గట్టుపల్లిలో తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువ క్రాంతి బూనియాది ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం యూత్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు టీపీసీసీ చీఫ్. మూడు రోజుల పాటు శిక్షణ శిబిర కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ రాహుల్ గాంధీదే అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. యూత్ కాంగ్రెస్ ప్రపంచంలో బిగ్గెస్ట్ అండ్ క్రేజిస్ట్ అని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం దొరకడం అదృష్టం లాంటిందన్నారు మహేష్ గౌడ్. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నా.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. రాజీవ్ గాంధీ వలె రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని, ఏఐసీసీ మహామహులు NSUI నుంచి వచ్చిన వారే అని ఆయన అన్నారు.
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు నీళ్లు బంద్
హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 18న (మంగళవారం) ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి. ఈ సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం..
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఒడ్డున శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఎస్టీలకు గుడ్ న్యూస్ అందించారు. ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొమరం భీం , సేవా లాల్ , ఏకలవ్య పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. మైదాన ప్రాంతాల్లో సైతం ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత గిరిజనులకు అభివృద్ధికి ఫలాలు అందేలా చేస్తామని వెల్లడించారు.