*అమిత్‌షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా జగన్ గెలుపును ఆపలేరు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ-జనసేన తొలి జాబితాపై సెటైర్లు వేశారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. వాళ్లు అమిత్‌షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వైసీపీ లిస్ట్‌లలో ఎలాంటి గందరగోళం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారికి విధి విధానాలు ఏమీ లేవని వెల్లడించారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్‌ను ఓడిస్తామంటూ చెప్పుకొస్తున్నారని అన్నారు. ఎవరూ ఎందులో కలిసినా జగన్ విజయాన్ని ఆపలేరన్నారు. టీడీపీ-జనసేన పార్టీల మధ్య జరిగిన తొలి జాబితా సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లకి అజెండా ఏమీ లేదని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలన్న అజెండాతో వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా అని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతుందని అన్నారు. జనసేన పార్టీ తమకు అవసరమా? అన్న అంశాన్ని ప్రజలే తేల్చుతారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
*జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హరిరామజోగయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ రాశారు. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అంటూ తీవ్రంగా మండిపడ్డారు.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ వ్యాఖ్యానించారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారంటూ ప్రశ్నలు కురిపించారు. జనసైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా?.. జనసైనికులకు కావలసింది ఎమ్మెల్యే సీట్లు కాదు.. పవన్ పరిపాలన అధికారం చేపట్టడమని ఆయన వెల్లడించారు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరిసగం మంత్రిపదవులు దక్కాలి.. అలా ప్రకటన వస్తేనే ఓట్ల సంక్షోభానికి మాత్ర హరిరామ జోగయ్య లేఖలో వెల్లడించారు. మాజీ మంత్రి హరిరామ జగయ్య పవన్‌కు రాసిన లేఖలో.. “ఒకరు ఇవ్వడం మరోకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా.. జనసేన 24సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా? జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా.. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా.. ఓట్ల సంక్షోభానికి ఏది తెర?.. సీట్ల పంపకం మిత్రపక్షాల మద్య ఏ ప్రాతిపదికన చేసారు.. అన్నికులాల జనాభా ప్రాతిపధికన జరిగాయా..జనసైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా?” అని లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
*తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు. ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చ, ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఓ సర్వే చేపడతామని చంద్రబాబు వెల్లడించారు. సర్వేల్లో ఏమైనా తేడా వస్తే.. అభ్యర్థులను మార్చేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. టిక్కెట్లు వచ్చేశాయని నిర్లక్ష్యం తగదన్న చంద్రబాబు తెలిపారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు.. ప్రభుత్వ విధానాలతో పాటు.. స్థానిక ఎమ్మెల్యేల పని తీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. జనసేన క్యాడర్‌తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలన్నారు చంద్రబాబు. పార్టీ అభ్యర్ధులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలి అని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు చంద్రబాబు. సిద్దం అని సభలు పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడని, ఎంత సీనియర్ నేతైనా.. నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలున్నా చివరి నిముషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలని చంద్రబాబు అన్నారు. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకలు, కార్యకర్తలను మీరు కలుపుకుని పోవాలని సూచించారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే ఒకటికి పది సార్లు స్వయంగా వెళ్లి మీరే కలవాలన్నారు. నేనే అభ్యర్థి కదా అని ఈగోతో వ్యవహరిస్తే కుదరదని స్పష్టీకరించారు. తటస్థులు కలవాలని.. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరండని, దొంగ ఓట్లను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలని, ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడన్న చంద్రబాబు వ్యాఖ్యానించారు.
*తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ..
పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్-కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-అర్వింద్, చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం-డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి-బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. మరోవైపు.. మహబూబ్‌నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరిలో ఒకరి పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. మల్కాజిగిరి, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపుతుండగా.. జాతీయ నేతల్లో మురళీధర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు మల్కాజ్‌గిరి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్ఎస్‌తో పొత్తు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి కిషన్ రెడ్డి ఇప్పటికే తెరదించారు. ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించి రాష్ట్రాన్ని చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధిరాకంలో ఉన్న దేశంలో మోడీ ఉండాలనే నిదానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
*తగ్గేదే లే.. చుక్కల్లో చికెన్ ధరలు
చికెన్ ధర చూస్తే కెవ్వుమనాల్సిందే. అంతకంతకూ ధర కొండెక్కుతుంది. చికెన్ రేటు అమాంతం పెరగడంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. దీంతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. కోడి ధరలు చూసి సామన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో రూ.150 నుంచి 200 ఉన్న కిలో లైవ్ కోడి.. నిన్న ధర అమాంతం పెరిగిపోయింది. కోళ్ల సరఫరా తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వినియోగదారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడి మాంసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300పైనే ఉంది. బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైగా అమ్ముతున్నారు. ఓవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు ఎండతీవ్రత ఎక్కువైతే చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం వస్తే చాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముక్కలేకపోతే ముద్దదిగదు. ఆదివారం సుమారు 12 లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సుమారు 7 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
*మీడియా అకాడమీ ఛైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్గా శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. ఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంత రావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా పనిచేశారు. అంతేకాకుండా.. గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రస్తుతం ప్రజాపక్షం ‘ఎడిటర్’ గా ఉన్నారు. కాగా.. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.
