*త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి.. కేసీఆర్ ను సీఎం రేవంత్ పరామర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారిపడిన సంగతి తెలిసిందే. తుంటి విరిగిన తర్వాత యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పదిహేను నిమిషాల పాటు కేసీఆర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ తో కూడా మాట్లాడానని అన్నారు. రేవంత్ రెడ్డి వెంట షబ్బీర్ అలీ, మంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అసెంబ్లీకి తప్పకుండా రావాలని కేసీఆర్ కోరారని తెలిపారు. రేవంత్ రెడ్డి సూచనలు, సలహాలు అవసరమన్నారు. కేసీఆర్ చికిత్సకు అన్ని విధాలా సహకరించాలని సీఎస్‌ను ఆదేశించినట్లు రేవంత్ తెలిపారు. కేసీఆర్ కు సర్జరీ జరిగిందని..ఆరోగ్యం కుదుట పడిందని అన్నారు. కేసీఆర్ తొందరగా కోలుకోవాలని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలనని.. ప్రభుత్వ తరుపున సహాయసహకారాలు అందించాలని అధికారులను ఆదేశించా అని తెలిపారు. అయితే కేసీఆర్ ను కలిసేందుకు కేటీఆర్ తో సీఎం రేవంత్ వెళ్లారు. లోనికి వెళుతున్నప్పుడు కేటీఆర్ పై సీఎం రేవంత్ భుజంపై చేయి వేసి మట్లాడుతూ వెళ్లారు. కేటీఆర్ కు ధైర్యం చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు భుజం చేయివేసుకుని వెళుతుంటే ఆపత్రిలో అందరూ ఆశక్తిగా చూశారు. ఆ తరువాత రేవంత్ కేసీఆర్ తో మాట్లాడి బయటకు వచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరానని తెలిపారు.
*మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తాం..
పాత్రికేయుల సమస్యలపై కూడా పోరాడుతామని, పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్ కు ఇచ్చినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలపై సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి పంపించామన్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీల అమలుకు వారేంటీ లేదు అన్న బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టుగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసామన్నారు. ప్రజలు పండగలాగా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవుతున్నారని తెలిపారు. ఆరోగ్య శ్రీ ని కూడా అమలు చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలకోసం…ప్రతి పధకం మీదే అన్నారు. ప్రారంభించడమే కాదు అమలు చేస్తామన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. ఐటీని అభివృద్ధి చేస్తామని, సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. సంపదలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు. అందరికీ ఆరోగ్య శ్రీ ఉంటుందని తెలిపారు. ఇక్కడున్న మీడీయం ఇరిగేషన్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ జిల్లాకు గోదావరి జలాలు తెస్తామన్నారు. ముగ్గురం కలిసి పనిచేస్తామని తెలిపారు. అర్ధరాత్రి అయినా మా దగ్గరకు రావచ్చని, పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పాత్రికేయుల సమస్యలపై కూడా పోరాడుతాం,పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
*కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలో కాంగ్రెస్ నీ గెలిపించిన ప్రజలు తలలు పట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెబుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చర్చించి బీజేపీ పక్షనేతను నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఫైళ్ళ మాయం పైన ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలన్నారు. గత మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి పై ఐటి అధికారుల దాడులు జరగాయన్నారు. దేశం మొత్తం విస్తు పోయేలా 290 కోట్లు దొరికాయన్నారు. ఇప్పటి వరకు 40కి పైగా సంచులు లెక్క బెట్టారని అన్నారు. ఇంకా 90 కి పైగా సంచులు లెక్కబెట్టల్సి ఉందన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎక్కడా ఇంత పెద్ద అమౌంట్ దొరకలేదన్నారు. ఆ డబ్బును లెక్క బెట్టడనికి కౌంటింగ్ మిషన్స్ కూడా సరిపోవడం లేదన్నారు. ఎలక్షన్ కమీషన్ కి చూపించిన ఆస్తి చాలా తక్కువ అన్నారు. కానీ ఇక్కడ లెక్కబెట్టలేని సంపద దొరకడం చూస్తే ఎంత అవినీతి చేస్తున్నారో అర్థం అవుతుందని తెలిపారు. అతని వద్ద ఉన్న దస్తావేజులు అక్కడ ఉన్న దన్నుకు పొంతన లేకుండా ఉందని తెలిపారు. ఇంకా వివిధ బ్యాంకులలో 7 కు పైగా లాకర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. అక్రమ సంపాదనకు సంబందించిన వివరాలు ఉన్న కంప్యూటర్స్ అల్మరలో గుర్తించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్న ధీరజ్ సాహు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహు ను మూడు సార్లు రాజ్యసభ ఎన్నుకున్నారని వ్యంగాస్త్రం వేశారు. ధీరజ్ సాహు పై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో కూడా అవినీతికి పాల్పడి కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్న వ్యక్తులే తీహార్ జైల్లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్య మంత్రులను, ఎంపీ లను ఏటిఎం లు గా మార్చుకుందని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారం లో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని తెలిపారు.
*సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయం..
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. టీడీపీ వాళ్లు ఎంత రోడ్ల మీదకు వచ్చినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్‌కు.. జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందన్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకుంటాయని.. వైసీపీ సీఎం జగన్ నాయకత్వంలో సింగిల్‌గా పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అసలు ఆ రెండు పార్టీలకు నైతికత ఉందా అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. అక్కడ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు.. ఇక్కడ ఎందుకు కలిసి పనిచేయాలనుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఓ స్నేహితుడితో జరిగిన పందెం గురించి మాట్లాడా మరో అంశం లేదన్నారు. మా అబ్బాయి బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారని పందెం వేయలేదని చెప్పానన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా పార్టీ కార్యక్రమాల కోసం ఇస్తే తీసుకున్నానని చెప్పానని.. రాజకీయాల కోసం నా ఆస్తులు పోగొట్టుకున్నానని బాలినేని తెలిపారు. సీఎం జగన్ తుఫాను బాధితుల పరామర్శకు వస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్ మీద తిరిగారా అంటూ మండిపడ్డారు. సీఎం జగన్ అధికారులను అప్రమత్తం చేయటం వల్లే నష్టం తగ్గిందన్నారు. గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోతే మొత్తం వైసీపీ మీద నెపం నెట్టాలని చూస్తున్నారని.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. త్వరలో గుండ్లకమ్మ గేట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమన్న ఆయన.. ప్రతీ పేదవారు సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారన్నారు. 2024లో మళ్లీ సీఎంగా జగన్ అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాకు దాచుకునే అలవాటు లేకపోవటం వల్లే అన్నీ మాట్లాడేస్తున్నానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
*రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శ్రీకారం
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శ్రీకారం చుట్టారు. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన మహోత్సవానికి రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ హాజరయ్యారు. రూ.347.15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులను ఎయిర్ పోర్టు అథారిటీ చేపట్టింది. ముందుచూపుతో అన్ని ప్రాంతాలకు ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. పాత ఎయిర్పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజమండ్రితో పాటు రాష్ట్రంలోని ఆరు ఏర్పాట్ల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎయిర్ పోర్టుల ద్వారా కనెక్టివిటీ పెంచడం ప్రధాని మోడీ లక్ష్యమన్నారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ లైన్స్ అభివృద్ధి వేగవంతం చేశారన్నారు. 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 12 కస్టమ్ ఎయిర్ ఫోర్సు, 98 డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు సహా 133 ఎయిర్ ఫోర్స్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రతివారం 126 విమాన సర్వీసులు నడుపుతున్నామన్నారు. త్వరలో ఢిల్లీ, గోవా, ముంబయి తదితర ముఖ్య ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుపుతామన్నారు. త్వరలో కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం శుభపరిణామమని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని ఆరు ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం చేస్తామన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యను కేంద్రం విరమించుకోవాలన్నారు.
*ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్.. ఖరారు చేసిన బీజేపీ
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ని బీజేపీ ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ని బీజేపీ అధిష్టానం పక్కన పెట్టింది. ఈ రోజు బీజేపీ కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన సర్బానంద సోనావాల్, అర్జున్ ముండాలు సీఎంను ఖరారు చేశారు. మొత్తం 90 అసెంబ్లీలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో 54 స్థానాల్లో బీజేపీ గెలిచింది. గతంలో విష్ణు దేవ్ సాయ్ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారం నిలుపుకోగా.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే ఫలితాలు వచ్చి వారం గడుస్తున్నా కూడా ఇంకా సీఎంలను ఖరారు చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుంకూరి అసెంబ్లీ స్థానం నుంచి విష్ణు దేవ్ సాయ్ గెలుపొందారు. 87,604 ఓట్లతో విజయం సాధించారు. గిరిజన వ్యక్తిని సీఎంగా బీజేపీ ఎన్నుకుంటే.. తొలి ఛాయిస్ విష్ణు దేవ్ సాయ్ అని వార్తలు వినిపించాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయననే సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. సాయ్ మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోడీ మంత్రి వర్గంలో ఉక్కు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 16వ లోక్‌సభలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. అజిత్ జోగి తర్వాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సీఎం అవుతున్న రెండో వ్యక్తిగా విష్ణుదేవ్ నిలిచారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఛతీస్‌గఢ్‌ను మధ్యప్రదేశ్ నుండి వేరు చేయడానికి ముందు విష్ణు దేవ్ సాయి 1990-98 మధ్య మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. విష్ణు దేవ్ 1999 నుండి 2014 వరకు రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం విష్ణు దేవ్‌కి బీజేపీ టికెట్ ఇవ్వలేదు.
*తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు..
తమిళనాడు రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ ధాటికి చెన్నై సముద్రాన్ని తలపిప్తోంది. ఎక్కడా చూసినా వరద నీరు, బురదమయైంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలో ప్రజల జీవితం దెబ్బతింది. డిసెంబర్ 4న కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నగర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇదిలా ఉంటే తమిళనాడుకు వర్షం ముప్పు తప్పడం లేదు. వచ్చే 2-3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయిన ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరి, కారైకల్‌లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. తమిళనాడులోని తిరునల్వేలి, కూనూర్‌లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కేరళలోని వడవత్తూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదల్లో చిక్కుకున్న చెన్నైలోని బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.6000 ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ రిలీఫ్ ఫండ్‌ని పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. ఈ సాయాన్ని 10,000కి పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రప్రభుత్వం ఒక్క పైసా కూడా సహాయ నిధికి అందించలేదన్నారు.
*భార్య ఇష్టంతో పనిలేదు.. వైవాహిక అత్యాచారం నేరంకాదు.. హైకోర్టు
తనకు ఇష్టం లేదన్న భర్త తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ హై కోర్టు ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మీద విచారణ జరిపిన హై కోర్టు సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. వివరాలలోకి వెళ్తే.. ఓ వివాహిత తన భర్త పైన కోర్టులో వేసిన ఫిర్యాదు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ఇష్టం లేదని చెప్పిన తన భర్త లైంగికంగా కలవడానికి బలవంతం చేసాడని.. తాను సహకరించలేదని హింసించాడని ఓ భార్య అలహాబాద్ హైకోర్టు లో ఫిటీషన్ దాఖలు చేసింది. కాగా ఈ ఫిటీషన్ పైన విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసింది. వివాహంతోనే భార్యభర్తల మధ్య లైంగిక చర్య హక్కుగా వస్తుందని.. ఇందులో బలవంతం చేయడం నేరం కాబోదని.. ఎలాంటి క్రిమినల్ పెనాల్టీ ఉండదని కోర్టు స్పష్టం చేసింది. అయితే భార్యకు 18 ఏళ్లు నిండి ఉండాలని.. అలా భార్యకు 18 ఏళ్లు నిండితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఐపీసీ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ.. అసహజ నేరారోపణలు ఎదుర్కుంటున్నభర్తను నిర్దోషిగా పరిగణిస్తూ జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణమిశ్రా సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. కాగా బాధితుడితోపాటు అతని బంధువులు ఆమెను గాయపరచడం అలానే క్రూరంగా వ్యవహరించారన్న అభియోగాల్లో మాత్రం భర్తను దోషిగా తేల్చింది. అయితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల తాజా తీర్పులు ఆసక్తికరంగా మారాయి.