టెక్కలి ఆస్పత్రిలో మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీలు.. తీవ్ర అసహనం..
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి జిల్లా ఆస్పత్రి పనితీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఇయన.. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అయితే, ఆస్పత్రిలో లిఫ్ట్ పనిచేయకపోవడం, రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి అసహనం వ్యక్తం చేశారు.. తక్షణమే లిఫ్ట్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఎన్నిసార్లు హెచ్చరించినా వైద్యులు.. సిబ్బంది తీరులో మార్పు రాలేదంటూ అహసహనం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. కాగా, మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే.. గతంలో టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇవాళ ( శనివారం ) భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి న్యూఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అరెస్టైన ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌ను మంజూరు చేసినప్పటికీ.. సీబీఐ అరెస్టు చేసిన చట్టబద్ధతపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తా..
మా సీఎం రేవంత్ రెడ్డిని.. పనికి రాని వాడు అంటే.. కేటీఆర్ కానీ, వాళ్ళ అయ్య (కేసీఆర్) కానీ ఎవరన్నా సరే నాలుక కోస్తం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ కార్యకర్తలను రెచ్చ కొట్టకండి అన్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ లు ఇంత చిల్లర చేయరని అన్నారు. అనవసర రచ్చ బీఆర్ఎస్ చేస్తుందన్నారు. హైదరాబాద్ ప్రజల మూడు ఖరాబ్ చేశారన్నారు. వినాయకుడి పూజలు చూడకుండా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఖైరతబాద్ వినాయకుడి నీ చూపించేవి టీవీలు.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లు లొల్లి పెట్టీ ఖైరతాబాద్ వినాయకుణ్ణి ప్రజలు చూడకుండా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వినాయకుడి సేవలో పోలీసులు ఉన్నారన్నారు. హరీష్ రావు నీకు బుర్ర పని చేయడం లేదా? అని మండిపడ్డారు. రోడ్డుమీదకు కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది. పోలీసులు.. పెండ్లాం, పిల్లల వదిలేసి మండపాల్లో ఉన్నారు.
మరోమారు ఇబ్రహీంపట్నం పీఎస్‌కు సినీ నటి జత్వాని..
ముంబై నటి జత్వాని కేసు సంచలనం సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో చర్యలకు కూడా దిగింది ప్రభుత్వం.. అయితే, మరోమారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు సినీ నటి జత్వాని.. రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారామె.. దీంతో.. ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. కాదంబరి జత్వాని నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడిపోయారు ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్.. మరోవైపు.. కేసు విచారణను వేగవంతం చేశారు.. గతంలో విజయవాడ వెస్ట్ ఏసీపీగా ఉన్న హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణలను ఇప్పటికే సస్పెండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అక్కడి ఆగకుండా మరి కొంత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది..
ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం.. ఆరోగ్యశ్రీకి రూ.2,500 కోట్ల బకాయిలు..!
రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్.. ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. 8,840 కోట్లు వైద్య కళాశాల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉండగా 2120 కోట్లు మాత్రమే ఖర్చు చేసారని ఆరోపించారు . దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని అన్నారు. మేం అధికారంలోకి వచ్చి మూడు నెలలు మాత్రమే.. మీరు ఐదేళ్లు పులివెందులలో ఆసుపత్రి కట్టారు, కళాశాలలు కట్టలేదని విమర్శించారు. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, కళాశాల నిర్మాణం కాకుండా, వసతులు లేకుండా విద్యా ప్రమాణాలను ఎలా ప్రారంభించాలని ప్రశ్నించారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వైద్య కళాశాల నిర్మాణంలో ఉందని, ఎన్ఎంసీకి నివేదికలు ఇచ్చారని తెలిపారు.
“హిందువుల గురించి ప్రశ్నించిన జర్నలిస్టుపై దాడి”.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోడీ..
