టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రాబాబు నాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇవాళ సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డిలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేతలు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.
బెంగళూరుకు నిలిచిపోయిన తిరుపతి లడ్డూ సరఫరా
బెంగళూరు వయాలికావల్‌లోని తిరుపతి తిమ్మప్ప ఆలయం ( టీటీడీ )లో లడ్డూ ప్రసాదం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే, బెంగళూరుకు వచ్చే లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అవును తిరుపతిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిమ్మప్ప సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది . దీంతో కొండపై నుంచి లడ్డూలు సరఫరా చేసే వాహనాల రాకపోకల్లో తేడా వస్తోంది. అందువల్ల బెంగళూరులోని తిరుపతి దేవస్థానానికి అక్టోబర్ 12 వరకు లడ్డూలను టీటీడీ మేనేజ్ మెంట్ బోర్డు సరఫరా చేయదు.
తిరుపతి దేవస్థానంలో అందించే లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి వినియోగిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపనూనె, ఇతర నూనెలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులో తేలింది. ఈ అంశం చాలా చర్చనీయాంశమైంది , హిందువుల మనోభావాలకు కలకలం రేపింది. అయితే.. తిరుపతి లడ్డూ పవిత్రత వివాదం తర్వాత తిరుపతి నుంచి నందిని నెయ్యికి డిమాండ్ పెరిగింది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో, నందిని నెయ్యిని మరింత సరఫరా చేయాలని టీటీడీ కెఎంఎఫ్‌ని అభ్యర్థించింది. దీని ప్రకారం కేఎంఎఫ్ సరైన భద్రతతో టీటీడీకి నెయ్యి పంపుతోంది.
మళ్లీ మోత మోగిస్తున్న టమాటా ధర.. హైదరాబాద్ లో కిలో రూ.100
రోజు రోజుకు కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయాల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు జేబులకు చిల్లుపడుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూరగాయాల ధరలు ఆకాశానంటుతున్నాయి. పండుగ వేళ కావడంతో మార్కెట్లలో పూల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే.. దేవి నవరాత్రోత్సవాల ఉండటంతో శాఖాహార ప్రియులు కూరగాయలు కొనడం తప్పదనే చెప్పాలి. అయితే.. ముఖ్యంగా కూరగాయాల్లో టమాటో ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటో ధర రూ. 100లుగా ఉంది.. మొన్నటివరకు కిలో రూ.10 నుంచి రూ.20 ఉన్న టమాటో ధర అమాంతం పెరిగిపోయింది.
రూ. 2 లక్షల పైబడి రుణం.. మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
రూ. 2 లక్షల పైబడి రుణమాఫీ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు రుణమాఫీ ప్రక్రియ ఇంకా ప్రాసెస్ లో ఉందని అన్నారు. దసరా తర్వాత 2 లక్షల పైబడి రుణం ఉన్న వాళ్లపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. గాంధీ భవన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖా ముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పది నెలల కాలంలోనే 25వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది గత ప్రభుత్వం అని మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో కూడా 25 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామన్నారు. గత ప్రభుత్వం ఇవ్వని రైతుబంధును కూడా ఇచ్చామన్నారు. స్వామి నాథన్ కమిషన్ నివేదిక కూడా ఎంఎస్పీ పెంపులో పట్టించుకోలేదు కేంద్రం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
6 కోట్ల మంది ప్రజలు మావోయిస్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు..
మావోయిస్టుల వల్ల 6 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వామపక్ష తీవ్రవాద సమీక్షలో అమిత్ షా కీలక వాఖ్యలు చేశారు. అభివృద్ధిని చేరువ చేయాలంటే వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయాలన్నారు. వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందన్నారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తే దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన వాళ్ళం అవుతామన్నారు. జవాన్ల కోసం 12 హెలికాఫ్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమై ఉన్న యువత ఆయుధాలు వదిలి ప్రజల్లోకి రావాలన్నారు. దేశ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని తెలిపారు. నక్సలిజం వల్ల ఉపయోగం లేదన్నారు. ఏపీ ,తెలంగాణ, మహారాష్ట్ర వామపక్ష ఉగ్రవాద నిర్ములనకు మంచి నిర్ణయాలు చర్యలు తీసుకున్నాయని తెలిపారు. 2014-24 వరకు వామపక్ష తీవ్రవాద ప్రబావిత ప్రాంతాల్లో 3006 కోట్లు ఖర్చు చేసామన్నారు. 11500 కిమి రోడ్ నెట్ ఏర్పాటు చేసామని తెలిపారు.
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4.45గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. రాత్రికి లేదా రేపు ఉదయం 10:30కి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీకానున్నట్లు సమాచారం. రేపు ఉదయం 11:30కి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి భేటీకానున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హార్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బుడమేరు వరదలపై నివేదిక తర్వాత తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విధులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు.
హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి
హైడ్రాపేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవ విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం పై చేస్తున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, మూసీ రిజర్వేషన్ పై సీఎం, ప్రభుత్వం కార్యక్రమంపై అపోహలు సృష్టించి… పాలనపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మాది ప్రజా, పారదర్శక ప్రభుత్వమని, ప్రజా ఎజెండానే కానీ వ్యక్తిగత ఎజెండా మాకు లేదని ఆయన వెల్లడించారు. రాక్స్, లేక్స్, పార్క్స్ ఉంటేనే నగరం అని, హైదరాబాద్ వీటన్నింటికి ప్రసిద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ కు రాక్స్, లేక్స్, పార్క్స్ శోభను తీసుకు వచ్చాయని, కాలక్రమంలో రాక్స్ లేకుండా పోతున్నాయి. పార్క్స్ కబ్జాలకు గురవుతున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. లేక్స్ కూడా లేకుండా మాయం అయి నగరానికి పెను ప్రమాదంగా మారుతున్నాయని, ఆకస్మిక వరదలు, వర్షాలు నేపద్యంలో గత ప్రభుత్వాలు కొంత పని చేసాయని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ ముఖ్యమైందా..?
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్‌ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి ఖరీదైన కార్యక్రమాలను చేపడుతున్నాడు” అని ఆయన అన్నారు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల వెనుక ఉన్న కారణాన్ని ఆయన ప్రశ్నించారు.
దళితుడి ఇంట్లో రాహుల్ హల్ చల్.. వంట చేసుకుని తినొచ్చారు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ దళిత కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా వంట గదిలో వారితో కలిసి వంటలు వండి కుల, వివక్ష వంటి పలు అంశాలపై చర్చించారు. అజయ్ తుకారాం సనాదే, ఆయన సతీమణి అంజనా తుకారాం సనాదేని కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దళితుల వంటశాల గురించి నేటికీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునని అన్నారు. షాహూ పటోలే చెప్పినట్లు దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో “వారు ఏమి తింటారు, ఎలా వండుతారు? దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత గురించి నేను అజయ్ తుకారాం సనాదే ఇంకా ఆయన భార్య అంజనా తుకారాం సనదేతో ఒక మధ్యాహ్నం గడిపాను” అని రాహుల్ రాసుకొచ్చారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న తన ఇంటికి నన్ను గౌరవంగా ఆహ్వానించి వంటగదిలో సహాయం చేసే అవకాశం ఇచ్చారు. మేమంతా కలిసి బెండకాయతో ‘హర్భయాచి భాజీ’ పచ్చిమిర్చి, తువర్ పప్పు తయారు చేసామని తెలిపారు.
అమ్మాయిలను డ్యాన్సులు చేయాలంటూ ర్యాగింగ్.. 10 మంది సీనియర్ల సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మూడురోజుల క్రితం వెలుగుచూసిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్టీవీలో ప్రసారం అయిన కథనాలకు అధికారులు స్పందించి ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్ధినులు పది మందిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ర్యాగింగ్ సమయంలో వీడియోలు తీసి వాట్సప్ గ్రూపులలో షేర్ చేసి కామెంట్స్ చేయడంతో క్లాస్ రూంలలో ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ప్రొఫెసర్లకు చెపితే ఎక్కడ సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తారో అని భయపడిపోయారు. చివరకు మీడియాను ఆశ్రయించారు. ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో ఎంక్వయిరీ చేసిన యూనివర్సిటీ అధికారులు.. 10 మంది విద్యార్థినులను క్రమశిక్షణ చర్యలలో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశామన్నారు.