*సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ వాయిదా..
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను వచ్చే నెల 13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కి వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. కాగా.. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరింది. కాగా.. సీఆర్పీసీ ప్రకారం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తనను ఇంట్లోనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే బుధవారం పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా.. తగినంత సమయం లేకపోవడంతో కోర్టు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది సుప్రీం కోర్టు. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ ఎన్నికల వేళ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు కవితపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడటంతో ఆ ఆదేశాలు అలాగే కొనసాగనున్నాయి.
*ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ.. బాలినేని సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌ను కలిసి ఏమైనా కావాలి అని అడిగితే బాలినేని అలిగాడు అంటారని.. ఎందుకు అలుగుతాను ప్రజల సమస్యలు పరిష్కరించుకోవటానికే కదా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు కోసమే తాను సీఎంను అడిగాను అని, జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్‌కు అన్నీ చెబుతానని ఆయన పేర్కొన్నారు. జరిగేవన్నీ సీఎంకి చెబితేనే కదా అందరికీ తెలిసేదన్నారు. సీఎం ఉద్యోగుల సమస్యలు మొత్తం పరిష్కరిస్తారని ఈ సందర్భంగా బాలినేని వెల్లడించారు. మాగుంట కోసం చాలా పట్టుబట్టాను.. సాధ్యం కాలేదు.. సర్దుకు పోయానని ఆయన స్పష్టం చేశారు. సర్దుకుపోకుంటే ఇవాళ ఆయన పార్టీకి రాజీనామా చేశారు.. ఆయనతో పాటు నేను వెళ్లలేను కదా అంటూ వివరించారు. ఇవాళ ఆయనతో కలసి పక్కపక్కనే కూర్చుని కార్యక్రమంలో పాల్గొన్నా.. రేపు కొందరు చిలువలు పలువలు చేసి రాస్తారన్నారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా కలసి కార్యక్రమంలో పాల్గొన్నారని మాట్లాడుతారన్నారు. తనకు చిత్తశుద్ది ఉంది.. ఆ మేరకే రాజకీయాలు చేస్తానని మాజీ మంత్రి బాలినేని అన్నారు. రాజకీయాల్లో చిన్న తప్పు చేసినా సరిదిద్దుకోవటానికి ఏళ్లు పడుతుంది అని వైఎస్సారు చెప్పిన మాటలు తనకు గుర్తున్నాయన్నారు. పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకూడదు.. ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలని ఆయన చెప్పిన మాటలే స్పూర్తి అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లోనే నా చివరి పోటీ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
*మాచర్లలో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు. అదే సమయానికి వైసీపీ కూడా మరో కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు కడుతున్న నేపథ్యంలో రెండు వర్గాలు వాదన దిగాయి. దీంతో సమీపంలో ఉన్న టీడీపీ, వైసీపీ క్యాడర్ కూడా తోడవడంతో, ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.
*తెలంగాణ భాష క్లాసిక్.. మాట్లాడుతున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది!
తెలంగాణ భాష ‘క్లాసిక్ భాష’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని గవర్నర్ పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని గవర్నర్ తమిళిసై చెప్పారు. రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు. ‘స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ. సమాజానికి కొత్తదానాన్ని అందించడం మన బాధ్యత. మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ భాష క్లాసిక్ భాష. మాట్లాడుతున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఈ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు ఎన్ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలి. తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందం, ఇది కన్నుల పండగగా ఉంది’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ‘మాతృభాష మన జీవితంలో అవసరం. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలి. తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి.. సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలి. నా మాతృభాష తమిళ్. నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు, శ్రమనే ఆధారం’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పుకొచ్చారు.
*112 మంది వైద్యులపై వేటుకు సిద్దమైన తెలంగాణ సర్కార్!
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది వైద్యులపై వేటు వేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. నెలలుగా డుమ్మా కొడుతున్న వైద్యుల లిస్ట్‌ను తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఉద్యోగాల్లో ఉండి.. కాలేజీలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్న డాక్టర్లను విధుల నుంచి తొలిగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వైద్యుల గైర్హాజరు కారణంగా అటు వైద్యవిద్యార్థులకు తరగతులు జరగకపోగా.. ఇటు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. టీచింగ్ హాస్పిటల్స్ కావడంతో రోగులకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. దవాఖానల్లో ఓపీ తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆథారైసెడ్ అబెసెన్సీలో ఉన్న 112 మంది వైద్యులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీరిని సర్వీస్ నుంచి టర్మినేట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వీరి స్థానంలో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వేసేందుకు కూడా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారట.