*అరేబియా సముద్రం నీటి అడుగున పూజలు నిర్వహించిన పీఎం మోడీ.. ఫోటోలు వైరల్..
ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. శ్రీకృష్ణుడు నడయాడిన నేలగా ప్రసిద్ధి చెందిన ద్వారక ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిందని భావిస్తుంటారు. పీఎం మోడీ అరేబియా సముద్ర నీటి అడుగున ద్వారకాధీశుడికి పూజలు నిర్వహించారు. శతాబ్ధాల క్రితం శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా సముద్ర అడుగు భాగంలో ఉందని హిందువులలు నమ్ముతారు. బెట్ ద్వారకా ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న పురాతన ద్వారక నగరం అవశేషాలను చూడవచ్చు. హిందూ గ్రంథాల్లో ఈ పురాతన ద్వారక నగరం గురించి ప్రస్తావించారు. శ్రీకృష్ణుడు ద్వారక నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ నగరం సముద్రంలో కలిసిపోయినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని నిర్వహించిన పూజలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. ‘‘నీటిలో మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. నేను ఆధ్యాత్మిక వైభవం మరియు కాలాతీత భక్తితో ముడిపడి ఉన్నానని భావించాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మా అందరినీ ఆశీర్వదించాలి’’ అని ప్రధాని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘నేను సముద్రం లోతుకి వెళ్లినప్పుడు, దైవత్వాన్ని అనుభవించానని, ద్వారకాధీశుడి ముందు నమస్కరించి, నెమలి ఈకలను శ్రీకృష్ణుడి పాదాల ముందు ఉంచానని, పురాతన ద్వారకా నగర అవశేషాలను చూడటంతో నా దశాబ్ధాల కల నెరవేరింది’’ అని ఆయన అన్నారు. ఆదివారం ఉదయం గుజరాత్ లోని దేవభూమి ద్వారక జిల్లాలో బెట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలిపేందుకు అరేబియా సముద్రంపై 2.32 కి.మీ.ల పొడవైన, దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ని ప్రధాని ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి రూ. 979 కోట్ల వ్యయం అయ్యింది.
*వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు వ్యక్తి దారుణహత్య..
తమిళనాడులో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి బంధువులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేరంలో అమ్మాయి బావ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రవీణ్(26)గా గుర్తించారు. ఈ ఘటన చెన్నై నగరంలోని పల్లికరణై సమీపంలో శనివారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ప్రవీణ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులు స్టీఫెన్ కుమార్, జోతి లింగం, శ్రీరామ్, అశోక్, విష్ణు రాజ్, దినేష్‌లను అరెస్టు చేశారు. నాలుగు నెలల క్రితం ప్రవీణ్, షర్మిలలు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. శనివారం ప్రవీణ్ భోజనం తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బటయకు వెళ్లిన సందర్భంతో షర్మిల సోదరుడు దినేష్, మరో నలుగురు ప్రవీణ్‌ని చుట్టుముట్టి దాడి చేశారు. ఆహారం తీసుకువచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి రెండు గంటలు గడిచినా ఇంటికి తిరిగి రాలేదని, నా కోడులు ఏడవడంతో ఏదో తప్పు జరిగిందని భావించానని, అప్పుడే విషయం తెలిసిందని ప్రవీణ్ తండ్రి గోపి కన్నీరుమున్నీరయ్యారు. నిందితులందరికి కఠిన శిక్ష పడాలని కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోంది.
*భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. పంటకు సీసీటీవీ, తుపాకీలతో కాపలా
ఇప్పటి వరకు ఆభరణాల దుకాణాలు లేదా బ్యాంకుల వద్ద కాపలా కాస్తున్న తుపాకీ పట్టుకున్న గార్డులను చూసి ఉంటారు. అయితే పొలాల్లో ఇలాంటి దృశ్యాలు చూడడం కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం అలాంటిదే జరుగుతోంది. కారణం ఇక్కడ వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో వెల్లుల్లి ధర బాగా పెరిగిపోవడంతో రైతులు తమ పొలాల్లో కాపలాగా ఉండేందుకు తుపాకీ పట్టుకునే గార్డులను, సీసీ కెమెరాలను పెట్టుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో వెల్లుల్లి ధర రిటైల్ మార్కెట్‌లో రూ.400 దాటిందని, హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకుతున్నాయని పలువురు రైతులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఉజ్జయినిలోని చింతామన్ రోడ్డులోని మంగ్రోలా గ్రామంలో సెక్యూరిటీ గార్డులు, రైతులు తుపాకులు పట్టుకుని పంటలు పండిన పొలాల్లో తిరుగుతూ కనిపించారు. చాలా మంది సంపన్న రైతులు CCTVలను అమర్చారు. మానిటర్లలో తమ పొలాలను పర్యవేక్షిస్తున్నారు. చాలా మంది రైతుల పంటలను దొంగలు ఎత్తుకెళ్లారని రైతు భరత్‌సింగ్ బాయిస్ తెలిపారు. కాబట్టి ఇప్పుడు అతను వెల్లుల్లి పంటను తన 13 బిఘాలలో వేసి భూమిని కాపాడుతున్నాడు. గత రెండేళ్లుగా వెల్లుల్లి సాగులో భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని, అయితే ఈ ఏడాది అదృష్టం కలిసివచ్చిందని బైస్ తెలిపారు. రైతులకు కిలో పంటకు రూ.200 లభిస్తోంది. మా వెల్లుల్లి పంట మరో 15 రోజుల్లో పండుతుంది కాబట్టి మేము మా పొలాన్ని ఈ విధంగా కాపాడుతున్నాము. భోపాల్‌కు చెందిన కూరగాయల వ్యాపారి మహ్మద్ సలీం, ఎకెఎస్ కంపెనీని నడుపుతూ, వెల్లుల్లి ధరలు ఈ స్థాయికి చేరుకోవడం తానెప్పుడూ చూడలేదన్నారు. ‘హోల్ సేల్ మార్కెట్ లో నాణ్యమైన వెల్లుల్లి ధర కిలో రూ.200 పలుకుతోంది. మధ్యప్రదేశ్ అంతటా హోల్‌సేల్ ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని సలీం చెప్పారు.
*రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ వ్యక్తి మృతి..
రష్యా-ఉక్రెయిన్ వార్లో 23 ఏళ్ల భారతీయుడు మరణించాడు. ఈ 23 ఏళ్ల యువకుడు గుజరాత్కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్‌గా గుర్తించారు. రష్యా సైన్యంలో సెక్యూరిటీ హెల్పర్‌గా చేరాడు. ఈనెల 21న ఉక్రెయిన్ వైమానిక దాడిలో మరణించాడని దాడి నుంచి తప్పించుకున్న మరో భారతీయ ఉద్యోగి తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని చెప్పారు. మరోవైపు.. హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. ఓ నివేదిక ప్రకారం.. సూరత్ జిల్లాకు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్ 2023 డిసెంబర్ లో రష్యా సైన్యంలో చేరారు. ఈ నెల ప్రారంభంలో, హామిల్ తండ్రి అతన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహాయం కోరుతూ భారత కాన్సులేట్‌కు లేఖ రాశారు. రష్యా సైన్యంతో ఒప్పందంపై ఉన్న పలువురు భారతీయులు కూడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. కాగా.. ఫిబ్రవరి 20న హామిల్‌తో మాట్లాడినట్లు హామిల్ తండ్రి చెప్పారు. ఈ ఘటన గురించి కర్ణాటకకు చెందిన సమీర్ అహ్మద్ మాట్లాడుతూ.. మరో ఇద్దరు భారతీయ యువకులతో కలిసి సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు. ఇంతలో బాంబు పడడంతో దగ్గర్లోని కందకంలో దాక్కున్నట్లు సమీర్ చెప్పాడు. కాసేపటి తర్వాత వెళ్లి చూడగా.. హేమిల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిపాడు. హేమిల్ మృతదేహాన్ని వ్యాన్ లోకి ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారని చెప్పుకొచ్చాడు. ఇటీవలి కాలంలో.. నేపాల్, భారతదేశం నుండి కొంతమంది రష్యా సైన్యంలో చేరినట్లు చెప్పబడిన అనేక నివేదికలు వచ్చాయి. ఒక నివేదిక ప్రకారం, 100 మందికి పైగా భారతీయ యువకులు రష్యా సైన్యంలో చేరారు. వీరిలో ఎక్కువ మందిని రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. .