అమెరికాలో రాహుల్ గాంధీ టీమ్ ఇండియా టుడే జర్నలిస్టుపై జరిపిన దాడిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాశ్మీర్‌లోని దోడాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. అమెరికాలో జర్నలిస్టుపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ, రాహుల్ గాంధీ ‘మొహబ్బత్‌కి దుకాన్’ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ‘‘ వారు (కాంగ్రెస్) మొహబ్బత్ కి దుకాన్ నడుపుతున్నట్లు చెప్పుకుంటారు. కానీ మన దేశానికి చెందిన ఒక జర్నలిస్టుపై అమెరికాలో కాంగ్రెస్ క్రూరమైన దాడికి పాల్పడింది. యూఎస్ఏలో భారతదేశ బిడ్డని అవమానించారు. వాక్ స్వాతంత్య్రానికి చాంపియన్లుగా చెప్పుకునే వారు క్రూరత్వంలో మునిగిపోయారు.’’ అని విమర్శించారు. జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను తగ్గించిందని ప్రధాని మోదీ అన్నారు. “రాజ్యాంగం” అనే పదం కాంగ్రెస్‌కు సరిపోదని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి మీడియా కీలక స్తంభం, ఓ జర్నలిస్టుని గదిలో బంధించి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య గౌరవాన్ని చాటి చెప్పే విషయమా..? భారత జర్నలిస్టుపై దాడి చేసి భారతదేశ ప్రతిష్టని పెంచుతున్నారా..? రాజ్యాంగం అనే పదం మీ నోటికి తగదా..? అని ప్రధాని కాంగ్రెస్ తీరుపై విరుచుకుపడ్డారు.
ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా ప్రభుత్వం.
పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆదిలాబాదు నుండి ఖమ్మం వరకి పాదయాత్ర చేసానని, మీ అందరి ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రజల ఆశయాలని చట్టాలుగా మార్చి పని చేస్తుంది మా ప్రభుత్వమని, ప్రాజెక్టుల కొసం భూములని ఇచ్చిన వారికి గౌరవం ఇవ్వాలి.అందుకే నిధులు విడుదల చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. రెండు లక్షలు రుణమాఫి చేస్తానని మాట ఇచ్చాం చేసి చూపామని, హామీ ఇవ్వకున్నా 2 లక్షల పైన ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామని, లక్ష రుణమాఫి చేస్తానని మోసం చేసింది నాటి బిఅర్ఎస్ ప్రభుత్వమన్నారు భట్టి విక్రమార్క. రుణమాఫీపై బీఅర్ఎస్ మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన మండిపడ్డారు. రెండు లక్షల పైన ఉన్నవారికి కూడ వెసులుబాటు కల్పించే యత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.
‘‘రాత్రులు నిద్ర పోలేదు’’.. నిరసన తెలుపుతున్న వైద్యుల వద్దకే సీఎం మమతా బెనర్జీ..
కోల్‌కతా వైద్యురాలి ఘటన పశ్చిమ బెంగాల్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్‌లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశంలో నిరసనలకు కారణమైంది. బెంగాల్‌లో ఇప్పటికీ బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశానికి డాక్టర్లు ఎవరూ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే, తాజాగా శనివారం మమతా బెనర్జీనే డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లారు. వారి డిమాండ్లను పరిశీలించి, ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన దోషులుగా ఎవరు తేలినా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘ మాకు న్యాయం కావాలి’’ అనే నినాదాల మధ్య వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. ‘‘నేను ముక్కమంత్రిగా కాకుండా మీ ‘‘దీదీ’’(అక్క)గా వచ్చాను. నా పదవి పెద్దది కాదు, ప్రజలు పెద్దవారు. నిన్న మీరింతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేసినందుకు, నేను కూడా నిద్రపోలేదు. దయచేసి మీ డిమాండ్లను నెరవేరస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను’’అని ఆమె అన్నారు.
గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి లో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గల్ఫ్ కార్మిక కుటుంబాల పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అయితే.. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి పదేండ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. పార్టీ మేని ఫెస్టోల్లో సైతం అంశాన్ని చేర్చి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ ఏనాడు పట్టించుకోలేదు. అయితే.. ఎన్ఆర్ఐ పాలసీ పై తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఈనెల 17న సీఎం ప్రత్యేకంగా భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించకుంది.