రేపు రాజమౌళి- మహేశ్ సినిమా పూజా కార్యక్రమం
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు అధికారకంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఫైనల్‌గా SSMB 29 బిగ్ అప్డేట్ వచ్చేసింది. రేపు అనగా జనవరి 2న ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని SS రాజమౌళి ఆఫీస్‌లో ఈ పూజా కార్యక్రమం జరగనుంది. అలాగే జనవరి చివరి వారం నుంచి షూటింగ్ పనులు స్టార్ట్ చేయనున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇటీవల విదేశీ పర్యటన ముగించికుని హైదరాబాద్ చేరుకున్న మహేశ్ బాబు ఈ కార్యక్రమానికి హాజరవుతాడా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు రాజమౌళి తో పాటు ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు ఈ వేడుకకు రానున్నట్టు సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మాత్రం ఆఫ్రికాలో స్టార్ట్ చేస్తున్నటు టాక్ . కొన్ని రోజుల క్రితం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ వెళ్లిన రాజమౌళి, అక్కడ కొన్ని లొకేషన్స్ చూసి వచ్చారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ కెన్యాతో పాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లలో షూటింగ్ చేసే అవకాశం ఉందట. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఆగని దావులూరి ప్రభావతి ఆగడాలు.. ఓ వ్యక్తిని కట్టేసి..!
మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి ఆగడాలు ఇంకనూ ఆగడం లేదు. గతంలో పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్‌గా పని చేసిన ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంకు చెందిన కవులూరి యోగేశ్వరరావుకు చెందిన బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిచుకున్న ఆమెపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఈ కేసు నడుస్తుండగానే తాజాగా ప్రభావతి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తిని కట్టేసి కొట్టి.. తననే కొట్టారని నాటకమాడారు. నూజివీడు మండలం మర్రిబందం గ్రామంకు చెందిన దోనవల్లి వెంకట్రావును వాటర్ ట్యాంక్ వద్ద కట్టేసి దావులూరి ప్రభావతి కొట్టారు. ఇందుకు తన తండ్రి, తనయుడి సాయం తీసుకున్నారు. వెంకట్రావును కొట్టి.. తనను కొడుతున్నారంటూ 112కి కాల్ చేసిన ప్రభావతి పోలీసులను తప్పుదోవ పట్టించారు. స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసి.. ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వెంకట్రావును కట్టేసి కొడుతుండగా.. కొందరు ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అసలు విషయం బయటపడింది.
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రిని ఢీకొన్న ఆటో..
బీహార్ రాష్ట్రం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి రత్నేష్ సదా ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆటో ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా బల్లియా సిమర్ అనే తన స్వగ్రామానికి చేరుకున్న మంత్రి రత్నేష్ సదా, ఉదయం వాకింగ్‌కు గార్డుతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న టెంపో అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి తల, కాలి వెనుక భాగంలో గాయాలయ్యాయి. అలాగే, ఆయన గార్డు కూడా గాయపడినట్లు సమాచారం.
ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంగా.. పవన్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాహారం ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి.. అధికార వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేందుకు కృషిచేస్తున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరించారు. ప్రగతి – పారదర్శకత – సుస్థిరత – జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో పిఠాపురం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రిగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గత ఆరున్నర నెలల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల సమాహారం అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఓ వరుస ట్వీట్స్ చేసింది.
మైనర్‌పై అత్యాచారం.. ట్యూషన్ టీచర్‌కు 111ఏళ్ల జైలు శిక్ష
కేరళ తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో టీచర్ దోషిగా తేలాడు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. టీచర్‌ను దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 44 ఏళ్ల ఉపాధ్యాయుడు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది పాటు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
50 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కి పాకిస్తాన్ సైన్యం.. భారత్‌కి ముప్పు..
పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, దాదాపుగా 50 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ పరిణామం భారత్‌కి ఆందోళనకరం. ఇటీవల కాలంలో అన్నీ మరిచిపోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు స్నేహాన్ని పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 2025 నాటికి, పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి.
ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాం
ఫార్ములా ఈకేసులో హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామని, అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని, 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారన్నారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని, నాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని, ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అని ఆయన విమర్శించారు. పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందని, నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్ కు ఏమి దొరకటం లేదన్నారు కేటీఆర్. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదని, జడ్జి గారు అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. రేసు కావాలని నేను నిర్ణయం తీసుకున్న.. వద్దనేది రేవంత్ నిర్ణయం.. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్‌లో చర్చ జరగలేదన్నారు. నాపై కేసు పెడితే.. రేవంత్ పై కూడా కేసు పెట్టాలని, రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? పల్లెటూరు భాష లో చెప్పాలంటే ఇది ఒక లొట్టపీసు కేసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
జూబ్లీ బస్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్ (జూబ్లీ బస్ స్టాండ్) లో ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్ స్టేషన్‌లో టాయిలెట్స్ పరిశీలించారు.. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్ లతో మాట్లాడి రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలని సూచించారు.. క్యాంటీన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు.. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. Jbs లో ఉన్న కార్గో సెంటర్ ను పరిశీలించారు.. రోజూ ఇక్కడి నుండి వెళ్ళే ప్రయాణికులు సంఖ్య కార్గో ,పార్శిల్ లు ఎన్ని తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు..
నాని సినిమా షూటింగ్‌లో విషాదం
జమ్ముకశ్మీర్‌లో జరుగుతున్న ‘హిట్ 3’ షూటింగ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సినిమా షూట్ లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కె.ఆర్. కృష్ణ(30) గుండెపోటుతో మృతి చెందింది. చిత్రబృందం కాశ్మీర్‌లో ఉండగా, కృష్ణ ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, ఆ చికిత్స విఫలమై మరణించినట్టు సమాచారం. టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న థ్రిల్లర్ హిట్ 3 కోసం చిత్ర బృందం కాశ్మీర్ వెళ్ళింది. కృష్ణ డిసెంబర్ 23న అస్వస్థతకు గురికావడంతో శ్రీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌తో ఆమె చికిత్స పొందుతుతోంది. కృష్ణ కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఏమైందో ఏమో సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. ఇప్పుడు కృష్ణ కెఆర్ అనే యువ మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌ను కోల్పోవడం మొత్తం టీమ్‌నే కాకుండా చిత్ర పరిశ్రమను కూడా తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది
80 లక్షల మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విజయవంతంగా రైతు భరోసాని సీఎం ఎగ్గొట్టారన్నారు. రైతు భరోసాలో కోతలు పెట్టడానికి సీఎం, మంత్రులు కష్టపడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతు భరోసా ఇవ్వాలన్న రేవంత్ ఇప్పుడు మాట మార్చారన్నారు హరీష్ రావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ నాలుకకు నరం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని, తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. కొత్తగా రైతు భరోసా కోసం అప్లికేషన్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు రైతుల్ని దరఖాస్తుల పేరుతో దోషుల్లా చూస్తుందని, రైతులు మళ్ళీ పైరవికారులు, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు టింగుటింగు మని రైతు బంధు వచ్చేదని, ఇప్పుడైతే 10 వేలు మేమోస్తే 15 వేలు అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు హరీష్ రావు.