*రాజీనామాపై సీఎం సుఖ్వీందర్ సింగ్ క్లారిటీ
కాంగ్రెస్ పార్టీని (Congress) మరో రాజకీయ సంక్షోభం వెంటాడుతోంది. ఈసారి హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) వంతు వచ్చింది. దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఒకటి హిమాచల్‌ప్రదేశ్, ఇంకొకటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. ఈ మూడు రాష్ట్రాల్లోనే హస్తం పార్టీ అధికారంలో ఉంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల పుణ్యమా? అంటూ హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్త తలనొప్పి వచ్చి పడింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్న రాజ్యసభ సీటు కోల్పోయింది. ఒక సీటు బీజేపీ తన్నుకుపోయింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తీరుకు నిరసనగానే ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిని మార్చాలని హైకమాండ్‌కు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే ఎమ్మెల్యేలు ఈ తెగింపునకు పాల్పడినట్లు సమాచారం. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా రాజీనామా వార్తలపై సుఖ్వీందర్ సింగ్ స్పందించారు. తాను రాజీనామా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పోరాట యోధుడునని తెలిపారు. అయినా తన రాజీనామాను ఎవరూ అడగలేదన్నారు. అలాగే తాను కూడా రాజీనామా లేఖ ఎవరికీ అందజేయలేదని తేల్చిచెప్పారు. త్వరలోనే అసెంబ్లీలో బలనిరూపణ ద్వారా బలం నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తిరిగి కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. కచ్చితంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజల మనసులను గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటామని సుఖ్వీందర్ సింగ్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండింట్ సభ్యులు బీజేపీ అభ్యర్థికే ఓటు వేశారు. దీంతో రెండు పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో అనంతరం లాటరీ ద్వారా ఎంపిక చేయడంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.
*25 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ని ఎలా సవాల్ చేస్తుంది.? హిమాచల్ పరిణామాల ఫైర్..
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాయి. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఒటేయడంతో ఆ రాష్ట్రంలోని ఒకే ఒక రాజ్య సభ సీటులో కమలం గెలిచింది. ఇదిలా ఉంటే, దీని తర్వాత రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం, కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సుఖు రాజీనామా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ఆయన కొట్టిపారేశారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం ఎలాగైనా ప్రభుత్వాన్ని కాపాడే పనిలో తనమునకలై ఉంది. మరో వైపు హిమచల్ మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకువచ్చింది. తాజాగా హిమాచల్ పరిణామాలపై కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్పందించారు. కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా సవాల్ చేస్తుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉందని, హిమాచల్ ప్రజలు ఈ హక్కును ఉపయోగించుకున్నారని, స్పష్టమైన మెజారిటీలో కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసిందని, అయితే, బీజేపీ తన ధన బలాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజల హక్కుల్ని అణిచివేయాలని అనుకుంటోందని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి హర్యానాకు వెళ్లారు. ఈ రోజు సిమ్లాకు తిరిగి వచ్చారు. వీరితో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ రోజు వీరికి అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు డప్పు చప్పుళ్లతో, నినాదాలతో స్వాగతం పలికారు. అంతకుముందు, సీఎం సుఖు మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందని, సీఆర్‌పీఎఫ్ సాయంతో వారిని హర్యానాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రభుత్వం భద్రతను, యంత్రాంగాన్ని బీజేపీ ఉపయోగించుకుంటున్న తీరు దేశ చరిత్రలో మునుపెన్నడూ లేదని, 25 ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్యేలను సవాల్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం అవుతోందని ప్రియాంకాగాంధీ అన్నారు. వారి చర్యల్ని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారని, ప్రకృతి విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవని బీజేపీ ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ విపత్తులోకి నెట్టాలనుకుంటోంది ఆమె ఆరోపించారు.
*అక్రమ మైనింగ్ కేసులో ఎస్పీ చీఫ్ అఖిలేష్‌కి సీబీఐ సమన్లు..!
అక్రమ మైనింగ్ కేసు విచారణలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షిగా హాజరుకావాలని సమన్లలో కోరారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ని రేపు దర్యాప్తు సంస్థ ప్రశ్నించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తర్ ప్రదేశ్ హమీర్‌పూర్ అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా అఖిలేష్ యాదవ్‌ని హాజరుకావాల్సిందిగా కోరింది. సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిబిఐ నోటీసు జారీ చేసింది. ఢిల్లీలోని సీబీఐ ముందు హాజరుకావాలని కోరింది. నేరపూరిత కుట్ర, దొంగతనం, దోపిడీ, మోసం వంటి నేరాలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. అక్రమ మైనింగ్‌కి అనుమతించినందుకు 11 మంది అజ్ఞాత ప్రభుత్వోద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అఖిలేష్ 2012 నుంచి జూన్, 2013 మధ్య మైనింగ్ శాఖను నిర్వహించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్, డియోరియా, సహరాన్‌పూర్, హమీర్‌పూర్ మరియు సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ అధికారులు కొన్ని అక్రమ మైనింగ్ స్థలాలను కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్ హక్కులు కూడా ఇచ్చారని సీబీఐ పేర్కొంది. జూలై 2016లో, అలహాబాద్ హైకోర్టు హమీర్‌పూర్‌లో అక్రమ మైనింగ్‌ను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై అసంతప్తి వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకోవడాన్ని అనుమతించలేమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అధికారుల సహకారంతో అక్రమ మైనింగ్ జరుగుతోందా..? లేదా..? అనే దానిపై నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ తాజాగా చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు అవనీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ విచారణకు హాజరుకావాలని 8 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇక జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ని కూడా అవినీతి ఆరోపణల్లో ఈడీ అరెస్ట్ చేసింది. పశ్చిమబెంగాల్ టీఎంసీ నేతలు కూడా పలు కుంభకోణాల్లో చిక్కుకున్నారు.
*మార్చి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..
ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. రేపటితో ఫిబ్రవరి నెల ముగియనుంది.. మార్చి నెలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను మార్చి నుంచి తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రక్రియలో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. న్యూ రూల్స్ మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ స్ఫష్టం చేసింది.. ఈమేరకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు దారులకు మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు.. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం కు సంబందించిన కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకురాబోతుంది.. మార్చి 15వ తేదీ తర్వాతే అమల్లోకి వస్తాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. తొలుత ఫిబ్రవరి 29 వరకు గడువు విధించగా.. పేటీఎం కస్టమర్ల సౌలభ్యం దృష్ట్యా మార్చి 15 వరకూ పొడిగించింది.. ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్షిస్తాయి. కొన్నిసార్లు నెల రెండో అర్ధ భాగంలోనూ మారుస్తారు. అయితే, ఫిబ్రవరి 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచగా.. గృహ వినియోగానికి సంబంధించి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు… ఇవేకాదు జీఎస్టీ చెల్లింపులలో కూడా కొన్ని మార్పులను తీసుకురానున్నట్లు తెలుస్తుంది..
*పాకిస్తాన్ పరిస్థితి ఇది.. పీఐఏ విమానాల్లో వెళ్లి కెనడాలోనే సెటిల్ అవుతున్న “ఎయిర్‌హెస్టెస్‌లు”..
పాకిస్తాన్ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా తయారైంది. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా ఆ దేశం అనేక కష్టాల్లో చిక్కుకుంది. ఇక ఆ దేశంలోని అన్ని సంస్థలు దాదాపుగా దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఒకటి. ఇంధన ధరలు పెరిగిపోవడం, అప్పులు ఇలా పీఐఏ ఆర్థిక సమస్యల్లో ఉంది. తమను ఆదుకోవాలని దేశ ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ విమానాల్లో ఎయిర్‌హోస్టెస్‌లుగా, విమాన సిబ్బందిగా కెనడాకు వెళ్లిన వారు, మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. కెనడాకు వెళ్లి మాయమవుతున్నారు. ఆ దేశంలోనే సెటిల్ అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా సోమవారం ఇస్లామాబాద్ నుంచి కెనడాలోని టొరంటో వెళ్లిన విమానంలో ఫ్లైట్ క్రూలో ఒకరిగి ఉన్న మర్యమ్ రజా కెనడాలో అదృశ్యమయ్యారు. ఒక రోజు తర్వాత కరాచీకి తిరిగి వచ్చే విమానంలో ఆమె డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు. అయితే, మరియమ్ కోసం వెతికిన అధికారులకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఆమె బస చేసిన హోటల్ గదిలో వెతికినప్పుడు పీఐఏ యూనిఫాంతో పాటు ‘‘ థాంక్యూ, పీఐఏ’’ అని రాసిని నోట్ కనుక్కోవడంతో కంగుతిన్నారు. మరియమ్ ఒక్కరే కాదు, ప్రతీ ఏటా సగటున ఐదుగురు పాకిస్తాన్ ఫ్లైట్ సిబ్బంది కెనడాకు వెళ్లి అక్కడే ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ కూడా అదృశ్యమయ్యారు. తాజాగా మరియమ్ కూడా ఇదే విధంగా కెనడాలో ఉండేందుకు ఇష్టపడుతోంది. పీఐఏ క్రూ సభ్యులు 2018 నుంచి కెనడాలో ఆశ్రయం కోరుతున్నారు. క్రూ సభ్యుల అదృశ్యం పీఐఏకి ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌లో భవిష్యత్ అంధకారమే అని తెలిసి అక్కడి యువత వేరే దేశాలకు వెళ్లేందుకు, ముఖ్యంగా యూఎస్, యూరప్ దేశాల్లో స్థిరపడేందుకు వలస వెళ్తున్నారు. 2023లో ఏడుగురు పీఐఏ సిబ్బంది కెనడాలో కనుమరుగయ్యారు. లాహోర్ నుంచి టొరంటో వెళ్లిన విమానంలో క్రూగా ఉన్న అయాజ్ ఖురేషీ, ఖలీద్ అఫ్రిది, ఫిదా హుస్సేన్ షాలు డిసెంబర్ 2023లో మళ్లీ పాక్ తిరిగి రాలేదు. చివరకు విమానం క్రూ లేకుండా ఇస్లామాబాద్ రావాల్సి వచ్చిందని పీఐఏ అధికారులు వెల్లడించారు. కెనడా ఉదారవాద ఆశ్రయ విధానాలు పీఐఏపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ తెలిపారు. తక్కువ జీతాలు కూడా ఇందుకు ఓ కారణమని తెలుస్తోంది.